SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty/x.com/TararAttaullah
పహల్గాం దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు, భయాలు అంతకంతకూ పెరుగుతుండడంతో సంయమనం పాటించాలని అనేక దేశాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.
భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతలు తగ్గించుకుంటాయని చైనా, అమెరికా, తుర్కియే, ఖతార్ ఆశాభావం వ్యక్తంచేశాయి. కొన్నిరోజులుగా నియంత్రణ రేఖ దగ్గర(ఎల్ఓసీ) రెండు దేశాల సైనికుల మధ్య కాల్పులు జరుగుతున్నాయి.
దీంతో భారత్, పాకిస్తాన్ యుద్ధం అంచున ఉన్నాయా…రానున్న కొన్నిరోజుల్లో పాకిస్తాన్‌పై భారత్ ఏదైనా చర్య తీసుకుంటుందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఇటీవలి తన ప్రకటనల్లో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇప్పటికే ఇందుకు సంబంధించిన సంకేతాలిచ్చారు.
తాజాగా పాకిస్తాన్ మరో మంత్రి కూడా ఈ తరహా వ్యాఖ్యలే చేశారు.
వచ్చే 24 నుంచి 36 గంటల్లో పాకిస్తాన్‌పై భారత్ దాడి చేస్తుందని పాకిస్తాన్ సమాచారశాఖ మంత్రి అతావుల్లా తరార్ చెప్పారు.
ఈ తెల్లవారుజామున 3.09 గం.లకు తరార్ ఈ ప్రకటన చేశారు. ఎక్స్‌లో వీడియో పోస్టు చేసిన ఆయన, ఉర్దూలో కూడా దీనిపై పోస్టు పెట్టారు.


పాకిస్తాన్ రక్షణ మంత్రి ఏమన్నారు?
భారత్ తక్షణ చర్య తీసుకోవచ్చని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అంతకుముందు వ్యాఖ్యానించారు.
”మేం బలగాల మోహరింపును పెంచాం. తక్షణమే ఏమైనా జరగొచ్చు. ఈ పరిస్థితుల్లో కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే తీసుకున్నాం” అని రాయిటర్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోమవారం (ఏప్రిల్ 28న) ఖవాజా చెప్పారు.
భారత్ నుంచి దాడి జరగొచ్చని పాకిస్తాన్ ఆర్మీ ప్రభుత్వాన్ని హెచ్చరించిందని కూడా ఖవాజా ఆసిఫ్ తెలిపారు.
పాకిస్తాన్ ఉనికికి ప్రమాదం ఉన్నప్పుడు మాత్రమే అణ్వాయుధాలు ఉపయోగిస్తాయని ఈ ఇంటర్వ్యూలో ఆయన అన్నారు.
వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంపై తన ప్రకటనలో ఖవాజా ఆసిఫ్ మాట్లాడారు.
నియంత్రణరేఖ దగ్గర పాకిస్తాన్ బలగాలను పెంచడాన్ని వ్యూహాత్మక నిర్ణయంలా చూడాలన్నారు.
వచ్చే రెండు నుంచి నాలుగు రోజుల్లో యుద్ధం వచ్చే అవకాశముందన్న తన ప్రకటనను తప్పుగా అర్ధం చేసుకున్నారని తర్వాత ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖవాజా వ్యాఖ్యానించారు.
”మనం మానసికంగా సిద్ధంగా ఉండాలి. యుద్ధం ముప్పు పొంచి ఉంది” అని పాకిస్తానీ టీవీ చానల్ సమా టీవీతో మాట్లాడుతూ ఖవాజా సూచించారు.
”యుద్ధం వచ్చే అవకాశముందా అని నన్ను అడిగారు. వచ్చే రెండు, మూడు రోజులు కీలకమని నేను చెప్పా. ఏదన్నా జరిగే అవకాశముంటే అది వచ్చే రెండు, మూడు రోజుల్లో జరుగుతుందని అన్నాను” అని తర్వాత ఆయన జియో న్యూస్‌తో తెలిపారు.
యుద్ధం జరగబోతుందని అంచనా వేసినట్టుగా తన ప్రకటనను చూడకూడదని ఖవాజా అన్నారు.
పరిస్థితులను మెరుగు పరచడానికి మిత్రదేశాలను పాకిస్తాన్ సంప్రదిస్తోందని కూడా ఖవాజా ఆసిఫ్ అన్నారు.
చైనా, గల్ఫ్ దేశాలతో మాట్లాడామని, బ్రిటన్, అమెరికా వంటి దేశాలకు కూడా పరిస్థితిని వివరించామని ఆయన చెప్పారు.
ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యల తర్వాత పాకిస్తాన్ సమాచార మంత్రి ఈ తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఎక్స్‌లో పోస్టు చేశారు.
