SOURCE :- BBC NEWS
స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా- సెబీ ఇటీవల స్టాక్ మార్కెట్ లావాదేవీల్లో పాల్గొనకుండా ముగ్గురు వ్యక్తులపై నిషేధం విధించింది. వారిలో కేతన్ పరేఖ్ కూడా ఉన్నారు.
ఈ ముగ్గురు ‘ఫ్రంట్ రన్నింగ్’ స్కామ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
వీరు రూ. 65.77 కోట్లు అక్రమంగా సంపాదించారని సెబీ తెలిపింది
కేతన్ పరేఖ్ ఈ స్కామ్‌కు పాల్పడుతున్నట్లు గుర్తించేందుకు సెబీ కొత్త పద్దతుల్ని ఉపయోగించింది. తన ఐడెంటిటీ ఎవరికీ దొరక్కుండా కేతన్ పరేఖ్ వేర్వేరు ఫోన్ నెంబర్లు, పేర్లు ఉపయోగించారు. అయినప్పటికీ సెబీకి దొరికిపోయారు.
కొన్ని కీలకమైన లింకులను కలపడం ద్వారా సెబీ ఈ స్కామ్‌ను గుర్తించింది. ఇంతకీ ఈ స్కామ్ ఎలా జరిగింది? ముగ్గురు వ్యక్తుల పకడ్బంది ప్రణాళికను సెబీ ఎలా బయటపెట్టింది?
భారతీయ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే విదేశీ ఇన్వెస్టర్లకు భారత దేశంలో ఉండి ఆపరేట్ చేసే ఒక ఫెసిలిటేటర్ అవసరం ఉంటుంది. ఆ ఫెసిలిటేటర్‌ను పెట్టుబడి పెట్టే వారికి అసిస్టెంట్‌గా భావించవచ్చు.
ఈ వ్యాపారంలో లక్షలు, కోట్ల రూపాయల సొమ్ము ఇన్వాల్వ్ అయి ఉంటుంది. విదేశీ ఇన్వెస్టర్లు ఇచ్చిన డబ్బును స్థానికంగా ఉండే ఫెసిలిటేటర్ తన తెలివిని ఉపయోగించి ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాల్లో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది..
రోహిత్ సల్గావ్కర్ ఒక ఫెసిలిటేటర్. ఆయన అమెరికాకు చెందిన టైగర్ గ్లోబల్‌తో కలిసి పని చేస్తున్నారు. ఈ సంస్థ నుంచి వచ్చే నిధులను స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం, లాభాలు ఆర్జించడం లాంటి పనులు చేస్తుంటారు.
రోహిత్ సల్గావ్కర్తో చేతులు కలిపి కేతన్ పరేఖ్ ఈ ఫ్రంట్ రన్నింగ్ స్కామ్‌కు ప్లాన్ చేసినట్లు సెబీ తెలిపింది.
ఫ్రంట్ రన్నింగ్ అంటే ఏంటి?
స్టాక్ మార్కెట్లో జరిగే అనేక మోసాల్లో ‘ఫ్రంట్ రన్నింగ్’ ఒకటి.
తన కస్టమర్ ఇచ్చిన సమాచారాన్ని ఉపయోగించుకుని లాభాలు ఆర్జించడమే ఫ్రంట్ రన్నర్ చేసే స్కామ్. తాజాగా సెబీ వెల్లడించిన కేసును చూస్తే ఇది ఎలా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.
ఇందులో స్టాక్ బ్రోకర్ లేదా ట్రేడర్, విదేశీ సంస్థ కొనుగోలు చేయాలనుకుంటున్న షేర్ల గురించి సమాచారం ముందే తెలుసుకుంటారు. వాటిని ముందే అతను లేదా ఆమె కొనేసి తన వద్ద పెట్టుకుంటారు.
అమెరికాకు చెందిన టైగర్ గ్లోబల్ భారత స్టాక్‌మార్కెట్లలో పెట్టుబడి పెట్టాలని భావించిదనుకుందాం. ఆ సంస్థ ఏ కంపెనీ షేర్లు కొనాలని అనుకుంటుంతో భారత్‌లో ఆ సంస్థకు ఫెసిలిటేటర్‌గా ఉన్న రోహిత్ సల్గావ్కర్కు ఆ సమాచారం చేరుతుంది.
అమెరికన్ సంస్థ ఏ కంపెనీ షేర్లు కొంటుంది లేదా అమ్ముతుంది, ఏ ధర వద్ద కొంటుంది. ఎప్పుడు కొంటుందనే వివరాలు అతనికి తెలుస్తాయి.
తన అమెరికన్ క్లయింట్ గురించిన విషయాలను రహస్యంగా ఉంచాల్సిన రోహిత్, ఆ సమాచారాన్ని రహస్యంగా కేతన్ పరేఖ్‌కు చేరవేస్తారు. తర్వాత కేతన్ పరేఖ్, ఆయన సహచరులు తమ ‘ఆట’ మొదలు పెడతారు.
ఉదాహరణకు అమెరికన్ సంస్థ ఒక కంపెనీకి చెందిన లక్ష షేర్లను, ఒక్కొక్కటి వంద రూపాయల చొప్పున కొనాలని నిర్ణయించుకుందని అనుకుందాం. ఈ సమాచారం కేతన్ పరేఖ్‌కు తెలిసిన తర్వాత ఆయన సహచరులు అమెరికన్ సంస్థ కొనాలని భావించిన కంపెనీ షేర్లను వంద రూపాయలు లేదా అంత కంటే తక్కువ ధరకు కొంటారు.
అమెరికన్ కంపెనీ తమకు లక్ష షేర్లు కావాలని రోహిత్‌కు చెప్పినప్పుడు ఆయన కేతన్ పరేఖ్, ఆయన సహచరుల వద్ద నుంచి వంద రూపాయల కంటే ఎక్కువ ధరకు వాటిని కొంటారు.
కేతన్ పరేఖ్, ఆయన గ్రూపు వంద రూపాయల షేర్‌ను 106 రూపాయలకు అమ్మితే వారికి ఒక్కొక్క షేరుకు ఆరు రూపాయలు లాభం. లక్ష షేర్లకు ఆరు లక్షల రూపాయల లాభం వస్తుంది. ఇలా చాలా తక్కువ సమయంలో ఎలాంటి రిస్క్ లేకుండా కోట్ల రూపాయలు సంపాదిస్తారు.
దీన్నే స్టాక్ మార్కెట్లో ‘ఫ్రంట్ రన్నింగ్’ అంటారు.
భారతదేశంలో ఫ్రంట్ రన్నింగ్‌కు పాల్పడటం నేరం.
కేతన్ పరేఖ్ అంత పెద్ద నెట్వర్క్ ఎలా సృష్టించారు?
కేతన్ పరేఖ్ నెట్వర్క్ చాలా పెద్దగా విస్తరించిందదని సెబీ చెబుతోంది. ఇందులో అశోక్ పోద్దార్తో పాటు అనేకమంది ఇతరులు కూడా ఉన్నారు.
వీళ్లంతా కోల్‌కతాకు చెందిన జీఆర్డీ సెక్యూరిటీస్ అండ్ సలాసర్ స్టాక్ బ్రోకింగ్ కోసం పని చేస్తారు. ఇందులో పని చేస్తున్న వారంతా ‘ఫ్రంట్ రన్నింగ్’ స్కామ్‌లో పాల్గొన్నారు.
అమెరికాలోని టైగర్ గ్లోబల్ కొనాలని భావిస్తున్న కంపెనీ షేర్లను వీరు ముందే కొనేశారు.
ఈ మొత్తం వ్యవహారం వేర్వేరు మొబైల్ నెంబర్ల నుంచి జరిగింది. దీన్నంతటినీ కేతన్ పరేఖ్, ఆయన సహచరులు నడిపించారు. ఇలా చెయ్యడం ద్వారా కేతన్ పరేఖ్ రూ. 65 కోట్లకు పైగా సంపాదించారు.
కేతన్ పరేఖ్ నెట్‌వర్క్‌ను సెబీ ఎలా గుర్తించింది?
కేతన్ పరేఖ్ నెట్‌వర్క్‌ను గుర్తించడానికి సెబీ వద్ద ఎలాంటి సమాచారం ఉందన్నదాని గురించి స్పష్టత లేదు.
అయితే, కేతన్ పరేఖ్ నెట్‌వర్క్‌ను కనుక్కోవడం అంత తేలిక్కాదు. స్టాక్ మార్కెట్లో జరిగిన వేల కొద్దీ లావాదేవీలు, అవి జరిగిన విధానాన్ని పరిశీలించిన తర్వాత సెబీ ఈ నెట్‌వర్క్‌ను గుర్తించగలిగింది. ఇందుకోసం షేర్లు కొనుగోలు చేసిన తీరు, కాల్ రికార్డుల పరిశీలన, ఆ నెట్వర్క్ సభ్యులు మొబైల్ ఫోన్లలో పంపుకున్న మెసేజ్‌లన్నింటినీ గుర్తించిన తర్వాత వారి గురించి తెలుసుకుంది.
కేతన్ పరేఖ్ 10 మొబైల్ ఫోన్ల ద్వారా తన సన్నిహితులతో టచ్‌లో ఉండేవారని సెబీ తెలిపింది. ఈ పది మొబైల్ ఫోన్లలో ఏ ఒక్క నెంబర్ కూడా అతని పేరు మీద లేదు. కేతన్ పరేఖ్‌తో మాట్లాడేవాళ్లు కూడా అతని పేరును కేతన్ పరేఖ్ అని కాకుండా జాక్, జాన్, బాస్, భాయ్, బాబీ అని సేవ్ చేసుకునేవారని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.
కేతన్ పరేఖ్ ఉపయోగించిన పది నెంబర్లలో ఒకటి ఆయన భార్య పేరు మీద రిజిస్టర్ అయి ఉండటాన్ని సెబీ తన దర్యాప్తులో భాగంగా గుర్తించింది. ఈ నెంబర్ ద్వారా ఆపరేట్ చేస్తున్న వ్యక్తులు ఎవరు, వారు ఏయే నెంబర్లకు కాల్ చేస్తున్నారు లాంటి అనేక వివరాలు సేకరించిన తర్వాత.. వాటన్నింటినీ పరిశీలించి, దీని వెనుక కేతన్ పరేఖ్ ఉన్నట్లు గుర్తించింది.
సెబీ దర్యాప్తులో మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. సెబీ అనుమానితుల్లో ఒకరైన సంజయ్ తపాడియా ఫిబ్రవరి 15న ‘జాక్ లేటెస్ట్’ అని సేవ్ చేసుకున్న ఒక నెంబర్‌కు ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అని మెసేజ్ పంపారు. కేతన్ పరేఖ్ పాన్‌కార్డులో పేర్కొన్న దాని ప్రకారం అతని పుట్టిన రోజు కూడా అదే. ఈ విషయాన్ని గుర్తించిన తర్వాత కేతన్ పరేఖ్ నెట్వర్క్ మీద సెబీకి అనుమానం పెరిగింది.
సెబీ ఆదేశాలలో ఏముంది?
కేతన్ పరేఖ్, రోహిత్ సల్గావ్కర్, అశోక్ కుమార్ పోద్దార్ సెబీలో రిజిస్టర్ అయిన ఏ మధ్యవర్తితోనూ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ లావాదేవీలు నిర్వహించే వీలు లేకుండా నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని తెలిపింది.
ఈ వ్యవహారంలో కేతన్ పరేఖ్, రోహిత్, అశోక్‌తో పాటు 22 సంస్థలకు సెబీ నోటీసులు జారీ చేసింది. సంపాదించిన సొమ్మును తిరిగి చెల్లించాలని, వారు ట్రేడింగ్ చెయ్యకుండా నిషేధం విధించడం, జరిమానాలు వెయ్యడం లాంటి చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని ఈ నోటీసుల్లో కోరింది.
