SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
ఒక గంట క్రితం
ఒక వయసుకు వచ్చాక మహిళలకు వరసపెట్టి నెలసరి పన్నెండు నెలల (సంవత్సరం) పాటు రాకుండా ఉంటే దాన్ని మెనోపాజ్ దశ అంటాం. మొత్తానికి నెలసరి ఆగిపోవడమే మెన్ – పాజ్ (mens-pause).
మహిళలకు ఉన్న నెలసరి అనుభవాలను బట్టి, వారు కుటుంబం నుంచి, సమాజం నుంచి ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి, కొంత మంది ఈ దశ కోసం ఎదురు చూస్తూ ఉంటే, కొంత మందికి మాత్రం నెలసరి ఆగిపోవడం చాలా ఆందోళనకరంగా ఉంటుంది.
కొంతమంది ఇది నెలసరి నుంచి విడుదల గా భావిస్తే, కొంత మంది దీన్ని వృద్ధాప్యానికి తొలి అడుగుగా చూస్తారు. కొంత మంది మెనోపాజ్ దశకు చేరుకున్న ఏడాది, రెండేళ్లకు గానీ మానసికంగా ధృడమవ్వలేరు.
ఒక వయసు రాగానే బటన్ నొక్కినట్టు ఈ నెలసరి ఆగిపోతుంది అనుకుంటే పొరపాటే. రజస్వల అయినపుడు నెలసరి ప్రతినెలా రావడానికి ఎలాగైతే ఒకటి నుంచి రెండేళ్లు పడుతుందో, అలాగే నెలసరి ఆగిపోవడానికీ సమయం పడుతుంది.
అయితే ఇలా పూర్తిగా ఆగిపోయే రెండు నుంచి ఎనిమిదేళ్ల ముందే శరీరంలో మార్పులు వస్తాయి. దీనినే పెరిమెనోపాజ్ అంటారు. ఇది మెనోపాజ్‌కి ముందు దశ. మహిళలు నలభైల్లో ఉన్నప్పుడే ఈ పెరిమెనోపాజ్ దశ మొదలవుతుంది.
అండాశయం నుంచి నెలనెలా విడుదలయ్యే అండాల వల్లే ప్రతి నెలా మహిళలకి నెలసరి వస్తూ ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో అండాల సంఖ్య తగ్గిపోతుంటుంది. అప్పుడు శరీరంలో వచ్చే హార్మోన్ల మార్పు వల్ల శారీరకంగా, మానసికంగా కొన్ని లక్షణాలు కనబడతాయి.

నెలసరిలో మార్పులు
పెరిమెనోపాజ్‌లో ఒక్కోసారి నెలసరి ముందుగా లేదంటే ఒక్కోసారి ఆలస్యంగా వస్తుంది. మెనోపాజ్కే దగ్గర పడుతున్న కొద్దీ నెలసరి మూడు, మూడు రోజులు ముందుకు జరుగుతూ ఉంటుంది. రక్తస్రావం కొందరికి చాలా తక్కువ ఉంటే, కొందరికి ఎక్కువ అవుతుంటుంది.
హాట్ ఫ్లాషెస్:
శరీరం ఆకస్మికంగా వేడిగా అయిపోతుంది, బాగా చెమటలు పట్టేసి వెంటనే చలేస్తూ ఉంటుంది. అప్పుడే ఫ్యాన్ వేసుకోవాలి అనిపించడం, వేసుకున్నాక కాసేపటికి చలి వేయడం ఉంటాయి. నిద్రలో కూడా వేడిగా అనిపించి, చెమటలు పట్టేసి, మెలకువ వచ్చేస్తుంది. వీటినే హాట్ ఫ్లాషెస్ అంటారు.

ఫొటో సోర్స్, Getty Images
మూడ్ స్వింగ్స్
పెరిమెనోపాజ్ దశలో ఊరికే విసుగు రావడం, ఎప్పుడు ఏమవుతుందో అని కంగారు పడడం, నిరాశగా ఉండటం, నెగెటివ్‌గా ఆలోచించడం, ఒక్కోసారి బాగా సంతోషంగా ఉండటం వంటివి జరుగుతాయి. వీటినే మూడ్ స్వింగ్స్ అంటారు.
కాస్త మతిమరుపు వచ్చినట్టుగా, ఏకాగ్రత కుదరనట్టుగా ఉంటుంది. దీనినే బ్రెయిన్ ఫాగ్ అంటారు. అయితే అందరికీ ఈ లక్షణాలు ఉండవు..ఒక్కొకరిలో కొన్ని లక్షణాలు ఉంటే, కొందరిలో అసలు ఏ లక్షణాలూ ఉండవు. ఈ లక్షణాలన్నీ కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి. తర్వాత మళ్ళీ మామూలుగా ఉంటారు.
జననాంగాలు:
అండాశయం అండాలు విడుదల చేయడం తగ్గిపోతూ ఉంటే, గర్భ సంచి కూడా చిన్నదైపోతుంటుంది. యోని కొంచెం వదులుకావడం, పొడిబారటం వంటివి జరుగుతాయి.
యోని పొడిబారటం వల్ల కాస్త దురదగా ఉంటుంది. కొందరిలో సెక్స్ పట్ల ఆసక్తి కూడా తగ్గుతుంది. ఇలా యోని పొడి బారుతూ ఉంటే, కేవై జెల్లీ గానీ యోనిలో అమర్చుకునే ఈస్ట్రోజెన్ జెల్లీ గానీ వాడొచ్చు.
మూత్రం
మూత్ర నాళంలో తరచూ ఇన్ఫెక్షన్లు రావడం, మూత్రం ఆపుకోలేకపోవడం జరుగుతూ ఉంటాయి. వీటిని నివారించాలంటే నీళ్లు ఎక్కువగా తాగడంతోపాటు ప్రతి రెండు మూడు గంటలకోసారి మూత్రానికి వెళ్లాలి.
కేగెల్స్ (kegels) ఎక్సర్సైజ్ అని పిలిచే వ్యాయామం, అంటే జననాంగాల దగ్గర ఉండే కండరాలు గట్టి పడటానికి చేసే వ్యాయామాన్ని రోజూ చేయడం వల్ల ఈ లక్షణాలు తగ్గుతాయి.
పైన పేర్కొన్న హాట్ ఫ్లాషెస్ వల్ల నిద్ర లేమి ఉండొచ్చు. అప్పుడు రోజంతా నీరసంగా, శక్తి లేనట్టుగా ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
నిద్రపై ప్రభావం
కొందరిలో కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు వస్తాయి. చెమటలు ఎక్కువగా పడతాయి. కొంత మందికి రొమ్ముల్లో నొప్పి, మంట ఉంటాయి. రొమ్ములు కొంచెం గట్టి పడటం, రొమ్ములోపల గడ్డలు ఏర్పడడం వంటివి జరగొచ్చు.
రొమ్ము నుంచి నీరు కూడా కారుతూ ఉంటుంది. రొమ్ముల్లో ఏదైనా వాపు కనిపించినా, ఏదైనా స్రావం వస్తున్నా… వెంటనే డాక్టర్ దగ్గరకి వెళ్ళి చెక్ చేయించుకోవాలి. ఈ వయసులో బ్రెస్ట్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వైద్యుల అభిప్రాయం తెలుసుకోవడం ముఖ్యం.
పై లక్షణాలను అధిగమించాలంటే, రోజూ వ్యాయామం చేయడం ఉత్తమ మార్గం. రోజూ అరగంట నడవటం లేదా కండరాలు గట్టిపడే వ్యాయామం (జిమ్ కి వెళ్లడం/స్త్రెంగ్త్ ట్రైనింగ్) చేయాలి.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శారీరక, మానసిక సమస్యలు చాలా వరకుతగ్గుతాయి. రోజూ కాయగూరలు, పండ్లు తినాలి. ప్రోటీన్ కోసం మాంసం, రకరకాల నట్స్ ఆహారంలో చేర్చుకోవాలి.
శరీరంలో ఈస్ట్రోజెన్ తగ్గుతుంటుంది కాబట్టి ఎముకలు కూడా పలచబడతాయి. అందుకే కాల్షియం కోసం పాలు, పాల ఉత్పత్తులు తీసుకోవచ్చు. లేదంటే వైద్యులను సంప్రదించి కాల్షియం సప్లిమెంట్స్ అయినా తీసుకోవాలి. రోజుకి ఒక గ్రామ్ కాల్షియం కావాలి. దానికి తగ్గట్టుగా ఆహారం తీసుకోవాలి.
మందు, పొగాకు, సిగరెట్లు అసలు వాడకూడదు. లక్షణాలు నియంత్రించడానికి కాఫీ కూడా తగ్గించాలి. నిద్రపోయేటప్పుడు పరిసరాలు చల్లగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోవడం హాట్ ఫ్లాషెస్‌ను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
పెరిమెనోపాజ్ సమస్యలకు చికిత్స ఏంటి?
మెనోపాజ్ తర్వాత వచ్చే సమస్యలకు హార్మోనల్ థెరపీ ఉన్నట్టే, పెరి మెనోపాజ్‌లో వచ్చే సమస్యలకి కూడా తక్కువ డోస్‌లో ఉండే హార్మోన్ థెరపీ ఉంటుంది. లక్షణాలను బట్టి కొన్ని రకాల పరీక్షలు చేసి వైద్యం అవసరమో లేదో నిర్ణయించి మందులు ఇస్తారు.
తక్కువ హార్మోన్లు ఉన్న కుటుంబ నియంత్రణ మాత్రలు కూడా చాలా వరకు ఈ లక్షణాలను నయం చేయడానికి ఉపయోగించవచ్చు. మార్కెట్లో ఇప్పుడు నాన్ హార్మోనల్ మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి మందులైనా వైద్యుల పర్యవేక్షణలోనే వేసుకోవాలి.
మన దేశంలో చాలా ప్రాంతాల్లో రకరకాల సమస్యలకు గర్భసంచి తొలగించుకున్న మహిళలు ఉన్నారు. చాలా నెలసరి సమస్యలకి కేవలం గర్భసంచి మాత్రమే తొలగిస్తారు. అండాశయాలు అలాగే ఉంచుతారు. వారికి కూడ ఈ పెరి మెనోపాజ్ దశ, మెనోపాజ్ దశ ఉంటాయని గుర్తించాలి. వారికి గర్భసంచి లేకపోవడం వల్ల నెలసరి మాత్రమే రాదు కానీ, మిగతా హార్మోన్లన్నీ మామూలుగానే ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ అందరి మహిళల్లాగే వారికి కూడా మెనోపాజ్‌లో హార్మోనల్ మార్పులు వస్తాయి.
ఎవరికైతే శారీరక మానసిక సమస్యలు ఎక్కువగా ఉంటాయో వారికి వైద్య సాయం కచ్చితంగా అందించాలి.
కొన్నిసార్లు మహిళలు వారిలో వచ్చే మార్పులు ఈ పెరి మెనోపాజ్ వల్ల వస్తున్నాయని గుర్తించే అవకాశం ఉండదు.
కుటుంబ సభ్యులు, మిత్రులు గుర్తించి వారికి సున్నితంగా అర్థమయ్యేలా చెప్పి, లక్షణాల పట్ల అవగాహన కల్పించి, వైద్యులను సంప్రదించమనాలి.
(గమనిక: రచయిత డాక్టర్. వైద్యపరమైన విషయాలను సులభంగా వివరించి అవగాహన కల్పించడానికి రాసిన కథనం మాత్రమే ఇది)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)