SOURCE :- BBC NEWS

రుతుక్రమం

ఫొటో సోర్స్, Getty Images

31 మే 2025

పీరియడ్స్ రాకపోవడాన్ని అమెనోరియా అంటారు. అమెనోరియాకు చాలా కారణాలుంటాయి.

పీరియడ్స్ రాకపోవడానికి గర్భధారణ ఒక కారణం. కానీ, ఇది కాకుండా దీనికి చాలా ఇతర కారణాలున్నాయి.

సంతానోత్పత్తి వయసు గల మహిళల్లో సాధారణంగా రుతుస్రావ కాలం (మెన్‌స్ట్రువల్ పీరియడ్) 28 రోజులు ఉంటుంది.

అయితే, దీనికంటే ముందు లేదా ఆ తర్వాత కొన్ని రోజులకు పీరియడ్స్ ప్రారంభం కావడం సాధారణం.

అప్పుడప్పుడు పీరియడ్స్ రాకపోవడాన్ని మనం అంత పెద్ద సమస్యగా చూడం. కానీ, ఇది తరచూ జరుగుతూ ఉంటే మాత్రం, ఇతర ఆరోగ్య సమస్యలకు ఇదొక సంకేతమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

”ఏదో సరిగ్గా లేదని తెలుసుకోవడానికి మిమ్మల్ని లేదా మీ శరీరాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ప్రతి స్త్రీ శరీరం పూర్తిగా భిన్నమైన రీతిలో పనిచేస్తుంటుంది. ఏ ఇద్దరు మహిళల శరీరం ఒకేలా పనిచేయదు.” అని గైనకాలజిస్ట్ డాక్టర్ అమిరా అల్కార్డిన్ మార్జినెజ్ బీబీసీతో చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

”మహిళలు గర్భం దాల్చకపోయినా లేదా వరుసగా మూడు నెలలు పీరియడ్స్ రాకపోయినా లేదా 45 ఏళ్ల కంటే ముందే పీరియడ్స్ ఆగిపోయినా.. వైద్య సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.” అని బ్రిటన్‌కు చెందిన నేషనల్ హెల్త్ సర్వీసు సూచించింది.

15 ఏళ్లు వచ్చే సరికి రుతుక్రమం ప్రారంభం కాకపోతే అమ్మాయిలకు హెల్త్ చెకప్‌లు చేయించాలని అమెరికాలోని మాయో క్లినిక్ సూచిస్తోంది.

ఈ రెండు ఇనిస్టిట్యూట్ల ప్రకారం.. గర్భధారణ కాకుండా అమెనోరియాకు ఎనిమిది కారణాలున్నట్లు తెలిసింది. అవేంటో తెలుసుకుందాం..

ఒత్తిడి

ఫొటో సోర్స్, Getty Images

1. ఒత్తిడి

” ఒత్తిడి అనేది అత్యంత ముఖ్య కారణం. ఇప్పుడు ఒత్తిడి అనేది ఒక మహమ్మారి లాంటిది.” అని డాక్టర్ అమిరా చెప్పారు.

ఒత్తిడి మన శరీరంలో అడ్రినలిన్ లాంటి హార్మోన్లను పెంచుతుంది. ఏదైనా రాబోయే ప్రమాదం నుంచి రక్షించేందుకు మన శరీరాన్ని ఇది అప్రమత్త స్థితిలో ఉంచుతుంది.

ఈ హార్మోన్ల దీర్ఘకాలిక ప్రభావంతో, రుతుక్రమం కూడా ప్రభావితమవుతుంది.

కొన్నిసార్లు పీరియడ్స్ రావు. లేదంటే పీరియడ్స్ సమయంలో తీవ్రమైన నొప్పి ఉంటుంది.

కొన్ని సందర్భాల్లో అయితే, ఒత్తిడి వల్ల రుతుక్రమంలో (నాలుగు వారాల వ్యవధిలో) మహిళలకు రెండుసార్లు పీరియడ్స్ వస్తాయి.

పీరియడ్స్ రాకపోవడానికి కారణం ఒత్తిడి అయితే, దీనికి పరిష్కారంగా క్రమం తప్పకుండా వ్యాయామం లేదా ప్రాణాయామం చేస్తుండాలని ఎన్‌హెచ్‌ఎస్ ప్రతిపాదించింది.

ఒకవేళ వీటివల్ల కూడా ఫలితం లేకపోతే, ఒత్తిడి, ఆందోళన నుంచి కాపాడేందుకు కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ(సీబీటీ) సాయపడతాయి.

2. ఒక్కసారిగా బరువు తగ్గడం

శరీరంలో ఒక్కసారిగా క్యాలరీలు తగ్గిపోతే, ఓవులేషన్‌కు (అండాశయం నుంచి అండాలను విడుదల చేసే ప్రక్రియకు) అవసరమయ్యే హార్మోన్ల ఉత్పత్తి ఆగిపోయి ఉండొచ్చు.

ఆ సమయంలో బరువు పెరగడానికి సంబంధిత మహిళలు, యువతులకు పోషకాహార నిపుణులు సాయం చేస్తారు.

ఒకవేళ ఈటింగ్ డిజార్డర్ వల్ల బరువు తగ్గితే అప్పుడు మానసిక వైద్యుడిని సంప్రదించాలి.

ఊబకాయం

ఫొటో సోర్స్, Getty Images

3. ఊబకాయం

అత్యధిక బరువు వల్ల శరీరంలో ఈస్ట్రోజెన్ ఎక్కువగా విడుదలవుతుంది. స్త్రీల సంతానోత్పత్తి వ్యవస్థను నియంత్రించే హార్మోన్లలో ఇదొకటి.

ఈస్ట్రోజెన్ స్థాయిలలో ఏమైనా పెరుగుదల చోటు చేసుకుంటే, అది రుతుక్రమంపై ప్రభావం చూపుతుంది.

కొన్నిసార్లు పీరియడ్స్ పూర్తిగా ఆగిపోతుండొచ్చు.

అమెనోరియాతో బాధపడుతున్న, బరువు ఎక్కువగా ఉన్న లేదా బాడీ మాస్ ఇండెక్స్ 30కి పైన ఉన్న మహిళలు ఆరోగ్యకరమైన బరువును కొనసాగించేందుకు పోషకాహార నిపుణులను సంప్రదించాలని వైద్యులు సూచిస్తుంటారు.

4. వ్యాయామాలు ఎక్కువగా చేయడం

అత్యధిక శారీరక వ్యాయామాల వల్ల కలిగే శారీరక ఒత్తిడి కూడా రుతుస్రావాన్ని (మెన్‌స్ట్రుయేషన్‌ను) నియంత్రించే హార్మోన్లపై ప్రభావం చూపుతుంది.

శరీరంలో విపరీతంగా కొవ్వు ఉండటం కూడా ఓవులేషన్‌ను అడ్డుకుంటుంది.

వాటిని సమతుల్యంగా మార్చుకునేందుకు ఏ స్థాయిలో వ్యాయామాలు చేయాలో ప్రొఫెషనల్ అథ్లెట్లకు క్రీడా వైద్య నిపుణులు చెబుతుంటారు.

5. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్

అండాశయం లోపల అండాల అభివృద్ధి కోసం ఫోలికల్స్ అని పిలిచే పెద్ద సంఖ్యలో సంచి లాంటి నిర్మాణాలు ఉంటాయి.

సాధారణంగా అండాశయంలో అండాల అభివృద్ధి జరుగుతుంది. వాటిలో ఒకటి ఫలదీకరణ చెందేందుకు సిద్ధంగా ఉంటుంది.

అయితే, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఓస్)లో అండాశయంలో ఒకేసారి చాలా ఫోలికల్స్ ఏర్పడతాయి. అవి అభివృద్ధి చెందిన అండాలను ఉత్పత్తి చేయలేవు.

ఈ పరిస్థితిని ఎదుర్కొనే మహిళలకు, అండాలను విడుదల చేయడంలో ఈ సంచులు విఫలమవుతూ.. ఓవులేషన్ జరగకుండా అడ్డుకుంటాయి.

యూకేలో, ప్రతి పది మంది మహిళల్లో ఒకరు పీసీఓఎస్‌కు గురవుతున్నారని ఎన్‌హెచ్‌ఎస్ అంచనా వేస్తోంది. దీనిలో 33 శాతం కేసులకు పీరియడ్స్ రావడం లేదు.

పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ వల్ల అండాశయాల సాధారణ పనితీరు ప్రభావితమై, ఓవులేషన్‌ను అడ్డుకుంటుంది.

మహిళలు, పిరియడ్స్

ఫొటో సోర్స్, Getty Images

6. మెనోపాజ్, ప్రీమెచ్యూర్ మెనోపాజ్

గర్భధారణ, పాలివ్వడం లాంటి సమయాలతో పాటు మెనోపాజ్ కూడా పీరియడ్స్ రాకపోవడానికి ఒక కారణంగా ఉంటుంది.

మెనోపాజ్ దశలోకి మహిళలు వచ్చినప్పుడు, వారి శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గుతుంటాయి. ఓవులేషన్ ప్రక్రియ సక్రమంగా జరగదు.

45 నుంచి 55 ఏళ్ల మధ్యలోని మహిళలకు మెనోపాజ్ వస్తుంటుంది.

40 ఏళ్ల కంటే ముందే ప్రతి వంద మంది మహిళలలో ఒకరు మెనోపాజ్‌కు గురవుతున్నారని చాలా వైద్య అధ్యయనాలు చెబుతున్నాయి. దీన్ని ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అంటారు.

7. గర్భనిరోధక సాధనాలు

కొన్ని గర్భనిరోధక మాత్రలు, ఇంజెక్షన్లు, ఇంప్లాంట్లు, గర్భాశయంలో చొప్పించే డివైజ్‌లు అమెనోరియాకు కారణమవుతాయి.

గర్భనిరోధక మాత్రలు తీసుకోవడం ఆపివేసినప్పటికీ, శరీరం క్రమం తప్పకుండా ఓవులేషన్ జరిపేందుకు కాస్త సమయం పట్టొచ్చు.

మహిళలు, పిరియడ్స్

8. ఇతర సమస్యలు, వైద్య చికిత్సలు

డయాబెటీస్ లేదా హైపర్‌థైరాయిడిజం లేదా హైపోథైరాయిడిజం వంటి హార్మోన్ రుగ్మతలు కూడా పీరియడ్స్ రాకపోవడానికి కారణం కావచ్చు.

మాయో క్లినిక్ వివరాల ప్రకారం.. యాంటీసైకోటిక్స్, కీమోథెరపీ, యాంటీడిప్రెసెంట్స్, అధిక రక్తపోటు, అలర్జీలకు ఇచ్చే మందులు వంటి వాటి వల్ల కూడా అమెనోరియా రావొచ్చు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS