SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
25 నిమిషాలు క్రితం
”బ్రహ్మోస్ అనేది కేవలం ఒక క్షిపణి కాదు. మన ఆర్మీ బలానికి ప్రతీక. సరిహద్దును రక్షించేందుకు ఇదొక పరిష్కారం. ఇది కేవలం ఆయుధం కాదు, ఇదొక మెసేజ్” అని మే 11న లఖ్‌నవూలోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఇంటిగ్రేషన్, టెస్టింగ్ ఫెసిలిటీ ప్రారంభోత్సవం సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
ఈ టెస్టింగ్ ఫెసిలిటీ భారత శక్తిని మరింత బలోపేతం చేస్తుందని రాజ్‌నాథ్ చెప్పారు. నేడు ప్రపంచంలోనే భారత్ అత్యంత శక్తిమంతమైన దేశాల్లో ఒకటిగా ఉందని పేర్కొన్నారు.
అలాగే ఈ కార్యక్రమంలోనే, ఇటీవల భారత్, పాకిస్తాన్ ఘర్షణల సందర్భంగా బ్రహ్మోస్ వినియోగించారని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు.
పాకిస్తాన్ నౌకను లక్ష్యంగా చేసుకుని ఉపయోగించిన క్షిపణి బ్రహ్మోస్ అని, వాటిని ప్రస్తుతం లఖ్‌నవూలో తయారు చేస్తున్నట్లు చెప్పారు.
”తాజాగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో బ్రహ్మోస్ క్షిపణి బలాన్ని మీరు చూసి ఉంటారు. ఒకవేళ చూడకపోతే, పాకిస్తాన్ వారిని అడగండి” అని కూడా యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
అలాగే, పాకిస్తాన్ టెర్రరిస్ట్ క్యాంపులను, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపేందుకు బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్షిపణులను వాడినట్లు సంబంధిత వర్గాలు చెప్పాయని న్యూఇండియన్ ఎక్స్‌ప్రెస్ తన కథనంలో నివేదించింది.
అయితే, పాకిస్తాన్లో జరిపిన దాడులపై ఏ క్షిపణులను వినియోగించారో ఇప్పటి వరకు భారత ఆర్మీ అధికారికంగా ప్రకటించలేదు. కానీ బ్రహ్మోస్ మిసైల్ వినియోగంపై చర్చ మాత్రం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో అసలు బ్రహ్మోస్ క్షిపణి అంటే ఏమిటి? దాని ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది, 1

బ్రహ్మోస్ ప్రత్యేకత
ప్రపంచంలో అత్యంత వేగవంతమైన క్షిపణుల్లో బ్రహ్మోస్ ఒకటి.
ఇది భూమి నుండి తక్కువ ఎత్తులో చాలా ఎక్కువ వేగంతో ఎగురుతుంది.
అందుకే యాంటీ మిసైల్ సిస్టమ్‌తో దాన్ని అడ్డుకోవడం అంత సులభం కాదు. ఈ క్షిపణులు తక్కువ సమయంలో ఎక్కువ దూరాలకు ఆయుధాలను మోసుకెళ్లగలవు.
సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులను రాడార్ ద్వారా ట్రాకింగ్ చేయడం అంత సులభం కాదు. ఎందుకంటే అవి ఉపరితలానికి చాలా దగ్గరగా, చాలా తక్కువ ఎత్తులో ఎగురుతాయి.
బ్రహ్మోస్ క్షిపణుల్లో కూడా నాలుగు రకాలున్నాయి. వీటిలో ఉపరితలం నుండి ఉపరితలం, ఆకాశం నుండి ఉపరితలం, సముద్రం నుండి ఉపరితలం, నీటి అడుగు నుంచి ఉపరితలం మీదకు ప్రయోగించగలవి.
భారత్ దగ్గర రష్యా సహాయంతో తయారు చేసిన అత్యంత అధునాతన సూపర్సోనిక్ బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణులు ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఎంత వేగంతో వెళ్తాయి?
2.8 మాక్ అంటే ధ్వని వేగానికి 2.8 రెట్లు ఎక్కువ వేగంతో బ్రహ్మోస్ క్షిపణులు ప్రయాణిస్తాయి. అంటే సెకనుకు సుమారు 900 మీటర్లు ప్రయాణిస్తాయి. ఈ క్షిపణి రేంజ్ 300 నుంచి 800 కిలోమీటర్లు. 300 కిలోగ్రాముల యుద్ధ సామగ్రిని ఇవి మోసుకెళ్తాయి.
సూపర్సోనిక్ క్షిపణులు ధ్వని వేగానికి రెండు నుంచి మూడు రెట్ల వేగంతో ప్రయాణించగలవు.
క్షిపణి లేదా విమానం ఎంత వేగంతో వెళుతుందో చెప్పడానికి దాని వేగాన్ని ధ్వని వేగంతో పోల్చి చూస్తారు.
ధ్వని వేగాన్ని ప్రామాణికంగా ‘మాక్’లో కొలుస్తారు. ఒక మాక్ అంటే గంటకు సుమారు 1,235 కిలోమీటర్లు.
భారత్, రష్యాలు సంయుక్తంగా అభివృద్ధి
భారత్‌కు చెందిన డీఆర్డీఓ, రష్యాకు చెందిన ఎన్పీఓఎంల జాయింట్ వెంచర్ బ్రహ్మోస్ ఏరోస్పేస్, బ్రహ్మోస్ క్షిపణులను అభివృద్ధి చేస్తోంది.
1990 మధ్యలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, డాక్టర్ శివథాను పిళ్లై వంటి ఆయన సహోద్యోగులు సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణుల కోసం రష్యాతో కోలాబరేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉందని భావించారు.
బ్రహ్మోస్ క్షిపణి పేరును బ్రహ్మపుత్ర, మోస్క్వా నదుల కలయికతో పెట్టినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తన కథనంలో పేర్కొంది.
బ్రహ్మోస్ క్షిపణుల తయారీ కోసం 1998లో రెండు దేశాల ప్రభుత్వాల మధ్యలో ఒప్పందం జరిగింది.
అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1999 జూలై 9న తొలి కాంట్రాక్ట్‌పై సంతకాలు చేసుకున్నారు.
బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రధాన కార్యాలయం దిల్లీలో ఉండగా.. దీని ప్రొడక్షన్ ఫ్యాక్టరీలు హైదరాబాద్, నాగ్‌పూర్, పిలని, తిరువనంతపురం, లఖ్‌నవూలలో ఉన్నాయి.
బ్రహ్మోస్ ప్రధాన కార్యాాలయం కాంప్లెక్స్‌ను అప్పట్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రారంభించారు.
2001 జూన్ 12న బ్రహ్మోస్ తొలి క్షిపణిని పరీక్షించింది భారత్.
2005 నుంచి భారత నౌకాదళానికి ఇది అందుబాటులోకి రాగా, 2007 నుంచి భారత ఆర్మీ ఈ క్షిపణిని తన సేవల్లోకి తీసుకుంది.
అన్ని వాతావరణ పరిస్థితుల్లో రాత్రింబవళ్లు ఆపరేషన్స్‌లో పాల్గొనేలా బ్రహ్మోస్‌ను అభివృద్ధి చేశారు.
అప్పటి భౌగోళిక రాజకీయ పరిస్థితులను ఉద్దేశిస్తూ.. బ్రహ్మోస్‌ను 21వ శతాబ్దపు ‘బ్రహ్మాస్త్ర’గా బ్రహ్మోస్ ఏరోస్పేస్ వ్యవస్థాపక సీఈవో, ఎండీ, డాక్టర్ ఏ.ఎస్ పిళ్లై 2023లో బ్రహ్మోస్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, Getty Images
ప్రస్తుతం లఖ్‌నవూలో ప్రారంభించిన ఈ కేంద్రంలో సూపర్ సోనిక్ బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణులను నిర్మించడం, పరీక్షించడంతో పాటు.. తేలికైన, ఫ్యూచర్ వేరియంట్లను కూడా అభివృద్ధి చేసి, తయారు చేయనుంది.
ఏడాదికి 80 నుంచి 100 బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణుల తయారీకి డిజైన్ చేయనుంది. అలాగే, 100 నుంచి 150 నెక్స్ట్ జెనరేషన్ వేరియంట్లను తయారు చేయనుంది.
”నేడు మనం చిన్న ఫిరంగుల నుంచి బ్రహ్మోస్, ఆకాశ్ క్షిపణి వ్యవస్థల వరకూ ఉన్న అతిపెద్ద క్షిపణులను కూడా చాలా దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. కేవలం మన రక్షణ ఎగుమతులను పెంచడమే కాదు, వివిధ దేశాలతో సరికొత్త భాగస్వామ్యాలను అభివృద్ధి చేసుకోవడంతో, అంతర్జాతీయ స్థాయిలో మనం మరింత బలోపేతం అవుతున్నాం.” అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
బ్రహ్మోస్ క్షిపణికి తొలి విదేశీ డీల్‌లో భాగంగా.. ఫిలిప్పీన్స్‌కు ఈ క్షిపణులను అందించింది భారత్.
బ్రహ్మోస్ విషయంలో సౌత్ ఈస్ట్ ఏషియాలో పలు ఇతర దేశాలతో కూడా చర్చలు జరిపినట్లు రిపోర్టులు వచ్చాయి.

ఫొటో సోర్స్, Getty Images
తాజాగా భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో.. భారత్ కనుక బ్రహ్మోస్ ప్రయోగిస్తే, దాన్ని అడ్డుకోవడం పాకిస్తాన్‌కు సాధ్యం కాకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణుల గురించి పాకిస్తాన్లో ప్రతిపక్ష పార్టీల ఎంపీలు పార్లమెంట్లో ఆందోళన వ్యక్తం చేశారు. తమ వద్ద ఉన్న బ్రహ్మోస్ క్షిపణుల్లో ఒకదానిని పొరపాటున పాకిస్తాన్ వైపు ప్రయోగించినట్లు భారత్ ఒకసారి ప్రకటించింది. ఈ ఘటన 2022 మార్చిలో జరిగింది.
“భారత్ వద్ద వ్యూహాత్మక, సంప్రదాయ ఆయుధాలు ఉన్నాయి. ఉదాహరణకు, అగ్ని వ్యూహత్మక క్షిపణి, బ్రహ్మోస్ సంప్రదాయ రకానికి చెందినది. వాటిని పాకిస్తాన్ వద్ద ఉన్న ఘౌరి, బాబర్ క్షిపణులతో పోల్చినప్పుడు దాడి చేసే సామర్థ్యంలో భారత క్షిపణులు ఎంతో ముందున్నాయి. భారత స్వీయ రక్షణ వ్యవస్థ కూడా ఇప్పుడు బాగా మెరుగుపడింది” అని భారత్‌లో ప్రముఖ రక్షణ రంగ విశ్లేషకుడు రాహుల్ బేదీ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)