SOURCE :- BBC NEWS

బహావల్‌పుర్

ఫొటో సోర్స్, Getty Images

పాకిస్తాన్‌పై జరిపిన దాడుల్లో ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకున్నామని భారత్ తెలిపింది. భారత్ లక్ష్యంగా చేసుకున్న ప్రాంతాల్లో బహావల్‌పుర్ ఒకటి.

బహావల్‌పుర్‌లోని మర్కజ్ సుబ్హాన్ అల్లా భవనం జైషే మొహమ్మద్ ప్రధాన కార్యాలయమని దాడుల వివరాలను తెలియజేస్తూ భారత ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషి వ్యాఖ్యానించారు.

”నియామకాలు, శిక్షణ, సైద్ధాంతికపరమైన సన్నద్ధతకు అది కేంద్రంగా ఉంది. కీలక ఉగ్రవాదులు ఈ ప్రాంతానికి వచ్చేవారు” అని ఆమె అన్నారు.

ఈ దాడుల్లో బహావల్‌పుర్‌లోని మసూద్ అజర్‌ రహస్య స్థావరాన్ని కూడా భారత్ లక్ష్యంగా చేసుకున్నట్లు ఆర్మీ తెలిపింది.

పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్సులోని ఉగ్రవాదుల రహస్య స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకున్నామని భారత్ ప్రకటించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

బహావల్‌పుర్, మురీద్కేతో పాటు సియాల్ కోట్‌కు దగ్గరలో ఉన్న రెండు శిబిరాలపై కూడా దాడి చేశామని భారత్ వెల్లడించింది.

”పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పంజాబీ. ప్రధానమంత్రి పంజాబీ, ఉన్నతాధికారులందరూ పంజాబీలు. ఇలాంటి పరిస్థితుల్లో పంజాబ్ మీద భారత్ దాడులు చేయడం పాకిస్తాన్‌కు సాధారణమైన విషయం కాదు” అని రక్షణరంగ నిపుణులు రాహుల్ బేదీ చెప్పారు.

నగరంలోని విక్టోరియా ఆస్పత్రి

ఫొటో సోర్స్, Getty Images

‘భారత్ దాడులు ఆశ్చర్యం కలిగించలేదు’

భారత్ దాడులలో సుబ్హాన్ అల్లా మసీదు భారీగా ధ్వంసమయినట్టు వీడియోల్లో తెలుస్తోంది.

భారత్ లక్ష్యంగా చేసుకున్న జాబితాలో బహావల్‌పుర్ కీలక ప్రాంతమని భారత రక్షణరంగ నిపుణులు అజయ్ శుక్లా అభిప్రాయపడ్డారు.

”దక్షిణ పంజాబ్‌లో బహావల్‌పుర్ కీలక ప్రాంతం. పంజాబీల వారసత్వాన్ని ప్రతిబింబించే పట్టణం మాత్రమే కాదు. జైషే మొహమ్మద్‌కు బాగా పట్టున్న ప్రాంతం. సియాల్ కోట్, బహావల్‌పుర్‌లు పాకిస్తాన్ ప్రధాన భూభాగంలో ఉన్నాయి. ఆ రెండూ పాకిస్తాన్‌లో ముఖ్యమైన పట్టణాలు. బహావల్‌పుర్‌పై భారత్ చేసిన దాడిని పాకిస్తాన్ ప్రధాన భూభాగంపై దాడిగా చూడొచ్చు” అని అజయ్ శుక్లా విశ్లేషించారు.

బహావల్‌పుర్‌పై దాడి ఆశ్చర్యం కలిగించలేదన్నారు.

పాకిస్తానీ సైనికుడు

ఫొటో సోర్స్, Getty Images

”ఈ దాడి ఆశ్చర్యం కలిగించలేదు. కానీ, అదే సమయంలో సాధారణమైనది కూడా కాదు. భారత ఆర్మీ లక్ష్యంగా చేసుకున్న ప్రాంతాల జాబితాలో అనేక ఉగ్రవాద రహస్య స్థావరాలున్నాయి. బహావల్‌పుర్ వాటిలో ఒకటి. పాకిస్తాన్‌లో ఉగ్రవాద మౌలిక స్థావరాలకు వీలయినంత ఎక్కువ నష్టం కలిగించేలా ఉండే ప్రాంతాలను భారత్ ఎంచుకుంది” అని అజయ్ శుక్లా తెలిపారు.

అయితే, పాకిస్తాన్ రక్షణ రంగ నిపుణులు మాత్రం పాకిస్తాన్ ఆర్మీకి బహావల్‌పుర్ అంత ప్రాధాన్యతా ప్రాంతం కాదని అంటున్నారు.

”బహావల్‌పుర్‌లో పాకిస్తాన్ రక్షణ వ్యవస్థ అంత బలంగా కూడా ఏమీ లేదు. బలగాల మోహరింపు, ఇతర రక్షణ రంగ విషయాలకు సంబంధించి లాహోర్, కరాచీకి ఇచ్చినంత ప్రాధాన్యత బహావల్‌పుర్‌కు పాకిస్తాన్ ఇవ్వదు. బహావల్‌పుర్‌పై దాడి మసూద్ అజర్‌ను గుర్తుకు తెస్తుంది. బహావల్‌పుర్ చుట్టూ ఎడారి ఉంటుంది. పాకిస్తాన్ ఆర్మీ అక్కడ యుద్ధ సన్నాహకాలు చేస్తుంటుంది. ఇంతకుమించి ప్రత్యేక ప్రాధాన్యత లేదు” అని పాకిస్తాన్ ఆర్మీ రిటైర్డ్ బ్రిగేడియర్ మహమూద్ షా బీబీసీతో చెప్పారు.

మసూద్ అజర్‌

ఫొటో సోర్స్, Getty Images

తన సరిహద్దుల నుంచే ఆయా ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న భారత్

తమ గగనతలం పరిధినుంచే దాడులు చేశామని భారత్ చెబుతోంది. భారత విమానాలు ఐదింటిని కూల్చివేశామని పాకిస్తాన్ చెబుతోంది. దీనిపై భారత్ స్పందించలేదు. పాకిస్తాన్ చెబుతున్నవాటిని బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించుకోలేదు.

తన భూభాగం నుంచే బహావల్‌పుర్ వంటి లక్ష్యాలపై భారత్ కచ్చితమైన దాడులు చేయగలదా?

”ప్రస్తుతం భారత్ దగ్గర అధునాతన క్షిపణులు, బాంబులు ఉన్నాయి. వాటి ద్వారా తన సరిహద్దుల నుంచే బహావల్‌పుర్ వంటి లక్ష్యాలపై భారత్ కచ్చితమైన దాడులు చేయగలదు” అని అజయ్ శుక్లా చెప్పారు.

బహావల్‌పుర్‌కు అంత ప్రాధాన్యత లేదని పాకిస్తాన్ రక్షణ రంగ నిపుణులు చెబుతోంటే భారత నిపుణులు మాత్రం ఇది కీలక ప్రాంతమని అంటున్నారు.

”బహావల్‌పుర్‌లో ఉద్రిక్తత ఎలా పెరుగుతుందో చూడాలి. ఇప్పుడు బంతి పాకిస్తాన్ ఆర్మీ కోర్టులో ఉంది. తనకు సముచితం అనిపించినదాన్ని పాకిస్తాన్ ఆర్మీ చేస్తుంది. తర్వాత భారత్ ప్రతీకారం తీర్చుకుంటుంది. ఇలాంటి చర్యలు పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తాయి. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఉద్రిక్తతలను పెంచే రిస్క్ పాకిస్తాన్ తీసుకుంటుందా అనేదే ప్రశ్న” అని అజయ్ శుక్లా అభిప్రాయపడ్డారు.

పాకిస్తాన్ ఆర్మీ

ఫొటో సోర్స్, Getty Images

బహావల్‌పుర్ దాడి ఉద్రిక్తతలను మరింత పెంచుతుందా?

”పాకిస్తాన్ దేన్ని లక్ష్యంగా చేసుకుని ప్రతిస్పందిస్తుందో తెలియాలి. భారత్‌లో ఉగ్రవాద శిబిరాలు లేవు. ప్రజలపై లేదా వైమానిక స్థావరాలపై దాడులు అనే రెండు ఆప్షన్లు మిగిలున్నాయి. సాధారణ ప్రజలపై దాడులు చేయకపోవచ్చు. పంజాబ్‌లోని అంబాలా ఎయిర్‌ఫోర్స్‌ స్థావరాన్ని పాకిస్తాన్ లక్ష్యంగా చేసుకునే అవకాశముంది. దీనివల్ల పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారొచ్చు.

పాకిస్తాన్‌పై దాడుల ద్వారా ఉగ్రవాద వ్యతిరేక దాడులు పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న కశ్మీర్‌కు మాత్రమే పరిమితం కాదన్న సందేశాన్ని భారత్ ఇచ్చింది.

”భారత్, పాకిస్తాన్ రెండూ అణ్వాయుధ దేశాలు. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ప్రపంచానికి ప్రమాదకరం. అందుకే రెండు దేశాలూ యుద్ధానికి మొగ్గుచూపవు. దూరం నుంచే క్షిపణులతో దాడి చేయడం గురించి చర్చ జరుగుతోంది. ఉపరితలం నుంచి ఉపరితలానికి క్షిపణులతో దాడులు జరిగితే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుంది. రెండు దేశాల దగ్గర అణ్వాయుధాలను ప్రయోగించగల క్షిపణులు ఉన్నాయి” అని బ్రిగేడియర్ మహమూద్ షా అన్నారు.

భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరిగే అవకాశాన్ని తోసిపుచ్చలేమని అజయ్ శుక్లా అన్నారు.

”పాకిస్తాన్ సైన్యం ప్రతిస్పందన బట్టి పరిస్థితి ఉంటుంది. భారత్ గగనతల రక్షణ, రాడార్, ఇతర రక్షణ వ్యవస్థలు పూర్తి సన్నద్ధంగా ఉన్నాయని పాకిస్తాన్ ఆర్మీ అర్ధం చేసుకుంది. భారత్ సన్నద్ధతతో ఉన్నప్పుడు దాడి చేయడం పాకిస్తాన్‌కు నష్టం కలిగించవచ్చు. పాకిస్తాన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేదే ఇప్పుడు ప్రశ్న” అని అజయ్ శుక్లా అన్నారు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

బహావల్‌పుర్ ఎందుకు కీలకం?

పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్సులో సట్లెజ్ నదికి ఆగ్నేయంలో బహావల్‌పుర్ ఉంది. పాకిస్తాన్‌లో ఇది 13వ పెద్ద నగరం.

పాకిస్తాన్‌లోని పెద్ద జిల్లాల్లో బహావల్‌పుర్ ఒకటి. సట్లెజ్ నది దగ్గర సారవంతమైన మైదానాలున్నాయి. చోలిస్తాన్ ఎడారి కూడా ఇక్కడ ఉంది.

ఈ ఎడారి నుంచి భారత్‌లోని థార్ ఎడారికి చేరుకోవచ్చు. జిల్లాలో మూడింట రెండొంతులు ఎడారి ప్రాంతమే.

భారత్, పాకిస్తాన్ విభజనకు ముందు బహావల్‌పుర్ రాష్ట్రానికి ఇది ప్రధాన ప్రాంతం.

1947లో విభజన జరిగినప్పుడు పాకిస్తాన్‌లో చేరిన తొలి రాజ సంస్థానం బహావల్‌పుర్. స్వాతంత్య్రం వచ్చిన వెంటనే పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం ఎదుర్కొన్నప్పుడు బహావల్‌పుర్ నవాబ్ భారీగా ఆర్థిక సాయం అందించారు.

మసూద్ అజర్‌కు బాగా పట్టున్న ప్రాంతంగా కూడా బహావల్‌పుర్‌ను భావిస్తారు. జైషే మొహమ్మద్ ప్రధాన కార్యాలయం మర్కజ్ సుబ్హాన్ అల్లా మసీదని భారత ప్రభుత్వం చెబుతోంది.

పాకిస్తాన్ ఆర్మీ 31వ కోర్ ప్రధాన కార్యాలయం కూడా బహావల్‌పుర్‌లోనే ఉంది.

దక్షిణ పంజాబ్ రక్షణ బాధ్యతలు ఈ యూనిట్ చూసుకుంటుంది. ఈ ఏడాది మార్చిలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ బహావల్‌పుర్ కంటోన్మెంట్‌ను సందర్శించారు.

పాకిస్తాన్ సింధ్ ప్రావిన్సుకు బహావల్‌పుర్‌ను గేట్ వేగా భావిస్తారు.

ఎడారి సహజ రక్షణగా ఉంది. కానీ యుద్ధం జరిగితే.. ఈ ప్రాంతం యుద్దభూమిగా మారే అవకాశం కూడా ఉంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)