SOURCE :- BBC NEWS

సింధు నది

ఫొటో సోర్స్, Getty Images

సింధు నది, దాని రెండు ఉప నదులు పాకిస్తాన్‌లోకి ప్రవహించకుండా భారత్ ఆపగలదా?

పహల్గాం దాడి తర్వాత రెండు దేశాల మధ్య సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ భారత్ నిర్ణయం తీసుకున్న తరువాత అనేక మందిలో మెదులుతున్న ప్రశ్న ఇది.

పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తూ భారత్ తీసుకున్న పలు చర్యలలో ఈ ఒప్పందాన్ని రద్దు చేయడం కూడా ఒకటి.

అయితే పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందన్న భారత్ వాదనను ఇస్లామాబాద్ ఖండించింది. ఇండియా తీసుకున్న చర్యలకు ప్రతిచర్యగా పాకిస్తాన్ కొన్ని నిర్ణయాలను ప్రకటించింది.

నదీజలాలను ఆపితే అది ‘యుద్ధంగా పరిగణిస్తాం’ అని పాకిస్తాన్ పేర్కొంది.

1960 సింధు జలాల ఒప్పందం ప్రకారం సింధు పరివాహక ప్రాంతానికి తూర్పున ఉన్న సట్లజ్, రావి, బియాస్ నదులను భారతదేశానికి.. పశ్చిమాన ఉన్న సింధు, జీలం, చీనాబ్‌ నదీ జలాల్లో 80 శాతం పాకిస్తాన్‌కు కేటాయించారు.

దీనిపై గతంలో వివాదాలు వచ్చాయి. భారతదేశం చేపట్టిన జలవిద్యుదుత్పత్తి, మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులపై పాకిస్తాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఆయా ప్రాజెక్టుల నిర్మాణం ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని వాదించింది. సింధు పరివాహక ప్రాంతంలో ప్రవహించే నీటితో పాకిస్తాన్‌లో 80 శాతానికి పైగా పంటలు పండుతున్నాయి. ఆ దేశానికి అవసరమైన విద్యుత్‌లో మూడొంతులు ఈ నదులపై నిర్మించిన ప్రాజెక్టుల ఆధారంగానే వస్తోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
సింధు నది జలాల ఒప్పందం, భారత్, పాకిస్తాన్

ఫొటో సోర్స్, EPA

‘కొత్త ప్రాజెక్ట్‌లు నిర్మిస్తే పాకిస్తాన్‌కు సమాచారం ఇవ్వనవసరం లేదు’

మరోవైపు వాతావరణ మార్పుల దృష్ట్యా నీటి పారుదల, తాగునీటి సౌకర్యం, జలవిద్యుదుత్పత్తి అవసరాలను ప్రస్తావిస్తూ ఈ ఒప్పందాన్ని సమీక్షించాలని భారత దేశం కొంతకాలంగా ఒత్తిడి చేస్తోంది.

ప్రపంచబ్యాంక్ మధ్యవర్తిత్వం వహించిన ఈ ఒప్పందంపై భారత్, పాకిస్తాన్ కొన్నేళ్లుగా తమ వాదనలు వినిపిస్తున్నాయి.

అయితే ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ఒక దేశం ప్రకటించడం ఇదే తొలిసారి.

ఈ ప్రవాహానికి ఎగువన ఉండటం భారతదేశానికి భౌగోళికంగా కలిసొచ్చే అంశం.

అయితే ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే ఏమవుతుంది? సింధు నది జలాలను భారత్ నిలిపివేస్తుందా లేదా మళ్లిస్తుందా?

దీనివల్ల పాకిస్తాన్ జీవనాధారాన్ని కోల్పోతుందా? భారత్‌కు ఈ నీటిని ఆపే, మళ్లించే సామర్థ్యం ఉందా?

ప్రవాహం తీవ్రంగా ఉన్న కాలంలో పశ్చిమ నదుల్లోని భారీ నీటి ప్రవాహాన్ని ఆపడం దాదాపు అసాధ్యం అంటున్నారు నిపుణులు.

ఈ జలాలను నిల్వ చేయాలంటే భారీ రిజర్వాయర్లు అవసరం. రిజర్వాయర్లలోకి వచ్చే నీటిని నిల్వ చేసేందుకు, ఉన్న నీటిని మళ్లించేందుకు విస్తృతమైన కాలువల వ్యవస్థ కావాలి. అయితే ఇప్పుడక్కడ అలాంటి మౌలిక వసతులేమీ లేవు.

“భారతదేశంలో ఎక్కువగా నదుల మీద హైడ్రో పవర్ ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయి. భారీగా నీటిని నిల్వ చేసే ప్రాజెక్టును ఏ నది మీదా కట్టలేదు” అని ‘సౌత్ ఏషియా నెట్‌వర్క్ ఆన్ డామ్స్‌’లో జల వనరుల నిపుణుడు హిమాన్షు ఠక్కర్ చెప్పారు.

ఇలాంటి హైడ్రో పవర్ ప్రాజెక్టులు నీటిని నిల్వ చేసేందుకు కాకుండా టర్బైన్లను తిప్పడానికి, విద్యుత్ ఉత్పత్తి చేయడానికి మాత్రమే నీటి ప్రవాహాన్ని ఉపయోగించుకుంటాయి.

సింధు, జీలం, చీనాబ్ నదుల్లో ఒప్పందం ప్రకారం 20 శాతం నీటిని వాడుకునేందుకు కూడా భారత్‌లో సరైన మౌలిక వసతులు లేవని నిపుణులు చెబుతున్నారు.

నీటి నిల్వ ప్రాజెక్టులను నిర్మించకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందనేది వారి వాదన. అయితే ఇలాంటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని పాకిస్తాన్ వ్యతిరేకిస్తోంది.

పాకిస్తాన్‌కు సమాచారం ఇవ్వకుండా భారత్ నీటిని ఆపాలన్నా లేదా మళ్లించాలన్నా ఇప్పుడున్న మౌలిక వసతుల్ని మార్చాలి. నీటిని నిల్వ చేయాలంటే కొత్త ప్రాజెక్టుల్ని నిర్మించాలని నిపుణులు చెబుతున్నారు.

“గతంలో మాదిరిగా కాకుండా, భారత్ ఇప్పుడు తాను నిర్మించతలపెట్టన ప్రాజెక్టుల వివరాలకు సంబంధించిన పత్రాలను పాకిస్తాన్‌కు సమర్పించాల్సిన అవసరం లేదు” అని ఠక్కర్ చెప్పారు.

సింధు నది జలాల ఒప్పందం, భారత్, పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

భారత్ ప్రారంభించిన ప్రాజెక్టుల పురోగతి ఎలా ఉంది?

అయితే భౌగోళికంగా కఠినమైన భూభాగం, స్థానికుల ఆందోళనలు వంటి అంశాల వల్ల సింధు నది పరివాహక ప్రాంతంలో భారత ప్రభుత్వం చేపట్టిన నీటి ప్రాజెక్టుల నిర్మాణం అనుకున్నంత వేగంగా సాగలేదు.

ఈ ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిపై అధికారిక సమాచారం ఏదీ లేనప్పటికీ, వాటి పురోగతి పరిమితంగా ఉందని తెలిసింది.

అయితే భారతదేశం ప్రస్తుతం ఈ నదులపై నిర్మించిన ప్రాజెక్టులను ఉపయోగించి నీటి ప్రవహాన్ని కట్టడి చేస్తే వేసవిలో పాకిస్తాన్‌కు నీటి కష్టాలు తప్పవని కొందరు నిపుణులు చెబుతున్నారు.

“నదుల్లో నీటి ప్రవాహం తక్కువగా ఉన్నప్పుడు నీటి నిల్వ అనేది ముఖ్యం. అందులోనూ కీలకమైన వేసవిలో ఏం జరుగుతుందనేది మరింత ఆందోళన కలిగించే విషయం” అని టఫ్ట్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ హసన్ ఎఫ్.ఖాన్ డాన్ పత్రికకు రాసిన వ్యాసంలో పేర్కొన్నారు.

“ఒప్పందం అమల్లో లేకపోతే అది మరింత తీవ్రంగా మారవచ్చు” అని ఆయన ఆ వ్యాసంలో అభిప్రాయపడ్డారు.

సింధు నది జలాల ఒప్పందం, భారత్, పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

ఒప్పందం ప్రకారం వరదల అంచనా, సాగునీటి ప్రణాళికలు, జల విద్యుదుత్పత్తి, తాగునీరు మొదలైన అవసరాల కోసం సింధు పరివాహక ప్రాంతంలో జల సంబంధిత సమాచారాన్ని భారతదేశం పాకిస్తాన్‌తో పంచుకోవాలి.

వరదలకు సంబంధించిన డేటాను పాకిస్తాన్‌కు అందించడాన్ని భారత్ ఇప్పుడు ఆపేయొచ్చని సింధు జలాల ఒప్పందం మాజీ కమిషనర్ ప్రదీప్ కుమార్ సక్సేనా పీటీఐ వార్తా సంస్థతో చెప్పారు.

జూన్‌లో ప్రారంభమై సెప్టెంబర్‌లో ముగిసే వర్షాల సీజన్‌లో ఈ ప్రాంతంలో వరదల వల్ల తీవ్ర విధ్వంసం జరుగుతోంది. అయితే భారత్ ఇప్పటికీ కొద్దిపాటి సమాచారాన్ని మాత్రమే అందిస్తోందని పాకిస్తాన్ అధికారులు అంటున్నారు.

“ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించడానికి ముందు కూడా భారత్ కేవలం 40శాతం డేటా మాత్రమే పంచుకుంది” అని సింధు జలాల ఒప్పందంలో పాకిస్తాన్ తరఫున అడిషనల్ కమిషనర్‌గా పనిచేసిన సిరాజ్ మెమెన్ బీబీసీతో చెప్పారు.

ఈ ప్రాంతంలో నీటి సంబంధిత ఉద్రిక్తతలు తలెత్తిన ప్రతిసారీ వినిపించే ప్రశ్న ఏంటంటే ఎగువన ఉన్న దేశం నదీ జలాలను దిగువన ఉన్న దేశం మీద “ఆయుధంగా” మార్చగలదా అని.

దీన్ని తరచుగా “వాటర్ బాంబ్” అని పిలుస్తుంటారు. ఎగువన ఉన్న దేశం వరదల సమయంలో తాత్కాలికంగా నీటిని నిల్వ చేసి, ముందస్తు హెచ్చరిక లేకుండా హఠాత్తుగా కిందకు వదిలితే దిగువ ప్రాంతంలో అంతులేని విధ్వంసం జరుగుతుంది.

భారత దేశం అలా చేయగలదా?

సింధు, ఇతర నదుల మీద భారత్ నిర్మించిన డ్యామ్‌లు పాకిస్తాన్ సరిహద్దుకు చాలా దూరంగా ఉన్నాయి. అందువల్ల వాటి నుంచి వర్షాకాలంలో నీటిని పెద్దమొత్తంలో విడుదల చేస్తే భారత్‌లోని ప్రాంతాలకూ వరద ముప్పు ఉంటుంది.

సింధు లాంటి హిమాలయన్ నదుల ప్రవాహంలో బురద ఎక్కువగా ఉంటుంది.

ఇది రిజర్వాయర్లలో పేరుకుపోతుంది. నీరు విడుదల చేసినప్పుడు ఈ బురద వల్ల దిగువన భారీగా నష్టం జరుగుతుంది.

బ్రహ్మపుత్రతో భారత్‌కు సమస్య ఉంటుందా?

చైనాలో పుట్టిన బ్రహ్మపుత్ర నదికి దిగువన భారత్ ఉంది.

2016లో జమ్ముకశ్మీర్‌లో మిలిటెంట్ దాడి తర్వాత భారత్ ‘రక్తం, నీరు కలిసి ప్రవహించవు’ అంటూ పాకిస్తాన్‌ను హెచ్చరించింది.

భారత్ ఈ ప్రకటన చేసిన తర్వాత చైనా ‘యార్లంగ్ సాంగ్‌పో’ నదికి చెందిన ఓ ఉపనది ప్రవాహాన్ని హైడ్రోపవర్ ప్రాజెక్ట్ పేరుతో అడ్డుకుంది. ఆ ఉపనదే భారత్‌లోకి ప్రవహించి బ్రహ్మపుత్రగా మారుతుంది.

పాకిస్తాన్‌ మిత్రదేశమైన చైనా అప్పట్లో తమ అవసరాల రీత్యా సరిహద్దుకు సమీపంలో జల విద్యుదుత్పత్తి కేంద్రాన్ని నిర్మించినట్లు చెప్పింది.

అయితే ప్రాజెక్టు నిర్మించిన సమయం చూస్తే.. చైనా పాకిస్తాన్‌కు సాయం చేసేందుకే ఈ నిర్మాణాన్ని చేపట్టినట్లు నిపుణులు పేర్కొంటుంటారు.

ఇలాంటి ప్రాజెక్టు వల్ల పర్యావరణంపై పెద్దగా ప్రభావం పడదని చైనా చెప్తున్నా నదీప్రవాహంపై ఆ దేశ నియంత్రణ పెరుగుతుందని భారత్ ఆందోళన చెందుతోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)