SOURCE :- BBC NEWS
ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యూహెచ్ఓ ) నుంచి అమెరికా వైదొలిగే ప్రక్రియకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆదేశాలపై ట్రంప్ సంతకం చేశారు.
అమెరికా వైదొలగాలనుకోవడం ‘‘ చాలా పెద్ద నిర్ణయం’’ అని ట్రంప్ చెప్పారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తొలిరోజే ట్రంప్ చేసిన డజన్ల కొద్దీ ఆర్డర్లలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా వైదొలగాలనే ఆర్డరు కూడా ఉంది.
డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలగుతామంటూ ట్రంప్ ఆదేశాలు జారీ చేయడం ఇది రెండోసారి.
కోవిడ్ -19 సంక్షోభ సమయంలో డబ్లూహెచ్‌ఓ వ్యవహరించిన తీరుపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో అధ్యక్షుడిగా తన తొలిపాలనా కాలంలోనే జెనీవా కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ నుంచి తప్పుకునే ప్రక్రియను మొదలుపెట్టారు. కానీ, ట్రంప్ తరువాత అధికారంలోకి వచ్చిన బైడెన్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని రద్దు చేసింది.
ఈ క్రమంలో రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తొలిరోజే ట్రంప్ ఈ ఆర్డరుపై సంతకం చేయడం వల్ల అమెరికా అధికారికంగా ఈ సంస్థనుంచి తప్పుకునే అవకాశాన్ని పెంచింది.
‘మేం తిరిగి రావాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ బలంగా కోరుకుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం’’ అని ట్రంప్ అన్నారు. భవిష్యత్తులో అమెరికా తిరిగి ప్రపంచ ఆరోగ్య సంస్థలోకి రావడానికి ఇది సంకేతం కావచ్చు.
‘‘చైనాలోని వూహాన్‌లో పుట్టిన కోవిడ్ 19 సంక్షోభం సహా, అనేక ప్రపంచ ఆరోగ్య సంక్షోభాల విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అసమర్థతను ప్రదర్శించింది. అత్యవసర సమయంలో తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. సభ్య దేశాల రాజకీయ ప్రభావాలకు అతీతంగా స్వతంత్రంగా వ్యవహరించలేకపోయింది. అందుకే యూఎస్ తన సభ్యత్వం నుంచి వైదొలగుతోంది ‘ అని ఆ ఆదేశంలో పేర్కొన్నారు.
ఐక్యరాజ్య సమితి సభ్యదేశాలతో పోల్చి చూసినప్పుడు అమెరికా ప్రపంచ ఆరోగ్య సంస్థకు భారీమొత్తంలో చెల్లింపులు చేసిందని, ఇది చాలా అన్యాయమని, అమెరికా వైదొలగడానికి ఇది కూడా ఒక కారణమని ఆదేశాలలో తెలిపారు.
కోవిడ్ సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనా పక్షం వహించి, ఆ సంక్షోభాన్ని ఎదుర్కొన్న తీరుపై ట్రంప్ తన తొలి పాలనా కాలంలోనూ విమర్శలు గుప్పించారు.
బైడెన్ పాలనలో ప్రపంచ ఆరోగ్య సంస్థకు అత్యంత ఎక్కువ నిధులు ఇచ్చింది అమెరికానే. 2023లో దాదాపు ఐదో వంతు సంస్థ బడ్జెట్ కు అమెరికా నిధులు సమకూర్చింది. ఈ సంస్థ వార్షిక బడ్జెట్ 6.8 బిలియన్ డాలర్లు.
ప్రపంచ ఆరోగ్య సంస్థను వీడాలనే ట్రంప్ నిర్ణయాన్ని ఆరోగ్య రంగ నిపుణులు తప్పుపడుతున్నారు. ఇది అమెరికా ఆరోగ్యరంగంపై ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించారు.
మలేరియా, టీబీ ఎయిడ్స్ వంటి జబ్బులను ఎదుర్కోవడంలో సాధించిన పురోగతిని ఈ నిర్ణయం తలకిందులు చేసే ప్రమాదం ఉందని కొందరు నిపుణులు చెప్పారు.
‘అమెరికా డబ్ల్యూహెచ్ఓ ను వదిలి వెళితే, ప్రపంచ ప్రజల ఆరోగ్యానికే కాదు అమెరికా నాయకత్వానికి, సైన్స్ కు ఉన్న శక్తికి కూడా ముప్పే’ అని బైడెన్ ప్రభుత్వంలో కోవిడ్-19 రెస్పాన్స్ కో- ఆర్డినేటర్ గా పని చేసిన ఆశిష్ ఝా అన్నారు.
‘ఈ అధ్యక్ష నిర్ణయం ఒక విపత్తు లాంటిది. డబ్ల్యూహెచ్‌ఓను వీడాలనే అమెరికా నిర్ణయం ప్రపంచ ఆరోగ్యానికే గట్టి దెబ్బ. అమెరికాకు మరింత పెద్ద గాయం’ అని జార్జ్ టౌన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పని చేస్తున్న ప్రపంచ ఆరోగ్య రంగ నిపుణుడు లారెన్స్ గోస్టిన్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)