SOURCE :- BBC NEWS

కెకీ మూస్

ఫొటో సోర్స్, kamlakar samant

  • రచయిత, ప్రియాంక జగ్తాప్
  • హోదా, బీబీసీ ప్రతినిధి
  • 3 జనవరి 2025

ప్రపంచ ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్, చిత్రకారుడు కెకీ మూస్ తన జీవితంలో 50 ఏళ్ల పాటు ప్రియురాలి కోసం ఎప్పుడూ తన ఇంటి గడప కూడా దాటకుండా నిరీక్షిస్తూ గడిపారు.

వృత్తిరీత్యా ఫోటోగ్రాఫర్ అయిన ఆయన, తన ప్రతిభకు 300 కు పైగా బంగారు పతకాలు సాధించారు.

చాలిస్‌గావ్‌లోని రాతితో నిర్మించిన ఒక భవనంలోనే ఆయన తన ఫోటోగ్రాఫ్‌లు, కళాకృతులకు ప్రాణం పోశారు. అక్కడే దాదాపు ఐదు దశాబ్దాలు ప్రవాసిలాగా జీవితం గడిపారు.

ప్రతిరోజూ అర్ధరాత్రి వచ్చే రైలుబండిపైనే ఆయన దృష్టంతా ఉండేది. తన ప్రియురాలికి స్వాగతం చెప్పేందుకు ఆయన రెడీగా ఉండేవారు.

తన చివరిశ్వాస వరకు కళకు, ప్రేమకు జీవితాన్ని అంకితం చేసిన కెకీ మూస్ గురించి తెలుసుకుందాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

‘50 ఏళ్ల పాటు నేను ప్రియురాలి కోసం ఎదురుచూశా’

కెకీ ప్రేమ కథ ఒక చరిత్రలాంటిది. ప్రియురాలు ఇచ్చిన మాటను నమ్మిన ఈ ప్రేమికుడు, ఆమె ఎప్పటికైనా తన దగ్గరకు వస్తారని దాదాపు 50 ఏళ్ల పాటు ఎదురుచూశారు. పంజాబ్ మెయిల్ రైలు ప్రతిరోజూ వచ్చి వెళ్లేదాకా ఆయన ఏమీ తినేవారు కాదు. తన జీవితంలో చివరి రోజు వరకు ఆయనిలాగే చేశారు.

మహరాష్ట్రలోని ఖందేశ్‌కు చెందిన కళామహర్షి కెకీ మూస్ తనకు ఎంతో ఇష్టమైన ఫోటోగ్రఫీ కోసం చాలీస్‌గావ్‌ అనే ఊరిలో మూస్ ఆర్ట్ గ్యాలరీని స్థాపించారు. ఈ ఆర్ట్ గ్యాలరీ ట్రస్టీ, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ కమలాకర్ సామంత్ తన పాఠశాల రోజుల్లో మొదటిసారి కెకీ మూస్‌ని కలిశారు.

ఆయనిచ్చిన సమాచారం ప్రకారం కెకీకి ఒక ప్రియురాలు ఉండేవారు.

చాలీస్‌గావ్‌‌కు వచ్చేందుకు కెకీ ముంబై నుంచి బయలుదేరి వస్తున్న రోజున, ఆయనకు వీడ్కోలు చెప్పేందుకు ఆయన గర్ల్‌ఫ్రెండ్ విక్టోరియా స్టేషన్‌కు వచ్చారు. ఈ విక్టోరియా స్టేషన్‌ను ఇప్పుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్‌గా పిలుస్తున్నారు.

వీడ్కోలు చెప్పడానికి వచ్చినప్పుడు ఆమె కెకీ మూస్ చేతిని తన చేతుల్లోకి తీసుకుని ఆయనకో మాటిచ్చారు. ఏదో ఒక రోజు తాను కచ్చితంగా పంజాబ్ మెయిల్‌లో చాలిస్‌గావ్ వస్తానని, తనతో కలిసి డిన్నర్ చేస్తానని చెప్పారు.

కెకీ మూస్

ఫొటో సోర్స్, kamlakar samant

ప్రియురాలి మాటలపై నమ్మకం ఉంచిన కెకీ మూస్, ఆ రైలు వచ్చినప్పుడు తన బంగ్లా కిటికీలు, తలుపులు అన్నీ తెరిచి ఉంచేవారు. రోజులో మిగిలిన భాగమంతా అవి మూసేసి ఉండేవి. రైలు వచ్చే సమయానికి దీపాలు వెలిగించేవారు. తోటలోని తాజా పూలతో బొకే తయారుచేసేవారు.

తర్వాత తోటలో పువ్వులు లేని సమయంలో వాడిపోని అలంకరణ పూలతో పూలగుత్తులు తయారుచేశారు.

ప్రతిరాత్రీ ఆయన ఇద్దరి కోసం భోజనం తయారుచేసేవారు. ఈ పద్ధతిలో ఆయన ప్రతిరోజూ తన ప్రియురాలికి స్వాగతం చెప్పేందుకు రెడీగా ఉండేవారు.

”చివరి వరకూ ఆయన తన ప్రియురాలికిచ్చిన మాట నిలబెట్టుకున్నారు. పంజాబ్ మెయిల్ వచ్చి వెళ్లిపోయిన తర్వాతే ఆయన ప్రతిరోజూ డిన్నర్ చేసేవారు. తన జీవితంలో ఆయన 1989 డిసెంబరు 31న చివరి డిన్నర్ చేశారు. అది కూడా ఆ రోజూ పంజాబ్ మెయిల్ రైలు వెళ్లిపోయిన తర్వాతే” అని కమలాకర్ సామంత్ చెప్పారు.

కెకీ చనిపోయిన తర్వాత ఆయన ఇంట్లో తాను రెండు లేఖలను చూశానని సామంత్ తెలిపారు. వాటిలో ఒకటి ఆయన ప్రియురాలి నుంచి వచ్చింది. రెండోది కేకీ బంధువు హథిఖాన్‌వాలా నుంచి వచ్చిందని సామంత్ తెలిపారు.

ఆయన ప్రియురాలిని లండన్ పంపించివేశారని, అక్కడ ఆమె వివాహం చేసుకున్నారని లేఖలో హథిఖాన్‌వాలా కేకీకి తెలిపారు. కేకీ ఆ ఉత్తరం ఎప్పుడూ చదవలేదని సామంత్ చెప్పారు.

నీలోఫర్ మోదీ

ఫొటో సోర్స్, Kamalakar Samant

అసలామె ఎవరు?

ముంబైలో చదువుకునేటప్పుడు నీలోఫర్ మోదీ అనే యువతితో ఆయనకు స్నేహం కుదిరింది. తర్వాత అది ప్రేమగా మారింది.

చదువు పూర్తయిన తర్వాత చాలిస్‌గావ్‌లో ఉంటున్న తన తల్లిదండ్రులతో కలిసి ఉండాలని కెకీ మూస్ నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయం ఆయనకు, నీలోఫర్‌కు మధ్య విభేదాలకు కారణమయింది.

కెకీ కుటుంబం ఆర్థికంగా మంచి స్థితిలోనే ఉన్నప్పటికీ, నీలోఫర్ సంపన్న కుటుంబానికి చెందిన వారు.

దీంతో నీలోఫర్ తల్లిదండ్రులకు వారి ప్రేమ విషయం అంత నచ్చలేదు. అయినప్పటికీ వారిద్దరూ పెళ్లిచేసుకోవడానికి వారు అంగీకరించారు.

అయితే, నీలోఫర్‌ ముంబై వదిలి చాలిస్‌గావ్‌లాంటి గ్రామీణ ప్రాంతానికి వెళ్లేందుకు ఆమె తల్లిదండ్రులు అంగీకరించలేదు.

కెకీతో కలిసి చాలిస్‌గావ్‌ వెళ్లేందుకు నీలోఫర్ సిద్ధమైనప్పటికీ, ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు.

కెకీ ముంబై నుంచి చాలిస్‌గావ్‌ వెళ్లేటప్పుడు నీలోఫర్ ఆయనకు ఒక మాటిచ్చారు. ఒకరోజు తాను తప్పకుండా చాలిస్‌గావ్‌ వస్తానన్నారు.

ఆ మాట కోసం కెకీ తన జీవితకాలం ఎదురుచూశారు.

కెకీ మూస్ ఇల్లు

ఫొటో సోర్స్, Adv Kranti Patankar

50 ఏళ్లలో రెండేసార్లు ఇంటి నుంచి బయటకొచ్చిన కెకీ

50 ఏళ్లలో రెండేసార్లు కెకీ ఇంటి నుంచి బయటికొచ్చారు. ఈ కాలమంతా తనను తాను ఆ ఇంటిలో బంధించుకున్నాని కెకీ అంగీకరించినట్టు కమలాకర్ సామంత్ బీబీసీతో చెప్పారు.

1939 నుంచి 1989 మధ్య 50 ఏళ్ల కాలంలో ఆయన రెండేసార్లు ఇంటి నుంచి బయటికొచ్చారు. 1957లో ఆయన తల్లి అంత్యక్రియల కోసం ఔరంగాబాద్ వెళ్లారు.

భూదాన్ ఉద్యమం సమయంలో వినోభాభావే‌ బొమ్మను వేసేందుకు చాలిస్‌గావ్‌ రైల్వేస్టేషన్‌ వెయిటింగ్ రూమ్‌కు వెళ్లారు. వినోభాభావే సోదరుడు శివాజీ నర్బర్ భావే, కెకీ మంచి స్నేహితులు. శివాజీరావు కోరిక మేరకు కెకీ ఇంటి నుంచి బయటకు వచ్చారు.

అప్పుడు చాలిస్‌గావ్‌ రైల్వేస్టేషన్‌లో తనను కలవాలని అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ కెకీని ఆహ్వానించారు. ప్రధాని ఆహ్వానాన్ని కెకీ సున్నితంగా తిరస్కరించారు.

”నేను వేసిన మీ బొమ్మ కావాలంటే మీరే మా ఇంటికి రండి అని నెహ్రూను ఆహ్వానించారు కెకీ. దీంతో జవహర్‌లాల్ నెహ్రూ ఆయన్ను కలవడానికి కెకీ ఇంటికెళ్లారు” అని సామంత్ చెప్పారు.

కెకీ ఇంటి నుంచి బయటకు రాకపోయినా, అనేకమంది ప్రముఖులు ఆయన్ను కలిసేందుకు, మాట్లాడేందుకు ఆయనింటికి వచ్చేవారు.

జవహర్‌లాల్ నెహ్రూ, బాబా ఆమ్టే, జయప్రకాశ్ నారాయణ్‌లాంటి ప్రముఖులు ఆయన ఇంటికి వచ్చిన వారిలో ఉన్నారు. వీళ్లలో చాలామంది ఫోటోలు ఆయన మ్యూజియంలో ఉన్నాయి.

కళాపిపాసి అంతులేని ప్రేమ

కెకీ మూస్ ప్రపంచ ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్. పెయింటర్, సంగీత ప్రేమికుడు, గొప్ప శిల్పి, పేపర్‌ను అనేక రకాలుగా మడిచి కళాకృతులుగా మార్చే ‘ఒరిగామి’ అనే ఆర్ట్ కూడా ఆయనకు తెలుసు.

కెకీ మంచి రచయిత, అనువాదకుడు, తత్త్వవేత్త కూడా. అన్ని మత గ్రంథాలను అధ్యయనం చేశారు.

ఇంగ్లిష్, ఫ్రెంచ్, జర్మన్, హిందీ, గుజరాతీ, ఉర్దు, మరాఠీ భాషలు వచ్చు. సొంత లైబ్రరీ నిర్మించాలన్న ఉద్దేశంతో దాదాపు 4వేల పుస్తకాలు సేకరించారు. ఉర్దూ కవిత్వమంటే ఆయనకు ఎంతో ఇష్టం.

ఇతర ఆర్టిస్టుల చెక్కశిల్పాలు, విగ్రహాలు, పురాతన వస్తువులు, పాత అరుదైన పాత్రలు, బొమ్మలు, పాత ఫర్నీచర్, నాణేలను ఆయన సేకరించారు.

అనేక రకాల సంగీతానికి సంబంధించిన క్యాసెట్లు, గ్రామ్‌ఫోన్ రికార్డులు సేకరించడం కెకీకి ఒక హాబీ. హిందీ, మరాఠీ, గుజరాతీ, రాజస్థానీ, అలాగే పిల్లల పాటలకు సంబంధించి ఆయన దగ్గర పెద్ద కలెక్షన్ ఉంది.

కెకీ మూస్

ఫొటో సోర్స్, ADV KRANTI PATANAKAR

1912 అక్టోబర్ 2న ముంబయిలోని మలబార్ హిల్‌లో పిరోజా, మానెక్జీ ఫ్రాంజీ మూస్ అనే పార్సీ దంపతులకు కెకీ జన్మించారు.

కెకీ పూర్తి పేరు కైకుసారో మానెక్జీ మూస్. వాళ్ల అమ్మ ఆయన్ను కెకీ అని పిలిచేవారు. ఆ తర్వాత ఆ పేరే ఆయన ఐడెంటిటీగా మారింది. చాలిస్‌గావ్ స్టేషన్‌కు దగ్గర్లో రాతితో నిర్మించిన ఒక బంగ్లాలో ఆయన నివసించారు.

ముంబయిలోని విల్సన్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక, ఉన్నత చదువుల కోసం ఇంగ్లండ్ వెళ్లారు.

కానీ, తన సోడా వాటర్ ఫ్యాక్టరీ, లిక్కర్ షాపు బాధ్యతలను కెకీయే చూసుకోవాలని మానెక్జీ భావించారు. 1934-35 మధ్యలో మానెక్జీ చనిపోయిన తర్వాత, షాపు నిర్వహణ బాధ్యతలను కెకీ తల్లి పిరోజా తీసుకున్నారు.

కొడుకు ఇంగ్లండ్ వెళ్లి ఉన్నత చదువులు చదివేందుకు ఒప్పుకున్నారు. 1935లో లండన్‌లోని బెన్నెట్ కాలేజ్ ఆఫ్ షెఫీల్డ్‌లో చేరారు. నాలుగేళ్ల కమర్షియల్ ఆర్ట్‌ కోర్సులో డిప్లొమా పూర్తి చేశారు. ఈ కోర్సులో ఫోటోగ్రఫీ కూడా ఒక సబ్జెట్. అది కూడా చదువుకున్నారు కెకీ. ఆ తర్వాత ఆర్ట్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్‌కు చెందిన రాయల్ సొసైటీ‌లో గౌరవ సభ్యత్వం పొందారు.

అమెరికా, జపాన్, రష్యా, స్విట్జర్లాండ్‌లను సందర్శించారు. అక్కడ చాలా ఫోటోగ్రఫీ ప్రదర్శనలను చూశారు. చాలామంది కళాకారులను కలిశారు. 1938లో భారత్‌కు తిరిగి వచ్చారు.

తర్వాత ముంబయి నుంచి నేరుగా చాలిస్‌గావ్‌కు వెళ్లారు. సుమారు 50 ఏళ్ల పాటు ఆ బంగ్లాలోనే ఉన్నారు.

కళకే తనను తాను అంకితం చేసుకుని, తన ప్రేమికురాలి కోసం జీవితమంతా వేచిచూసిన గొప్ప కళాకారుడిగా కెకీ మూస్ మిగిలిపోయారు. అదే బంగ్లాలో 1989 డిసెంబర్ 31న ఉదయం 11 గంటలకు కన్నుమూశారు.

కెకీ జీవితంపైనా, ఆయన ఫోటోగ్రఫీ పైనా మహారాష్ట్ర రాష్ట్ర సాహిత్య, సంస్కృతీ మండల్ 1983లో ‘కెకీ మూస్: లైఫ్ అండ్ స్టిల్ లైఫ్’ అనే పేరుతో ఒక పుస్తకాన్ని ప్రచురించింది.

కెకీ స్వయంగా రాసిన ‘వెన్ ఐ షెడ్ మై టియర్స్’ అనే ఆత్మకథ ఇంకా ప్రచురితం కావాల్సి ఉందని కమలాకర్ సామంత్ బీబీసీకి చెప్పారు.

కెకీ సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది డిసెంబర్ 31న కళామహర్షి కెకీ మూస్ ఆర్ట్ గ్యాలరీ పరిసరాల్లో ఒక కార్యక్రమాన్ని కెకీ మూస్ ఫౌండేషన్ నిర్వహిస్తుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS