SOURCE :- BBC NEWS
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ నగరంలో ప్రజలు పెద్ద ఎత్తున జరుపుకునే హిందూ పండగ మహా కుంభమేళా నేడు (సోమవారం) ప్రారంభమైంది.
45 రోజుల పాటు జరిగే ఈ వేడుకకు 40 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. అంతరిక్షం నుంచి కూడా చూడగలిగే అతిపెద్ద వేడుక ఇది.
వచ్చే ఆరు వారాల పాటు భారతీయులు అత్యంత పవిత్రంగా భావించే గంగా నది, యమునా నది, పురాణాల్లో పేర్కొన్న సరస్వతి నదుల కలయిక త్రివేణి సంగమం వద్ద భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తారు.
బూడిద పూసుకుని నగ్నంగా ఉండే హిందూ సాధువులు, అంటే నాగ సాధువులు మంగళవారం తెల్లవారుజామున త్రివేణి సంగమంలో తొలి స్నానాలు ఆచరిస్తారు.
పవిత్రమైన నదిలో స్నానం ఆచరించడం ద్వారా, పాపాలు తొలగిపోతాయని, ఆత్మశుద్ధి జరిగి, జనన, మరణమనే చక్రం నుంచి విముక్తి లభిస్తుందని హిందూవులు భావిస్తారు. హిందూయిజంలో మనిషి జీవితానికి అంతిమ లక్ష్యం మోక్షం పొందడమే.
సోమవారం రోజు 50 లక్షల నుంచి 80 లక్షల మంది భక్తులు స్నానాలు ఆచరిస్తారని, ఆ తర్వాత రోజు మంగళవారం 2 కోట్ల మందికి పైగా పవిత్రమైన త్రివేణి సంగమంలో స్నానం చేస్తారని అంచనాలున్నాయి.
భక్తులకు, పర్యాటకులకు సదుపాయం కల్పించేందుకు, 4 వేలకు పైగా విస్తీర్ణంలో త్రివేణి సంగమ తీరంలో అతిపెద్ద టెంట్ సిటీని ఏర్పాటు చేశారు.
ఈ వేడుక ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు, ఆదివారం ప్రయాగ్‌రాజ్‌లోని విశాలమైన మైదానంలోని చాలా ప్రాంతాల్లో ఇంకా కొన్ని పనులు కొనసాగాయి.
సాధువులు, ఇతర భక్తులు ఏర్పాటు చేసిని కొన్ని క్యాంపులలో నీరు, అడపాదడపా విద్యుత్ సరఫరా లేదు.
అక్కడ వాతావరణం ఎలా ఉంది?
నగరంలో ఎక్కడ చూసినా భక్తులు, సెక్యూరిటీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు తమ లగేజీని భుజాలపై వేసుకుని త్రివేణి సంగమం వైపుకు వెళ్లడం కనిపిస్తోంది. ప్రతిచోటా పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు.
వజ్రా వాహనాలు, డ్రోన్లు, బాంబు డిస్పోజల్ స్క్వాడ్స్, నేషనల్ సెక్యూరిటీ గార్డులను ఈ వేడుక జరిగే ప్రాంతం వద్ద మోహరించారు.
పలు ప్రాంతాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యానాథ్ ఫోటోలతో ఉన్న ‘మానవాళికి చెందిన అపురూపమైన సాంస్కృతిక వారసత్వం” అనే సందేశంతో హోర్డింగ్‌లు కనిపించాయి.
దీంతోపాటు, ఇతర సాధు సంతుల పోస్టర్లతో నగరమంతా నిండిపోయింది.
వివిధ అఖాడాలకు చెందిన సాధువులు రకరకాల ప్రదర్శనలు చేసుకుంటూ మహా కుంభమేళాకు విచ్చేస్తున్నారు. వారితోపాటు ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు కనిపించాయి. వందలమంది భక్తులు నృత్యం చేస్తూ, పాటలు పాడుతూ కనిపించారు.
సాధువులను చూసేందుకు రోడ్లపై వందలమంది గుమికూడుతుండటంతో, కిలోమీటర్ ప్రయాణానికి కూడా గంటల సమయం పడుతోంది.
ఇక్కడకు వచ్చిన భక్తులు ఏం చెబుతున్నారు?
ఇక్కడకు రావడం చాలా ఆనందంగా ఉందని భక్తులు చెబుతున్నారు.
” మేం ఐదు రోజుల కోసం వచ్చాం. ఇది మా తొలి కుంభమేళా. జనవరి 14న జరిగే షాహీ స్నాన్ (పవిత్ర స్నానం) ఆచరించిన తర్వాత మేం ఇంటికి వెళ్తాం. ప్రస్తుతం మేం మహారాజ్ జీ ఆశ్రమంలో ఉంటాం.” అని ముంబయికి చెందిన గీతా చెప్పారు.
”కుంభమేళా జరిగిన 12 ఏళ్ల క్రితం నేనిక్కడికి వచ్చాను. అంతకుముందుతో పోలిస్తే ఏర్పాట్లు మెరుగ్గా ఉన్నాయి.” అని గీతతో పాటు వచ్చిన జయశ్రీ భరత్ పుంజాని చెప్పారు.
బిహార్‌లోని భాగల్పూర్ నివాసి అయిన 25 ఏళ్ల నూతన్, మంచు తుంపర్లు పడుతున్న సమయంలో ఒక పాలిథీన్‌తో చేసిన రూఫ్ కింద రోడ్డుపక్కన నిలబడి ఉన్నారు.
”మా గ్రామం నుంచి 30 మంది వచ్చాం. ఇక్కడ ఉండేందుకు ఎలాంటి ఏర్పాటు లేదు. ఎక్కడికి వెళ్లినా పోలీసులు మమ్మల్ని తరిమి కొడుతున్నారు. టెంట్‌లో ఉండేందుకు మావద్ద సరిపడా డబ్బులు లేవు. కుంభమేళాలో టీ స్టాల్ ఏర్పాటు చేద్దామని మేం అనుకున్నాం. కానీ, కష్టంగా ఉంది.” అని చెప్పారు.
బెంగాల్ నుంచి వచ్చిన మహిళల బృందానికి కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. ‘‘మహా కుంభమేళా సందర్భంగా గంగలో స్నానం చేసేందుకు మేం 20 మందికి పైగా మహిళలు వచ్చాం. కానీ, ఇక్కడ ఉండేందుకు ఎలాంటి సదుపాయం లేదు. రెండు మూడు రోజల పాటు రోడ్డుపైనే ఉండాలి.” అని సంజీతా శ్రద్ధా అనే మహిళ అన్నారు.
”భస్మమే మా శరీరానికి వేసుకునే బట్టలు”
వివిధ అఖాడాలకు చెందిన వందలాదిమంది సాధువులు టెంట్లు ఏర్పాటు చేసుకున్నారు. అవి కొన్ని ఎకరాలకు పైగా విస్తరించాయి. సాధువులు సొంతంగా తమ టెంట్లు నిర్మించుకున్నారు. అక్కడే ఉంటూ, వారు పూజలు చేస్తారు.
కుంభమేళాలోని అఖాడాల్లో పెద్ద ఎత్తున జనం కనిపిస్తున్నారు. నాగ సాధువులు పంచ దశనాం జునా అఖాడాలో తమ శరీరాలపై బూడిద, మెళ్లల్లో రుద్రాక్ష మాలలు ధరించి కూర్చుని ఉన్నారు.
ఇంత చలిలో కూడా, కొందరు నాగ సాధువులు అఖాడాల బయట రోడ్డుపై మంట వేసుకుని టెంట్లు వద్ద కూర్చుని ఉన్నారు. వారి ఆశీర్వాదం తీసుకునేందుకు పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు. చాలామంది వారితో ఫోటోలు తీసుకుంటున్నారు.
”ధ్యానం చేయడం ప్రారంభిస్తే, మీకసలు చలి అనేదే తెలియదు. భక్తిలో ఎంతో శక్తి ఉంటుంది. దీంతో, మీరు చలిని ఫీలవ్వరు.” అని ఒక నాగ సాధువు బీబీసీకి చెప్పారు. ” మేం అఘోరీ బాబాలం. దుస్తులకు బదులు బూడిద రాసుకుంటాం. ఇది మాకు చలి ఎక్కువగా తగలనివ్వదు.” అని తెలిపారు.
”భస్మమే మా శరీరానికి వేసుకునే దుస్తులు. ఇలా మేం 12 గంటలు పాటు ఉంటే, శరీరంలో నొప్పులు మొదలవుతాయి. కానీ, ఇదే మా సాధన” అని మరో నాగ సాధువు చెప్పారు. ఇలాంటి చాలామంది సాధువులు మహా కుంభమేళాకు వస్తారు.
వారిలో ఒకరు అస్సాంలోని కామాఖ్యా పీఠానికి చెందిన గంగాపురి మహారాజ్. ఈయన్ను కలిసేందుకు ఎంతోదూరం నుంచి చాలామంది వస్తున్నారు. 3 అడుగుల 8 అంగుళాలు ఉండే ఈ బాబా, 32 ఏళ్లుగా స్నానం చేయలేదు. మేం ఆయన్ను కలవడానికి ప్రయత్నించినప్పుడు, ఆయన నిరాకరించారు.
గంగాపురి మహారాజ్ ఉన్న సమీప టెంట్‌లో ఉన్న ఒక మహిళను ఆయన గురించి మేం అడిగినప్పుడు, గంగాలో అప్పుడే స్నానం చేసి వచ్చి, ఆయన టెంట్‌లో ఉన్నారని తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)