SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
ఒక గంట క్రితం
రోమన్ క్యాథలిక్ చర్చికి పన్నెండేళ్ల పాటు మతాధిపతిగా పని చేసిన తొలి లాటిన్ అమెరికన్ వ్యక్తి పోప్ ఫ్రాన్సిస్. ఆయన అసలు పేరు జార్జ్ మారియో బెర్‌గోగ్లియో. అర్జెంటీనాలో పుట్టారు.
1. పోప్‌గా ఉన్న 12 ఏళ్లలో సొంత దేశం వెళ్లలేదు
పోప్ ఫ్రాన్సిస్ తాను ఆ పదవిలో ఉన్న 12 ఏళ్ల కాలంలో ఒక్కసారి కూడా తన దేశం అర్జెంటీనాకు వెళ్లలేదు. అర్జెంటీనాకు సరిహద్దులో ఉన్న ఐదు దేశాల్లో నాలుగింటిని ఫ్రాన్సిస్ సందర్శించారు.
మతాధిపతి అయిన తర్వాత మూడు నెలలకు, తొలి ప్రయాణంగా 2013లో బ్రెజిల్ వెళ్లారు.
2015లో బొలీవియాకు, పరాగ్వేకు, 2018లో చిలీకి వెళ్లారు. క్యూబా, ఈక్వెడార్, మెక్సికో, పెరూ వంటి కొన్ని లాటిన్ అమెరికా దేశాలకు కూడా వెళ్లారు.
అయితే, స్వదేశానికి ఎందుకు వెళ్లలేదు అన్నది ఎప్పుడూ ప్రశ్నార్థకంగానే ఉంది. ఇది తన దేశంతో ఫ్రాన్సిస్‌కు ఉన్న సంక్లిష్ట బంధాన్ని తెలియజేస్తుంది.
అక్కడ చాలామంది ఆయన్ని అభిమానించే వారున్నప్పటికీ, చాలామంది ఈయన్ను వివాదాస్పదమైన వ్యక్తిగా గుర్తుంచుకుంటారు.
అర్జెంటీనాకు వెళ్లే విషయంపై అడిగిన ప్రతిసారి పోప్ ఫ్రాన్సిస్ అస్పష్టమైన సమాధానాలు ఇస్తూ వచ్చారు.
”నాకు వెళ్లాలని ఉంది. వారు నా ప్రజలు. కానీ, ఇంకా ప్లాన్ చేసుకోలేదు. దానికంటే ముందు చాలా విషయాలను పరిష్కరించాల్సి ఉంది” అని 2024 సెప్టెంబర్‌లో అన్నారు.
తన పర్యటనను రాజకీయ అవసరాల కోసం వాడుకోవడం పోప్ ఫ్రాన్సిస్‌కు ఇష్టంలేదని ఆయన సన్నిహితుడు గుస్టావో వీరా చెప్పారు.
అర్జెంటీనాలో ఏం జరుగుతుందో పోప్ నిత్యం తెలుసుకుంటూ ఉండేవారని, ప్రతి విషయాన్ని చర్చించేవారని వీరా చెప్పారు.
జాతి ఐక్యతను తీసుకొచ్చేందుకు, అర్జెంటీనియన్లను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు తాను ఒక సాధనం అనిపించినప్పుడు మాత్రమే అర్జెంటీనా వెళ్తానని ఆయన అనేవారని వీరా తెలిపారు.


ఫొటో సోర్స్, Getty Images
2. ఒకప్పుడు క్లబ్బులో బౌన్సర్
అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఏర్స్‌లో బెర్‌గోగ్లియో పెరిగారు. అప్లయిడ్ కెమిస్ట్రీలో డిప్లొమాతో ఆయన సెకండరీ స్కూల్ విద్య పూర్తి చేశారు.
థియాలజీలో (మతపరమైన విశ్వాసాలపై అధ్యయనం చేయడంపై) డిగ్రీని పొందిన తర్వాత, సాహిత్యం, సైకాలజీ బోధించేందుకు వెళ్లారు.
13 ఏళ్ల వయసులోనే ఉద్యోగం చేయాలని తండ్రి ఒత్తిడి చేశారని, ఒక దుస్తుల ఫ్యాక్టరీలో పని చేసేందుకు ఏర్పాట్లు కూడా చేశారని 2010లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
ఆ తర్వాత కొన్నేళ్లకు రోమ్‌లోని చర్చిలో మాట్లాడుతూ, ఫ్లోర్లను తుడిచినట్లు, నైట్‌క్లబ్‌లో బౌన్సర్‌గా పనిచేసినట్లు కూడా చెప్పారు.
ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో కూడా పనిచేసినట్లు తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
3. ఫుట్‌బాల్‌కు వీరాభిమాని
శాన్ లోరెంజో డి అల్మాగ్రో అనే ఫుట్‌బాల్ క్లబ్బుకు పోప్ ఫ్రాన్సిస్ వీరాభిమాని. దక్షిణ అమెరికన్ క్లబ్ ఫుట్‌బాల్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన పోటీ ‘కోపా లిబర్టాడోర్స్’లో క్లబ్ తన 106 ఏళ్ల చరిత్రలో తొలిసారి విజయం సాధించింది.
”ఈ విజయానికి మీరు సపోర్టు ఇవ్వడమే కారణమా? అని అడిగినప్పుడు, ‘‘నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ, ఈ విజయం మిరాకిల్ కాదు” అని అన్నారు.
పోప్ ఫ్రాన్సిస్ చాలామంది ఫుట్‌బాల్ దిగ్గజాలను కలిశారు.
ఫ్రాన్సిస్ మరణం తర్వాత ఈస్టర్ మండే రోజు షెడ్యూల్ చేసిన ఇటాలియన్ ఫుట్‌బాల్‌లోని టాప్ లెవల్ మ్యాచ్‌లు నాలుగింటిని వాయిదావేశారు.

ఫొటో సోర్స్, Getty Images
4. బస్సు ప్రయాణం ఇష్టం
సాధారణ జీవనశైలి అంటే పోప్‌కు చాలా ఇష్టం. ఆయన ప్రయాణించే వాహనం కూడా ఆయన సింపుల్ లైఫ్‌స్టైల్‌ను తెలుపుతుంది.
పోప్‌గా ఎన్నికైన తర్వాత, నేరుగా ఆయన కార్డినల్స్‌తో కలిసి బస్సు ఎక్కారు. విలాసవంతమైన వాహనాల కంటే సాధారణ కార్లకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నట్లు పోప్ ఫ్రాన్సిస్ స్పష్టం చేశారు.
మతాధిపతి కాకముందు తరచూ ఆయన బస్సుల్లో, సిటీ సబ్‌వే ట్రైన్లలో ప్రయాణించేవారు. వాటికన్‌కు వెళ్లేటప్పుడు ఎకానమీ క్లాస్‌లోనే వెళ్లేవారు.
చనిపోవడానికి ఒక రోజు ముందు సెయింట్ పీటర్స్ స్క్వేర్‌కు వెళ్లినప్పుడు వెనుకవైపు ఓపెన్‌గా ఉన్న ‘పోప్ మొబైల్’ వాహనంలో చేతులు ఊపుతూ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
5. మంచి సెన్సాఫ్ హ్యూమర్ కోసం ప్రార్థన
తన కౌంటర్లు, సెటైర్లతో చమత్కారానికి, హాస్యానికి పోప్ ఫ్రాన్సిస్ బాగా ప్రాచుర్యం పొందారు.
గత ఏడాది(2024) 15 దేశాలకు చెందిన వందమందికి పైగా హాస్యనటులను వాటికన్‌కు పిలిపించి ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు.
”మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఇవ్వు దేవుడా” అంటూ 40 ఏళ్లకు పైగా ప్రతిరోజూ తాను ప్రార్థన చేస్తున్నానని పోప్ ఫ్రాన్సిస్ వారితో చెప్పారు.
16వ శతాబ్దంలో జైలు శిక్షను ఎదుర్కొన్న థామస్ మోర్ కూడా ఇదే ప్రార్థన చేసేవారు. ఆ తర్వాత ఆయన క్యాథలిక్ చర్చికి సెయింట్ అయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
6. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువ
‘ఇంటర్నెట్ దేవుడు ఇచ్చిన వరం’ అని 2018లో పోప్ ఫ్రాన్సిస్ వ్యాఖ్యానించారు. దీన్ని మేనేజ్ చేయడం అతిపెద్ద బాధ్యతగా చెప్పారు.
పోప్ ఫ్రాన్సిస్‌కు ముందు పని చేసిన పోప్ బెనెడిక్ట్ 16 అప్పటి ట్విటర్‌లో (ప్రస్తుత ఎక్స్‌లో) 2012 సంవత్సరంలో అకౌంట్ తెరిచారు. కానీ, ఫ్రాన్సిస్ పోప్ అయిన తర్వాతే దీనికి పెద్ద సంఖ్యలో ఫాలోయర్స్ చేరారు.
తొమ్మిది భాషల్లో పోప్ పోస్టులు పెట్టేవారు. 5 కోట్లకు పైగా ఫాలోయర్స్ ఉండేవారు.
పోప్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కు 99 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. కొత్త టెక్నాలజీలు మానవ సంబంధాలను భర్తీ చేయవని ఆయన అనేవారు.
మరణానికి ముందు ఆయన ఈస్టర్ సండే రోజున కూడా ఎక్స్‌లో తన సందేశాన్ని పోస్టు చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)