SOURCE :- BBC NEWS

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న ఒక మత్స్యకార పల్లె ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. ఇక్కడ హెపటైటిస్ కేసులు నమోదు కావడమే దానికి కారణం. ప్రస్తుతం ఈ పల్లెలో వైద్యశిబిరం కొనసాగుతోంది.
వైద్య సిబ్బంది రాకతో తమ గ్రామానికి చెడ్డ పేరు వస్తుందంటూ పల్లం గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హెపటైటిస్ నిర్థరణ పరీక్షలు చేసుకునేందుకు కూడా గ్రామస్థులు ముందుకు రావడం లేదు. అక్కడికి వెళ్లిన బీబీసీ బృందంతో కూడా పల్లం గ్రామస్థులు మాట్లాడేందుకు మొదట నిరాకరించారు.
హెపటైటిస్ బీ, సీ వ్యాధులపై అవగాహన కోసం చేపట్టిన పైలట్ ప్రాజెక్టులో భాగంగా పల్లం గ్రామాన్ని ఎంచుకున్నామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎం. దుర్గారావు దొర బీబీసీతో చెప్పారు.
మరోవైపు హెపటైటిస్ బీ, సీ సోకినవారు పల్లం గ్రామంలో ఉన్నారని, సహకరిస్తే గ్రామస్థులందరికీ పరీక్షలు చేసి, వైద్యం అందిస్తామని అక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్న సిబ్బంది చెబుతున్నారు.


ఏమిటీ పల్లం గ్రామం కథ?
చుట్టూ నీరుతో దీవిలా కనిపిస్తుంది పల్లం గ్రామం. జనాభా సుమారు 6 వేలు. వీరంతా చేపల వేటపైనే ఆధారపడి జీవిస్తున్నారు. గోదావరి పాయలు, బంగాళాఖాతం బ్యాక్ వాటర్స్ ఈ గ్రామం చుట్టూ చేరుతాయి.
గ్రామం చుట్టూ ఉండే మడ అడవుల్లోని నీటి పాయల్లో చేపల వేట చేస్తుంటారు. మహిళలు చేపలు అమ్ముతుంటారు.
అయితే, జిల్లాలో హెపటైటిస్ వ్యాధి పరిస్థితిపై ఒక అవగాహనకు వచ్చేందుకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అధికారులు ఒక పైలట్ ప్రాజెక్ట్ చేపట్టారు. అందులో భాగంగా జిల్లాలోని కాట్రేనికోన మండలంలోని పల్లం గ్రామంలో వైద్యపరీక్షలు నిర్వహించేందుకు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు.
ఏప్రిల్ 5 నుంచి ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులో ఏప్రిల్ 8 నాటికి దాదాపు 2,400 టెస్టులు జరిగాయి. ఈ క్రమంలోనే అక్కడ హెపటైటిస్ కేసులు వెలుగుచూశాయి.

“పల్లం గ్రామంలో 16 హెపటైటిస్ బీ, 9 హెపటైటిస్ సీ కేసులు వెలుగుచూశాయి.’’ అని జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి ఎం. దుర్గారావు దొర బీబీసీతో చెప్పారు.
ఇక జిల్లాలో అమలాపురం, అల్లవరం, అంబాజీపేట, అయినవిల్లి, కాట్రేనికోన, ఉప్పలగుప్తం, కొత్తపేట, పి.గన్నవరం, ఐ.పోలవరం తదితర మండలాల్లో 47 హెపటైటిస్ బీ కేసులు, 133 హెపటైటిస్ సీ కేసులు నమోదయ్యాయి.
‘‘18 ఏళ్లు పైబడిన వారే ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నట్లు ప్రాథమికంగా తేలింది. పల్లం మత్స్యకార గ్రామం కావడంతోపాటు పెద్దది కూడా. అందుకే దీనిని పైలట్ ప్రాజెక్టు కోసం ఎంపిక చేశాం” అని దుర్గారావు దొర చెప్పారు.
ఇక్కడ వైద్యశిబిరం ఏప్రిల్ 15 వరకు ఉంటుందని, ఆ తర్వాత జిల్లాలోని మిగతా చోట్ల కూడా హెపటైటిస్ వ్యాధి నిర్థరణ శిబిరాల్ని నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.

‘నాకు పరీక్షలొద్దు, ఆరోగ్యంగానే ఉన్నా’
గ్రామంలో చాలామంది హెపటైటిస్ బీ, సీ వైద్య పరీక్షలకు నిరాకరిస్తున్నారు. ఏప్రిల్ 8న బీబీసీ బృందం అక్కడికి వెళ్లగా, ఆ సమయంలో వైద్యశిబిరం వద్ద సిబ్బంది తప్ప పరీక్షలు చేయించుకునేవారు కనిపించలేదు.
టెస్టులు చేయించుకోవాలంటూ ఇంటింటికి వెళ్లి అడుగుతున్న వైద్య సిబ్బందితో బీబీసీ కూడా వెళ్లింది. టెస్టులు చేయించుకునేది లేదని, ఇందుకు ఎవరి కారణాలు వారికున్నాయని కొందరు బీబీసీతో చెప్పారు.
“చక్కగా చేపలు తింటూ ఆరోగ్యంగా ఉన్నా. వైద్య పరీక్షలంటే నాకు భయం. కరోనా సమయంలో ఇంజెక్షన్లు చేయించుకున్నాం. ఇప్పటికీ కాళ్లు, చేతులు నొప్పులుగానే ఉన్నాయి.” అని పల్లం గ్రామానికి చెందిన కాసులమ్మ చెప్పారు.
స్థానికుడైన టైలర్ నారాయణమూర్తి ఇంటికి వెళ్లినప్పుడు.. “డాక్టర్లు హెపటైటిస్ సీ పరీక్షల్ని HCV (Hepatitis C Virus) అంటున్నారు. ఇది హెచ్ఐవీలాగా వినిపిస్తోంది. దీంతో గ్రామంలో మూడు, నాలుగు హెచ్ఐవీ కేసులు వచ్చాయంటూ వదంతులు మొదలయ్యాయి. దీనిపై సరైన విధంగా అవగాహన కల్పించాల్సిన బాధ్యత వైద్య సిబ్బందిదే” అని అన్నారు.

వైద్యులు ఏమంటున్నారంటే?
పైలట్ ప్రాజెక్టుగా పల్లం గ్రామాన్ని ఎంచుకుని అకస్మాత్తుగా వైద్య పరీక్షలు నిర్వహిస్తుండటంతో గ్రామస్థుల్లో ఆందోళన మొదలైంది.
ప్రజల్లో “మేం ఆరోగ్యంగానే ఉన్నాం కదా, మాకెందుకు పరీక్షలు..తర్వాత లేనిపోని భయాలు” అనుకునే ధోరణి కనిపిస్తోందని వైద్యశిబిరం నిర్వహిస్తున్న కాట్రేనికోన పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లిఖిత బీబీసీతో చెప్పారు.
వైద్య పరీక్షలు చేయించుకుంటేనే వ్యాధి ఉందో లేదో తెలుస్తుందని, ఒకవేళ ఉంటే చికిత్స తీసుకునే అవకాశముంటుందని డాక్టర్ లిఖిత గ్రామస్థులకు సూచిస్తున్నారు.
“గ్రామంలో 6 వేల మంది వరకు ఉన్నారు. టెస్టులు చేయించుకున్న వారిలో ఇప్పటివరకు హెపటైటిస్ బీ, సీ రెండు కలిపి 25 వరకు కేసులు వచ్చాయి. పరీక్షలు వద్దన్నవారికి చేయడం లేదు. అవగాహన కల్పిద్దామన్నా మాట వినడం లేదు. అయితే ఇక్కడేమి సాధారణం కంటే ఎక్కువగా కేసులు నమోదు కాలేదు.” అని కాట్రేనికోన ప్రభుత్వ ఆసుపత్రి హెల్త్ సూపర్‌వైజర్ రామ్మోహనరావు బీబీసీతో చెప్పారు.

హెపటైటిస్ ప్రమాదకరమా?
‘‘హెపటైటిస్ బీ, సీలు రెండూ వైరస్‌లతో సంక్రమించేవే. ఇవి కాలేయంపై ప్రభావం చూపుతాయి. అయితే హెపటైటిస్ బీకి వ్యాక్సీన్ ఉంది. దానిని మనం చిన్నతనంలోనే తీసుకుని ఉంటాం. కానీ, హెపటైటిస్ సీకి వ్యాక్సీన్ లేదు, అందుకే ఇది ప్రమాదకరం. ఇది తెలియకపోతే క్రమంగా కాలేయం పాడైపోతుంది. అందుకే పరీక్షలు చేయించుకొని వ్యాధి ఉందా, లేదా అనేది నిర్థరించుకోవాలి.” అని డాక్టర్ లిఖిత సూచించారు.
వ్యాధి ఉన్నవారికి లక్షణాలు బయటకు కనిపించకపోయినా.. లోపల కాలేయం పాడైపోతూ ఉంటుందని, అది చివరకు లివర్ ఫెయిల్యూర్‌గా మారే ప్రమాదం ఉందన్నారు డాక్టర్ లిఖిత.
సురక్షితం కానీ రక్త మార్పిడి, ఇంజెక్షన్లు, లైంగిక సంబంధాలు హెపటైటిస్ బీ లేదా సీ వ్యాధి సంక్రమించేందుకు కారణం కావొచ్చని లిఖిత చెప్పారు.
పల్లం గ్రామంలో ఎక్కువగా కేసులు నమోదుకావడానికి కారణాలను ఆమె వివరించారు. ‘‘ఈ ఊళ్లో అక్షరాస్యత తక్కువగా ఉంది. ఇక్కడ చేపలు పట్టడానికి, పొలాల్లో పనిచేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి జనం వలస వస్తుంటారు. సాధారణంగా ఇక్కడ ప్రజలు వైద్యం కోసం స్థానికంగా ఉండే డాక్టర్లనే ఎక్కువగా సంప్రదిస్తుంటారు. వారు ఒకే ఇంజక్షన్‌ను పలువురికి వాడితే హెపటైటిస్ వచ్చే అవకాశం ఉంది” అని తెలిపారు.

లక్షణాలు ఏంటి?
హెపటైటిస్ బీ, హెపటైటిస్ సీ వ్యాధుల లక్షణాల గురించి డాక్టర్ లిఖిత మరిన్ని వివరాలు చెప్పారు.
హెపటైటిస్ బీ: కలుషిత రక్తం, ఇతరులు వాడిన సూదులు వంటి వాటితో సంక్రమించే ప్రమాదం ఉంది. మత్తు పదార్థాలు అలవాటు ఉన్నవారికి కూడా రావొచ్చు. వ్యాధి సోకినా త్వరగానే కోలుకుంటారు. తెలియకుండా వ్యాధి శరీరంలో ఎక్కువ కాలం ఉంటే అది కాలేయ క్యాన్సర్‌కు కూడా దారి తీస్తుంది.
లక్షణాలు : కామెర్లు, నీరసం, వాంతులు, కడుపునొప్పి
హెపటైటిస్ సీ: రక్త మార్పిడి, సురక్షితం కానీ లైంగిక సంబంధాల ద్వారా సంక్రమిస్తుంది. ప్రసవ సమయంలో తల్లి నుంచి బిడ్డకు కూడా సోకే అవకాశం ఉంది.
లక్షణాలు : జ్వరం, నీరసం, కామెర్లు, ఆకలి తగ్గిపోవడం, వాంతులు, కడుపు నొప్పి, నల్లటి రంగులో మలం రావడం
కానీ ఎక్కువ మందిలో ఎటువంటి లక్షణాలు కనిపించకుండానే హెపటైటిస్ సీ సోకుతుంది. హెపటైటిస్ సీకి ప్రస్తుతం ఎటువంటి వ్యాక్సీన్ లేదు. మందుల ద్వారా నయం చేయాలి” అని డాక్టర్ లిఖిత చెప్పారు.

‘ఒక్కసారిగా డాక్టర్లు వచ్చేసరికి..’
పల్లం గ్రామంలో పరీక్షలు చేయించుకున్న మల్లాడి భాగ్యరాజు బీబీసీతో మాట్లాడారు.
“మేం మొదటిసారి పరీక్ష చేయించుకున్నాం. నాకు, నా భార్యకు వ్యాధి లేదని తేలింది. వైద్యులు కూడా ఒకేసారి తెల్లకోట్లతో గ్రామంలోకి వచ్చేసి సూదులతో తిరిగితే భయంగానే ఉంటుంది. ఇలాంటి మెడికల్ క్యాంపులు పెట్టే ముందు అవగాహన కల్పించాలి” అని భాగ్యరాజు బీబీసీతో చెప్పారు.
అయితే, అవగాహన కల్పించినా కూడా కొందరు వినడం లేదని, కాట్రేనికోన ప్రభుత్వ ఆసుపత్రి హెల్త్ సూపర్ వైజర్ రామ్మోహనరావు చెప్పారు.
గ్రామస్థులు సహకరిస్తే అందరికీ పరీక్షలు చేసి, అవసరమైన వారికి తగిన వైద్యం అందిస్తామని అక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్న సిబ్బంది చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS