SOURCE :- BBC NEWS

పసుపు బోర్డు, కేంద్ర ప్రభుత్వం, పీయూష్ గోయల్, నిజామాబాద్, తెలంగాణ, బీజేపీ, బీఆర్ఎస్, అరవింద్, కవిత

ఫొటో సోర్స్, Getty Images

తమ ప్రాంతంలో పసుపుబోర్డు ఏర్పాటు చేయాలనే నిజామాబాద్ ప్రాంత పసుపు రైతుల చిరకాల డిమాండ్ నెరవేరింది. దీని కోసం అనేక పోరాటాలు జరిగాయి. రాజకీయంగానూ ఈ వ్యవహారం ప్రాధాన్యత సంతరించుకుంది. హడావుడిగా అయినా.. మొత్తానికి కార్యరూపం దాల్చబోతోంది.

నిజానికి 2023 అక్టోబరులోనే పసుపు బోర్డు ఏర్పాటు గెజిట్ వచ్చినప్పటికీ, నిజమాబాద్‌ను ప్రధాన కార్యాలయంగా ప్రకటించి, ఇవాళ లాంఛనంగా ప్రారంభించబోతున్నారు.

ప్రస్తుతానికి నిజామాబాద్ దగ్గర్లోనే ఉన్న సుగంధ ద్రవ్యాల బోర్డు కార్యాలయంలో పసుపు బోర్డు పనులు ప్రారంభం అవుతాయి.

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ ఆన్‌లైన్ ద్వారా పనుల్ని ప్రారంభిస్తారు.

నిజామాబాద్‌కు చెందిన బీజేపీ నాయకుడు పల్లె గంగారెడ్డి పసుపు బోర్డుకు మొదటి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.

బీబీసీ న్యూస్ తెలుగు
పసుపు బోర్డు, కేంద్ర ప్రభుత్వం, పీయూష్ గోయల్, నిజామాబాద్, తెలంగాణ, బీజేపీ, బీఆర్ఎస్, అరవింద్, కవిత

ఫొటో సోర్స్, Getty Images

ఇప్పటి వరకూ బోర్డు లేదా?

దేశవ్యాప్తంగా పండే కీలకమైన పంటలపై పరిశోధనలు, దిగుబడి పెంచడం, మార్కెటింగ్ వంటి అంశాలను అధ్యయనం చేసేందుకు, రైతులకు సలహాలు సూచనలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయా పంటలకు సంబంధించిన బోర్డులను ఏర్పాటు చేస్తుంది.

అలా పసుపు సహా 52 సుగంధ ద్రవ్యాలకు కలపి జాతీయ సుగంధ ద్రవ్యాల (స్పైసెస్) బోర్డు ఒకటి 1987లో ఏర్పాటు చేశారు.

కేరళలోని కొచ్చిలో దీని ప్రధాన కార్యాలయం ఉంది.

దీనికి 2010 నుంచి గుంటూరు, వరంగల్‌లో ప్రాంతీయ కార్యాలయాలు పెట్టారు. నిజామాబాద్, పాడేరు, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్‌లలో స్పైస్ బోర్డుకు సంబంధించిన వివిధ కార్యాలయాలు ఉన్నాయి.

నిజామాబాద్ దగ్గరలో ఉండే స్పైసెస్ బోర్డు కార్యాలయం పసుపు పంటపై పనిచేస్తుంది.

అయితే నిజామాబాద్ ప్రాంతీయ కార్యాలయం కాకుండా పూర్తిస్థాయిలో పసుపు కోసమే బోర్డు కావాలన్నది స్థానిక రైతుల డిమాండ్.

”టీ బోర్డు, పొగాకు బోర్డులాగా పసుపు బోర్డు ఉంటే రైతులకు లాభం. స్పైసెస్ బోర్డులో పసుపు పంటకు ప్రాధాన్యం లేదు. ప్రత్యేకంగా బోర్డు ఉంటే రైతులకు నమ్మకం ఉంటుంది. అందుకే మేం బోర్డు విషయంలో ఒత్తిడి చేస్తున్నాం.” పసుపు బోర్డు కోసం పోరాడుతోన్న సమయంలో బీబీసీతో చెప్పారు నిజామాబాద్‌కు చెందిన రైతు నాయకుడు ఉప్పల ప్రభాకర్.

పసుపు బోర్డు, కేంద్ర ప్రభుత్వం, పీయూష్ గోయల్, నిజామాబాద్, తెలంగాణ, బీజేపీ, బీఆర్ఎస్, అరవింద్, కవిత, స్పైసెస్ బోర్డు

ఫొటో సోర్స్, Mark Eden/Alamy

పసుపు బోర్డుతో ఏం ఉపయోగం?

”అన్ని సుంగధ ద్రవ్యాలపై కాకుండా కేవలం పసుపుపైనే పనిచేసే ఈ కొత్త బోర్డు పసుపు పంటపై పరిశోధన, మార్కెట్ పెంచడం, కొత్త మార్కెట్ సృష్టించడంపై పనిచేస్తుంది.” అని భారత ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.

కొత్త వంగడాలు కనిపెట్టడం, తెగుళ్ల నివారణకు పనిచేయడం, యాంత్రీకరణ, రైతులకు సూచనలు, మార్కెటింగ్ పెంచడం, నాణ్యత పెంచడం వంటి పనులపై ఈ బోర్డు శ్రద్ధ పెడుతుంది.

ఇప్పటికే నిజమాబాద్ (కమ్మరపల్లి)లో పసుపు పరిశోధన కేంద్రం విషయంలో రైతులకు అవగాహన పెరిగింది.

వారి పరిశోధనల ఫలితాలు, కొత్త వంగడాలు రైతులకు చేరుతున్నాయి.

కానీ అది బోర్డులో భాగమైతే మరింత లాభదాయకంగా ఉంటుందంటున్నారు స్థానికులు.

పసుపు బోర్డు, కేంద్ర ప్రభుత్వం, పీయూష్ గోయల్, నిజామాబాద్, తెలంగాణ, బీజేపీ, బీఆర్ఎస్, అరవింద్, కవిత, స్పైసెస్ బోర్డు

ఫొటో సోర్స్, fb/Arvind Dharmapuri

పసుపు రాజకీయం

2017 ఆగష్టులో అప్పటి ఎంపీ కల్వకుంట్ల కవిత పసుపు బోర్డు ఏర్పాటు కోసం ప్రధాని మోదీని కలిశారు. 2018లో సురేశ్‌ ప్రభు స్పైసెస్ డెవలప్‌మెంట్‌ పార్క్ ప్రకటించారు. 2018లో పసుపు బోర్డు ఎన్నికల అంశంగా మారింది.

టీఆర్ఎస్ తరపున లోక్‌సభకు పోటీ చేసిన కవితకు వ్యతిరేకంగా 178మంది రైతులు ఎంపీ స్థానానికి నామినేషన్లు వేశారు. కాశీలోనూ మోదీపైనా పలువురు నామినేషన్లు వేశారు.

”బీజేపీ ఎంపీగా గెలిచిన తరువాత పసుపు బోర్డును తీసుకురాకపోతే రాజీనామా చేస్తా” అని బాండు పేపర్ పై రాసి హామీ ఇచ్చిన ధర్మపురి అరవింద్ ఆ ఎన్నికల్లో గెలిచారు.

కానీ ఆ తరువాత ఆయన (2019 – 2024) హయాంలో పూర్తి స్థాయి పసుపు బోర్డు ఏర్పాటు చేయలేకపోయారు.

కానీ, దానికి సంబంధించిన ఇతర కార్యాలయాలు వచ్చాయి.

2020 జనవరిలో నిజామాబాద్‌లో స్పైసెస్ బోర్డు రీజినల్ ఆఫీసు ఏర్పాటు చేశారు.

ఇందులో పసుపు, మిర్చి రెండు పంటలకు సంబంధించిన వ్యవహారాల పర్యవేక్షణ ఉంటుంది.

అంతే కాకుండా రైతులకు అందే పాలిషర్లు, బాయిలర్ల సంఖ్య గతంకంటే గణనీయంగా పెరిగింది. రాయితీ ధరపై వీటిని ఇస్తున్నారు.

తరువాత కూడా ఈ అంశం రగులుతూనే ఉంది.

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ పాలమూరు ప్రజాగర్జనలో పసుపు బోర్డు గురించి ప్రకటించారు.

ఆ తరువాత 2023 అక్టోబరులో ప్రభుత్వం గెజిట్ ఇచ్చేసింది.

కానీ గెజిట్ మాత్రమే ఇచ్చింది తప్ప ఇంకేమీ ముందుకు కదల్లేదు.

ఆ గెజిట్ లో కూడా ఫలానా చోట బోర్డు అని చెప్పలేదు.

ఇన్నాళ్లకు మళ్లీ నిజామాబాద్ కేంద్రంగా తాత్కాలిక కార్యాలయంలో ఆన్‌లైన్ ద్వారా హడావుడిగా ప్రారంభోత్సవం చేస్తున్నారు.

పసుపు బోర్డు, కేంద్ర ప్రభుత్వం, పీయూష్ గోయల్, నిజామాబాద్, తెలంగాణ, బీజేపీ, బీఆర్ఎస్, అరవింద్, కవిత, స్పైసెస్ బోర్డు

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌లో పసుపు ఎందుకు ప్రత్యేకం?

భారతదేశంలో పసుపు హిందూ సంప్రదాయంతో ముడిపడి ఉంది. అంతే కాకుండా ఆహార పదార్ధాలు, సౌందర్య సాధనాలు, ఔషధాల్లోనూ పసుపును ఉపయోగిస్తారు.

భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద పసుపు ఉత్పత్తిదారు, వినియోగదారు, ఎగుమతిదారు కూడా.

2022-23 సంవత్సరంలో 11.61 లక్షల టన్నులతో ప్రపంచంలో మూడింట రెండో వంతు పసుపు భారత్ ఉత్పత్తి చేయగా, పసుపులో ప్రపంచ వాణిజ్యంలో భారత్ కు 62% వాటా ఉంది.

2022-23లో భారత్ నుంచి వివిధ దేశాలకు 1.534 లక్షల టన్నుల పసుపు, పసుపు ఆధారిత ఉత్పత్తులు ఎగుమతయ్యాయి.

దేశంలోని 20 రాష్ట్రాల్లో పసుపు పండించినా, ఎక్కువగా మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో ఉత్పత్తి అవుతుంది.

పసుపు బోర్డు, కేంద్ర ప్రభుత్వం, పీయూష్ గోయల్, నిజామాబాద్, తెలంగాణ, బీజేపీ, బీఆర్ఎస్, అరవింద్, కవిత, స్పైసెస్ బోర్డు

ఫొటో సోర్స్, Getty Images

పసుపు బోర్డులో ఎవరుంటారు?

కేంద్రం పసుపు బోర్డుకు అధ్యక్షులను నియమిస్తుంది.

అధ్యక్ష పదవితోపాటు ఆయుష్ మంత్రిత్వ శాఖ నుంచి సభ్యులు, కేంద్ర ప్రభుత్వ ఔషధాలు, వ్యవసాయం & రైతు సంక్షేమం, వాణిజ్యం & పరిశ్రమల శాఖలు, అలాగే మూడు రాష్ట్రాల నుంచి సీనియర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు (రొటేషన్ ప్రాతిపదికన), అలాగే పరిశోధనలో నిమగ్నమైన ప్రభుత్వ సంస్థల ప్రతినిధులు, పసుపు రైతులు, ఎగుమతిదారులు సభ్యులుగా ఉంటారు.

ఇక దీనికి కార్యదర్శిని వాణిజ్య శాఖ నియమిస్తుంది.

ఈ సంస్థ కింద ప్రాంతీయ, డివిజినల్, ఫీల్డు కార్యాలయాలు ఉంటాయి.

పసుపు బోర్డుకు కూడా ఇలాంటి బ్రాంచి కార్యాలయాలు దేశంలో పసుపు పండించే ఇతర ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)