SOURCE :- BBC NEWS

నెల్లూరులో జికా వైరస్

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఆరేళ్ల బాలుడికి జికా వైరస్ సోకిందని ప్రచారం జరగడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన పెరిగింది. ఇది ఏపీ ఆరోగ్య శాఖలోనూ అలజడి రేపింది.

ఇప్పటివరకు కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటకల్లో మాత్రమే జికా కేసులు నమోదయ్యాయి. ఏపీలో అధికారికంగా కేసులు లేవు. దీంతో అసలు ఏం జరిగిందో తెలుసుకోడానికి బీబీసీ ఆ బాలుడి కుటుంబం, వైద్యులతో మాట్లాడింది.

జికా సోకడం నిజమేనా?

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం వెంకటాపురంలో ఆరేళ్ల బాలుడికి 20 రోజులుగా జ్వరం వస్తుండటంతో తల్లిదండ్రులు స్థానిక ఆస్పత్రుల్లో, ఆ తర్వాత నెల్లూరులోని నారాయణ మెడికల్ కాలేజీలో చూపించారు.

శాంపిల్స్ సేకరించిన అక్కడి డాక్టర్లు వాటిని ముంబయిలోని ఒక ప్రైవేటు ల్యాబ్‌కు పంపించారు. అది జికా వైరస్ కావచ్చంటూ ఆ ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చింది.

ప్రస్తుతం ఆ బాలుడు చెన్నై ఎగ్మోర్‌లో ఉన్న పిల్లల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ బాలుడి తండ్రితో ఈ రోజు (డిసెంబర్ 20) ఉదయం 11.30 గంటల సమయంలో బీబీసీ ఫోన్లో మాట్లాడింది.

”మా అబ్బాయికి అలాగే ఉంది. స్పృహలో లేడు. అలాగే పడుకుని ఉంటున్నాడు. మమ్మల్ని సరిగ్గా గుర్తుపట్టడం లేదు. ప్రస్తుతం జ్వరం లేదు. అన్నం తినిపిస్తే తింటున్నాడు. మలమూత్రాలకు పోతున్నాడు. నార్మల్ వార్డులో ఉంచారు. ఏం జబ్బు అనేది డాక్టర్లు మాకైతే ఏమీ చెప్పలేదు. వైరస్ ఉందా లేదా అనేది కూడా ఏమీ చెప్పడం లేదు” అని బాలుడి తండ్రి అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
వెంకటాపురంలో బాలుడికి అస్వస్థత

ఐసీయూలో..

20 రోజులుగా జ్వరం వస్తూ తగ్గుతూ ఉండటంతో స్థానిక ఆర్ఎంపీకి చూపించామని, ఆయన నెల్లూరు తీసుకెళ్లాలని సూచించారని బాలుడి చిన్న నానమ్మ సుభాషిణి చెప్పారు.

”కిష్టాపురంలో ఒక ఆర్ఎంపీకి బాలుడిని చూపించారు. తర్వాత నెల్లూరు తీసుకెళ్లారు. అక్కడే రెండు రోజులు చికిత్స తీసుకున్నారు. అనంతరం ఇంటికి వచ్చారు. మరుసటి రోజు ఫిట్స్ వచ్చింది. దీంతో మళ్లీ నారాయణ ఆస్పత్రిలో జాయిన్ చేయించారు. అక్కడ ఐసీయూలో పెట్టారు. తర్వాత ఏదో వైరస్ వచ్చింది.. మద్రాసుకు తీసుకెళ్లమని చెప్పారు” అని ఆమె తెలిపారు.

”ఉదయాన్నే స్కూలుకు వెళ్లి సాయంత్రం వచ్చి.. ఇవి చెప్పండి అవి చెప్పండి అని మా దగ్గరికి వచ్చేవాడు. అలాంటి అబ్బాయి ఇలా అయ్యాడంటే మేం నమ్మలేకపోతున్నాం. ఇంతకుముందు చిన్న వయసులో ఫిట్స్ వచ్చాయి. అప్పటి నుంచి జాగ్రత్తగా మందులు వాడుతున్నారు. జాగ్రత్తగా చూసుకుంటున్నాం” అని ఆమె చెప్పారు.

వెంకటాపురం

ఆ రిపోర్టు తప్పు కావచ్చు: డీఎంహెచ్ఓ

పుణె నుంచి రిపోర్టులు వచ్చేవరకు జికా వైరస్ అని నిర్ధరణకు రాలేమని నెల్లూరు జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి (డీఎంహెచ్ఓ) పెంచలయ్య బీబీసీతో చెప్పారు.

”ఇంకా నిర్ధరణ కాలేదు. డెంగీ ఫీవర్ లక్షణాలే జికాకూ ఉంటాయి. దోమల వల్లే జికా కూడా వ్యాపిస్తుంది కాబట్టి న్యూరలాజికల్ సమస్యలు వస్తాయి. దద్దుర్లు వంటివి వస్తాయి. నారాయణ ఆస్పత్రి వాళ్లు బాంబేలో ప్రైవేట్ ల్యాబ్‌కు పంపించారు. అది తప్పు కావచ్చని అనుకుంటున్నాను.

ప్రస్తుతానికి చెన్నై ఎగ్మోర్ చిల్డ్రన్స్ ఆస్పత్రిలో బాలుడిని ఉంచాం. చెన్నై గవర్నమెంట్ ల్యాబ్ నుంచి నెగటివ్ అని రిపోర్ట్స్ వచ్చాయి. బాలుడి తల్లిదండ్రులకూ నెగిటివ్ అనే వచ్చింది. బాలుడి ఆరోగ్యం ఇప్పుడు నిలకడగా ఉంది. కోలుకోవడానికి సమయం పడుతుంది. మరింత స్పష్టత కోసం పుణెకి శాంపిల్ పంపించాం. ఆ రిపోర్ట్ రావాల్సి ఉంది” అని పెంచలయ్య తెలిపారు.

వెంకటాపురం, జికా వైరస్

గ్రామంలో పరిస్థితి ఎలా ఉంది?

జికా వైరస్ సోకిందని చెబుతున్న బాలుడి స్వగ్రామం వెంకటాపురానికి బీబీసీ వెళ్లింది. గ్రామంలో రెండు కాలనీలు ఉన్నాయి.

బాలుడు ఉంటున్న కాలనీలో మొత్తం 72 ఇళ్లు ఉన్నాయి. 252 మంది జనాభా ఉన్నారు. ఆ పక్కనే ఎస్సీ కాలనీలో 72 ఇళ్లు ఉన్నాయి. అక్కడ 262 మంది నివసిస్తున్నారు.

ఈ కాలనీల్లో దాదాపు అందరూ వ్యవసాయం, పాడి పశువులపై ఆధారపడి జీవించేవారే. దీంతో పశువులు ఎక్కువగా కనిపించాయి. ముఖ్యంగా ఇళ్ల ముందు బర్రెలు ఉండటంతో వాటి చుట్టూ ఈగలు, దోమలు పెద్ద ఎత్తున ముసురుతున్నాయి.

జికా వైరస్ కేసు బయటపడిందనే వార్తలతో ఏపీ ఆరోగ్యశాఖ వెంకటాపురానికి వైద్య బృందాలను పంపించి, ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తోంది. గ్రామంలో ఇంకా ఎవరికైనా అలాంటి లక్షణాలు ఉన్నాయా అని ఇంటింటికీ తిరిగి ఫీవర్ సర్వే చేసింది.

వెంకటాపురంలో ఆరోగ్య శిబిరాలు

ఓ బాలుడికి జికా వైరస్ సోకిందనే ప్రచారంతో వెంకటాపురం వచ్చాం కానీ, ఇక్కడ ఆ వైరస్ లక్షణాలు ఎవరిలోనూ కనిపించలేదని మర్రిపాడు ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్ గోపీనాథ్ బీబీసీకి చెప్పారు.

”ఒకటో తరగతి పిల్లాడికి జ్వరం పది పదిహేను రోజుల నుంచి తగ్గడం లేదని నెల్లూరు నారాయణ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. చికిత్స చేసినా జ్వరం తగ్గడం లేదని శాంపిల్స్ తీసి ముంబయికి పంపించారు. ఎన్సెఫలైటిస్ ఉంది, ఓసారి మీరు చెక్ చేయండని పరీక్షల తర్వాత మాకు ఆదేశాలు వచ్చాయి. దీంతో మేం వచ్చి సర్వే చేశాం. క్యాంపు నడుపుతూ పరిస్థితిని గమనిస్తున్నాం. ప్రస్తుతానికి ఏమీ లేవు. ఒక మహిళకు ఫీవర్ ఉండేది కానీ ఇప్పుడు తగ్గిపోయింది. పెద్దగా సమస్యలు అయితే ఏమీ లేవు” అని డాక్టర్ గోపీనాథ్ వివరించారు.

వెంకటాపురంలో పరిశుభ్రతపై అవగాహన

పరిశుభ్రతపై అవగాహన

దోమకాటు వల్ల జికా వైరస్ వ్యాపిస్తుంది కాబట్టి ఫాగింగ్, బ్లీచింగ్ చేస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డిసెంబర్ 18 నుంచి గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్నామని మర్రిపాడు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారి షేక్ మొహమ్మద్ జావీద్ తెలిపారు.

ఇప్పటివరకైతే ఆంధ్రపదేశ్‌లో జికా వైరస్ కేసు నమోదు కాలేదని అధికారులు ధ్రువీకరించారు. అధికారులు గ్రామం నుంచి 26 శాంపిళ్లు సేకరించి, పరీక్షలకు పంపించారు.

ఆ రిపోర్టులు వచ్చాక, అవసరమైన జాగ్రత్తలు సూచిస్తామని వైద్యులు చెప్పారు. అంతవరకూ గ్రామంలో ఆరోగ్య శిబిరాలు కొనసాగిస్తామని తెలిపారు.

జికా వైరస్

జికా వైరస్ లక్షణాలు

వస్తూ పోతూ ఉండే జ్వరం, చికిత్స చేసినా పూర్తిగా తగ్గకపోవడం, కాళ్లలో బలం తగ్గి సరిగ్గా నడవలేని పరిస్థితి రావడం వంటివి జికా వైరస్ ప్రధాన లక్షణాలని డాక్టర్ గోపీనాథ్ వివరించారు.

గర్భిణులు ఈ వైరస్ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

”జికా వైరస్ వల్ల పుట్టబోయే బిడ్డలపై ప్రభావం ఉంటుంది. కొన్నిసార్లు పిల్లలకు ఇది ప్రాణాంతకంగా మారుతుంది. కొన్నిసార్లు స్వల్ప లక్షణాలు వచ్చి తగ్గిపోవచ్చు” అని ఆయనన్నారు.

దీనిపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి స్పందించారు.

బాలుడికి చెన్నైలో మెరుగైన వైద్యం అందిస్తున్నామని, పుణె నుంచి రిపోర్ట్ వచ్చేవరకూ అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నామని చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS