SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
-
12 మే 2025
ఇటీవల భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఘర్షణ నేపథ్యంలో.. ‘బ్లాకౌట్’ అనే పదం బాగా వినిపించింది.
రాత్రిళ్లు డ్రోన్ దాడులు జరుగుతున్న సమయంలో పంజాబ్, రాజస్థాన్, జమ్మూకశ్మీర్ సహా సరిహద్దుల్లోని చాలా ప్రాంతాల్లో బ్లాకౌట్ విధించిన దృశ్యాలు మీడియాలో కనిపించాయి.
భారత్- పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉంటున్న యంగ్ జనరేషన్‌కు ఇది కొత్త అనుభవం. రెండు దేశాల మధ్య ఈ స్థాయి ఘర్షణను ఈ తరం ఇంత వరకూ చూడలేదు.


ఫొటో సోర్స్, Getty Images
బ్లాకౌట్ అంటే…
బ్లాకౌట్ అంటే కొంత సమయం లేదా కొన్ని గంటల పాటు లైట్లు ఆర్పివేసి.. ఆ ప్రాంతాన్ని చీకటిగా ఉంచడం.
ఈ బ్లాకౌట్ సమయంలో వీధులు, ఇళ్లలోని దీపాలు, వాహనాల లైట్లు పూర్తిగా ఆపివేస్తారు. లేదంటే గగనతలం నుంచి చూస్తే కనిపించనంతగా కాంతి తీవ్రతను తగ్గిస్తారు.
శత్రు దేశాలు దాడి చేసినప్పుడు వారికి జనావాసాలు లేదా ఇతర జన సంచార ప్రదేశాలు ఉన్నాయని తెలియకుండా ఉండేందుకు బ్లాకౌట్ పాటిస్తారు.
”బ్లాకౌట్ సమయంలో ఇళ్లలో, వాహనాల్లోనూ అత్యవసరమై దీపాలు వేసుకుంటే అవి బయటకు కనిపించకుండా పేపర్లు వంటివి కిటికీలకు అతికించి ఉంచుతారు” అని భారత ఆర్మీ రిటైర్డ్ మేజర్ పీటీ చౌదరి బీబీసీతో చెప్పారు.
కేవలం సరిహద్దులో ఉన్న గ్రామాలు, పట్టణాల్లోనే కాకుండా ఆర్మీ, వాయుసేన స్థావరాలు, క్యాంపుల వద్ద కూడా బ్లాకౌట్ పాటిస్తుంటారు. ఆకాశం నుంచి చూస్తే కింద ఉన్న జనం లేదా ప్రాంతం ఉనికి తెలియకుండా ఉండేలా జాగ్రత్తలు పాటిస్తారు.
యుద్ధం లేదా దేశాల మధ్య ఉద్రిక్తతలు, ఘర్షణల సమయంలో కొన్నిసార్లు వైమానిక దాడులు కూడా జరుగుతుంటాయి.
అలాంటి సమయంలో లైట్లు వేసి ఉంచితే, ఆ ప్రదేశంలో తమ లక్ష్యాలు ఉన్నాయని శత్రు దేశాల ఫైటర్ జెట్లు గుర్తించేందుకు వీలుంటుంది.
”ఫైటర్ జెట్లకు ఈ ప్రదేశాలు కనిపించకుండా ఉండేందుకు వీలుగా లైట్లు ఆపివేసి లేదా కాంతి తీవ్రతను బాగా తగ్గించి బ్లాకౌట్ పాటిస్తారు. ఇందుకు ముందుగానే సైరన్ మోగిస్తారు” అని వివరించారు పీటీ చౌదరి.
అయితే, ఇటీవల కాలంలో డ్రోన్లతో జీపీఎస్ లొకేషన్ ఆధారంగా లక్ష్యాన్ని చేరుకుని పేల్చివేసే సాంకేతికతను చాలా దేశాలు అందిపుచ్చుకున్నాయని ఆయన చెప్పారు.
”ప్రస్తుతం భారత్, పాక్ మధ్య జరుగుతున్న ఘర్షణల్లో ఇంకా అంత అధునాతన డ్రోన్లు ఉపయోగించినట్లు కనిపించ లేదు” అని చెప్పారాయన.

ఫొటో సోర్స్, Getty Images
బ్లాకౌట్ ఎన్ని రకాలు?
పవర్ బ్లాకౌట్ – ప్రకృతి విపత్తులు అంటే తుపానులు, భూకంపం, వరదలు సంభవించినప్పుడు కరెంటు సరఫరా నిలిపివేస్తారు.
దీనివల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నిరోధించేందుకు వీలవుతుంది.
ఇదే కాకుండా సైబర్ దాడులు, గ్రిడ్, పరికరాలు ఫెయిల్ అయినప్పుడు కూడా కరెంటు సరఫరా నిలిపివేస్తారు.
మీడియా బ్లాకౌట్ – ఇది మీడియా రంగానికి సంబంధించింది. సమాచారం చేరవేయకుండా మీడియాను ప్రభుత్వం కట్టడి చేయడం.
యుద్ధ సమయంలో సున్నిత సమాచారం బయటకు తెలియకుండా నిరోధించడం ఈ కోవలోకి వస్తుంది.
మెడికల్ బ్లాకౌట్- తాత్కాలికంగా మనిషి స్పృహ కోల్పోవడం లేదా జ్జాపకశక్తి కోల్పోవడం.
మత్తు పదార్థాలు సేవించడం లేదా బీపీ తగ్గడం, మెదడుకు ఆక్సిజన్ తగ్గడం వంటివి జరిగినప్పుడు ఇది ఏర్పడుతుందని వైద్యులు చెబుతున్నారు.
ఇవి కాకుండా ఇంటర్నెట్ బ్లాకౌట్ అనేది ఒకటుందని, దీన్ని కూడా అవసరమైనప్పుడు ప్రభుత్వం అమలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS