SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్న ఓ విద్యార్ధి పోలీస్ ఆఫీసరైన తన తల్లికి చెందిన పాత సర్వీస్ వెపన్‌తో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు చనిపోయారు. మరో ఆరుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు.
కాల్పులు జరిపిన యువకుడి పేరు ఫీనిక్స్ ఇక్నెర్. ఆయన వయసు 20 ఏళ్లు. లంచ్‌టైమ్‌లో యూనివర్సిటీ క్యాంపస్‌లోని విద్యార్ధి సంఘం భవనం వద్ద కాల్పులు జరిపాడు.
అతనిపై పోలీసులు కాల్పులు జరిపారు. తర్వాత ఆసుపత్రికి తరలించారు. అతను ఎందుకు కాల్పులు జరిపాడనేది తెలియలేదు. కాల్పుల్లో చనిపోయిన వారు విద్యార్థులు కాదని క్యాంపస్ పోలీసులు చెప్పారు. అయితే వాళ్లెవరనేది వెల్లడించలేదు.
కాల్పులు జరిపిన యువకుడు లియోన్ కౌంటీలో పోలీస్ ఆఫీసర్‌గా పని చేసిన మహిళ కుమారుడని, ఆమె ఆదర్శ ఉద్యోగిగా గుర్తింపు పొందారని పోలీస్ అధికారి వాల్ట్ మెక్ నీల్ చెప్పారు.
స్కూలులో రిసోర్స్ ఆఫీసర్‌గా పని చేస్తున్న జెస్సికా ఇక్నెర్, పోలీసులకు అత్యాధునిక ఆయుధాలు ఇచ్చిన తర్వాత తన పాత ఆయుధాన్ని ఇంటి వద్ద దాచి పెట్టారు. ఆ తుపాకీ తీసుకుని ఆమె కుమారుడు కాల్పులకు పాల్పడ్డారు.

సంఘటన జరిగిన స్థలం వద్ద ఓ షాట్‌గన్ లభించినట్లు పోలీసులు తెలిపారు.
కాల్పులు జరిపిన యువకుడు షెరీఫ్ కార్యాలయపు యూత్ అడ్వైజరీ కౌన్సిల్‌లో “దీర్ఘకాలిక సభ్యుడని” అతను అనేక శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్నాడని షెరీఫ్ మెక్ నీల్ చెప్పారు.
“అతనికి ఆయుధం అందుబాటులో ఉండటం మాకేమీ ఆశ్చర్యం కలిగించలేదు” అని ఆయన చెప్పారు.
జనవరిలో ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడాన్ని వ్యతిరేకిస్తూ యూనివర్సిటీలో జరిగిన ఆందోళనల్లో ఫీనిక్స్ ఇక్నెర్ పాల్గొన్నాడని యూనివర్సిటీ న్యూస్ పేపర్ చెబుతోంది.
ఎఫ్ఎస్‌యూ న్యూస్‌తో అతను చేసిన వ్యాఖ్యల్ని గురువారం తొలగించారు. అతని అభిప్రాయాలను బలపరిచాలని తాము భావించడం లేదని ఎఫ్ఎస్‌యూ న్యూస్ ఎడిటర్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఫొటో సోర్స్, Reuters
మధ్యాహ్నం సమయంలో క్యాంపస్‌లో కాల్పులు జరుగుతున్నాయని ఫోన్ చేయగానే పోలీసులు స్పందించారని యూనివర్సిటీ వెల్లడించింది. విద్యార్థులంతా “తదుపరి సూచనలు అందేవరకు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని” హెచ్చరిక జారీ చేశారు.
“నా సహ విద్యార్థుల్లో ఒకరి ఫోన్‌లో అలర్ట్ వచ్చింది. ఆమె దాని గురించి క్లాస్‌రూమ్‌లో అందరికీ చెప్పారు” అని అవా అర్నెండో అని విద్యార్థిని సీబీఎస్ న్యూస్ మయామీకి చెప్పారు.
తాను12 రౌండ్ల కాల్పులు విన్నట్లు మరో విద్యార్థి బ్రేక్ లియోనార్డ్ సీబీఎస్‌కు వెల్లడించారు.
“నా వెనుక ఉన్న వారు పరుగెత్తడం చూసే వరకు ఇదేదో కావాలని చేస్తున్నారేమో అనుకున్నాను. అయితే తర్వాత నాకు 12 నుంచి 15 రౌండ్ల కాల్పులు వినిపించగానే నేను కూడా అక్కడ నుంచి పరుగు తీయడం మొదలు పెట్టాను” అని ఆయన చెప్పారు.
ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోనితో సమావేశం కావడానికి ముందు అధికారులు ఈ సంఘటన గురించి వివరించారని అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చెప్పారు. కాల్పుల సంఘటన తర్వాత తుపాకులపై నియంత్రణలు మార్చాలా అని ఆయన అడిగారు.
అమెరికా రాజ్యాంగంలో రెండో సవరణకు తాను పెద్ద మద్దతుదారుడినని ఆయన చెప్పారు. ఈ సవరణ అమెరికన్లు తుపాకులు కలిగి ఉండే హక్కును రక్షిస్తోంది.
“ఇలాంటివి జరగడం దారుణం. దీని గురించి మీకు తర్వాత ఇంకా చాలా చెప్పాల్సి ఉంది” అని ట్రంప్ అన్నారు.
కాల్పుల సంఘటన “సిగ్గు చేటు, భయానక అంశం” అని అన్నారు.
“ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ కుటుంబం కోసం మేం ప్రార్థిస్తున్నాం. అధికారులు సత్వరం స్పందించారు” అని ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్ చెప్పారు.
ఫ్లోరిడా యూనివర్సిటీలో కాల్పులు జరగడం ఇదే మొదటిసారి కాదు. 2015లో ఓ స్కూల్ గ్రాడ్యుయేట్ లైబ్రరీ దగ్గర జరిపిన కాల్పుల్లో ముగ్గురు గాయపడ్డారు. ఆ సమయంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో కాల్పులు జరిపిన వ్యక్తి మరణించారు.
2018లో ఫ్లోరిడాలోని పార్క్‌లాండ్ హైస్కూల్‌లో జరిగిన కాల్పుల ఘటనలో తండ్రిని కోల్పోయిన ఓ బాలిక, గురువారం ఫ్లోరిడా యూనివర్సిటీలో జరిగిన కాల్పుల నుంచి అదృష్టత్తువశాత్తూ తన క్లాస్‌మేట్లు తప్పించుకున్నారని చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)