SOURCE :- BBC NEWS

మనీ విత్‌డ్రా

ఫొటో సోర్స్, Getty Images

  • రచయిత, కొటేరు శ్రావణి
  • హోదా, బీబీసీ ప్రతినిధి
  • 2 మే 2025, 10:51 IST

ప్రావిడెంట్ ఫండ్ విత్ డ్రా చేసుకోవడానికి సులభమైన మార్గాలు అందుబాటులోకి వచ్చాయి.

ఒకనాడు పీఎఫ్ విత్‌డ్రాకు పెద్ద తతంగమే ఉండేది. కానీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) పీఎఫ్‌ విత్‌డ్రాయల్‌ విధానాలపై ఇటీవల కొన్ని కీలకనిర్ణయాలు తీసుకుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ లింక్
పోస్ట్‌ X స్కిప్ చేయండి

X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

ఇకపై వీటి అవసరం లేదు

పీఎఫ్ విత్‌డ్రా కోసం ఆన్‌లైన్ క్లెయిమ్స్ చేసేటప్పుడు, క్యాన్సిల్డ్ చెక్ లేదా పాస్‌బుక్ అప్‌లోడ్ అనేది తప్పనిసరిగా ఉండేది.

కానీ ఇకపై ఆన్‌లైన్ విత్‌డ్రాయల్ క్లెయిమ్స్‌కు బ్యాంకు పాస్‌బుక్ ఫొటోకాపీ కానీ క్యాన్సిల్డ్ చెక్‌ కానీ అప్‌లోడ్ చేయాల్సినవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈమేరకు ట్వీట్‌ చేశారు.

ఈ ట్వీట్‌ను ఈపీఎఫ్ఓ తన ఎక్స్ హ్యాండిల్‌పై రీపోస్ట్ చేసింది.

దీనివల్ల 8 కోట్ల మంది ఈపీఎఫ్ఓ సభ్యులకు ప్రయోజనం చేకూరనుంది.

ఉద్యోగులు

ఫొటో సోర్స్, Getty Images

బ్యాంకుతో లింకు మరింత సులభం

పీఎఫ్ యూనివర్సల్ అకౌంట్ నెంబర్‌ (యూఏఎన్) ను బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేయడంలో ఎదురువుతున్న జాప్యాన్ని నివారించేందుకు కొత్త పద్ధతి తెచ్చారు.

గతంలో బ్యాంకు ఖాతాతో పీఎఫ్ నెంబర్ అనుసంధానం జరగాలంటే ముందు అది బ్యాంకు లేదంటే ఎన్‌పీసీఐ దగ్గరకు వెళ్లేది. అక్కడ మూడురోజుల సమయం పట్టేది. తరువాత దీనిని ఉద్యోగి పనిచేసే కంపెనీ ధృవీకరణ కోసం పంపేవారు. అక్కడ పనిభారం కారణంగా ఈ ఆమోద ప్రక్రియ సగటున 13 రోజులు పట్టేది.

కానీ కంపెనీల ధృవీకరణ వల్ల ఈ మొత్తం ప్రక్రియకు ఎటువంటి అదనపు విలువ కలగడం లేదనే ఉద్దేశంతో ఇప్పుడీ విధానాన్ని సరళీకరించారు. కంపెనీల ధృవీకరణను తొలగించారు.

అంతేకాక, ఇప్పటికే తమ ఈపీఎఫ్ అకౌంట్లకు అనుసంధానమైన బ్యాంకు అకౌంట్ వివరాలను మార్చాలనుకునే సభ్యులు, కేవలం ఆధార్ ఓటీపీ అథెంటికేషన్‌తో కొత్త బ్యాంకు అకౌంట్ నెంబర్‌ను, ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌ను నమోదు చేసుకోవచ్చు

యూఏఎన్‌తో మీ బ్యాంకు ఖాతాను అనుసంధానించుకోవడం ద్వారా తేలికగా మీ ఈపీఎఫ్ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంతుందో చెక్ చేసుకోవచ్చు.

అంతేకాక, ట్రాన్స్‌ఫర్లను, విత్‌‌డ్రాయల్స్‌ను ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు.

పీఎఫ్ విత్‌డ్రాయల్స్ ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ ఖాతాలో పడేందుకు ప్రస్తుతం ప్రతి ఈపీఎఫ్ఓ మెంబర్ యూఏఎన్‌తో తన బ్యాంకు ఖాతాను అనుసంధానించుకోవాలి.

ఈపీఎఫ్ఓ కార్యాలయం

ఫొటో సోర్స్, Getty Images

ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ విత్‌డ్రా

ఈపీఎఫ్ఓ తీసుకురానున్న మరో కీలక సంస్కరణ.. ఏటీఎం, యూపీఐల ద్వారా పీఎఫ్ విత్ డ్రా చేసుకోవడం.

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ప్రతిపాదనలకు మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు.

యూపీఐపైనే నేరుగా ఈపీఎఫ్ఓ సభ్యులు తమ పీఎఫ్ అకౌంట్‌లో డబ్బులు ఎన్ని ఉన్నాయో తెలుసుకోవచ్చని దావ్రా చెప్పారు. అలాగే, ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా రూ.లక్ష వరకు వెంటనే విత్‌డ్రా చేసుకోవచ్చు.

విత్‌డ్రాయల్ ఆప్షన్లను మరింత పెంచుతున్నట్లు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి చెప్పారు.

ఉద్యోగులు

ఫొటో సోర్స్, Getty Images

పెన్షనర్లకూ ప్రయోజనం..

తాజా సంస్కరణలతో పింఛనుదారులు కూడా ప్రయోజనం పొందుతారని దావ్రా చెప్పారు.

పింఛనుదారులు ప్రస్తుతం దేశంలో ఏ బ్యాంకు బ్రాంచు నుంచైనా, ఎక్కడి నుంచైనా తమ ఫండ్స్‌ను విత్‌డ్రా చేసుకోగలుగుతున్నారు.

దేశవ్యాప్తంగా ఉన్న 122 స్థానిక కార్యాలయాల్లో ఈ సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

దీంతో, అంతకుముందు ఎంపిక చేసుకున్న బ్యాంక్ బ్రాంచులకే పరిమితమైన పెన్షన్ విత్‌డ్రాయల్స్ భౌగోళిక పరిమితులను ఈపీఎఫ్ఓ పూర్తిగా తొలగించేసినట్లయింది.

అంతేకాక, పెన్షన్ ప్రారంభమయ్యే సమయంలో ఏ వెరిఫికేషన్ కోసం కూడా పెన్షనర్లు బ్యాంకుకు రావాల్సిన అవసరం లేదు.

3రోజుల్లోనే సెటిల్మెంట్

ఈపీఎఫ్ఓ తాజా సంస్కరణల్లో మరొకటి ఆటో క్లయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్. దీనికింద క్లయిమ్‌ల ప్రాసెసింగ్ వేగాన్ని పెంచుతుంది.

ఆటో ప్రాసెసింగ్‌లో కేవలం మూడు రోజుల్లోనే ఫండ్స్ సెటిల్ చేస్తారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ సిస్టమ్ కింద 2.34 కోట్ల క్లయిమ్‌లను సెటిల్ చేసినట్లు కేంద్ర మంత్రి చెప్పారు.

డబ్బులు

ఫొటో సోర్స్, Getty Images

పీఎఫ్‌ విత్‌డ్రాకు కారణాలు కావాలా?

  • తనకు లేదా కుటుంబంలోని ఎవరైనా అనారోగ్యం బారినపడితే, చికిత్స కోసం పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవచ్చు. టీబీ, లెప్రసీ, పెరాలసిస్, క్యాన్సర్, పాండమిక్, ఏదైనా పెద్ద సర్జికల్ ఆపరేషన్ కోసం వీటిని తీసుకోవచ్చు.
  • కూతురు, కొడుకు, సోదరి, సోదరుడు లేదా సొంత పెళ్లి కోసం పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవచ్చు.
  • కూతురు లేదా కొడుకు ఉన్నత చదువుల కోసం.
  • ఇల్లు, ఫ్లాట్, భూమి కొనుగోలుకు లేదా ఇంటి మరమ్మతులకు, ఇంటి రుణాన్ని తిరిగి చెల్లించేందుకు తీసుకోవచ్చు.
  • రిటైర్‌మెంట్‌కు ముందు ఏడాది లోపల విత్‌డ్రాయల్ చేసుకోవచ్చు.ఆ సమయంలో మొత్తం పీఎఫ్ బ్యాలెన్స్‌లో 90 శాతం డ్రా చేసుకోవచ్చు.
  • నిరుద్యోగిగా మారినప్పుడు మొత్తం పీఎఫ్ బ్యాలెన్స్‌లో 75 శాతం తీసుకోవచ్చు.
  • ప్రకృతి వైపరీత్యం సమయంలో ప్రాపర్టీ డ్యామేజ్ అయినప్పుడు పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఈపీఎఫ్ఓ

ఫొటో సోర్స్, Getty Images

వడ్డీ ఎంత?

ఈపీఎఫ్ఓలో ప్రస్తుతం 8 కోట్లకు పైగా యాక్టివ్ మెంబర్లు, 78 లక్షలకు పైగా పెన్షనర్లు ఉన్నారు. ఆ ఆర్గనైజేషన్‌లో మెంబర్లు ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తున్నారు.

ఉద్యోగి, ఎంప్లాయర్ ఇద్దరూ ఈపీఎఫ్ఓ స్కీమ్ కింద నెలవారీ కొంత మొత్తం జమ చేయాల్సి ఉంటుంది. జీతం నుంచే ఉద్యోగి మొత్తాన్ని కట్ చేస్తారు. ఎంప్లాయర్ షేరును కంపెనీ క్రెడిట్ చేస్తుంది.

ఈపీఎఫ్ఓ కంట్రిబ్యూషన్ కింద ఉద్యోగుల బేసిక్ వేతనంలో నెలకు 12 శాతాన్ని కట్ చేస్తారు. అలాగే, ఎంప్లాయర్ తమ షేరు కింద మరో 12 శాతాన్ని ఉద్యోగి ఈపీఎఫ్ఓ అకౌంట్‌కు జమ చేస్తారు. దానిలో 8.33 శాతం పెన్షన్ ఫండ్‌కు వెళితే, మరో 3.67 శాతం ఈపీఎఫ్‌కు జమ అవుతుందని ఈపీఎఫ్ఓ తన ఎఫ్ఏక్యూల్లో పేర్కొంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS