SOURCE :- BBC NEWS

మనీ క్రెడిట్ కార్డ్స్

ఫొటో సోర్స్, Getty Images

అప్పులేని జీవితాన్ని అందరూ కోరుకుంటారు. కానీ లోన్‌ లేకుండా బతకడం ఈ రోజుల్లో దాదాపు కష్టమైన పనే.

హౌసింగ్‌ లోన్‌, వెహికల్‌ లోన్, పర్సనల్‌ లోన్‌.. లేదా కనీసం క్రెడిట్‌ కార్డ్‌… ఇలా ఏదో రూపంలో అప్పు మన జీవితంతో ముడిపడే ఉంటుంది.

వ్యక్తులు మాత్రమే కాదు, రాష్ట్రాలూ దేశాలూ కూడా అప్పులు చేసే బండిని నడిపిస్తాయి. దేశాలకు పరపతి రేటింగ్‌ ఉంటే, మన లాంటి వ్యక్తులకు క్రెడిట్‌ స్కోర్‌ ఉంటుంది.

అప్పు తీసుకుంటే తీర్చగలిగే సామర్థ్యం ఉందా లేదా అనే అంశాన్ని ఈ క్రెడిట్‌ స్కోర్ సూచిస్తుంది. ఇది ఎంత మెరుగ్గా ఉంటే, అంతగా మనకు అప్పు పుడుతుంది.

కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వాళ్లు, గతంలో ఎప్పుడూ అప్పు చేయని వాళ్లకు ఎలాంటి స్కోరూ ఉండదు. ఇలాంటి వాళ్లకు లోన్లు రావడం అంత ఈజీ కాదు.

మరి కొత్తగా లోన్ తీసుకుందామనుకునే వాళ్లు, తమ క్రెడిట్‌ స్కోర్‌‌ను ఎలా సాధించుకోవాలి? భవిష్యత్‌లో ఏదైనా పెద్ద లోన్ (హౌసింగ్‌ లోన్‌, బిజినెస్ లోన్‌) తీసుకునే ఆలోచన ఉన్నవాళ్లు ముందునుంచే క్రెడిట్ ప్రొఫైల్‌ ఎలా నిర్మించుకోవాలి?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
క్రెడిట్ కార్డులు

ఫొటో సోర్స్, Getty Images

క్రెడిట్‌ స్కోర్ ఎందుకు?

ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌, ఎక్స్‌పీరియన్‌, ఈక్విఫాక్స్‌, క్రిఫ్‌ వంటి సంస్థలు ప్రస్తుతం భారత్‌లో క్రెడిట్‌ బ్యూరోలుగా వ్యవహరిస్తున్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అనుమతితో ఈ సంస్థలు నడుస్తాయి. ఓ వ్యక్తికి లేదా సంస్థకు లోన్‌ ఇవ్వాలో వద్దో ఈ క్రెడిట్‌ బ్యూరో సంస్థలు చెప్పవు. ఇవి కేవలం క్రెడిట్‌ స్కోర్‌ను మాత్రమే లెక్కిస్తాయి.

వివిధ ఆర్థిక సంస్థల నుంచి నివేదికలు తీసుకుని, వాటిని విశ్లేషించి ఆయా వ్యక్తుల లేదా సంస్థల ప్రొఫైల్‌ను తయారుచేస్తాయి.

చెల్లింపుల తీరు(తీసుకున్న రుణాలు ఎలా చెల్లిస్తున్నారు), అప్పు తీసుకునే తీరు (ఎంత తరచుగా రుణాలు పొందుతున్నారు) లాంటి అంశాల ఆధారంగా ఈ నివేదికలను రూపొందిస్తాయి.

అప్పులిచ్చే సంస్థలు వీటి ఆధారంగానే అప్పులు ఇవ్వాలా వద్దా, ఇస్తే రిస్క్ ఏ స్థాయిలో ఉంటుంది అనే దానిపై ఓ అంచనాకు వస్తాయి.

క్రెడిట్ స్కోర్‌ మెరుగ్గా ఉండడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. అందుకే మనం అప్పు తీసుకున్నా, తీసుకోకపోయినా మనకంటూ ఓ క్రెడిట్‌ స్కోర్‌ ఉంచుకోవడం ముఖ్యం. ఇప్పుడు కాకపోయినా, ఎప్పుడైనా అప్పు కావాల్సి వస్తే అప్పటికప్పుడు మంచి క్రెడిట్‌ స్కోర్‌ లేకపోతే ఇబ్బందులు తప్పవు.

క్రెడిట్ కార్డులు

ఫొటో సోర్స్, Getty Images

మెరుగైన క్రెడిట్‌ స్కోర్ ఉంటే..

