SOURCE :- BBC NEWS
ఒక గంట క్రితం
తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి టెస్ట్‌లలో తొలి సెంచరీ చేశాడు. ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య జరుగుతున్న బ్యాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో ఓ వైపు వరుసగా వికెట్లు పడుతున్నప్పటికీ నితీశ్ రాణించాడు.
మూడో రోజు ఓవర్ నైట్ స్కోర్ 164/5తో భారత్ ఆట కొనసాగించే సమయానికి క్రీజులో రిషబ్ పంత్, రవీంద్ర జడేజా ఉన్నారు.
అయితే.. స్కోరు 200 దాటక ముందే రిషబ్ పంత్ రూపంలో ఆరో వికెట్ కోల్పోయింది భారత్.
దాంతో నితీశ్ కుమార్ రెడ్డి క్రీజులో వచ్చాడు.
అనంతరం కొద్దిసేపటికే రవీంద్ర జడేజా కూడా అవుట్ కావడంతో క్రీజులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్‌తో కలిసి నితీశ్ స్కోర్ పెంచుకుంటూ పోయాడు.
మూడో రోజు ఆట మొదటి సెషన్ ముగిసే సమయానికి ఇంకా ఫాలో ఆన్ భయం వెంటాడుతోంది.
అయితే, వాషింగ్టన్ సుందర్‌తో కలిసి నితీశ్ నిలకడగా ఆడడంతో రెండో సెషన్‌లో భారత్ ఫాలో ఆన్ నుంచి గట్టెక్కింది.
ఇద్దరూ కలిసి టీ బ్రేక్ సమయానికి స్కోర్ 326కి చేర్చారు. అనంతరం వర్షం కాసేపు ఆటకు అంతరాయం కలిగించింది. తిరిగి ఆట మొదలైన తరువాత వాషింగ్టన్ సుందర్, ఆ తరువాత వచ్చిన బుమ్రా అవుటైనప్పటికీ సిరాజ్‌తో కలిసి ఆడుతూ నితీశ్ సెంచరీ పూర్తి చేశాడు.
నితీశ్ 171 బంతుల్లో సెంచరీ సాధించాడు.
భారత టాప్ ఆర్డర్‌లో యశస్వి జైస్వాల్ (82) తప్ప మిగతా బ్యాటర్లు ఎవరూ రాణించలేదు.
చివర్లో వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీ చేయగా నితీశ్ సెంచరీ చేశాడు.
నితీశ్ కుమార్ రెడ్డి ప్రస్తుత బోర్డర్ గావస్కర్ ట్రోఫీ సిరీస్‌తోనే టెస్ట్‌లలో అరంగేట్రం చేశాడు. నవంబర్‌లో జరిగిన తొలి టెస్టులో ఒంటరి పోరాటం చేశాడు.
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఆ మ్యాచ్‌లో నితీశ్ కుమార్ 41 పరుగులు చేశాడు.
ఆ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 49.4 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌటైంది.
అయితే.. నితీశ్ 59 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 41 పరుగులు చేసి ఆఖరి వికెట్‌గా అవుటయ్యాడు.
ఎవరీ నితీశ్ కుమార్ రెడ్డి?
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందిన నితీశ్ కుమార్ రెడ్డి వయస్సు 21 ఏళ్లు.
ఆయన 2003 మే 26న జన్మించారు.
2023 సీజన్‌తో ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. కానీ, ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌తో నితీశ్ గుర్తింపు పొందాడు.
2024 ఐపీఎల్ సీజన్‌లో 13 మ్యాచ్‌లాడిన నితీశ్ 142 స్ట్రయిక్‌రేట్‌తో 303 పరుగులు చేశాడు. 3 వికెట్లు తీశాడు.
దీనికంటే ముందు ఈ ఏడాది జనవరిలో రంజీ ట్రోఫీలో భాగంగా ముంబయితో జరిగిన మ్యాచ్‌లో నితీశ్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఐదు వికెట్లు తీశాడు.
ఇందులో అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్ వికెట్లు కూడా ఉన్నాయి.
విరాట్ కోహ్లీని అభిమానించే నితీశ్ రెడ్డి చాలా ప్రతిభావంతుడైన ఆటగాడు అని సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ విమల్ కుమార్ తెలిపారు.
ప్రస్తుతం హర్దిక్ పాండ్యాలా ఫాస్ట్ బౌలింగ్ కోటాలో ఆల్‌రౌండర్‌గా పరిగణించాల్సిన కొద్ది మంది ఆటగాళ్లలో నితీశ్ కుమార్ రెడ్డి కూడా ఒకరని విమల్ అభిప్రాయపడ్డారు.
నితీశ్ కుమార్ గురించి మరో తెలుగు క్రికెటర్ హనుమ విహారి ఐపీఎల్ సమయంలో మాట్లాడుతూ, నితీశ్ అరుదైన ఆటగాడని, అతనిపై బీసీసీఐ దృష్టిసారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)