SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, UGC
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు.
శ్రీతేజ్ హెల్త్ బులిటెన్‌ను సికింద్రాబాద్ కిమ్స్ కడల్స్ ఆసుపత్రి వైద్యులు మంగళవారం విడుదల చేశారు.
ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసి న్యూరో రీహాబిలిటేషన్ సెంటర్‌కు పంపిస్తున్నట్లు కిమ్స్ వైద్యులు చేతన్ ఆర్ ముందాడ, పూడి విష్ణతేజ్ చెప్పారు.
దాదాపు నాలుగు నెలలకుపైగా శ్రీతేజ్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు.

నటుడు అల్లు అర్జున్ నటించిన పుష్ప 2.. ది రూల్ సినిమా విడుదల సందర్భంగా డిసెంబరు నాలుగో తేదీ రాత్రి హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ తీవ్ర గాయపడ్డాడు. అప్పట్నుంచి కిమ్స్ కడల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శ్రీతేజ్ న్యూరాలజీ(నాడీ వ్యవస్థ) ఇంకా మెరుగుపడలేదని వైద్యులు చెప్పారు.
”న్యూరాలజీ పరంగా బాగా మెరుగుకావాల్సి ఉంది. అందుకే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసి న్యూరోరీహాబిలిటేషన్ కు పంపించి అవసరమైన చికిత్స అందించాలని నిర్ణయించాం” అని వైద్యులు చేతన్ ఆర్ ముందాడ, పూడి విష్ణతేజ్ వివరించారు.
ఓరల్(నోటి ద్వారా) ఆహారం తీసుకుంటున్నట్లుగా చెప్పారు. వెంటిలేటర్ సపోర్టు అవసరం లేకుండా శ్వాస తీసుకుంటున్నట్లు చెప్పారు.
”శ్రీతేజ్ ఇంకా ఎవర్నీ గుర్తు పట్టలేకపోతున్నాడు. మాట్లాడలేకపోతున్నాడు. ఎవరైనా పిలస్తుంటే స్పందించడం లేదు” అని వైద్యులు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
అసలేం జరిగిందంటే..
నిరుడు డిసెంబర్ 5న ‘పుష్ప 2:ది రూల్’సినిమా విడుదలైంది. అంతకు ఒకరోజు ముందు అంటే డిసెంబరు 4వ తేదీన ఏపీ, తెలంగాణలో సినిమా ప్రీమియర్ షోలను రాత్రి 9.30 గంటల నుంచి ప్రదర్శించారు.
సంధ్య థియేటర్‌లోనూ బెనిఫిట్ షో వేశారు. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన భాస్కర్, ఆయన భార్య రేవతి (35), 9 ఏళ్ల కుమారుడు శ్రీతేజ్, కుమార్తె శాన్వికతో కలిసి అక్కడికి వచ్చారు.
అదే సమయంలో నటుడు అల్లు అర్జున్ థియేటర్ కు వచ్చిన సందర్భంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి చనిపోగా, శ్రీతేజ్ తీవ్ర గాయాలపాలయ్యాయని పోలీసులు చెబుతున్నారు.
ఈ ఘటనపై 18 మందిపై చిక్కడపల్లి పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో అల్లు అర్జున్ ఏ11గా ఉన్నారు.

ఫొటో సోర్స్, PTI
అనంతరం నిరుడు డిసెంబరు 13న అల్లు అర్జున్‌ను అరెస్టు చేయగా.. బెయిలుపై బయటకు వచ్చారు.
ఈ వ్యవహారం జాతీయ స్థాయిలో అప్పట్లో సంచలనం రేపింది.
ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను అల్లు అర్జున్, తండ్రి అల్లు అరవింద్, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, దర్శకుడు సుకుమార్, పుష్ప సినిమా నిర్మాతలు సహా సినీ ప్రముఖులు పరామర్శించారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శ్రీతేజ్ కుటుంబాన్ని పరామర్శించి రూ.25 లక్షలు సాయం అందించారు.
డిసెంబరు 25న శ్రీతేజ్ కుటుంబానికి అల్లు అర్జున్ తరఫున రూ.కోటి, దర్శకుడు సుకుమార్, పుష్ప నిర్మాతలు తరఫున చెరో రూ.50 లక్షల చొప్పున సాయం చేస్తున్నట్లు అల్లు అరవింద్ అప్పట్లో ప్రకటించారు.
”రూ.2కోట్ల సాయం అందించారు. పిల్లల పేరుతో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు” అని గతంలో బీబీసీతో శ్రీతేజ్ తండ్రి భాస్కర్ చెప్పారు.