SOURCE :- BBC NEWS

బీజేపీ, వాజ్‌పేయి, అద్వానీ, నరేంద్రమోదీ, అమిత్ షా

ఫొటో సోర్స్, Getty Images

1980లో ఇందిరాగాంధీ కేంద్రంలో తిరిగి అధికారంలోకి వచ్చారు. అంతకుముందు జనతా ప్రభుత్వంలో ఉప ప్రధానమంత్రిగా పనిచేసిన జగ్జీవన్ రామ్ ఫిబ్రవరి 28న ద్వంద్వ సభ్యత్వ అంశాన్ని వదులుకోనని, తుది నిర్ణయం తీసుకునే వరకు అలా కొనసాగుతానని ప్రకటించారు.

ద్వంద్వ సభ్యత్వం అంటే జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ రెండింటిలోనూ ఒకేసారి సభ్యుడిగా ఉండటం. చాలామంది సీనియర్ నాయకులు దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జనసంఘ్ సహా పలు పార్టీలు కలిస్తే ఏర్పడినదే ఈ జనతా పార్టీ.

అయితే, జనసంఘ్ సభ్యులు ఆర్ఎస్ఎస్‌ను విడిచిపెట్టకపోతే, వారిని పార్టీ నుంచి బహిష్కరించాలని జనతా పార్టీ వర్కింగ్ కమిటీ 1980 ఏప్రిల్ 4న నిర్ణయించింది. దీనిని జనసంఘ్ సభ్యులు ముందే ఊహించారు.

ఈ ఘటన గురించి కిన్షుక్ నాగ్ ‘ది సాఫ్రాన్ టైడ్: ది రైజ్ ఆఫ్ ది బీజేపీ’ పుస్తకంలో రాశారు.

“1980 ఏప్రిల్ 5, 6 తేదీలలో జనతా పార్టీలోని జనసంఘ్ విభాగం దిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో ఒక సమావేశాన్ని నిర్వహించింది. దాదాపు 3,000 మంది సభ్యులు పాల్గొన్నారు. ఇక్కడే భారతీయ జనతా పార్టీ ఏర్పాటును ప్రకటించారు” అని పుస్తకంలో తెలిపారు.

అటల్ బిహారీ వాజ్‌పేయిని పార్టీకి అధ్యక్షుడిగా నియమించగా, ఎల్.కె. అద్వానీ, సూరజ్ భాన్, సికందర్ బఖ్త్‌లను ప్రధాన కార్యదర్శులుగా నియమించారు.

1980 ఎన్నికలలో జనతా పార్టీ 31 సీట్లను గెలుచుకోగా, అందులో 16 సీట్లు జనసంఘ్ నుంచే వచ్చాయి. అయితే, ఈ గెలిచిన 16 మంది సభ్యులు 14 మంది రాజ్యసభ సభ్యులు, ఐదుగురు మాజీ క్యాబినెట్ మంత్రులు, ఎనిమిది మంది మాజీ రాష్ట్ర మంత్రులు, ఆరుగురు మాజీ ముఖ్యమంత్రులు కొత్త పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు, వారందరూ తామే నిజమైన జనతా పార్టీ అని చెప్పుకున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
బీజేపీ, వాజ్‌పేయి, అద్వానీ, నరేంద్రమోదీ, అమిత్ షా

ఫొటో సోర్స్, Getty Images

ఎన్నికల గుర్తుగా కమలం

జనతా పార్టీలో చోటుచేసుకున్న పరిస్థితుల దృష్ట్యా పార్టీ ఎన్నికల చిహ్నమైన ‘హల్ధార్ కిసాన్’ను ఎన్నికల సంఘం తాత్కాలికంగా(ఫ్రీజ్) స్తంభింపజేసింది.

కొత్తగా ఏర్పాటైన భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి జాతీయ పార్టీ హోదాను మంజూరు చేసింది. ఆ తర్వాత ఎన్నికల సంఘం బీజేపీకి కమలం గుర్తును కేటాయించింది.

అంతకుముందు చక్రం, ఏనుగు వంటి ఎన్నికల చిహ్నాలను కేటాయించాలని బీజేపీ కోరింది, కానీ ఎన్నికల సంఘం అంగీకరించలేదు.

జనతాపార్టీ చిహ్నం ‘హల్ధార్ కిసాన్’ ఫ్రీజ్ నిర్ణయాన్ని సమీక్షించాలని మాజీ ప్రధాని, జనతా పార్టీ నేత చంద్రశేఖర్ ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించారు.

ఆరు నెలల తర్వాత ‘హల్ధార్ కిసాన్’ చిహ్నంపై ఆంక్షలను ఎత్తివేసింది కమిషన్.