నోటీసులు అందుకున్న 21 రోజుల్లోగా ఈ సంస్థలు సెబీకి సమాధానం చెప్పాలని అందులో ఆదేశించింది.
రోహిత్ సల్గావ్కర్, కేతన్ పరేఖ్ కుట్రపన్ని రహస్యంగా ఉంచాల్సిన తమ క్లయింట్ల సమాచారాన్ని ఉపయోగించుకుని, వారిని మోసగించి అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించారని సెబీ 188 పేజీల మధ్యంతర ఆదేశాల్లో పేర్కొంది.
ఫెసిలిటేటర్‌గా ఉంటూ ఫ్రంట్ రన్నింగ్ మోసానికి పాల్పడినట్లు అశోక్ పోద్దార్ అంగీకరించినట్లు సెబీ వెల్లడించింది.
కేతన్ పరేఖ్, అతని సహచరుల మీద సెబీ ప్రస్తుతం తాత్కాలిక నిషేధం మాత్రమే విధించింది. ఇది శాశ్వతం కాదు.
సెబీ కావాలనుకుంటే ఈ ఆదేశాలను మార్చగవచ్చు లేదా వెనక్కి తీసుకోవచ్చు లేదా వాటినే శాశ్వత ఉత్తర్వులుగా మార్చి కొనసాగించవచ్చు. ఈ వ్యవహారం కొంత సంక్లిష్టమైనది కావడంతో తుది నిర్ణయం తీసుకోవడానికి ఇంకా కొంత సమయం పట్టవచ్చు.
ఈ మధ్య కాలంలో కేతన్ పరేఖ్ అతని సహచరులు కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. సెబీ మధ్యంతర ఉత్తర్వుల్ని, షోకాజ్ నోటీసుల్ని వాళ్లు కోర్టులో సవాలు చెయ్యవచ్చు.
కేతన్ పరేఖ్ ఎవరు?
భారతీయ స్టాక్ మార్కెట్లలో కేతన్ పరేఖ్ బాగా పరిచయమున్న పేరు. అతని ప్రతి కదలికను ట్రేడర్లు ఆసక్తిగా గమనిస్తుంటారు.
ప్రస్తుతం ఆయనకు కోల్‌కతా స్టాక్ ఎక్స్చేంజ్ మీద పూర్తి ఆధిపత్యం ఉంది. 1999 నుంచి 2000 మధ్య ఐటీ, టెక్నాలజీ విస్తరిస్తున్న సమయంలో భారత్‌లో స్టాక్ మార్కెట్లు పరుగులు పెట్టడం మొదలైంది.
అయితే అదే సమయంలో కేతన్ పరేఖ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది.
కేతన్ పరేఖ్ బ్యాంకులు, ప్రమోటర్ల సొమ్ము ఉపయోగించుకుని అక్రమ మార్గాల్లో షేర్ల ధరలు పెరిగేలా చేసి, ధరలు పెరిగిన తర్వాత వాటిని అమ్మడం ద్వారా అక్రమాలకు పాల్పడినట్లు సెబీ దర్యాప్తులో తేలింది.
2001 మార్చ్‌లో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. అప్పట్లో కేతన్ 50రోజులకుపైగా జైల్లో ఉన్నారు.
ఆ తరవాత కూడా, స్టాక్ మార్కెట్లో అనేక అక్రమాలు జరిగాయి. దాంతో ట్రేడింగ్ సైకిల్‌ను వారం రోజుల నుంచి ఒక రోజుకు కుదించారు. బద్లా ట్రేడింగ్‌ను ఆపేశారు. కేతన్ పరేఖ్‌ను స్టాక్ మార్కెట్ వ్యవహారాల్లో పాల్గొనకుండా అప్పట్లో 14 ఏళ్ల నిషేధం కూడా విధించారు.
మళ్లీ ఇప్పుడు ఆయన మరో స్కామ్‌లో దొరికిపోయారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS