SOURCE :- BBC NEWS

ఇజ్రాయెల్, పాలస్తీనా, గాజా, హమాస్

ఫొటో సోర్స్, Israeli Embassy in US

ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న ఓ జంటను వాషింగ్టన్ డీసీలోని యూదు మ్యూజియం బయట కాల్చి చంపారు.

మృతులను యారోన్ లిషిన్స్కీ, సారా లిన్ మిల్గ్రిమ్‌గా గుర్తించారు.

‘ఫ్రీ ఫ్రీ పాలస్తీనా’ అని అరుస్తూ ఓ వ్యక్తి వారిని కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు.

అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఇజ్రాయెల్, పాలస్తీనా, గాజా, హమాస్

వాషింగ్టన్ డీసీ డౌన్‌టౌన్‌లోని కాపిటల్ యూదు మ్యూజియంలో ఓ కార్యక్రమం జరుగుతుండగా బయట కాల్పులు జరిగినట్టు పోలీసులకు బుధవారం రాత్రి 9:08 గంటలకు(స్థానిక కాలమానం ప్రకారం) ఫోన్‌ కాల్స్ వచ్చాయి.

సంఘటన స్థలంలో ఓ మహిళ, పురుషుడు మొదట స్పృహ కోల్పోయి కనిపించారు. అనంతరం వారు చనిపోయినట్టు గుర్తించారు.

ఆ జంట మ్యూజియంలో కార్యక్రమం నుంచి బయటకు వస్తుండగా కాల్పులు జరిగాయని మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ (ఎంపీడీ) తెలిపింది.

ఈ ప్రాంతం పర్యటకంగా ప్రసిద్ధిగాంచింది. ఎఫ్‌బీఐ వాషింగ్టన్ ఆఫీస్‌ సహా అనేక కీలక ప్రదేశాలు, మ్యూజియంలు, ప్రభుత్వ భవనాలు అక్కడ ఉన్నాయి.

షికాగోకు చెందిన 30ఏళ్ల ఎలియాస్ రోడ్రిగ్జ్ వీరిపై కాల్పులు జరిపారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మ్యూజియం వెలుపల రోడ్రిగ్జ్ వేగంగా నడుస్తూ, నలుగురిపై తుపాకీతో కాల్పులు జరిపినట్టు కనిపించిందని ఎంపీడీ చీఫ్ పమేలా స్మిత్ చెప్పారు.

ఆ తర్వాత మ్యూజియం లోపలికి వెళ్లిన ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కస్టడీలోకి తీసుకుంటున్నప్పుడు ఆయన ”ఫ్రీ ఫ్రీ పాలస్తీనా” అని నినాదాలు చేశారని పోలీసులు తెలిపారు.

ఎంపీడీ నేతృత్వంలో దర్యాప్తు సాగుతోంది.

ఇజ్రాయెల్, పాలస్తీనా, గాజా, హమాస్

ఫొటో సోర్స్, Reuters

‘ఆమెకు ప్రపోజ్ చేయడానికి ఉంగరం కూడా కొన్నాడు’

”ఓ జంటను హత్య చేశారని, ఈ విషయం తెలిసి తమ సిబ్బంది తీవ్ర వేదనకు గురయ్యారని” అమెరికాలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం తెలిపింది.

”మా దుఃఖాన్ని మాటల్లో చెప్పలేం. ఈ బాధాకర సమయంలో మృతుల కుటుంబాలకు ఎంబసీ తోడుగా ఉంటుంది” అని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం పేర్కొంది.

ఈ యువ జంట నిశ్చితార్థం చేసుకోబోతున్నారని అమెరికాలోని ఇజ్రాయెల్ రాయబారి యెచియల్ లీటర్ అన్నారు.

” తన స్నేహితురాలికి వచ్చే వారం జెరూసలేంలో ప్రపోజ్ చేయాలనే ఉద్దేశంతో ఆ యువకుడు ఈ వారం ఒక ఉంగరం కొనుగోలు చేశారు” అని ఆయన చెప్పారు.

“వారిది అందమైన జంట” అని ఆయన అన్నారు.

వాళ్లిద్దరూ చాలా మంచివారని, అందరితో కలిసిపోతారని ఆ జంటను వాషింగ్టన్‌లో కలిసిన రాబి అనే వ్యక్తి చెప్పారు.

నగరంలో జరిగిన యూదుల కార్యక్రమాల్లో ఆ జంటను చూశానని లెవి షెమ్‌టోవ్ బీబీసీ రేడియో ఫర్ టుడే కార్యక్రమంలో తెలిపారు.

ఇజ్రాయెల్, పాలస్తీనా, గాజా, హమాస్

ఫొటో సోర్స్, Embassy of Israel in New Delhi

ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్పారు?

దాడి తర్వాత జరిగిన పరిణామాలను అక్కడి వారు వివరించారు.

“సుమారు 9 గంటల 7నిమిషాలకు తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించాయి. ఆ తర్వాత ఒక వ్యక్తి లోపలికి వచ్చారు. ఆయన ఏదో బాధలో ఉన్నట్టు కనిపించారు. ఆయనకేదో సాయం అవసరమని, సురక్షితమైన ఆశ్రయం అవసరమని మేమనుకున్నాం” అని కేటీ కలిషర్ చెప్పారు.

“అక్కడివారు ఆయనకు సాయం చేశారు. ఆయనకు నీళ్లు ఇస్తున్నారు, జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఆయన ప్రజలను చంపే వ్యక్తని ఎవరికీ తెలియదు” అని ఆ కార్యక్రమంలో యోని కాలిన్ చెప్పారు.

‘‘కాల్పులు జరిపింది ఆ వ్యక్తే అని పోలీసులు అనగానే ఆయన ‘నేనే ఇలా చేశాను. నేను గాజా కోసం ఇదంతా చేసాను. పాలస్తీనాకు స్వేచ్ఛ ఇవ్వండి. ఇదొక్కటే పరిష్కారం’ అని ఆయన అన్నారు’ అని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

ఇజ్రాయెల్, పాలస్తీనా, గాజా, హమాస్

ఫొటో సోర్స్, Reuters

ఇజ్రాయెల్ ప్రధాని ఆగ్రహం, ఆవేదన

ఈ దాడిని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఖండించారు. ఇది యూదు వ్యతిరేక చర్య అన్నారాయన.

ఈ హత్యలతో తాను తీవ్ర ఆగ్రహానికి గురయ్యానని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు అన్నారు.

“మరణించిన యువ ప్రేమికుల కుటుంబాల కోసం నా హృదయం బాధతో స్పందిస్తోంది” అని ఆయన అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇజ్రాయెల్ ప్రతినిధులకు భద్రతను పెంచాలని ఆదేశించానని చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)