SOURCE :- BBC NEWS

ఆయుర్ధాయం, జీవనశైలి, వందేళ్లు, శతాధిక వృద్ధులు, ఆహారపు అలవాట్లు, దురలవాట్లు, ధూమపానం, మద్యపానం, అమెరికా, బ్రెజిల్

ఫొటో సోర్స్, Neto family

జోవో మారిన్హో నెటోకు నవంబర్ చివరి వారం కూడా సాదాసీదాగా గడిచిపోయేలా కనిపించింది. ఈశాన్య బ్రెజిల్‌లోని అపుయారేస్‌లో పదేళ్ల నుంచి నివసిస్తున్న ఇంటిలో తన దైనందిన జీవితాన్ని ఆయన యధావిధిగా గడుపుతున్నారు.

కానీ సరిగ్గా మూడురోజుల తరువాత ఆయన బ్రెజిల్ సహా ప్రపంచ వ్యాప్తంగా పతాక శీర్షికలకు ఎక్కారు. దీనికి కారణం112 ఏళ్ల జోవో నెటో ప్రపంచంలోనే జీవించి ఉన్న వయోధికుడిగా రికార్డులెక్కారు. ఈ విషయాన్ని ఆయనకు సహాయకురాలు చెప్పినప్పుడు ‘‘నేను చాలా అందగాడిని కూడా’’ అంటూ జోవో చమత్కరించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సులోనూ జోవో పేరు చేరింది.

బ్రిటన్‌కు చెందిన 112 ఏళ్ల జాన్ టిన్నిస్ ఉడ్ 2024 నవంబర్ 25న చనిపోవడంతో జోవో నెటో ప్రపంచంలో అత్యంత పెద్ద వయస్కుడిగా అవతరించారు.

టొమికో ఇటూక ప్రస్తుతం ప్రపంచంలో జీవించి ఉన్న అతి పెద్ద వయస్కురాలిగా గుర్తింపు పొందారు . ఆమె వయసు116 ఏళ్లు. ఆమె 2024 ఆగస్టులో అతి పెద్ద వయోధికురాలిగా రికార్డులకెక్కారు.

ప్రస్తుతం ప్రపంచంలో అతి పెద్ద వయస్కులుగా గుర్తింపు పొందిన స్త్రీ పురుషులిద్దరూ వందేళ్లకు పైబడినవారే. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి వారి సంఖ్య పెరుగుతోంది.

బీబీసీ న్యూస్ తెలుగు
ఆయుర్ధాయం, జీవనశైలి, వందేళ్లు, శతాధిక వృద్ధులు, ఆహారపు అలవాట్లు, దురలవాట్లు, ధూమపానం, మద్యపానం, అమెరికా, బ్రెజిల్

ఫొటో సోర్స్, Getty Images

2030 నాటికి పది లక్షలకు చేరుకుంటుందా?

ప్రపంచవ్యాప్తంగా 2024 నాటికి 100ఏళ్లకు పైబడిన వారి సంఖ్య దాదాపు 5 లక్షల 88వేలు ఉందని ఐక్యరాజ్యసమితికి చెందిన పాపులేషన్ డివిజన్ అంచనా వేస్తోంది. ఈ దశాబ్దం చివరి నాటికి ఈ సంఖ్య పది లక్షలు దాటుతుందని భావిస్తున్నారు.

వందేళ్లకు పైడిన వారి సంఖ్య 1999లో 92వేలుగా ఉంది.పూర్వీకులతో పోలిస్తే ప్రస్తుతం జీవన ప్రమాణాలు పెరగడం, మెరుగైన జీవన పరిస్థితులు, ఆహారం, ఔషధాలు లాంటి అంశాల వల్ల మనుషులు ఎక్కువ కాలం జీవించగలుగుతున్నారు.

ఐక్యరాజ్య సమితి 1960 నుంచి సగటు ఆయుర్థాయం గురించి సమాచారాన్ని భద్రపరచడం మొదలుపెట్టింది. అప్పట్లో సగటున ఒక మనిషి 52 ఏళ్లు జీవించేవారని అంచనా వేసింది. 60 ఏళ్ల తర్వాత, ప్రస్తుతం ప్రపంచ సగటు ఆయుర్ధాయం 73 ఏళ్లకు చేరింది. 2050 నాటికి ఇది 77ఏళ్లకు చేరుతుందని ఐక్యరాజ్య సమితి భావిస్తోంది.

క్లుప్తంగా: వందేళ్లు జీవించడం చాలా గొప్ప విషయం. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం ప్రపంచ జనాభాలో వందేళ్లు దాటిన వాళ్లు 0.007శాతం మాత్రమే. వందేళ్లు జీవించాలంటే అనేక సమస్యల్ని అధిగమించాలని, అందువల్ల మనలో ఎక్కువ మంది ఆ సంఖ్యను చేరుకోవడం కష్టమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

2023లో జన్మించిన మగ పిల్లల్లో 2శాతం, ఆడపిల్లల్లో 5శాతం వందేళ్లకు పైగా జీవిస్తారని 2024లో ఫ్రాన్స్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్‌ట్యూట్ ఆఫ్ డెమోగ్రఫిక్ స్టడీస్ అంచనా వేసింది.

వయసు పెరిగే కొద్దీ అనేక మందిలో వ్యాధులు కూడా పెరుగుతాయనేది గుర్తించడం ముఖ్యం.

“ఎక్కువకాలం జీవించడం అనేది ఆనందంగా జీవించడానికి పర్యాయపదం కాదు” అని బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్ యూనివర్సిటీలో సెల్యులర్ బయోలజీ ప్రొఫెసర్ జేనెట్ లార్డ్ చెబుతున్నారు. పురుషులు సగటున తాము మరణించడానికి ముందు వచ్చే 16 ఏళ్లు డయాబెటిస్, డిమెన్షియా ( జ్ఞాపకశక్తి తగ్గిపోవడం)తో బాధపడతారని లార్డ్ వివరించారు. మహిళల్లో ఇది 19ఏళ్లుగా ఉంది.

ఆయుర్ధాయం, జీవనశైలి, వందేళ్లు, శతాధిక వృద్ధులు, ఆహారపు అలవాట్లు, దురలవాట్లు, ధూమపానం, మద్యపానం, అమెరికా, బ్రెజిల్, ఫ్రాన్స్

ఫొటో సోర్స్, Getty Images

వందేళ్లు దాటిన వారి జీవన రహస్యం ఏంటి?

వందేళ్లు బతకడమే కష్టం అయితే, వందేళ్ల తర్వాత కూడా జీవించడం ఇంకా కష్టం.

అమెరికాలో ఐదు లక్షల్లో ఒకరు మాత్రమే వందేళ్లు దాటి 110 ఏళ్ల వరకు జీవించారని బోస్టన్ యూనివర్సిటీ దీర్ఘకాల అధ్యయనం అంచనా వేసింది.

వందేళ్లకు పైగా జీవించిన అమెరికన్ల సంఖ్య 2010వరకు 50వేలకు పైగా ఉండగా, 2020 నాటికి 80వేలకు చేరిందని అమెరికన్ జనాభా లెక్కలు చెబుతున్నాయి.

దీంతో వందేళ్లకు పైబడి జీవించిన వారు సహజంగానే మనుషుల వయసుని అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షిస్తున్నారు.

“వృద్ధాప్యంలో అనేక మందికి వచ్చే సమస్యలను వారు అధిగమిస్తున్నారు. అది వారికి ఎలా సాధ్యం అవుతోందో మేమింకా స్పష్టంగా చెప్పలేకపోతున్నాం” అని ప్రొఫెసర్ లార్డ్స్ చెప్పారు.

వందేళ్లకు పైబడి జీవిస్తున్నవారు తమ వయసుకు తగ్గట్లుగా ఆరోగ్యంగా ఉంటున్నారు. నెటోకు దృష్టి సంబంధిత సమస్యలు తప్ప ఇతర అనారోగ్య సమస్యలేవీ లేవని ఆయన బాగోగులు చూసుకుంటున్న నర్స్ అలెలుయ టెయ్‌క్సెరా చెప్పారు.

“ఆయనకు ఎలాంటి ఔషధాలు అవసరం లేదు. ఆయనకు తీవ్రమైన వ్యాధులున్న చరిత్ర కూడా లేదు. ఆయన వయసు 112 ఏళ్లు” అని ఆమె బీబీసీతో చెప్పారు.

నెటో ఎలాంటి సమస్యలు లేకుండా జీవిస్తున్నారని, ఆయనకు ఆల్కహాల్ అలవాటుకూడా లేదని ఆయన పెద్ద కుమారుడు చెప్పారు. వందేళ్లకు పైబడి జీవించిన మిగతా వారు కూడా ఇంకా మెరుగైన జీవితం గడిపారు.

ఫ్రాన్స్‌లో 122 ఏళ్లు జీవించిన జీన్ కాల్మెంట్ 1997లో చనిపోయారు.120 ఏళ్లు పైబడి జీవించిన వ్యక్తిగా ఆయన ఆధికారికంగా గుర్తింపు పొందారు. ఆయన ధూమపానం చేసేవారు. చాక్లెట్లు కూడా విపరీతంగా తినేవారు.

ఆయుర్ధాయం, జీవనశైలి, వందేళ్లు, శతాధిక వృద్ధులు, ఆహారపు అలవాట్లు, దురలవాట్లు, ధూమపానం, మద్యపానం, అమెరికా, బ్రెజిల్, ఫ్రాన్స్

ఫొటో సోర్స్, Getty Images

చెడు అలవాట్లున్నా..

అమెరికన్ గిరియాట్రిక్ సొసైటీ 400 మంది అమెరికన్ యూదుల మీద 2011లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం 95 ఏళ్లు దాటిన వారందరికీ ఏదో ఒక చెడు అలవాటు విపరీతమైన స్థాయిలో ఉంది.

అందులో 60 శాతం మందికి పైగా సిగరెట్లు తాగేవాళ్లు ఉన్నారు. వారిలో సగం మందికి ఊబకాయం ఉంది. వారిలో మూడు శాతం మంది మాత్రమే శాకాహారులు. నిర్ఘాంతపరిచే మరో అంశం ఏంటంటే వారిలో ఎక్కువ మంది కనీసం వ్యాయాయం కూడా చేసేవారు కాదు.

“వందేళ్లు, వందేళ్లకు పైబడి జీవించిన వారి జీవన శైలిని పరిశీలిస్తే వారికి ఎక్కువ కాలం జీవించడం పట్ల ఏ మాత్రం ఆసక్తి లేదనేది మొదటి అంశం” అని బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిగ్టన్‌లో బయోజరోన్టాలజీ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న రిచర్డ్ ఫరాఘెర్ చెప్పారు. వయో అధ్యయన నిపుణులలో ఆయన ప్రముఖుడిగా గుర్తింపు పొందారు.

“వారిలో సహజంగానే ఏదో ప్రత్యేకత ఉంది. ఎందుకంటే వారు మనం ఎక్కువ కాలం జీవించడానికి ఏం చేస్తామో, వారు కచ్చితంగా దానికి వ్యతిరేకంగా చేస్తున్నారు” అని ఆయన చెప్పారు.

ఎక్కువ కాలం జీవించడంలో జెనెటిక్స్ కీలక పాత్ర పోషిస్తాయని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు.

నూరేళ్లు, అంత కంటే ఎక్కువ కాలం జీవించినవారు యవ్వనంలో తమ సహచరులు ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచి తమను తాము రక్షించుకుని ఉండవచ్చు. ఒక వేళ అలాంటివి ఎదురైనా వాటిని ఎదుర్కొనే సత్తా వారికి ఉండి ఉండవచ్చు. అనేక మంది ప్రాణాలు తీసిన తీవ్ర అనారోగ్య పరిస్థితుల్ని కూడా వారు అధిగమించి ఉండవచ్చు.

ఆయుర్ధాయం, జీవనశైలి, వందేళ్లు, శతాధిక వృద్ధులు, ఆహారపు అలవాట్లు, దురలవాట్లు, ధూమపానం, మద్యపానం, అమెరికా, బ్రెజిల్, ఫ్రాన్స్

ఫొటో సోర్స్, Getty Images

మనం ఇంకా ఎక్కువ కాలం జీవించవచ్చా?

నిండు నూరేళ్లు జీవిస్తున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో మనుషుల ఆయుర్ధాయాన్ని ఇంకా పెంచవచ్చా అనే విషయంపై శాస్త్రవేత్తలు ఆలోచిస్తున్నారు.

ఈ శతాబ్దం ముగిసే నాటికి మనిషి జీవితకాలం 125 నుంచి 130 ఏళ్లకు చేరుకోవచ్చని అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీ పరిశోధకులు అంచనా వేస్తున్నారు. మనిషి బర్త్‌డే కేకు మీద 130 కొవ్వొత్తుల్ని వెలిగించే రోజు వస్తుందని భావిస్తున్నారు.

“ప్రస్తుత రికార్డు 2100 పూర్తయ్యే నాటికి బద్దలవుతుందని మేం నమ్ముతున్నాం. అప్పటికి ఎవరైనా 126,128, లేదా 130 ఏళ్లు కూడా పూర్తి చేస్తారేమో” అని మైకేల్ పియర్స్ అభిప్రాయపడుతున్నారు.

రానున్న కొన్ని దశాబ్ధాలలో కాల్మెట్ రికార్డు బద్దలయ్యేందుకు 100శాతం అవకాశం ఉందని, ఎవరో ఒకరు 127వ పుట్టిన రోజు చేసుకునేందుకు 68శాతం అవకాశం ఉందని అంతర్జాతీయంగా ఎక్కువకాలం జీవించిన వారి డేటాను ఆధారం చేసుకుని పియర్స్‌తోపాటు ప్రొఫెసర్ అడ్రియన్ రాఫ్‌టెరీ కూడా చెబుతున్నారు.

అయితే ఈ విషయంలో లాభపడేది మహిళలే. ఎందుకంటే 2024 డిసెంబర్ 9 నాటికి ప్రపంచంలో అత్యధిక వయసు ఉన్న, జీవించి ఉన్న 50 మందిలో 50 మంది కూడా మహిళలే. నెటో 54వ స్థానంలో ఉన్నారు.

ఏదేమైనప్పటికీ, ఎక్కువ కాలం జీవించడం అనే అంశం గురించి సైన్స్ సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు చాలానే ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా వయోధికుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో జీవన ప్రమాణాల నాణ్యతను అర్థం చేసుకోవడం కీలకం అని లండన్‌లోని కింగ్స్ కాలేజ్ డైరెక్టర్ రిచర్డ్ సివో చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఐదేళ్ల లోపు పిల్లల కంటే 65 ఏళ్లు పైబడిన వారి సంఖ్య ఎక్కువగా ఉందనేది ఐక్యరాజ్య సమితి అంచనా.

“మనం ఎంత కాలం జీవిస్తాం అనేది ఇప్పుడు చర్చించాల్సిన ప్రశ్న కాదు. మనం వయసు పెరగడాన్ని ఎలా ఆలస్యం చేయవచ్చు, ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఎలా ఉండగలం అనేది ముఖ్యం” అని సివో చెప్పారు.

“ఇలా మనం, వృద్ధాప్యానికి చేరుకోలిగితే అదృష్టవంతులమే. అప్పుడు వృద్దాప్యంలో కూడా మనం బాధ పడకుండా ఆనందించవచ్చు” అనేది సివో అభిప్రాయం.

*జోస్యూ సెయిక్సస్, బీబీసీ న్యూస్ బ్రస్సెల్ అందించిన అదనపు సమాచారంతో

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)