SOURCE :- BBC NEWS

KCR

ఫొటో సోర్స్, @BRSparty

26 నిమిషాలు క్రితం

”కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలనే ఇంత కాలం బయటకు రాలేదు. ఇక నుంచి బయటకు వస్తాను. ప్రజల తరపున పోరాడతాను” అని ప్రకటించారు కేసీఆర్.

భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్ళు అయిన సందర్భంగా హనుమకొండ దగ్గర నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

రాష్ట్రం నలుమూలల నుంచీ వచ్చిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సభలో పాల్గొన్నారు. సభ ప్రారంభంలో కశ్మీర్ బాధితులకు నివాళులు అర్పించారు.

కేసీఆర్ తన ప్రసంగంలో కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇస్తానన్న హామీలు, చెప్పిన గ్యారెంటీల గురించి ఒక్కొక్కటిగా ప్రశ్నలు వేశారు. అన్నిట్లో కాంగ్రెస్ ఫెయిల్ అయిందంటూ ఘాటుగా విమర్శించారు.

అయితే, కేసీఆర్, ఆయన పార్టీ తమ లోపాలను సరిదిద్దుకోకుండా ప్రభుత్వంపై పసలేని ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

కమీషన్లు తీసుకుంటున్నారు-కేసీఆర్

కాంగ్రెస్ పార్టీ నాయకులు కమీషన్లు తీసుకుంటున్నారంటూ ఆరోపించారు కేసీఆర్.

‘‘స్వయంగా ఆర్థిక మంత్రి చాంబర్ ముందు కాంట్రాక్టర్లు క్యూ కట్టి నిరసన తెలిపారు. 20-30 శాతం కమీషన్లు తీసుకుంటున్నారని కాంట్రాక్టర్లే అంటున్నారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అన్నిరకాలుగా నష్టపోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు భూముల ధరలు ఎక్కువ ఉండేవి. ఇప్పుడు భూమి అమ్ముదామంటే కొనేవాడు లేడు. కల్లాల్లో వడ్లకు 500 బోనస్ ఇస్తామన్నారు. కానీ వడ్లు కొనేవాడు లేడు. కరెంటు రెప్పపాటు కూడా పోకుండా ఇచ్చాం. ఇప్పుడు కరెంట్ సమస్యలు మళ్లీ వచ్చాయి. మొత్తంగా రాష్ట్రాన్ని కాంగ్రెస్ వెనక్కు తీసుకెళ్లింది. అప్పుడైనా, ఇప్పుడైనా ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీయే పెద్ద శత్రువు” అన్నారు కేసీఆర్.

BRS

ఫొటో సోర్స్, @BRSparty

నా కళ్ల ముందే తెలంగాణ ఇలా అయిపోతుంటే ఏడుపు వస్తోంది-కేసీఆర్

”నా కళ్ల ముందే తెలంగాణ ఇలా అయిపోతుంటే ఏడుపు వస్తోంది. బస్సుల్లో మహిళలు జుట్లు పట్టుకుని కొట్టుకునేలా చేశారు. మహిళలే ఫ్రీ బస్సు వద్దు అంటున్నారు.

పింఛన్లు పెంచుతామని పెంచలేదు. పోలీసులకు చెబుతున్నాను. మీ డైరీల్లో రాసుకోండి. మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వమే. దాన్ని ఆపడం ఎవరి తరమూ కాదు. మా వారిపై మీరు కేసులు ఎందుకు పెడుతున్నారు? కార్యకర్తలపై కేసులు పెడితే మా లీగల్ సెల్ అందుబాటులో ఉంటుంది” అని కేసీఆర్ అన్నారు.

తన ప్రసంగంలో భాగంగా తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్నీ, పార్టీ ప్రారంభోత్సవ సందర్భాన్నీ, పార్టీ ప్రస్థానం, తెలంగాణ ఏర్పాటు ఘటనలను ప్రస్తావించారు కేసీఆర్.

బీజేపీ మీద కూడా విమర్శలు చేసిన కేసీఆర్, పదకొండేళ్ల బీజేపీ పాలనలో తెలంగాణకు పదకొండు రూపాయలు కూడా ఇవ్వలేదని విమర్శించారు.

‘‘కగార్ పేరుతో ఛత్తీస్‌గఢ్‌లో ఊచకోత కోస్తున్నారు. కేంద్రాన్ని కోరుతున్నా, కగార్ నిలిపివేయండి. మీరు అంగీకరిస్తే తీర్మానంగా భావించి, దిల్లీకి ఉత్తరం తీర్మానంగా పంపుతాను’’ అని సభలో కేసీఆర్ ప్రకటించారు.

సైన్యం ఉంది కదా అని చంపకూడదనీ, ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్లాలని కేసీఆర్ అన్నారు.

అద్దంకి దయాకర్

ఫొటో సోర్స్, Screengrab

ఉసూరుమనించిన కేసీఆర్ స్పీచ్: కాంగ్రెస్ పార్టీ

అయితే కేసీఆర్ ప్రసంగాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పు పట్టింది.

‘‘కేసీఆర్ స్పీచ్ ఉసూరుమనిపించింది. రాష్ట్రాన్ని ఆర్థికంగా అధోగతి పట్టించారు. దాన్ని మేం సరిచేస్తున్నాం. ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి తెలంగాణను ఎలా దోచుకున్నారో ప్రజలకు అర్థమయింది. అసలు మీరు ఉద్యోగాల నోటిఫికేషన్లు వేశారా?

మీరు పథకాల పేర్లు చెప్పి అయినయా, కాలేదా అంటే, అక్కడున్నది మీ జనమే కాబట్టి కాలేదంటారు. కానీ కాంగ్రెస్ అమలు చేసిన పథకాల సమాచారం మీ దగ్గర లేదనుకుంటా. మీదంతా స్వయం డబ్బా పరనింద. నీ స్పీచ్ కోసం ప్రజలను హింసించారు.

మీ పాతచింతకాయ స్పీచులు విని తెలంగాణ ప్రజలకు బోర్ కొట్టింది. మీ పార్టీని బతికించుకోవడానికి బీజేపీని ఏదో తిట్టాలి కాబట్టి తిట్టినట్టు చేశారు కానీ, బీజేపీ, మీరూ ఒకటని తేలిపోయింది” అని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)