SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Sneha Jha
”అహంకారరూపిణి” (అహంకారానికి ప్రతీక).. ”పాపి”.. ”వేశ్య”.. ”మనుస్మృతి నిబంధనలను ఉల్లంఘించిన నీచమైన మహిళ” – ఈ పదాలన్నీ మలయాళ కవి కురీపుజ శ్రీకుమార్ రాసిన నదియుడె రాత్రి (కథానాయిక రాత్రి) అనే కవితలోనివి.
దాదాపు వందేళ్ల కిందట, తన మొదటి, చివరి సినిమా విగతకుమారన్ విడుదలైనప్పుడు మలయాళ సినిమా తొలి మహిళా నటి పీకే రోజీకి వ్యతిరేకంగా కులతత్వ సమాజం వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఇవే.
పీకే రోజీ దళిత వర్గానికి చెందిన మహిళ. ఆ సైలెంట్ ఫిల్మ్‌లో ఆమె హీరోయిన్‌గా చేశారు.
1928లో, తిరువనంతపురంలో ఈ సినిమా(ఏడాది వ్యతిరేకత ఎదురైనప్పటికీ) విడుదలైంది. జేసీ డేనియల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మలయాళ సినిమా పితామహుడిగా ఆయన్ను భావిస్తారు.

గూగుల్ డూడుల్..
దళిత మహిళను నాయర్ క్యారెక్టర్‌లో చూపించడాన్ని అగ్రవర్ణ ప్రేక్షకులు తీవ్రంగా వ్యతిరేకించారు. థియేటర్‌ను ధ్వంసం చేసి, డేనియల్, రోజీని అక్కడి నుంచి తరిమికొట్టారు. ఆ హింస అక్కడితో ఆగలేదు. ఆ గుంపు రోజీ ఇంటికి కూడా నిప్పంటించింది.
2003లో ప్రచురితమైన శ్రీకుమార్ రాసిన ఈ కవిత, రోజీని శాశ్వతంగా అనామకురాలిగా మార్చేసిన ఘటనను వెలుగులోకి తీసుకొచ్చింది.
రోజీ జీవితం గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. సమాచారం అందుబాటులో లేదు. 2023లో ఆమె 120వ జయంతి సందర్భంగా గూగుల్ ప్రత్యేకంగా డూడుల్‌ను అంకితం చేసింది. కానీ, ఇప్పటికీ ఆమె అసలు పుట్టిన రోజు ఎప్పుడో తెలియదు.
రచయిత విను అబ్రహాం ‘ది లాస్ట్ హీరోయిన్’ అనే పేరుతో ఒక వ్యాసం రాశారు. రోజీ ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు మరణించారనే దానిపై కచ్చితమైన సమాచారం లేదని ఆయన చెప్పారు. ఆమె పాపులర్ అయిన చిత్రం గురించి కూడా ప్రామాణికంగా చెప్పలేమన్నారు.
రోజీ 1900ల ప్రారంభంలో తిరువనంతపురం ప్రాంతంలో ఉండే పులయా కమ్యూనిటీలో జన్మించారు. వారిని సమాజంలో అంటరానివారిగా పరిగణించేవారు. జీవనోపాధి కోసం వారు గడ్డి కోయడం వంటి పనులు చేసేవారు. కానీ, నటనపై ఆమెకున్న ఆసక్తితో కక్కారాసి నాటకం (ఒక జానపద నాటక రూపం)లో అడుగుపెట్టారు.
కక్కారాసి నాటకాల్లో నటించిన మొదటి మహిళ రోజీగా చెబుతారు. ఆ సమయంలోనే ఆమె డేనియల్‌ను కలిశారు. విగతకుమారన్‌లో నటించారు.

ఫొటో సోర్స్, Getty Images
డేనియల్, రోజీ పాత్రలతో చిత్రం
ఈ సినిమా ప్రదర్శన తర్వాత, ఘర్షణ చెలరేగడంతో ప్రాణాలు కాపాడుకోవడం కోసం రోజీ తిరువనంతపురం నుంచి పారిపోవాల్సి వచ్చింది. అక్కడి నుంచి కేశవ్ పిళ్లై అనే వ్యక్తి ట్రక్కులో దాక్కుని నాగర్‌కోయిల్‌కు వెళ్లినట్లు చెబుతారు.