బీజేపీ, వాజ్‌పేయి, అద్వానీ, నరేంద్రమోదీ, అమిత్ షా

ఫొటో సోర్స్, Getty Images

బయటి నేతలకు ప్రాధాన్యం

అయితే, ఆర్‌ఎస్‌ఎస్‌ వెలుపలి నాయకులను బీజేపీ విస్మరించలేదు. నళిన్ మెహతా పుస్తకం ‘ది న్యూ బీజేపీ’ ప్రకారం..

శాంతిభూషణ్ (కేంద్ర మాజీ మంత్రి), ప్రఖ్యాత న్యాయవాది రామ్ జెఠ్మలానీ, కె.ఎస్.హెగ్డే (సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి), సికందర్ బఖ్త్‌ (కాంగ్రెస్ మాజీ నాయకుడు)ను స్వాగతించింది. అంతేకాదు, పార్టీ రాజ్యాంగాన్ని రూపొందించిన కమిటీలోని ముగ్గురు సభ్యులలో ఇద్దరు ఆర్‌ఎస్‌ఎస్ వెలుపలివారే.

దేశ విభజన తర్వాత సింధ్ నుంచి శరణార్థిగా భారత్‌కు వచ్చారు రామ్ జెఠ్మలానీ. సికందర్ బఖ్త్ దిల్లీకి చెందిన ముస్లిం.

పార్టీ అధ్యక్షుడిగా అటల్ బిహారీ వాజ్‌పేయి పేరును సికందర్ ప్రతిపాదించగా, దీనికి రాజస్థాన్‌కు చెందిన భైరాన్ సింగ్ షెకావత్ మద్దతు ఇచ్చారు.

బీజేపీ, వాజ్‌పేయి, అద్వానీ, నరేంద్రమోదీ, అమిత్ షా

ఫొటో సోర్స్, Getty Images

‘గాంధీ సోషలిజం’

బీజేపీ సైద్ధాంతికంగా ‘గాంధీ సోషలిజం’ను స్వీకరించింది, కానీ ప్రారంభంలో పార్టీలోని కొన్ని వర్గాల నుంచి మద్దతు లభించలేదు.

‘ది సాఫ్రాన్ టైడ్: ది రైజ్ ఆఫ్ ది బీజేపీ’ పుస్తకం ప్రకారం..

విజయరాజే సింధియా నాయకత్వంలో చాలామంది బీజేపీ నాయకులు ‘సోషలిజం’ అనే పదం ఉపయోగించడాన్ని వ్యతిరేకించారు. ఎందుకంటే దీనికి కమ్యూనిస్టుల ముద్ర ఉండటమే.

ఇక ‘గాంధీ సోషలిజం’ను స్వీకరించడం వల్ల పార్టీ కాంగ్రెస్‌కు కాపీలా కనిపిస్తుందని, వాస్తవికతను దెబ్బతీస్తుందని కొందరు నాయకులు భావించారు.

ఆ సమయంలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ బాలా సాహెబ్ దేవరస్ ‘గాంధీ సోషలిజం’ను స్వీకరించడానికి అనుకూలంగా లేరనీ అనుకున్నారు, కానీ ఆయన కూడా అంగీకరించారు.

కిన్షుక్ నాగ్ పుస్తకం ప్రకారం..

హిందువులు కాని వారిని పార్టీలో చేర్చుకోవడం పట్ల ఆర్‌ఎస్‌ఎస్ సంతోషంగా లేదు. అయినప్పటికీ, జనసంఘ్ పాత సిద్ధాంతాలను వదిలేసి కొత్తగా ప్రారంభించాలని బీజేపీ నిర్ణయించుకుంది. బహుశా అందుకే జయప్రకాశ్ నారాయణ్‌తో పాటు శ్యామా ప్రసాద్ ముఖర్జీ, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటాలను పార్టీ వేదికపై పెట్టారు.

బీజేపీ, వాజ్‌పేయి, అద్వానీ, నరేంద్రమోదీ, అమిత్ షా

ఫొటో సోర్స్, Rupa Publications

ముంబయిలో బీజేపీ జాతీయ సమావేశం

1980 డిసెంబర్ చివరి వారంలో ముంబయిలో శివాజీ పార్క్‌లో పార్టీ బహిరంగ సభ జరిగింది, వేలమంది పార్టీ కార్యకర్తలు అందులో పాల్గొన్నారు.

లాల్ కృష్ణ అద్వానీ తన ఆత్మకథ ‘మై కంట్రీ, మై లైఫ్‌’లో అప్పటికి 25 లక్షల మంది బీజేపీలో సభ్యులుగా చేరారని, జనసంఘ్ ప్రభావం ఎక్కువున్న సమయంలో 16 లక్షల మంది వరకే ఉన్నారని తెలిపారు.

1981 జనవరి 31న ఇండియా టుడేలో సుమిత్ మిత్రా ‘బీజేపీ కన్వెన్షన్, ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్’ శీర్షికతో రాసిన కథనం ప్రకారం.. 54,632 మంది ప్రతినిధులలో 73 శాతం మంది ఐదు రాష్ట్రాల (మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బిహార్) నుంచి వచ్చారు.

ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ బాలా సాహెబ్ దేవరస్ సోదరుడు భావురావు దేవరస్ కూడా సభకు హాజరయ్యారు.

జయప్రకాశ్ నారాయణ్ సిద్ధాంతమైన ‘గాంధీ సోషలిజం’ను అంగీకరించడం తనకు కష్టమని ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు శేషాద్రి చారి అన్నారు.

ఒక ఇంటర్వ్యూలో ప్రవీణ్ తొగాడియా మాట్లాడుతూ.. “చాలామంది బీజేపీ సభ్యులు గాంధీ సోషలిజం, పార్టీ కొత్త జెండాతో ఏకీభవించలేదు. ఆ సమయంలో నేను స్వయం సేవకుడిని కాబట్టి నాకు ఇది తెలుసు. ఈ భిన్నాభిప్రాయం విస్తృతంగా ఉంది కానీ, దానిని బహిరంగంగా ప్రకటించలేదు” అని అన్నారు.

బీజేపీ, వాజ్‌పేయి, అద్వానీ, నరేంద్రమోదీ, అమిత్ షా

ఫొటో సోర్స్, Rupa Publications

విజయ రాజే సింధియా వ్యతిరేకత

అప్పటి బీజేపీ సీనియర్ నాయకురాలు విజయ రాజే సింధియా పార్టీ కొత్త సిద్ధాంతాన్ని బహిరంగంగా వ్యతిరేకించారు. గాంధీ సోషలిజం నినాదం సాధారణ బీజేపీ కార్యకర్తలను గందరగోళానికి గురి చేస్తోందంటూ పార్టీ ప్రతినిధులకు ఐదు పేజీల లేఖ రాశారు. బీజేపీని ఈ నినాదం కాంగ్రెస్ ఫోటోకాపీగా మార్చుతుందని, పార్టీ వాస్తవికతను నాశనం చేస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.

విజయరాజే రాసిన రాయల్ టు పబ్లిక్ లైఫ్‌ ప్రకారం.. ‘‘నేను ఈ నినాదాన్ని వ్యతిరేకించాను, ముంబయి సమావేశంలో ఆ నినాదాన్ని పార్టీ మార్గదర్శక సూత్రంగా అంగీకరించారు. జనతా పార్టీ నుంచి బయటకు వెళితే ‘గాంధీ సోషలిజం’పై ఆధారపడవలసిన అవసరం లేదని అప్పట్లో చాలామంది పార్టీ నాయకులు భావించారు.’’

క్రిస్టోఫర్ జాఫర్లెట్ తన పుస్తకం ‘ది హిందూ నేషనలిస్ట్ మూవ్‌మెంట్ అండ్ ఇండియన్ పాలిటిక్స్‌’ ప్రకారం..

‘‘చివరికి, ఒక మధ్యే మార్గం కనుగొన్నారు. విజయరాజే తన వాదనను ఉపసంహరించుకునేలా ఒప్పించారు. మార్క్స్ సోషలిజానికి బీజేపీ సోషలిజం పూర్తిగా వ్యతిరేకమని పార్టీ సీనియర్ నాయకులు స్పష్టంచేశారని ఆమె ఒక విలేఖరుల సమావేశంలో తెలిపారు. బీజేపీ సోషలిజం దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ సమగ్ర మానవతావాదం, సంక్షేమవాదం భావనలపై ఆధారపడి ఉందని చెప్పారు.’’

ఈ మొత్తం చర్చలో వాజ్‌పేయి జోక్యం చేసుకుని, ‘గాంధీ సోషలిజం’ సిద్ధాంతం నుంచి పార్టీ వెనక్కి తగ్గబోదని స్పష్టంచేశారు.

బీజేపీ, వాజ్‌పేయి, అద్వానీ, నరేంద్రమోదీ, అమిత్ షా

ఫొటో సోర్స్, Getty Images

‘సానుకూల లౌకికవాదం’

డిసెంబర్ 30న రాత్రి వాజ్‌పేయి తన ప్రసంగంలో డాక్టర్ అంబేద్కర్ సమానత్వ సూత్రాన్ని బీజేపీ స్వీకరిస్తుందని ప్రకటించారు. అంతేకాదు, 17వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ మహారాజు అవలంభించిన ‘సానుకూల లౌకికవాదం’ విధానం పార్టీలో ఉంటుందన్నారు.

శివాజీ ఆగ్రాలో బందీగా ఉన్న సమయంలో ఆయన సేవకుడు ముస్లిం అని వాజ్‌పేయి చెప్పారు. 1661లో ముస్లిం సాధువు యాకుత్ బాబా ఆశీర్వాదంతో శివాజీ తన కొంకణ్ స్వాధీన ప్రయత్నాలను ప్రారంభించారని వాజ్‌పేయి అన్నారు.

“జనతా పార్టీ విడిపోయి ఉండవచ్చు, కానీ జయప్రకాశ్ నారాయణ్ కలలను మేం ఎప్పటికీ చెదిరిపోనివ్వం” అని వాజ్‌పేయి అన్నారు.

‘గాంధీ సోషలిజం’ గురించి పార్టీలో సైద్ధాంతిక చీలికను సూచిస్తున్న వార్తాపత్రిక రిపోర్టులను ఆయన తోసిపుచ్చారు.

వాజ్‌పేయి తన ప్రసంగంలో “ఈ పశ్చిమ కనుమల ఒడ్డున నిలబడి చెబుతున్నదేంటంటే.. చీకటి తొలగిపోతుంది, సూర్యుడు ఉదయిస్తాడు, కమలం వికసిస్తుందని నమ్మకంగా చెప్పగలను” అన్నారు.

బీజేపీ, వాజ్‌పేయి, అద్వానీ, నరేంద్రమోదీ, అమిత్ షా

ఫొటో సోర్స్, Getty Images

బీజేపీకి మొహమ్మద్ కరీం మద్దతు

సభకు ముఖ్య అతిథిగా మొహమ్మద్ కరీం చాగ్లా పాల్గొన్నారు. ఆయన నెహ్రూ, ఇందిరా మంత్రివర్గంలో పనిచేశారు.

విభజనకు ముందు చాగ్లా మొహమ్మద్ అలీ జిన్నాకు సహాయకుడిగా కూడా పనిచేశారు. చాగ్లాను అటల్ బిహారీ వాజ్‌పేయి స్వాగతించారు, ఆయన లౌకికవాదానికి చిహ్నం అని అన్నారు. వాజ్‌పేయి భవిష్యత్ ప్రధానమంత్రి అని చాగ్లా అభిప్రాయపడ్డారు.

మొహమ్మద్ కరీం తన ఆత్మకథ ‘రోజెస్‌ ఇన్ డిసెంబర్’ లో.. “ఆ సమయంలో రాజకీయాలు, చట్టం రెండింటిలోనూ జిన్నా నాకు ఆదర్శంగా నిలిచారు. ఆయన జాతీయవాదిగా ఉన్నంత కాలం నేను మద్దతు ఇచ్చాను. కానీ ఆయన మతతత్వంలోకి మారి రెండు దేశాల సిద్ధాంతాన్ని సమర్థించడంతో మా మార్గాలు వేరయ్యాయి” అని తెలిపారు.

బీజేపీ, వాజ్‌పేయి, అద్వానీ, నరేంద్రమోదీ, అమిత్ షా

ఫొటో సోర్స్, Getty Images

సమావేశానికి జిన్నా మనవడి నిధులు

మొత్తం కార్యక్రమానికి రూ. 20 లక్షలు ఖర్చయ్యాయి, ఆ సమయంలో ఇది పెద్ద మొత్తం.

వినయ్ సీతాపతి పుస్తకం ‘జుగల్‌బందీ: ది బీజేపీ బిఫోర్ మోదీ’ ప్రకారం..

‘‘ఈ సమావేశానికి ప్రముఖ పారిశ్రామికవేత్త నుస్లీ వాడియా ఎక్కువ నిధులు అందించారని ఆ కార్యక్రమానికి హాజరైన ఒక సీనియర్ బీజేపీ నాయకుడు చెప్పారు. 1970ల చివరి నాటికి జిన్నా మనవడైన నుస్లీ వాడియా బీజేపీకి అతిపెద్ద ఆర్థిక మద్దతుదారులలో ఒకరిగా మారారు.’’

పార్టీ మొదటి సమావేశం జరిగిన పదహారేళ్ల తర్వాత, 1996లో బీజేపీకి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం వచ్చింది. అయితే, పూర్తి మెజారిటీ లేకపోవడంతో సఫలం కాలేకపోయింది.

కానీ, తరువాత భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. 1998లో అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలో బీజేపీ మొదటిసారిగా ప్రభుత్వం ఏర్పాటుచేసింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)