SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Andriy Yermak/Telegram
పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు ముందు సెయింట్ పీటర్స్ బసిలికా లోపల అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ సమావేశమయ్యారు.
15 నిమిషాల ఈ సమావేశం చాలా సానుకూలంగా సాగిందని వైట్‌హౌస్ చెప్పగా, చాలా విషయాలను చర్చించుకున్నట్లు ఆ తర్వాత జెలియెన్‌స్కీ తెలిపారు.
‘‘ఒకవేళ ఉమ్మడి ఫలితాలను సాధిస్తే, ఈ సమావేశం చరిత్రాత్మకం అయ్యే అవకాశం ఉంది’’ అని మీటింగ్ తర్వాత యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ స్పందించారు.
‘‘మేం చర్చించిన అన్ని అంశాలలో సత్ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం. మా ప్రజలకు రక్షణ కల్పించే, ఎలాంటి షరతులు లేని, మరో యుద్ధానికి దారి తీయడానికి అవకాశం లేని శాంతి ఒప్పందం కావాలి’’ అని జెలియెన్‌స్కీ తన ఎక్స్ పోస్టులో రాశారు.
పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల ప్రారంభానికి ముందు, ట్రంప్, జెలియెన్‌స్కీ ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుకుంటున్న ఫోటోలు విడుదలయ్యాయి.
పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు ట్రంప్, జెలియెన్‌స్కీతో పాటు ప్రిన్స్ విలియం, బ్రిటన్ ప్రధాని సర్ కీర్ స్టార్మర్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మేక్రాన్ వంటి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

రష్యా, యుక్రెయిన్‌లు శాంతి ఒప్పందానికి దగ్గరగా వచ్చాయని ట్రంప్ చెప్పిన ఒక్కరోజులోనే ఈ సమావేశం జరిగింది. ట్రంప్ రాయబారి స్టీవ్ విట్కాఫ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య మాస్కోలో చర్చలు ముగిశాక ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ ఏడాది ప్రారంభమైనప్పటి నుంచి స్టీవ్ విట్కాఫ్ రష్యాకు వెళ్లడం ఇది నాలుగోసారి. మూడు గంటల పాటు జరిగిన చర్చలు సానుకూలంగా సాగాయని పుతిన్ సహాయకుడు యురి ఉషాకోవ్ అన్నారు.

ఫొటో సోర్స్, Andriy Yermak/Telegram
కేవలం యుక్రెయిన్ విషయంలో మాత్రమే కాక, ఇతర అంతర్జాతీయ అంశాలపై కూడా రష్యా, అమెరికాలను ఇవి మరింత దగ్గర చేశాయని ఉషాకోవ్ తెలిపారు.
రష్యా, యుక్రెయిన్ ప్రతినిధుల మధ్య నేరుగా చర్చలు తిరిగి ప్రారంభించేలా ఈ సమావేశంలో చర్చించామని ఉషాకోవ్ చెప్పారు.
వాటికన్ సిటీలో ట్రంప్, జెలియెన్‌స్కీ మధ్య జరిగిన ఈ ప్రైవేట్ సమావేశం గురించి మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామని వైట్‌హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవెన్ చెయుంగ్ చెప్పారు.

ఫొటో సోర్స్, UKRAINE’S PRESIDENTIAL PRESS SERVICE
బసిలికాలో ఈ ఇద్దరు అధినేతలు ఎదురెదురుగా కూర్చుని ఉన్న ఫోటోలను జెలియెన్‌స్కీ కార్యాలయ అధినేత ఆండ్రీ యెర్మాక్ విడుదల చేశారు.
బసిలికా లోపల సర్ కీర్ స్టార్మర్, మేక్రాన్‌తో కలిసి ట్రంప్, జెలియెన్‌స్కీ చర్చిస్తున్న ఫోటోలు కూడా బయటికి వచ్చాయి.
ఫిబ్రవరిలో ఓవల్ ఆఫీసులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌లతో చర్చలు జరిగిన తర్వాత, అనూహ్య రీతిలో ఆ సమావేశం నుంచి జెలియెన్‌స్కీ వెళ్లిపోయారు. ఆ తర్వాత ఈ ఇరువురు నేతలు ముఖాముఖి సమావేశం కావడం ఇదే తొలిసారి.
అప్పట్లో, కాల్పుల విరమణ ఒప్పందానికి అనుగుణంగా వ్యవహరించకుండా, మూడో ప్రపంచ యుద్ధంతో యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ జూదమాడుతున్నారని ట్రంప్ ఆరోపించడంతో, ఇరువురు మధ్యలో చర్చలు వేడెక్కాయి.
ట్రంప్, జెలియెన్‌స్కీ మధ్య విభేదాలను తగ్గించి, వారిద్దరినీ కలిపేందుకు బ్రిటన్ ప్రధాని స్టార్మర్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మేక్రాన్ ప్రయత్నిస్తున్నట్లు ఈ ఫోటోలలో కనిపించింది.
ఈ సమావేశం తర్వాత ఇద్దరు అధినేతలు బసిలికా మెట్లు దిగి, మొదటి వరుసలో ఏర్పాటు చేసిన వారి వారి సీట్లలో కూర్చున్నారు.
అయితే, ట్రంప్, జెలియెన్‌స్కీలు ఒకరిపక్కన ఒకరు కూర్చోలేదు. ఫ్రెంచ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం సీటింగ్ ఏర్పాట్లను చేశారు.

ఫొటో సోర్స్, Reuters
ముగిసిన పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు
పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలను రోమ్‌లోని శాంటా మారియా మాగ్గియోర్ చర్చిలో ముగిశాయి.
గత శతాబ్ధ కాలంలో వాటికన్ వెలుపల పోప్‌కు అంత్యక్రియలు జరగడం ఇదే తొలిసారి.
విదేశాలకు వెళ్లి రోమ్‌కు తిరిగి వచ్చిన ప్రతిసారి శాంటా మారియా మాగ్గియోర్ బసిలికాను పోప్ ఫ్రాన్సిస్ సందర్శించేవారు.
పోప్ అంత్యక్రియల సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు రోమ్‌కు తరలివచ్చారు. 4 లక్షల మంది ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారని ఇటలీ అధికారులు వెల్లడించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)