SOURCE :- BBC NEWS

బంగ్లాదేశ్ పౌరుడు

ఫొటో సోర్స్, HYD-CWC

బంగ్లాదేశ్ నుంచి సికింద్రాబాద్‌కు పారిపోయి వచ్చిన మైనర్ బాలుడిని పోలీసులు తిరిగి స్వదేశానికి పంపించేస్తున్నారు.

గత సంవత్సరం అతను భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించాడు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో బాలుడిని గమనించిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) పోలీసులు, అదుపులోకి తీసుకున్నారు.

ఏడాది తర్వాత ఇప్పడీ బాలుడిని అధికారులు బంగ్లాదేశ్‌లోని తల్లిదండ్రులకు అప్పగిస్తున్నారు

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

అసలేం జరిగింది?

కోల్‌కతా నుంచి ఈ పదహారేళ్ల బాలుడు 2024 మే 5న సికింద్రాబాద్‌కు రైలులో వచ్చాడు. స్టేషన్లో తిరుగుతున్న అతడిని ఆర్పీఎఫ్ సిబ్బంది గుర్తించింది. విచారణలో బాలుడు వివరాలు సరిగ్గా చెప్పలేదు. అతను మైనర్ కావడంతో చైల్డ్ ప్రొటెక్షన్ సెల్ సిబ్బందికి అప్పగించారు. అనంతరం సైదాబాద్‌లోని జువైనల్ వెల్ఫేర్ హోంకు తరలించారు.

”హోంకు తరలించాక బాలుడి వివరాలు తెలుసుకున్నాం. బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చానని చెప్పాడు” అని హైదరాబాద్ జిల్లా సంక్షేమ అధికారి అక్కేశ్వరరావు బీబీసీతో చెప్పారు.

అతనిది బంగ్లాదేశ్‌లోని దోహజారి ప్రాంతంలోని చోటేగావ్ గ్రామమని, పనికి వెళ్లాలని తల్లి కొట్టడంతో పారిపోయి బంగ్లాదేశ్ సరిహద్దులకు వచ్చినట్లు బాలుడు చెప్పాడని అధికారులు తెలిపారు.

దీనిపై బాలుడితో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించినా… మైనర్ కావడం, బంగ్లాదేశ్‌కు ప్రయాణ ఏర్పాట్లలో ఉండటంతో అధికారులు అనుమతించలేదు.

బాలుడు ఎందుకు ఇంటి నుంచి వచ్చాడనే విషయాన్ని బీబీసీ స్వతంత్రంగా నిర్ధరించలేదు.

”బంగ్లాదేశ్ సరిహద్దు నుంచి భారత్‌లోకి ఎలా ప్రవేశించాడనే విషయాన్ని బాలుడు సరిగ్గా చెప్పలేదు” అని అక్కేశ్వరరావు వివరించారు.

భారత్‌లోకి ప్రవేశించాక కోల్‌కతాకు చేరుకుని, అక్కడి నుంచి కనిపించిన రైలు ఎక్కి సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకున్నట్లు బాలుడు చెప్పిన వివరాల ద్వారా తెలిసిందని హైదరాబాద్ బాల రక్షా భవన్ కోఆర్డినేటర్ సుమలత బీబీసీతో చెప్పారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్

ఫొటో సోర్స్, HYD-CWC

బంగ్లాదేశ్ నుంచి టెంపరరీ ట్రావెల్ పర్మిట్

బాలుడి వివరాలను చెన్నైలోని బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్ అధికారులకు హైదరాబాద్ చైల్డ్ వెల్ఫేర్ అధికారులు తెలియజేశారు.

ఆ తర్వాత, 2024 డిసెంబరులో చెన్నైలోని బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్, బంగ్లాదేశ్ అధికారులు హైదరాబాద్ వచ్చి, అతని వివరాలు సేకరించారు.

”ఆ బాలుడు బంగ్లాదేశీయుడా లేదా రోహింజ్యానా అనేది నిర్ధరించుకునేందుకు అధికారులు వచ్చారు” అని సుమలత చెప్పారు.

బంగ్లాదేశ్‌లో బాలుడి స్వగ్రామంగా చెబుతున్న ఊరి నుంచి హైకమిషన్ అధికారులు వివరాలు తెలుసుకొని, నిర్ధరించుకున్నారని ఆమె చెప్పారు.

అనంతరం, 2025 మార్చిలో బంగ్లాదేశ్ హైకమిషన్ బాలుడి కోసం ‘టెంపరరీ ట్రావెల్ పర్మిట్‌’ను పంపించింది.

”భారత్‌లోకి వచ్చేముందు అతనికి ట్రావెల్ పర్మిట్ గానీ, వీసాగానీ లేవు. అందుకే, బంగ్లాదేశ్ నుంచి అధికారులు అతని కోసం ట్రావెల్ పర్మిట్‌ను పంపించారు” అని సుమలత బీబీసీతో చెప్పారు.

ఎలా పంపిస్తున్నారు?

హైదరాబాద్ జిల్లా సంక్షేమ శాఖ అధికారులు బాలుడి వివరాలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్‌కు తెలియజేశారు. దీంతో, మూడు నెలల్లో (జూన్ 21లోగా) బాలుడిని బంగ్లాదేశ్‌కు పంపించాలని మేజిస్ట్రేట్‌ ఆదేశించారు.

”హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశాలతో బాలుడి వివరాలను ఫారిన్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్ఆర్ఆర్వో)కు అందించాం. అతనికి భారత్‌లో ఏదైనా నేర చరిత్ర ఉందా?అనే విషయంపై విచారణ జరిగింది. అలాంటిదేమీ లేదని నిర్ధరించుకున్నాక, ఎఫ్ఆర్ఆర్వో నుంచి ఎగ్జిట్ పర్మిట్ లభించింది” అని అక్కేశ్వరరావు బీబీసీకి చెప్పారు.

ఆ తర్వాత చెన్నైలోని బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషనర్‌కు, కోల్‌కతాలోని స్పెషల్ బ్రాంచ్‌కు హైదరాబాద్ సంక్షేమ శాఖ అధికారులు సమాచారం ఇచ్చారు. అన్ని చోట్ల నుంచి అనుమతులు రావడంతో మే 13న బాలుడిని కోల్‌కతా తీసుకెళ్లారు అధికారులు.

”కోల్‌కతా చేరుకున్నాక, పశ్చిమ బెంగాల్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, పోలీసుల సాయంతో భారత సరిహద్దు ప్రాంతమైన హరిద్వార్‌పూర్‌కు తీసుకెళ్తారు. అక్కడ బీఎస్ఎఫ్ (బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్) సాయంతో బాలుడిని బంగ్లాదేశ్ అధికారులకు అప్పగిస్తారు. వారు తల్లిదండ్రులకు ఆ బాలుడిని అప్పగిస్తారు” అని సుమలత చెప్పారు.

గతంలో నేపాల్ నుంచి వచ్చిన ఓ బాలుడిని ఇదే తరహాలో స్వదేశానికి పంపించామని సుమలత వివరించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)