SOURCE :- BBC NEWS
గ్లోబల్ వార్మింగ్ (భూ ఉపరితల ఉష్ణోగ్రత) సగటు 1.5C దాటకుండా ఉంచేందుకు ప్రయత్నిస్తామని ప్రపంచ నేతలు దశాబ్దం కిందట చేసిన ప్రతిజ్ఞ చెదిరిపోయింది.
భూమి అంతకుమించి వేడెక్కుతున్న దిశగా భారీ ముందడుగు పడినట్లు కొత్త డేటా సూచిస్తోంది.
సింబాలిక్ థ్రెషోల్డ్(అంశాలను ఒక క్రమపద్ధతిలో పేర్చి, వాస్తవికతకు దగ్గరగా ఫలితాలను అందించే మెకానిజం)ను దాటిన మొదటి సంవత్సరం 2024 అని, ఇది అత్యంత వేడి సంవత్సరం కూడా అని ప్రపంచంలోని ప్రధాన డేటా ప్రొవైడర్లలో ఒకటైన యూరోపియన్ కోపర్నికస్ క్లైమేట్ సర్వీస్ తెలిపింది.
అయితే, దీనితో ప్రపంచ దేశాలు పెట్టుకున్న 1.5C లక్ష్యం చెదిరిపోయినట్లు కాదు. ఎందుకంటే, దశాబ్దాలుగా వస్తున్న సగటుకి కొనసాగింపు ఇది. కాకపోతే, శిలాజ ఇంధన ఉద్గారాలు వాతావరణాన్ని ఇంకా వేడెక్కిస్తూనే ఉండడంతో ఆ లక్ష్యం చెదిరిపోయే దిశగా ప్రపంచం ముందుకు సాగుతున్నట్లే.
ఇటీవలి ఉష్ణోగ్రతల రికార్డులను ”క్లైమేట్ బ్రేక్‌డౌన్” (వాతావరణ విచ్ఛిన్నం)గా గత వారం ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరెస్ అభివర్ణించారు.
”వినాశనం దిశగా సాగుతున్న ఈ మార్గం నుంచి మనం బయటకు రావాలి. అది వెంటనే జరగాలి, సమయం లేదు” అని ఆయన తన న్యూ ఇయర్ మెసేజ్‌లో పేర్కొన్నారు.
భూతాపానికి కారణమవుతున్న వాయువుల ఉద్గారాలను 2025లో తగ్గించుకోవాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు.
కోపర్నికస్ విడుదల చేసిన డేటా ప్రకారం, 2024లో ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు పారిశ్రామికీకరణకు ముందుకంటే దాదాపు 1.6°C ఎక్కువగా ఉన్నాయి. (పారిశ్రామికీకరణకు ముందు అంటే, మనుషులు పెద్దయెత్తున శిలాజ ఇంధనాలను మండించడం మొదలుపెట్టిన కాలానికంటే ముందు.)
గత ఏడాదిలో కేవలం 0.1°C పెరిగి 2023 రికార్డును 2024 చెరిపేసింది. అలాగే, గత పది సంవత్సరాలు..10 అత్యంత వేడి సంవత్సరాలుగా నమోదయ్యాయి.
నాసా, ఇతర వాతావరణ సమూహాలు తమ డేటాను త్వరలో విడుదల చేయనున్నాయి. అయితే అవి విడుదల చేసే గణాంకాల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చు, కానీ 2024 ఏడాది అత్యంత వేడి సంవత్సరంగా రికార్డు నెలకొల్పిందనే విషయంతో ఏకీభవించవచ్చని భావిస్తున్నారు.
గతేడాది భూమి వేడెక్కడానికి కారణమైన కార్బన్ డయాక్సైడ్ వంటి మనుషుల కారణంగా ఏర్పడే వాయు ఉద్గారాలు ఇప్పటికీ వాతావరణంలో రికార్డు స్థాయిలోనే ఉన్నాయి.
పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల జలాలు అసాధారణంగా వేడెక్కే ఎల్ నినో వంటి సాధారణ వాతావరణ పరిస్థితుల పాత్ర ఇందులో తక్కువే.
”వాతావరణంలోని గ్రీన్‌హౌస్ వాయువుల సాంద్రతలే మన వాతావరణాన్ని ప్రభావితం చేసే అతిపెద్ద అంశం” అని కోపర్నికస్ డిప్యూటీ డైరెక్టర్ సమంతా బర్గెస్ బీబీసీతో చెప్పారు.
2015 పారిస్ ఒప్పందానికి ప్రపంచ దేశాలు అంగీకారం తెలిపినప్పటి నుంచి 1.5C అనేది ప్రపంచ వాతావరణం విషయంలో ఒక పవర్‌ఫుల్ సింబల్‌గా మారింది. తీవ్ర ప్రభావం పడే అవకాశమున్న చాలా దేశాలు దీనిని మనుగడకు సంబంధించిన విషయంగా భావిస్తున్నాయి.
ఐక్యరాజ్య సమితి 2018 నివేదిక ప్రకారం.. ఉష్ణోగ్రతలు 1.5C దాటి 2Cకి చేరితే వాతావరణ మార్పుల కారణంగా సంభవించే వేడిగాలులు, సముద్రమట్టాల పెరుగుదల, వన్యప్రాణులు అంతరించిపోవడం వంటి ప్రమాదాలు చాలా తీవ్రంగా ఎక్కువగా ఉంటాయి.
ఇన్ని హెచ్చరికలు ఉన్నప్పటికీ , ఈ ప్రపంచం 1.5C మార్కును దాటే దిశగా సాగుతోంది.
”ఈ 1.5C పరిమితిని ఎప్పటికి దాటుతామనేది కచ్చితంగా అంచనా వేయడం కష్టం, కానీ మనం ఇప్పుడు దానికి అత్యంత చేరువలో ఉన్నాం” అని ఐక్యరాజ్యసమితి నివేదిక రచయిత, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఫిజిక్స్ విభాగానికి చెందిన మైల్స్ అలెన్ చెప్పారు.
ఇదే మాదిరిగా కొనసాగితే 2030 తొలినాళ్లలో ఈ ఉష్ణోగ్రత 1.5C దాటే అవకాశముంది. రాజకీయంగా ఇది చాలా పెద్ద విషయమే, కానీ అంతటితో అంతా అయిపోయినట్లు కాదు.
”అంటే, 1.49C ఉంటే ఫర్వాలేదని కాదు, 1.51 నమోదైతే అంతా అయిపోయిందనీ కాదు. కానీ, ఒక డిగ్రీ సెల్సియస్‌లో పదో వంతు కూడా చాలా కీలకం. వేడి పెరుగుతున్న కొద్దీ వాతావరణ మార్పుల వల్ల కలిగే ప్రభావాలు మరింత తీవ్రమవుతాయి” అని అమెరికాకు చెందిన పరిశోధన బృందం బర్గ్‌లీలో ఎర్త్ సైంటిస్ట్‌గా పనిచేస్తున్న జెక్ హౌజ్‌ఫాదర్ చెప్పారు.
ఒక్క డిగ్రీలో కొంతభాగం పెరిగినా అది తరచూ వేడిగాలులు, భారీ వర్షపాతం వంటి తీవ్రమైన వాతావరణ పరిస్థితులకు కారణమవ్వొచ్చు
2024లో, పశ్చిమ ఆఫ్రికాలో బొబ్బలు తెప్పించే ఉష్ణోగ్రతలు, దక్షిణ అమెరికాలోని కొన్నిప్రాంతాల్లో దీర్ఘకాలిక కరవు పరిస్థితులు, మధ్య యూరప్‌లో తీవ్ర వర్షపాతం, ఉత్తర అమెరికా, దక్షిణ ఆసియా ప్రాంతాల్లో బలమైన తుపానులను ప్రపంచం చూసింది.
వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ గ్రూప్ ప్రకారం, వాతావరణ మార్పుల వల్ల గత ఏడాది సంభవించిన తీవ్రమైన పరిస్థితుల్లో ఇవి కొన్ని మాత్రమే.
కొత్త గణాంకాలు విడుదలైన ఈ వారంలోనూ.. కార్చిచ్చుకు తీవ్ర వర్షాభావ పరిస్థితులు, బలమైన గాలులు తోడై లాస్ ఏంజలెస్‌ను అతలాకుతలం చేశాయి.
ఈ వారంలో సంభవించిన ఘటనలకు అనేక కారణాలు ఉన్నప్పటికీ, వాతావరణం వేడెక్కడం వంటివి కాలిఫోర్నియా కార్చిచ్చుకు అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని నిపుణులు అంటున్నారు.
2024 ఏడాదిలో కొత్త రికార్డులను నెలకొల్పింది గాలి ఉష్ణోగ్రతలు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు కూడా రోజువారీ గరిష్ఠ స్థాయికి చేరాయి. అదే సమయంలో వాతావరణంలో తేమ కూడా రికార్డు స్థాయికి చేరింది.
కొత్త రికార్డులను నమోదు చేయడం పెద్దగా ఆశ్చర్యం కలిగించే విషయమేమీ కాదు, ఎందుకంటే గత ఏడాది ఏప్రిల‌్‌లో ముగిసిన ఎల్ నినో ప్రభావం, మనుషుల కారణంగా ఏర్పడే వాయు ఉద్గారాల వంటి వాటి కారణంగా 2024 అత్యంత వేడిగా ఉంటుందన్న అంచనాలు ముందు నుంచే ఉన్నాయి.
అయితే, ఇటీవలి సంవత్సరాల్లో నమోదైన రికార్డుల మధ్య తేడా అంచనాల కంటే తక్కువగా ఉందని, ఇది యాక్సెలరేషన్ (వేడెక్కడంలో వేగాన్ని)ను సూచిస్తోందని కొందరు శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
”2023, 2024 రెండింటి ఉష్ణోగ్రతలు చాలామంది శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచాయని చెప్పడం ఉత్తమమని నేను భావిస్తున్నా. ఇంత త్వరగా 1.5C కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని మేం ఊహించలేదు” అని డాక్టర్ హౌజ్‌ఫాదర్ చెప్పారు.
”వాతావరణ మార్పులు, ఎల్ నినో కారణంగా ఊహించిన దానికంటే ఎక్కువగా, కచ్చితంగా కారణమిదీ అని వివరించలేని విధంగా 2023 నుంచి 0.2C అదనంగా వేడెక్కింది” అని జర్మనీలోని ఆల్ఫ్రెడ్ వెజెనర్ ఇన్‌స్టిట్యూట్‌లో క్లైమేట్ ఫిజిసిస్ట్ హెల్జ్ గొబ్లింగ్ అంటున్నారు.
ఈ అదనపు వేడిని వివరించేందుకు వివిధ సిద్ధాంతాలున్నాయి. భూమిని చల్లబరిచే తక్కువ ఎత్తు మేఘాల పొరల్లో స్పష్టమైన తగ్గుదల, ఎల్ నినో ముగిసినా సముద్ర ఉపరితలం ఎక్కువ కాలం వేడిగా ఉండడం వంటి థియరీలు ఉన్నాయి.
”భూమి వేడెక్కడంలో యాక్సెలరేషన్ మానవ కార్యకలాపాలతో ముడిపడి ఉండడం అనేది, భవిష్యత్తులో మరింత వేడెక్కడానికి కారణమవుతుందా? లేదంటే ఇది సహజ వైవిధ్యంలో భాగమా? అనేదే ఇక్కడ ప్రశ్న” అని డాక్టర్ హెల్జ్ అంటున్నారు.
”అయితే, అది ఇప్పుడే చెప్పలేం” అన్నారాయన.
ఈ విషయంలో అనిశ్చితి ఉన్నప్పటికీ, భవిష్యత్తు వాతావరణం ఇప్పటికీ మానవుల చేతిలో ఉందని, ఉద్గారాలను గణనీయంగా తగ్గించగలిగితే భూమి వేడెక్కడాన్ని తగ్గించగలమని శాస్త్రవేత్తలు బలంగా చెబుతున్నారు.
”ఒకవేళ 1.5C పరిమితి దాటినప్పటికీ, మనం ఈ శతాబ్దంలో గ్లోబల్ వార్మింగ్‌ను 1.6C, 1.7C, లేదా 1.8కి పరిమితం చేయొచ్చు” అని డాక్టర్ హౌజ్‌ఫాదర్ చెప్పారు.
”మనం బొగ్గు, చమురు, సహజవాయువును నిరంతరం వాడుతూ 3C, 4C కి చేరడం కంటే, ఇది చాలా బెటర్. ఆ అవకాశం ఇప్పటికీ ఉంది.” అన్నారు హౌజ్ ఫాదర్.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)