SOURCE :- BBC NEWS

గ్రహశకలం, ఆస్టరాయిడ్

ఫొటో సోర్స్, Getty Images

భూమిని ఢీకొట్టే అవకాశం దాదాపుగా లేదని చెప్పిన భారీ గ్రహశకలం చంద్రుడిని ఢీకొట్టే అవకాశం గతంలో అనుకున్న దానికంటే పెరిగిందని నాసా చెబుతోంది.

తొలుత గుర్తించినప్పుడు, 2024 వైఆర్4 అనే ఈ గ్రహశకలం 2032లో భూమిని ఢీకొట్టే అవకాశం కొద్దిగా ఉందని, ఆ తర్వాత ఆ అవకాశం మరింత తగ్గి 0.004 శాతంగా నాసా పేర్కొంది.

అయితే, ఈ గ్రహశకలం 2032 డిసెంబర్ 22న చంద్రుడిని ఢీకొట్టే అవకాశం 1.7 శాతం నుంచి 3.8 శాతానికి పెరిగినట్లు నాసా ఒక ప్రకటనలో తెలిపింది. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌తో సహా ఇతర టెలిస్కోప్‌ల నుంచి అందిన సమాచారం ఆధారంగా దీనిని లెక్కించారు.

ఒకవేళ ఢీకొన్నప్పటికీ, చంద్రుడి కక్ష్యలో ఎలాంటి మార్పూ ఉండదని పేర్కొంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

వెబ్ స్పేస్ టెలిస్కోప్‌ ఇన్‌ఫ్రా రెడ్ అబ్జర్వేషన్లు ఈ గ్రహశకలం పరిమాణాన్ని అంచనా వేయడానికి సాయపడ్డాయి. వెబ్ స్పేస్ అంచనాల ప్రకారం ఇది 53 నుంచి 67 మీటర్లు.. అంటే, సుమారు 10 అంతస్తుల భవనం అంత పరిమాణంలో ఉండొచ్చన్నది శాస్త్రవేత్తల అంచనా.

నిరుడు డిసెంబర్‌లో చిలీలోని ఒక ఎడారిలో ఏర్పాటుచేసిన టెలిస్కోప్ ఈ ‘2024 వైఆర్4’ గ్రహశకలాన్ని తొలిసారి గుర్తించినప్పటి నుంచి పదుల సంఖ్యలో ఇతర ఖగోళ వస్తువులు భూమికి సమీపం నుంచి వెళ్లాయి. ఇవన్నీ చంద్రుడి కంటే భూమికే సమీపంలోంచి వెళ్లాయి.

వాటిలో చాలావరకు చాలా చిన్నవి. అవి కొన్ని భూవాతావరణంలోకి ప్రవేశించి మండిపోయి ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

గ్రహశకలం, 2024 వైఆర్4

ఫొటో సోర్స్, Getty Images

ఈ గ్రహశకలం చంద్రుడిని ఢీకొట్టడం దాదాపు అసంభవమైనప్పటికీ ఒకవేళ అలాంటిది జరిగితే ఆ పరిణామాన్ని పరిశీలించడానికి, చంద్రుడి స్పందన అధ్యయనం చేయడానికి ఇది ఓ అరుదైన అవకాశం కానుంది.

‘చంద్రుడిని కనుక ఢీకొంటే అది అధ్యయనానికి గొప్ప అవకాశం’ అని కెంట్ యూనివర్సిటీలోని స్పేస్ సైన్స్ ప్రొఫెసర్ మార్క్ బర్షెల్ ‘న్యూ సైంటిస్ట్’ మ్యాగజీన్‌తో మాట్లాడుతూ చెప్పారు.

అలాంటిది జరిగితే టెలిస్కోప్‌లతో చూడొచ్చు.. బైనాక్యులర్లతో కూడా చూసే అవకాశం ఉండొచ్చని మార్క్ అన్నారు.

దీనిపై మరింత అధ్యయనం చేయడానికి వెబ్ స్పేస్ టెలిస్కోప్ వచ్చే నెలలో ‘2024 వైఆర్4’ను మరోసారి పరిశీలించనుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)