”పహల్గాం ఘటనను సాకుగా చూపుతూ వచ్చే 24 నుంచి 36 గంటల్లో సైనిక చర్యకు దిగే ఆలోచనలో భారత్ ఉందని పాకిస్తాన్‌కు విశ్వసనీయమైన ఇంటెలిజెన్స్ సమాచారం ఉంది. ఏ రకమైన దాడికైనా నిర్ణయాత్మకంగా స్పందిస్తాం. ఈ ప్రాంతంలో జరిగే వినాశకర పరిణామాలకు భారత్ బాధ్యత వహించాలి” అని తరార్ తన ప్రకటనలో వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్, పాకిస్తాన్ మధ్య పెరిగిన ఉద్రికత
పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా భారత్ చాలా చర్యలు తీసుకుంది.
ఇందులో సింధు జలాల ఒప్పందం నిలిపివేత, పాకిస్తానీ పౌరులకు వీసాలు రద్దు వంటి నిర్ణయాలున్నాయి. దీనికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ కూడా సిమ్లా ఒప్పందం నిలిపివేత, భారతీయులకు వీసాలు రద్దు వంటి చర్యలు ప్రకటించింది.
సింధు నది నీటిని భారత్ ఆపితే, దాన్ని ‘యుద్ధ చర్య’గా పాకిస్తాన్ భావిస్తుందని ఆ దేశ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
‘దోషులకు కఠిన శిక్ష విధిస్తాం’ అని దాడి తర్వాత భారత ప్రధాని మోదీ ప్రకటించారు.
పహల్గాం దాడిలో తమ పాత్ర లేదని పాకిస్తాన్ చెబుతోంది.

ఫొటో సోర్స్, ANI
పహల్గాం దాడి తర్వాత పరిస్థితులు మారిపోయాయా?
ఇటీవలి సంవత్సరాల్లో కశ్మీర్లో సాధారణ పరిస్థితులున్నాయని భారత్ పదే పదే చెబుతోంది. ఈ ఏడాది కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. పర్యటకుల సంఖ్య బాగా పెరుగుతోందని ప్రభుత్వం తెలిపింది.
పహల్గాం దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య పరిస్థితి మారిపోయిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
”పహల్గాం దాడితో అంతా మారిపోయింది” అని దక్షిణాసియా వ్యవహారాల నిపుణులు మైఖేల్ కుగల్‌మాన్ న్యూస్‌వీక్‌లో ప్రచురితమైన తన వ్యాసంలో అభిప్రాయపడ్డారు.
”దిల్లీ వైపు నుంచి చూస్తే దాడి తీవ్రత, ప్రజల ఒత్తిడి దృష్ట్యా ఏదో ఒక సైనిక చర్య తీసుకునే అవకాశం ఉంది. ఇది జరిగితే, బలహీనంగా కనిపించడానికి పాకిస్తాన్ సిద్ధంగా లేదు. అది కూడా ప్రతిస్పందిస్తుందని కచ్చితంగా చెప్పొచ్చు” అని మైఖేల్ కుగల్‌మాన్ అభిప్రాయపడ్డారు.
ఈ పరిస్థితుల్లో భారత్‌గానీ, పాకిస్తాన్‌గానీ చేసే తప్పుడు అంచనా మరిన్ని సమస్యలకు కారణమవుతుందని విశ్లేషకులు హెచ్చరించారు.
”తీవ్రమైన స్పందన మనం చూస్తాం. భారతీయులకే కాకుండా, పాకిస్తాన్ శక్తులకు కూడా భారత్ సంకల్పం తెలిసేలా ఆ స్పందన ఉంటుంది” అని మిలిటరీ నిపుణులు శ్రీనాథ్ రాఘవన్ బీబీసీతో చెప్పారు.
యూరి ఆర్మీ క్యాంప్‌పై జరిగిన దాడిలో 19 మంది సైనికులు చనిపోయిన తర్వాత 2016 సెప్టెంబరులో పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రైక్స్ జరిపామని భారత్ ప్రకటించింది.
ఆ తర్వాత 2019లో పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై దాడి తర్వాత బాలాకోట్‌లో వైమానిక దాడులు జరిపామని తెలిపింది. నియంత్రణ రేఖకు 50 కిలోమీటర్ల దూరంలోని బాలకోట్‌పై వైమానిక దాడులు జరిపామని భారత్ ప్రకటించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, YouTube/@ISPR
పాకిస్తాన్లో అశాంతి, ఆందోళన?
యుద్ధం భయాల మధ్య పాకిస్తాన్ నుంచి వస్తున్న ప్రకటనలు పాకిస్తాన్లో ఉన్న అశాంతిని, భయాన్ని ప్రతిబింబిస్తున్నాయా?
”ప్రభుత్వం, సైన్యం పూర్తి సన్నద్ధంగా ఉన్నాయని, పాకిస్తాన్‌పై దాడి చేస్తే మౌనంగా ఉండిపోదని, ప్రతిస్పందించేందుకు సిద్ధంగా ఉందని భారత్‌కు చెప్పేందుకు అలాంటి ప్రకటనల ద్వారా పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది” అని మిలిటరీ నిపుణులు అజయ్ శుక్లా చెప్పారు.
భారత్‌తో సైనిక ఘర్షణకు దిగే సామర్థ్యం తమకుందని చూపించేందుకు కూడా పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని అజయ్ శుక్లా అన్నారు.
”బాలాకోట్ దాడుల సమయంలో భారత వాయుసేనకు చెందిన యుద్ధ విమానాన్ని పాకిస్తాన్ కూల్చివేసింది. తమ సామర్థ్యం తగ్గిందని భారత్ అనుకోకూడదన్నది పాకిస్తాన్ ఉద్దేశం” అని ఆయనన్నారు.
”భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. నియంత్రణ రేఖ వద్ద మోహరించిన సైన్యాలు కట్టడిలో ఉండడం లేదు. రెండు దేశాల మధ్య తీవ్రమైన ఉద్రిక్తత ఉందని చెప్పడానికి ఎల్వోసీ దగ్గర కాల్పుల ఘటనలు నిదర్శనం” అని అజయ్ శుక్లా అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘భారత్ సైనిక చర్యకు దిగే అవకాశం ఎక్కువగా ఉంది’
‘‘పాకిస్తాన్ ఆర్మీ, ప్రభుత్వంతో సంబంధం ఉన్న వ్యక్తుల మాటలను జాగ్రత్తగా అర్ధం చేసుకోవాలి. తాము సైన్యాన్ని మోహరించామని, భారత్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పడ ద్వారా, మేం వెనక్కి తగ్గుతామని మీరు అనుకోవద్దన్న అర్ధం ఉంది” అని పాకిస్తాన్ రక్షణమంత్రి ప్రకటనను ఉద్దేశించి అజయ్ శుక్లా అన్నారు.
పాకిస్తాన్‌పై భారత్ సైనిక చర్యకు దిగే అవకాశం చాలా ఎక్కువగా ఉందని అజయ్ శుక్లా భావిస్తున్నారు.
”పహల్గాం కాల్పుల తర్వాత భారత్, పాకిస్తాన్ నుంచి వచ్చిన ప్రకటనలన్నీ భారత్ చర్య తీసుకోబోతోందని, మరణాలకు ప్రతీకారం తీర్చుకోబోతుందని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. రెండు దేశాల మధ్య యుద్ధం జరిగే అవకాశం పెరిగింది. బాలాకోట్ తర్వాతెప్పుడూ ఇంతటి ఉద్రిక్త పరిస్థితి లేదు” అని ఆయనన్నారు.
భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరగబోతున్నట్టు అన్ని సంకేతాలు కనిపిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తానీ నిపుణులు ఏమంటున్నారు?
మరోవైపు పాకిస్తాన్ నిపుణుల స్పందన మరోలా ఉంది.
”పాకిస్తాన్లో ఎలాంటి అశాంతి, భయం, ఆందోళన లేవు. పరిస్థితులను ఎదుర్కోడానికి పాకిస్తాన్ సిద్ధంగా ఉంది. రక్షణమంత్రి ఉద్దేశం అదే” అని పాకిస్తాన్ కాయద్-ఎ-ఆజమ్ యూనివర్సిటీ ప్రొఫెసర్, మిలటరీ వ్యవహారాల నిపుణులు డాక్టర్ సల్మా మాలిక్ చెప్పారు.
”ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు మనం సిద్ధంగా ఉన్నామని రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రజలకు చెబుతున్నారు. భారత్ స్నేహ హస్తం చాపితే, పాకిస్తాన్ కూడా స్నేహంగా ఉంటుంది. భారత్ దాడికి దిగితే మనం దాడికి కూడా సిద్ధంగా ఉంటాం” అని సల్మా మాలిక్ అన్నారు.
”చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని పాకిస్తాన్ కోరుకుంటోంది. ఒక వేళ యుద్ధం వస్తే పాకిస్తాన్ పూర్తి సన్నద్ధంగా ఉంది. బాలాకోట్ జరిగినప్పుడు కూడా పాకిస్తాన్ వెనక్కి తగ్గలేదు. భారత్ ఎలాంటి చర్య తీసుకున్నా, అదే తీరులో పాకిస్తాన్ ప్రతిస్పందిస్తుంది” అని ఆమె అన్నారు.
వచ్చే కొన్నిరోజుల్లో సరిహద్దు దగ్గర ఏమన్నా జరగబోతుందా అన్నదానికి ”దిల్లీవైపు నుంచి ఏం జరిగినా, భవిష్యత్తులో ఏమైనా జరగొచ్చని మేం భావిస్తాం. ఏమీ జరగకపోతే, భవిష్యత్తులో ఎలాంటి ఘటనలూ ఉండబోవని మేమనుకుంటాం” అని సల్మా మాలిక్ సమాధానం ఇచ్చారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)