SOURCE :- BBC NEWS
పహల్గాంను ‘ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా’ అని ఎందుకు అంటారంటే….

ఫొటో సోర్స్, Getty Images
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో టూరిస్టులపై జరిగిన దాడిలో 26 మంది చనిపోయారు. ఈ దాడికి నిరసనగా కశ్మీర్లో వ్యాపార సంస్థలను, విద్యా సంస్థలను మూసివేశారు. ప్రజా రవాణా సౌకర్యాలు కూడా ఈ దాడి వల్ల ప్రభావితమయ్యాయి.
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)కు చెందిన సెక్యూరిటీ బృందం శ్రీనగర్‌కు చేరుకుంది. మరిన్ని భద్రతా బలగాలు, ఉన్నత భద్రతా అధికారులు పహల్గాం చేరుకునే అవకాశం కనిపిస్తోంది.
పహల్గాంకు ఐదు కిలోమీటర్ల దూరంలోని బైసరన్ ప్రాంతంలో ఈ దాడి జరిగింది.
జమ్మూకశ్మీర్‌కు వచ్చే పర్యటకులు అత్యంత ఎక్కువగా సందర్శించే ప్రాంతాల్లో పహల్గాం ఒకటి.

పచ్చిక బయళ్లు, అందమైన సరస్సులతో ఆహ్లాదకరంగా ఉండే ప్రాంతం కావడంతో ఇక్కడికి పెద్ద సంఖ్యలో దేశ, విదేశీ పర్యటకులు వస్తుంటారు.
అధికారిక లెక్కల ప్రకారం 2024లో 35 లక్షల మంది కశ్మీర్లో పర్యటించారు. మార్చి నుంచి జూన్ మధ్య కాలంలో పర్యటకులు ఎక్కువగా ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు. ఈ సమయంలో పహల్గాం అందాలను చూసే అవకాశం ఉంటుంది.
అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఈ ప్రాంతం మంచుతో కప్పేసి, తీవ్రమైన చలి ఉంటుంది.
స్విట్జర్లాండ్‌లోని లంగెర్న్ ప్రాంతంలోని ప్రకృతి సౌందర్యానికి పహల్గానికి దగ్గర పోలికలు ఉన్నాయని ప్రకృతి ప్రేమికులు అంటుంటారు.
స్విట్లర్లాండ్లో ఉన్నట్లు కనుచూపు మేర ముదురు ఆకుపచ్చ రంగులో పచ్చిక మైదానాలు బైసరన్ వ్యాలీలో కనిపిస్తుంటాయని, అందుకే తరచూ దీన్ని ‘మినీ స్విట్జర్లాండ్’గా చెబుతుంటారని పహల్గాం డెవలప్మెంట్ అథారిటీ తన వెబ్సైట్లో పేర్కొంది.
పహల్గాం జమ్మూకశ్మీర్‌లో ఎక్కడ ఉంటుంది? పహల్గాం చుట్టూ చూడదగ్గ ప్రదేశాలేంటి? పర్యటకులు ఇక్కడికి ఎలా వస్తుంటారు? వంటి విషయాలు తెలుసుకుందాం..

ఫొటో సోర్స్, Getty Images
అనంత్‌నాగ్ జిల్లా వెబ్సైట్లో పేర్కొన్న వివరాల ప్రకారం…జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని అనంత్‌నాగ్ జిల్లాలో చుట్టూ పచ్చని అరణ్యంతో, ఎత్తైన కొండల మధ్యన పహల్గాం ఉంటుంది.
హిందువులు పవిత్రంగా భావించే అమర్నాథ్ యాత్రకు వెళ్లే మార్గాల్లో అత్యంత ముఖ్యమైన ప్రాంతం ఇది.
చూడగానే మైమరిచిపోయే ప్రకృతి అందానికి పెట్టింది పేరుగా పహల్గాం నిలుస్తోంది. పహల్గాం చుట్టుపక్కలా ఎన్నో చూడదగ్గ ప్రదేశాలున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
పహల్గాంకు ఎలా చేరుకోవచ్చు?
అప్డేట్ అయ్యింది 2 గంటలు క్రితం
పహల్గాంకు అత్యంత సమీపంలో ఉండే అంతర్జాతీయ విమానాశ్రయం శ్రీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు. శ్రీనగర్ ఎయిర్‌పోర్టుకు ఈ ప్రాంతం 96 కి.మీ. దూరంలో ఉంటుందని అనంత్‌నాగ్ జిల్లా వెబ్సైట్లో పేర్కొంది.
అదే రైలు మార్గం గుండా అయితే… పహల్గాంకు దగ్గర్లో ఉదమ్‌పూర్, జమ్మూలు ఉంటాయి. పహల్గాంకు ఉదమ్‌పూర్ 217 కి.మీల దూరం కాగా, జమ్మూ 285 కి.మీల దూరంలో ఉంటుంది. ఆ తర్వాత బస్సు లేదా క్యాబ్‌లో పహల్గాంకు వెళ్లాలి.
పహల్గాం నుంచి జమ్మూ, కశ్మీర్‌కు మంచి రోడ్డు మార్గం ఉంది. జమ్మూ, శ్రీనగర్, అనంత్‌నాగ్ నుంచి రాష్ట్ర బస్సు సర్వీసులు, ప్రైవేట్ బస్సులు అందుబాటులో ఉంటాయి. ట్యాక్సీలో కూడా వెళ్లొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
పహల్గాం చుట్టుపక్కలున్న పర్యాటక ప్రదేశాలేంటి?
పహల్గాంలో ప్రముఖ పర్యాటక ప్రాంతాలుగా చందన్‌వరీ, బైసరన్, శేష్నాగ్ లేక్, పంచతర్ణి, అమర్నాథ్ గుహ, అరు వ్యాలీ, లిడ్డర్‌వాట్ ఉన్నట్లు లేహ్ లద్దాఖ్ టూరిజం వెబ్సైట్ పేర్కొంది.
చందన్‌వరీ: ఇక్కడి మంచు వంతెన ఫేమస్. అమర్నాథ్ యాత్ర చందన్‌వరీ గుండా సాగుతుంది. ఈ విషయాన్ని అమర్నాథ్ యాత్ర రూట్ మ్యాప్‌లో పేర్కొన్నారు. అమర్నాథ్కు వెళ్లే రెండు మార్గాల్లో ఇదొకటి. ఇది చాలా చిన్న లోయ.
బైసరన్: జమ్మూ కశ్మీర్లో పర్యటకులపై దాడి బైసరన్ ప్రాంతంలోనే జరిగింది. పచ్చిక మైదానంలో మంచుతో కప్పేసిన పర్వతాలు ఈ ప్రాంతపు సుందర దృశ్యాన్ని పర్యటకులకు అందిస్తుంటాయి.
బైసరన్ నుంచి 11 కిలోమీటర్ల దూరంలో 3,353 మీటర్ల ఎత్తులో తులియన్ సరస్సు మంచుతో కప్పేసి ఉంటుంది. దీనికి మూడు వైపులా మంచు పర్వతాలే ఉంటాయి. బైసరన్ లోయలను, పహల్గాంను తరచూ ‘మినీ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా’గా చెబుతుంటారని మేక్ మైట్రిప్ తన వెబ్సైట్లో పేర్కొంది.
శేష్నాగ్ సరస్సు: జూన్ వరకు మంచుతోనే ఉండే ఈ సరస్సు నీరు గ్రీన్, బ్లూ రంగులో కనిపిస్తుంటుంది. చందన్‌వరీ నుంచి 13 కిలోమీటర్ల దూరంలో శేష్నాగ్ ఉంటుంది. సముద్ర మట్టానికి 11,330 అడుగుల ఎత్తులో ఇది ఉంటుంది. హిందూ పురాణాల్లోని శేష్నాగ్ తలను పోలిన ఏడు శిఖరాలు ఉండటంతో ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చిందని లేహ్ లద్దాఖ్ టూరిజం వెబ్సైట్ పేర్కొంది. ఇది ట్రెక్కింగ్‌కు ఫేమస్.

ఫొటో సోర్స్, Getty Images
పంచతర్ణి: ఐదు ప్రవాహాల సంగమమే పంచతర్ణి. దీనికి పేరు కూడా అలానే వచ్చింది. అమర్నాథ్ యాత్రకు వెళ్లేవారికి పంచతర్ణి చివరి క్యాంపింగ్ సైట్. అక్కడి నుంచి 6 కి.మీల దూరంలోనే అమర్నాథ్ ఉంటుంది.
అమర్నాథ్: శివుణ్ని దర్శించుకునేందుకు ఈ ఆధ్యాత్మిక యాత్ర పహల్గాం నుంచి ప్రారంభమవుతుంది. మంచు రూపంలో కనిపించే అమరేశ్వరుడి దర్శనం కోసం ప్రతి ఏడాది జూలై నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో వేలమంది భక్తులు ఈ ప్రాంతానికి వెళ్తుంటారు.
అరు వ్యాలీ: అందమైన ఈ పచ్చిక మైదానాన్ని చేరుకునేందుకు పర్వతం గుండా నడవాలి. గుర్ కుంభ్ వద్ద లిడ్డార్ నది అంతర్థానమవుతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి 27 నిమిషాలు ప్రయాణిస్తే తిరిగి కనిపిస్తుందని లేహ్ లద్దాఖ్ టూరిజం వెబ్సైట్ పేర్కొంది.
లిడ్డార్‌వాట్: దట్టమైన అడవుల మధ్యలో అద్భుతమైన క్యాంపింగ్ సైట్ ఉండే ప్రాంతమే లిడ్డార్‌వాట్. సింధు లోయలో ట్రెక్కింగ్ ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది.
బేతాబ్‌వ్యాలీ: సన్నీడియోల్, అమృతా సింగ్ నటించిన బేతాబ్ సినిమా షూటింగ్ ఇక్కడే జరిగింది. పర్వతాల మధ్య పచ్చని పచ్చిక బయళ్లతో ఉంటుంది. పహల్గాం నుంచి ఈ ప్రాంతానికి వెళ్లొచ్చు. ప్రకృతిని ప్రేమించే వారికి ఇది చూడదగ్గ ప్రదేశం.
స్నో లెపర్డ్, ఆసియాటిక్ బ్లాక్ బేర్, రెడ్ ఫాక్స్, హిమాలయన్ మస్క్ డీర్ వంటి అంతరించిపోయే ప్రమాదమున్న వన్యప్రాణులకు, అరుదైన జీవులకు ఇది నిలయంగా ఉందని ఈకశ్మీర్టూరిజం వెబ్సైట్ పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
పహల్గాం జనాభా ఎంత?
అయితే, ఈ జనాభా 13,200 పెరిగి ఉంటుందని అంచనాలున్నాయి. అప్పటి జనాభా లెక్కల ప్రకారం.. పహల్గాంలో ముస్లిం జనాభా ఎక్కువ. ఆ తర్వాత హిందువులు, సిక్కులు, క్రిస్టియన్లు, బౌద్ధులు, జైన్లు, ఇతర మతాల వారు ఉన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)