ఆ తర్వాత, ఆమె నాయర్ కులానికి చెందిన అదే కేశవ పిళ్లైను వివాహం చేసుకున్నారు. తన అసలు గుర్తింపును దాచేసి, తనను వెలివేసిన అదే సమాజపు మనుషుల మధ్య తన మిగిలిన జీవితం గడిపారు. 1980లలో ఆమె చనిపోయినట్లు చెబుతారు. కానీ, దీని గురించి స్పష్టమైన సమాచారం అందుబాటులో లేదు.
డేనియల్ ధనవంతుడే, కానీ విగతకుమారన్ వైఫల్యం.. ఆ తర్వాత కూడా సినిమాలు తీయడానికి చేసిన ప్రయత్నాలు ఆయన్ను ఆర్థికంగా కుంగదీశాయి. 1960లలో చరిత్రకారుడు, జర్నలిస్ట్ చెలంగట్ గోపాలకృష్ణన్ ఆయన సేవలను మళ్లీ గుర్తుచేస్తూ, ఆయన్ను మలయాళ సినిమా పితామహుడిగా పేర్కొన్నారు. డేనియల్ 1975లో చనిపోయారు.
1970ల నుంచి చరిత్రకారుడు కున్నుకుజి ఎస్.మణి.. నటి రోజీ గురించి రాయడం మొదలుపెట్టారు. 21వ శతాబ్దంలో, రోజీకి గుర్తింపు తెచ్చేందుకు పలు ప్రయత్నాలు జరిగాయి.
2005లో కేరళ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా, దళిత రచయితల సంఘం రాసిన నిరసన లేఖ ద్వారా విను అబ్రహాంకు ఆమె గురించి తొలిసారి తెలిసింది. ఆ తర్వాత, ఆయన చేసిన పరిశోధనతో ‘ది లాస్ట్ హీరోయిన్’ రాశారు.
అనంతరం, 2013లో దర్శకుడు కమల్ మలయాళ చిత్రం సెల్యులాయిడ్‌ను నిర్మించారు. అందులో డేనియల్‌గా పృథ్విరాజ్ సుకుమారన్ నటించగా, రోజీగా చాందిని గీతా నటించారు.
ఇప్పటికీ అరుదు..
2019లో సినిమా పరిశ్రమలో మహిళలను, స్త్రీవాదాన్ని ప్రోత్సహించేందుకు ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్(డబ్ల్యూసీసీ) పీకే రోజీ ఫిల్మ్ సొసైటీని ఏర్పాటు చేసింది.
”రోజీ స్టోరీని పూర్తిగా డాక్యుమెంట్ చేయలేకపోవచ్చు. కానీ, ఆమె జీవితం కులం, జెండర్ మధ్య జరిగిన పోరాటానికి ప్రతీకగా నిలుస్తుంది” అని డబ్ల్యూసీసీ వ్యవస్థాపక సభ్యురాలు బినా పాల్ చెప్పారు.
దర్శకుడు పా.రంజిత్‌కు చెందిన నీలమ్ కల్చరల్ సెంటర్ తమిళనాడులో పీకే రోజీ ఫిల్మ్ ఫెస్టివల్‌ను ప్రారంభించింది. ఇక్కడ దళితులు ఇతివృత్తంగా నిర్మించిన చిత్రాలను ప్రదర్శిస్తారు. 2024లో కేరళ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రోజీకి నివాళిగా ఒక సిగ్నేచర్ వీడియోను ప్రదర్శించింది.
ఇదంతా ప్రశంసనీయమే. కానీ, భారతీయ సినిమాల్లో దళితులు, నటీమణులు సముచిత స్థానం పొందినప్పుడు మాత్రమే నిజమైన న్యాయం చేకూరినట్టు.
మెయిన్‌స్ట్రీమ్ ఫిల్మ్‌ల్లో ఇప్పటికీ దళిత హీరోలు, హీరోయిన్లు అరుదుగా కనిపిస్తుంటారు. దళిత కులాలకు చెందిన సినీ నటులు బహిరంగంగా కనిపించడం అరుదు. ఒకవేళ ఇప్పుడు రోజీ బతికి ఉన్నా, మెయిన్ హీరోయిన్‌గా కాకుండా సపోర్టింగ్ రోల్స్‌లో కనిపించి ఉండేవారని దర్శకుడు కమల్ అభిప్రాయపడ్డారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)