SOURCE :- BBC NEWS

సైన్యం

ఫొటో సోర్స్, Getty Images

ఒక గంట క్రితం

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడిలో 26మంది మరణించారు. మృతుల్లో ఎక్కువ మంది పర్యటకులే.

2019 ఆగస్టులో జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన అతిపెద్ద దాడి అని చెబుతున్నారు.

దాడి జరిగిన రోజున భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా సౌదీ అరేబియాలో ఉన్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌లో ఉన్నారు.

అయితే, పహల్గాం దాడికి కొన్నిరోజుల ముందు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసిమ్ మునీర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని ఏ శక్తి కూడా కశ్మీర్‌ను పాకిస్తాన్ నుంచి వేరు చేయలేదని అన్నారు. హిందువులు, ముస్లింల మధ్య వ్యత్యాసాన్ని వివరించే క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలకు కొన్ని రోజుల తర్వాత జమ్మూకశ్మీర్‌లో దాడి జరిగింది. ప్రధాని మోదీ తన సౌదీ అరేబియా పర్యటనను మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
బాధితులు

ఫొటో సోర్స్, Getty Images

పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడికి సంబంధించి పాకిస్తాన్ నుంచి అనేక రకాల స్పందనలు వస్తున్నాయి.

భారతదేశంలో పాకిస్తాన్ మాజీ హైకమిషనర్‌గా పని చేసిన ఓ అధికారి ఎక్స్‌లో ఇలా రాశారు: “భారత్ దుస్సాహసాన్ని అడ్డుకోవడానికి పాకిస్తాన్ పూర్తిగా సిద్ధంగా ఉందని నాకు నమ్మకం ఉంది. ఈసారి పాకిస్తాన్ సమాధానం తగిన విధంగా ఉంటుందనడంలో నాకు ఎటువంటి సందేహం లేదు” అన్నారు.

పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నాయకురాలు ఎంపీ షెర్రీ రెహ్మాన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఇలా రాశారు: “పహల్గాంలో జరిగిన విషాదకరమైన ఉగ్రవాద దాడిని నేను ఖండిస్తున్నాను. దురదృష్టవశాత్తు జరిగిన ఈ దాడికి కూడా పాకిస్తాన్ కారణం అనడం భారత్‌కు సాధారణమై పోయింది” అన్నారు.

“భారతదేశం తన వైఫల్యాలను ఆపడంలో విఫలమైంది. నియంత్రణ రేఖ (LOC) వెంబడి వ్యూహాత్మక స్థిరత్వం, బాధ్యతాయుతమైన ఒప్పందం కోసం పిలుపునిచ్చే సహేతుకమైన స్వరాలను విస్మరిస్తున్నారు. వారిని ఎగతాళి చేస్తున్నారు. ఊహించినట్లుగానే, ఎటువంటి దర్యాప్తు లేకుండా, భారతదేశ రైట్ వింగ్ ఇప్పుడు పాకిస్తాన్‌ను నాశనం చేయాలని పిలుపునిస్తుంది” అని షెర్రీ అన్నారు.

గాయపడిన  మహిళ

ఫొటో సోర్స్, Getty Images

హమాస్ దాడితో ముడిపెట్టిన హుస్సేన్ హక్కానీ…

అమెరికాలో పాకిస్తాన్ మాజీ రాయబారి హుస్సేన్ హక్కానీ ఎక్స్‌ లో ఇలా రాశారు: “అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాద దాడి తర్వాత గాజా విషాదంలో మునిగిపోయింది. ఏప్రిల్ 22, 2025న జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద దాడి కూడా పరిణామాల పరంగా అంతే భయంకరమైనది. ఈ ఉగ్రవాద దాడిని అన్ని నాగరిక దేశాలు, ప్రజలు ఖండించాలి” అన్నారు.

ఈ దాడి గురించి పాకిస్తాన్ వార్తా చానల్ సామా టీవీ యాంకర్ మాట్లాడుతూ,

“భారతదేశంలో ఏదైనా ఉగ్రవాద దాడి జరిగినప్పుడల్లా, భారత్‌ నేరుగా పాకిస్తాన్‌ను వేలెత్తి చూపుతుంది” అని అన్నారు.

పాకిస్తాన్ జర్నలిస్ట్ సిరిల్ అల్మెయిడా ఎక్స్‌లో ఇలా రాశారు: “భారతదేశం దీన్ని ఎవరు చేశారో గుర్తించి వారిపై ప్రతీకార చర్య తీసుకోవాలనుకుంటే ఎవరైనా దానిని ఆపగలరా?”

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసిమ్ మునీర్

ఫొటో సోర్స్, Getty Images

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఏం చెప్పారు?

ఏప్రిల్ 13 నుంచి 16 వరకు ఇస్లామాబాద్‌లో ప్రవాస పాకిస్తానీల సమావేశం జరిగింది. ఇలాంటి సమావేశం జరగడం ఇదే మొదటిసారి.

జనరల్ మునీర్, ఈ సమావేశంలో ప్రసంగిస్తూ టూ నేషన్ థియరీ గురించి మాట్లాడారు. పాకిస్తాన్‌కు కశ్మీర్‌ చాలా కీలకమని అన్నారు. హిందువులు, ముస్లింల మధ్య వ్యత్యాసాన్ని కూడా నొక్కి చెప్పారు.

ప్రపంచంలో ఏ శక్తి కూడా కశ్మీర్‌ను పాకిస్తాన్ నుంచి వేరు చేయలేదని జనరల్ మునీర్ అన్నారు.

అలాగే “మనం ఒకటి కాదు, రెండు దేశాలు. మన పూర్వీకులు ప్రతి విషయంలోనూ హిందువులకన్నా భిన్నంగా ఉన్నామని నమ్మేవారు. మన మతం, ఆచారాలు, సంప్రదాయాలు, ఆలోచనలు, లక్ష్యాలు అన్నీ భిన్నంగా ఉంటాయి.” అన్నాారాయన.

జనరల్ మునీర్ చేసిన ఈ ప్రకటనలో…హిందువులు, ముస్లింల మధ్య వ్యత్యాసం గురించి వివాదం ఉంది.

జనరల్ మునీర్ చేసిన ఈ ప్రకటన పాకిస్తాన్‌లోని హిందువుల పట్ల ద్వేషాన్ని పెంచుతుందని పాకిస్తాన్‌లోని చాలామంది అంటున్నారు. పాకిస్తాన్‌లో హిందువులు అతిపెద్ద మైనారిటీ సమాజం.

జనరల్ మునీర్ వీడియో క్లిప్‌పై పాకిస్తానీ సూఫీ పండితుడు, జర్నలిస్ట్ సబాహత్ జకారియా మాట్లాడుతూ, “మొదటి ప్రశ్న మనం ఎవరు? మనం హిందువులు, ముస్లింల గురించి మాట్లాడుతుంటే, 20 కోట్ల మంది ముస్లింలు భారతదేశంలో నివసిస్తున్నారు. మీ ఆలోచన ప్రకారం చూస్తే, ఈ 20 కోట్ల మంది ముస్లింలు కూడా మిగిలిన భారతీయుల కంటే భిన్నంగా ఉన్నారు. కాబట్టి పాకిస్తాన్ తన 24 కోట్ల ముస్లింలలో 20 కోట్ల మంది భారతీయ ముస్లింలను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉందా? భారతీయ ముస్లింలు కూడా పాకిస్తాన్‌లో చేరాలనుకుంటున్నారా? తిరిగి పంపిస్తున్న10 లక్షలమంది అఫ్గాన్ ముస్లింల సంగతేంటి? వారు దశాబ్దాలుగా పాకిస్తాన్‌లో నివసిస్తున్నారు. వారికి రెండు దేశాల సిద్ధాంతం వర్తించదా?” అని అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)