  • – సులభంగా క్రెడిట్‌ కార్డులు లభిస్తాయి
  • – తక్కువ వడ్డీతో రుణాలు లభిస్తాయి‌
  • – బ్యాంకులు, ఆర్థిక సంస్థలు పోటీపడి మంచి ఆఫర్లతో రుణాలు ఇచ్చే వీలుంటుంది.
  • – అధిక మొత్తంలో రుణం లభించే అవకాశాలు పెరుగుతాయి‌
  • – లోన్స్‌ తీసుకునే సమయంలో ప్రాసెసింగ్‌ ఫీజ్‌ రద్దు లేదా రాయితీతో పాటు వడ్డీ రేట్లలో కూడా స్వల్ప మార్పులకు ఆస్కారం ఉంది.

రాత్రికి రాత్రి క్రెడిట్ ప్రొఫైల్ నిర్మించుకోవడం సాధ్యం కాదు. ఇదో విధానం. స్టాటిస్టిక్స్, బిగ్‌ డేటా అనలటిక్స్‌ ఆధారంగా ఈ స్కోర్‌ వస్తుంది.

మనం ఎందుకు లోన్‌ తీసుకుంటున్నాం, ఎంత తీసుకుంటున్నాం, ఎలా తీరుస్తున్నాం, మన ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, ఎంత మంది దగ్గర అప్పుల కోసం తిరుగుతున్నాం.. ఇలా అనేక అంశాల ఆధారంగా ఈ స్కోర్‌ నిర్ణయమవుతుంది.

క్రెడిట్ కార్డులతో లాభాలు

ఫొటో సోర్స్, Getty Images

1. ముందు క్రెడిట్‌ కార్డ్‌ అప్లై చేసుకోండి!

క్రెడిట్‌ హిస్టరీ లేకపోతే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపించవు. అందుకే ఏదైనా బ్యాంక్‌ చిన్న మొత్తానికి క్రెడిట్‌ కార్డ్‌ ఇస్తుందేమో చూడండి. మీరు పనిచేసే సంస్థ ఇచ్చే శాలరీ అకౌంట్‌ ఉన్న బ్యాంక్‌ను సంప్రదించండి. వాళ్లు ఇస్తారేమో ప్రయత్నించండి.

లేదంటే కొంత మొత్తాన్ని ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసి, దానిపై ఇచ్చే సెక్యూరిటీ క్రెడిట్‌ కార్డ్‌ పొందండి. దీనివల్ల బ్యాంకులకు పెద్దగా రిస్క్ ఉండదు. ఎందుకంటే ఎంత మొత్తంలో మీరు క్యాష్‌ డిపాజిట్‌ చేశారో, ఆ మొత్తానికే కార్డ్ లిమిట్‌ ఉంటుంది. ఉదాహరణకు రూ.50వేల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఉంటే, అంతే మొత్తంలో క్రెడిట్‌ కార్డ్‌ లిమిట్ లభిస్తుంది. మీరు చేసే డిపాజిట్లపై వడ్డీ కూడా వస్తుంది.

ఈ కార్డ్‌ను వాడుకుంటూ, క్రమం తప్పకుండా చెల్లింపులు చేయండి. ఈఎంఐలుగా మార్చడం, కనీస మొత్తం చెల్లించడం వంటివి అసలు చేయొద్దు. మెరుగైన వాడకం ద్వారా కొద్దికాలానికి మీ స్కోర్‌ బిల్డ్‌ అవుతుంది.

క్రెడిట్ కార్డు

ఫొటో సోర్స్, Getty Images

2. క్రెడిట్ బిల్డర్‌ రుణాలు

ఐసీఐసీఐ బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకులు ఇలాంటి రుణాలిస్తుంటాయి. క్రెడిట్‌ స్కోర్‌ మెరుగయ్యేందుకు లేదా పెరగడానికి ఇది పనికొస్తుంది.

దారుణంగా పడిపోయిన క్రెడిట్‌ హిస్టరీని, క్రెడిట్‌ స్కోర్‌ను పెంచుకునేందుకు ఇది కూడా ఓ మార్గమని గుర్తించండి. అసలు ఎలాంటి స్కోర్‌ లేని వాళ్లకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఈ క్రెడిట్‌ బిల్డర్‌ ప్రోగ్రాం కింద కస్టమర్లకు ఇన్‌స్టా ప్లాటినం క్రెడిట్‌ కార్డ్‌ ఇస్తామని ఐసీఐసీఐ బ్యాంక్‌ వెబ్‌సైట్‌ చెబుతోంది. అయితే దీనికి కొన్ని నిబంధనలున్నాయి.

అప్పటికే ఏవైనా రుణాలుంటే వాటిని చెల్లించాలి. బ్యాంక్‌ ఏదైనా వెయివ్‌ ఆఫ్‌ చేసినా ఆ మొత్తాన్ని కూడా కట్టేయాలి. ఈ క్రెడిట్‌ బిల్డర్‌ రుణాల్లో కూడా కొంత మొత్తాన్ని సేవింగ్స్ అకౌంట్లో జమ చేయాలి. ఎంత డబ్బు జమ చేస్తామో అందులో కొంత మొత్తాన్ని లోన్‌ రూపంలో ఇస్తారు. దానిపై ఇన్‌స్టా ప్లాటినం కార్డ్‌ జారీ అవుతుంది.

నెలనెలా క్రమం తప్పకుండా, నీర్ణీత సమయంలో నిర్ణీత మొత్తాన్ని కట్టేయాల్సి ఉంటుంది. ఇందులో వడ్డీ రేటు కూడా తక్కువే ఉంటుంది.

అంటే మన దగ్గరున్న డబ్బును మనమే బ్యాంకులో జమ చేసి దానిపై లోన్‌ తీసుకోవడమే ఈ క్రెడిట్ బిల్డర్‌ విధానం. మన దగ్గర డబ్బు బాగా ఉండి, క్రెడిట్ స్కోర్ లేకపోతే ఈ విధానం బాగా ఉపయోగపడుతుంది.

అప్పులు,  క్రెడిట్ స్కోర్లు

ఫొటో సోర్స్, Getty Images

షార్ట్‌ టర్మ్‌లో ఆర్థిక అవసరాలు తీర్చుకోవాలనుకున్న వాళ్లకు ఇది ఉపయోగపడదు. కేవలం క్రెడిట్‌ స్కోర్‌ బిల్డ్‌ చేసుకోవడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది.

బ్యాంక్‌లో జమ చేసే మొత్తంపై ఎలాంటి వడ్డీ లభించదు. ఎంత మొత్తమైతే బ్యాంక్‌ రుణంగా ఇస్తుందో, అంత డబ్బును లాక్‌ చేసి పెడతారు. రుణం చెల్లించే వరకూ మీ డిపాజిట్‌ నుంచి ఈ డబ్బు అన్‌లాక్‌ కాదు.

సింపుల్‌గా చెప్పాలంటే… మీరు రూ.50వేలు ఈ క్రెడిట్‌ బిల్డర్‌ ప్రోగ్రాం కింద జమ చేశారనుకుందాం. అందులో నుంచి మొత్తం రూ.50వేలూ రుణంగా పొందారు. ఇప్పుడు దీనిపై వడ్డీతో కలిపి నెలనెలా ఈఎంఐ కట్టాలి.

మీ అసలు, వడ్డీ… రెండూ అయిపోయేంత వరకూ ఈ రూ.50వేల మొత్తం రిలీజ్‌ కాదు. పూర్తిగా అప్పు చెల్లించేసిన తర్వాత మీ డబ్బు రిలీజ్‌ అవుతుంది.

టాటా క్యాపిటల్‌ వంటి సంస్థలు కూడా ఇలాంటి రుణాలను ఇస్తున్నాయి. ఈ పద్ధతిలో రుణాలు తీసుకుంటే, మెల్లిగా క్రెడిట్ స్కోర్ బిల్డ్‌ అవుతుంది. ఎందుకంటే ఈ వివరాలు కూడా బ్యాంకులు క్రెడిట్‌ బ్యూరోలకు ఇస్తాయి.

క్రెడిట్‌ స్కోర్‌ దారుణంగా పడిపోయి, ఇక ఏ బ్యాంకూ కార్డ్‌ ఇచ్చేందుకు ముందుకు రాని పక్షంలో, ఇలాంటి క్రెడిట్ బిల్డర్‌ లోన్స్‌ తీసుకుని, మళ్లీ క్రెడిట్ జర్నీ మొదలుపెట్టొచ్చు.

ఆథరైజ్డ్‌ యూజర్ – క్రెడిట్‌ కార్డ్‌ పొందాలనుకున్నప్పుడు సదరు సంస్థలు ఆదాయపు పత్రాలు, శాలరీ స్టేట్‌మెంట్లు వంటివి చెక్‌ చేస్తాయి. ఇవేవీ లేకపోయినా మన కుటుంబ సభ్యుల ద్వారా ఆథరైజ్డ్ యూజర్‌ కార్డ్‌ పొందొచ్చు.

అంటే వాళ్ల క్రెడిట్‌ స్కోర్‌ ఆధారంగా సంస్థలు మీకు క్రెడిట్‌ కార్డ్‌ జారీ చేస్తాయి. ప్రైమరీ మెంబర్‌ ష్యూరిటీపై ఈ కార్డ్‌ మీకు లభిస్తుంది. అయితే ఒకసారి కార్డు వచ్చిన తర్వాత మీ కార్యకలాపాలు,తిరిగి చెల్లింపుల ప్రభావం మీ సిబిల్‌ స్కోర్‌పైనే ఉంటుంది.

అయితే మీకు ష్యూరిటీ ఉండే వాళ్లు ఏదైనా చెల్లింపు తప్పినా, ఎగ్గొట్టినా ఆ ప్రభావం కూడా మీపై ఉంటుందని గుర్తించాలి. అందుకే జాగ్రత్తగా ఎంపిక చేసుకున్న బయటి వ్యక్తులను లేదా మన కుటుంబ సభ్యులనే ఆథరైజ్డ్‌ యూజర్‌గా సిఫార్సు చేయమని అడగండి.

ఈ కార్డ్‌ తీసుకుని వాడుతూ, అప్పులు చెల్లిస్తూ ఉంటే స్కోర్‌ కూడా బిల్డ్ అవుతూ వెళ్తుంది.

అప్పు ,  క్రెడిట్ స్కోర్

ఫొటో సోర్స్, Getty Images

3. చిన్న మొత్తంలో లోన్స్‌

ఈ రోజుల్లో ప్రైవేట్‌ ఎన్‌బీఎఫ్‌సీ (నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ)లు చిన్న చిన్న కన్స్యూమర్‌ లోన్స్‌ ఇస్తూ ఉన్నాయి. టీవీ, రిఫ్రిజిరేటర్‌, స్మార్ట్‌ ఫోన్ వంటి వాటి కోసం వీటిని తీసుకోవచ్చు. ఈ సంస్థలు కూడా కొద్దిగా రిస్క్‌ తీసుకుని మైక్రో లోన్స్‌ ఇస్తూ ఉంటాయి. క్రెడిట్‌ స్కోర్‌ ఆధారంగా కాకుండా పాన్‌, ఆధార్‌ బేస్‌ చేసుకుని లోన్‌ ఆఫర్ చేస్తూ ఉంటారు. ఇవి వచ్చినా, మెల్లిగా క్రెడిట్ స్కోర్‌ బిల్డ్‌ చేసుకునేందుకు అవకాశం దొరుకుతుంది.

4. ‘ఇప్పుడు కొనండి, తరువాత చెల్లించండి’

ఇవి కూడా కన్స్యూమర్‌ లోన్స్ లాంటివే. సంస్థలు రిటైలర్లకు చాలా చిన్న మొత్తాల్లో ఇలాంటి బీఎన్‌పీఎల్‌ లోన్లు ఇస్తూ ఉంటాయి. ఏవైనా వస్తువులు కొనేటప్పుడే ఈ రుణాలు లభిస్తాయి.

వస్తువు కొనేటప్పుడు మీరు కొంత మొత్తాన్ని చెల్లిస్తే, ఎన్‌బీఎఫ్‌సీలు మరికొంత మొత్తాన్ని రుణంగా ఇస్తాయి.

పైన చెప్పిన కన్స్యూమర్‌ లోన్స్ అయినా, ఈ బై నౌ పే లేటర్ లోన్స్ అయినా వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయని గుర్తుంచుకోండి. కేవలం మన స్కోర్‌ బిల్డప్‌ కోసమే వీటిని వినియోగించుకోవాలి కానీ అనవసరంగా కొనుగోళ్లు జరిపితే మొదటికే మోసం వస్తుంది.

మొదట్లోనే మీ స్కోర్‌ పాడైతే, దాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు నానాపాట్లూ పడాల్సి వస్తుంది.

క్రెడిట్ కార్డులు

ఫొటో సోర్స్, Getty Images

5. క్రెడిట్‌ స్కోర్ ఏ అంశాలపై ఆధారపడుతుంది?

కింద చెప్పిన ఒక్కో పాయింట్‌కు క్రెడిట్ స్కోర్‌లో కొంత భాగం ఉంటుంది. అంటే ప్రతి పాయింట్‌నూ క్రెడిట్‌ బ్యూరో సంస్థలు క్షుణ్ణంగా పరిశీలిస్తాయని గుర్తుంచుకోండి.

ఎంత రుణం తీసుకున్నారు, దేని కోసం తీసుకున్నారు, క్రెడిట్‌ కార్డ్‌పై మీకున్న పరిమితిలో ఎంతవరకూ వాడుకున్నారు, సెక్యూర్డ్‌ ఎంత, అన్‌సెక్యూర్డ్‌ ఎంత, ఎన్ని క్రెడిట్‌ కార్డులకు దరఖాస్తు చేసుకుంటున్నారు, అప్పుల కోసం ఎంతగా వెంపర్లాడుతున్నారు వంటి అంశాలన్నింటినీ బేరీజు వేసుకునే మీ స్కోర్‌ నిర్మాణమవుతుంది.

ఇందులో ప్రధాన వాటా చెల్లింపులదే. తీసుకున్న అప్పును వాయిదా తేదీలోపు చెల్లిస్తున్నారా లేదా అనేదే ప్రధాన ప్రామాణికం. మినిమం డ్యూ చెల్లించినా మీ పేమెంట్‌ హిస్టరీపై కచ్చితంగా ప్రభావం ఉంటుంది.

క్రెడిట్‌ లిమిట్‌లో గరిష్టంగా 40 శాతం మించకుండా వాడుకుంటే మంచిది. అంతకు మించి వాడితే, మీ యుటిలైజేషన్‌ పాయింట్స్‌ మెల్లిగా కరిగిపోతూ ఉంటాయి.

లోన్లు తీసుకోవడం మొదలుపెట్టి ఎంతకాలమైంది, ఎన్నేళ్ల నుంచి క్రెడిట్‌ కార్డులు వాడుతున్నారు, ఎంత పర్ఫెక్ట్‌గా తిరిగి చెల్లిస్తున్నారనేది లెంగ్త్‌ ఆఫ్ హిస్టరీ చెప్పేస్తుంది.

హౌసింగ్‌, వెహికల్‌ వంటి సెక్యూర్డ్‌ లోన్స్ శాతమెంత, క్రెడిట్‌ కార్డ్‌ వంటి అన్‌సెక్యూర్డ్‌ లోన్స్‌ పర్సంటేజ్‌ ఏ స్థాయిలో ఉందో క్రెడిట్‌ మిక్స్ చెబుతుంది.

మార్ట్‌గేజ్‌ ద్వారా పొందే హౌసింగ్‌, వెహికల్‌, గోల్డ్‌ లోన్లకు రిస్క్‌ తక్కువగా ఉంటుంది. క్రెడిట్ కార్డుల ద్వారా తీసుకునే డబ్బుకు రిస్క్‌ ఎక్కువ ఉంటుంది.

వీటితో పాటు ఎంత ఆత్రంగా కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు, పర్సనల్‌ లోన్ల కోసం ఎంతగా అర్రులు చాచి బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు అనే అంశం కూడా మీ స్కోర్‌పై ఎఫెక్ట్‌ చూపిస్తుంది. మీ క్రెడిట్ రిపోర్టును సమీక్షించాల్సిందిగా అప్పు ఇచ్చే సంస్థలు పదే పదే చేస్తూ ఉంటే, అది స్కోర్‌ను కిందికి లాగుతుంది.

క్రెడిట్ స్కోర్

ఫొటో సోర్స్, Getty Images

6. క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేసే అంశాలు

మీ క్రెడిట్ స్కోర్ అంశాలను ప్రభావితం చేసే అంశాలు ఇలా ఉంటాయి.

పేమెంట్‌ హిస్టరీ – 35శాతం

క్రెడిట్‌ యుటిలైజేషన్‌ – 30 శాతం

లెంగ్త్‌ ఆఫ్ క్రెడిట్‌ హిస్టరీ – 15 శాతం

క్రెడిట్‌ మిక్స్‌ – 10 శాతం

న్యూ క్రెడిట్‌ – 10 శాతం

క్రెడిట్ స్కోర్‌ను పైన చెప్పిన రీతిలో విభజించి ఆయా శాతాల ఆధారంగా స్కోరు నిర్ణయిస్తారు.

అందుకే మెల్లిగా క్రెడిట్ ప్రొఫైల్ నిర్మించుకోవడానికి పైన చెప్పిన అంశాల ఆధారంగా జాగ్రత్తగా వ్యవహరించాలి. అయితే ఇది రాత్రికి రాత్రి జరిగిపోయేది కాదు. రాబోయే రెండు, మూడేళ్లలో ఏదైనా హౌసింగ్‌ లోన్‌ వంటి పెద్ద రుణం పొందాల్సి వచ్చినప్పుడు ఎలాంటి స్కోరూ లేకపోతే కష్టమవుతుంది.

అందుకే ముందు నుంచే మంచి స్కోర్‌ బిల్డ్‌ చేసుకోవడానికి ప్రయత్నించండి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS