SOURCE :- BBC NEWS
పాకిస్తాన్ విడుదల చేసిన ‘పారిస్ మేం ఈ రోజు వస్తున్నాం’ ప్రకటన విమర్శలపాలైంది
ఈఫిల్ టవర్ వైపు విమానం దూసుకెళుతున్నట్లు పాకిస్తాన్ విమానయాన సంస్థ విడుదల చేసిన ప్రకటన తీవ్ర విమర్శల పాలైంది. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) విమానాలు పారిస్‌కు మళ్లీ వెళ్లనున్నాయని చెప్పేందుకు ఈ ప్రకటన రూపొందించారు.
ఈ ప్రకటనకు “పారిస్.. మేం ఈరోజు వస్తున్నాం” అనే క్యాప్షన్ పెట్టారు.
అయితే, ఇది అమెరికాలో జరిగిన 9/11 దాడుల మాదిరిగానే ఉందని సోషల్ మీడియాలో చాలామంది ఎత్తి చూపారు.
“ఇది ప్రకటనా లేదా బెదిరింపా?” అని ఎక్స్‌లో ఒక నెటిజన్ కామెంట్ చేశారు. మార్కెటింగ్ మేనేజర్‌ను తొలగించాలని మరొకరు సూచించారు.
ఈ ప్రకటనను గతవారం విడుదల చేశారు. దానికి 2.1 కోట్ల వ్యూస్ వచ్చాయి. ప్రకటనలో వాడిన చిత్రాన్ని చాలామంది విమర్శించారు. దీంతో ఘటనపై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ విచారణకు ఆదేశించారని, ఉప ప్రధాని ఇషాక్ దార్ కూడా ఎయిర్ లైన్స్ ప్రకటనను విమర్శించినట్లు పాకిస్తాన్ జియో న్యూస్ తెలిపింది.
ఏమిటీ 9/11 దాడులు ?
2001 సెప్టెంబర్ 11న హైజాకర్లు ప్రయాణీకుల విమానాలతో న్యూయార్క్‌లోని ట్విన్ టవర్స్, వాషింగ్టన్‌లోని పెంటగాన్‌ను ఢీకొట్టారు. ఈ ఘటనల్లో దాదాపు 3,000 మంది మరణించారు.
దాడులకు ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొన్న ఖలీద్ షేక్ మొహమ్మద్ 2003లో పాకిస్తాన్‌లో అరెస్టయ్యారు. దాడులకు పథక రచన చేసిన అల్-ఖైదా గ్రూపు నాయకుడు ఒసామా బిన్ లాడెన్‌ను 2011లో అమెరికా బలగాలు పాకిస్తాన్‌లో చంపేశాయి.
పీఐఏ ప్రకటనపై ఏమనాలో తెలియడం లేదని పాకిస్తాన్ జర్నలిస్ట్ ఒమర్ ఖురైషీ చెప్పారు.
“ఎయిర్‌లైన్ మేనేజ్‌మెంట్ దీన్ని తనిఖీ చేయలేదా? 9/11 దుర్ఘటన గురించి వారికి తెలియదా, భవనాలపై దాడి చేయడానికి విమానాలను ఉపయోగించారు, ప్రజలు దీనిని అదేవిధంగా చూస్తారని వారు అనుకోలేదా?” అని ఆయన ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.
2016 డిసెంబర్‌లో చిత్రాల్ నుంచి ఇస్లామాబాద్ వెళుతున్న పీఐఏ విమానం పాకిస్తాన్‌లోని హవేలియన్ ప్రాంతంలో కూలడంతో అందులో ఉన్న మొత్తం 48 మంది మరణించారు.
గతంలోనూ..
ప్రకటన మీద వచ్చిన విమర్శలపై ఎయిర్‌లైన్స్ ఇంకా స్పందించలేదు. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ గతంలోనూ వివాదాల్లో చిక్కుకుంది.
1979లో న్యూయార్క్‌లోని ట్విన్ టవర్స్‌పై విమానం నీడను చూపించే ప్రకటనను పీఐఏ ప్రసారం చేసిందని ఎక్స్‌లో కొంతమంది నెటిజన్లు ఎత్తిచూపారు.
పాకిస్తాన్‌లో తీవ్రమైన విమాన ప్రమాదాల కారణంగా ఆ ‘దురదృష్టం’ నుంచి బయటపడేందుకు 2017లో విమానయాన సిబ్బంది మేకను బలి ఇవ్వడంతో పీఐఏ హేళనకు గురైంది.
2019లో ఫ్లైట్ అటెండెంట్‌లు బరువు తగ్గాలని లేదా గ్రౌండ్‌లో పనిచేయాలని ఆదేశించడంతో పీఐఏ విమర్శల పాలైంది. అదనపు బరువు తగ్గించుకోవడానికి సిబ్బందికి పాకిస్తాన్ ఎయిర్‌లైన్స్ ఆరు నెలల సమయం ఇచ్చింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS