SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Muzafar AV
చర్మం రంగు ఆధారంగా వివక్షను ఎదుర్కోవడం గురించి కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శారదా మురళీధరన్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరిచాయి.
దీనిపై సోషల్ మీడియాలో చేసిన పోస్టును మొదట తొలగించిన ఆమె, తర్వాత తిరిగి పోస్టు చేశారు.
ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, ఒక ఉన్నతాధికారి కూడా చర్మం రంగు ఆధారంగా వివక్షను ఎదుర్కోవాల్సిరావడం.
”నా ప్రధాన కార్యదర్శి పదవి గురించి ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య విన్నాను. అది నా భర్త తెలుపంత నల్లగా ఉంది. నేను నా నలుపు రంగును అంగీకరించాలి” అని శారదా మురళీధరన్ అన్నారు.
1990 బ్యాచ్ అధికారిణి అయిన శారదా మురళీధరన్, సెప్టెంబర్ 2024లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఆమెకు ముందు, ఆమె భర్త వి. వేణు ఈ పదవిలో ఉన్నారు.
పేదరిక నిర్మూలన, మహిళా సాధికారత, జీవనోపాధి మిషన్, గ్రామ పంచాయతీ అభివృద్ధి పథకాలు, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, ఉన్నత విద్యకు సంబంధించిన ప్రాజెక్టులను అమలు చేయడంలో శారదా మురళీధరన్ పేరు తెచ్చుకున్నారు.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీకి డైరెక్టర్ జనరల్‌గా కూడా ఆమె పనిచేశారు.
”ఆమె తీవ్రమైన అభిప్రాయాలు ఎప్పుడూ వ్యక్తం చేయరు. సంచలన విషయాలు మాట్లాడరు. చాలా క్రమశిక్షణ ఉన్న వ్యక్తి. సౌమ్యంగా మాట్లాడుతారు. అలాంటి ఆమె చేసిన వ్యాఖ్యలు చాలా షాక్‌కు గురిచేశాయి” అని సీనియర్ కామెంటేటర్ ఎంజీ రాధాకృష్ణన్ బీబీసీతో అన్నారు.

శారదా మురళీధరన్ పోస్టులో ఏముందంటే…
మొదట చేసిన తన పోస్ట్‌ను తొలగించిన శారద, ఆ తర్వాత మళ్లీ రీ పోస్టు చేశారు. స్పందనలు వరదలా రావడంతో తాను ఈ పోస్టును డిలీట్ చేశానని, కొందరు దీనిపై చర్చించాల్సిన అవసరముందని సూచించడంతో రీపోస్ట్ చేస్తున్నానని ఆమె అన్నారు.
”నేను ఈ ప్రత్యేకంగా ఈ విషయం ఎందుకు చెప్పాలనుకున్నాను? నాకు బాధేసింది, అవును. కానీ గత ఏడు నెలలుగా, నాకు ముందు పదవిలో ఉన్న వ్యక్తితో (ఆమె భర్త) పోల్చుతున్నారు. నేను దానికి బాగా అలవాటు పడ్డాను.
అది నల్లగా ఉండడం గురించి.. అదేదో సిగ్గుపడాల్సిన విషయంలా.. నలుపు కేవలం ఒక రంగు కాదు, అది మంచిది కాదు, నలుపనేది ఒక వర్గసమస్య, అదో గాఢాంధకారం” అని ముద్రవేశారు.
కానీ, నలుపు రంగును చెడుగా ఎందుకు చూడాలి? నలుపు రంగు లోకం సార్వత్రిక సత్యం. నలుపు అనేది దేనినైనా గ్రహించగల రంగు, ఇది మానవ నాగరికతకు తెలిసిన అత్యున్నత శక్తి ప్రవాహం. ఇది అన్నిచోట్లా ఉంటుంది.
నాకు నాలుగేళ్ల వయసులో మా అమ్మను ఒకసారి అడిగా. నన్ను మళ్ళీ గర్భంలోకి పంపించి, నలుపు రంగు తీసేసి తెల్లగా, అందంగా మార్చగలవా అని?
‘ఇలాంటి రంగులో పుట్టకపోవడం మంచిది’ అన్న అభిప్రాయాలను వింటూనే నా జీవితంలో 50 సంవత్సరాలు గడిపేశాను.
నలుపు రంగులో అందం, విలువ లేవని, తెల్లని చర్మం ఆకర్షణీయంగా ఉంటుందని అన్న నమ్మకం మదిలో నిండిపోయింది. గొప్పవి, అద్భుతమైనవి, మంచివి, పరిపూర్ణమైనవి అన్నీ తెల్లటి రంగుతో ముడిపడి ఉంటాయని చాలామంది అంటూ ఉంటారు.
నాకు తెల్లరంగు లేదు కాబట్టి నేను తక్కువదాన్ననే భావన, దానిని నేను ఏదో ఒక విధంగా భర్తీ చేసుకోవాలి” అని ఆమె తన పోస్టులో రాశారు.
ఈ పోస్ట్ చర్చనీయాంశంగా మారిన తర్వాత, శారదా మురళీధరన్ ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ, చర్మం రంగుపై తన వ్యాఖ్య వాస్తవానికి సెటైరిక్‌గా చేశానని అన్నారు.
“నల్లగా ఉండటంలో తప్పేంటి ? నలుపు రంగుకు కూడా విలువుంది. అందమైనది అని అంగీకరించడం ముఖ్యం. నేను స్త్రీనా లేదా నల్లగా ఉన్నానా అనే విషయంలో ఆత్మన్యూనతతో ఉండటం మానేయాల్సిన సమయం ఆసన్నమైందని నేను భావిస్తున్నాను. రెండింటినీ అంగీకరించి బలంగా బయటకు రావాల్సిన సమయం ఆసన్నమైంది” అని ఆమె ఏఎన్ఐతో అన్నారు.
“నేను ధైర్యంగా ముందుకు రావడం వల్ల, అభద్రత, ఆత్మన్యూనత వంటి సమస్యలను ఎదుర్కొంటున్న ఇతరులు కూడా తమకు విలువ ఉందని, ఎవరి మెప్పు పొందాల్సిన అవసరం లేదని గ్రహించే అవకాశం ఉంది” అని ఆమె అన్నారు

ఫొటో సోర్స్, Muzafar A.V.
ఆ పోస్ట్‌కి ఎలాంటి స్పందనలు వచ్చాయి?
మురళీధరన్ చేసిన సోషల్ మీడియా పోస్ట్‌పై అనేక రకాలుగా స్పందించారు.
కర్ణాటక అదనపు ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన కె. జయరాజ్ బీబీసీతో మాట్లాడుతూ, “నా మొత్తం కెరీర్‌లో ఇలాంటిది నేను చూడలేదు, వినలేదు. ఇది అందుకు భిన్నం. ఆమెకు ఏదో భిన్నమైన అనుభవం ఎదురై ఉంటుంది” అని అన్నారు.
కానీ రంగు, అనేక ఇతర కారణాల ఆధారంగా వివక్ష ఇప్పటికీ సమాజంలో ఉంది.
స్త్రీవాద కార్యకర్త, ‘ఫియర్‌లెస్ ఫ్రీడమ్’ పుస్తక రచయిత్రి కవితా కృష్ణన్ ఈ విషయంపై బీబీసీ డేలాంగ్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడారు.
“భారతదేశంలో రంగుల సమస్య బ్రిటిష్ వారికి లేదా స్వాతంత్ర్యానికి సంబంధించింది కాదు, కులానికి సంబంధించింది. నల్లగా, నలుపుకు దగ్గరగా ఉండేవారు కష్టపడి పనిచేసే తరగతికి చెందినవారిగా భావిస్తారు. అందులోనూ అణచివేతకు గురైన ప్రజలు, దళితులకు అలాంటి రంగు ఉంటుంది. ఉన్నత కులాల వాళ్లు తెల్లగా ఉంటారు.’’ అని అన్నారు.
“ముఖ్యంగా మహిళలను వారి రంగు ఆధారంగా చూడడం సాధారణం. దీనికి వ్యతిరేకంగా సమాజంలో జరగాల్సినంతగా ఉద్యమం జరగలేదు.” అన్నారామె.
కవితా కృష్ణన్ చెప్పినదాని ప్రకారం…ఈ వివక్ష చూపడం మహిళల మధ్య ఐక్యతను విచ్ఛిన్నం చేయడమే.
“తెల్లగా ఉంటే మరిన్ని ప్రత్యేకతలు లభిస్తాయని, నల్లగా ఉన్నవారు చర్మాన్ని అందంగా మార్చుకోవడానికి ఫెయిర్‌నెస్ క్రీమ్‌ను ఉపయోగించాలని సందేశం సమాజంలోకి వెళుతోంది. నా చిన్నప్పుడు, ఒక యువతి తెల్లగా లేకపోవడం వల్ల రిసెప్షనిస్ట్ ఉద్యోగం పొందడం లేదని టీవీలో ఒక యాడ్ చూసేదాన్ని” అని ఆమె అన్నారు.
“ఇది వ్యక్తిలో ఆత్మవిశ్వాసం కోల్పోయేలా చేస్తుంది. మిమల్ని ముక్కలు చేస్తున్నట్లు అనిపిస్తుంది. రంగు కారణంగా కాకపోయినా, మరే కారణంగానైనా మిమ్మల్ని తక్కువ చేసి చూపించడానికి ఇదొక మార్గం. శరీర ఆకారం, జుట్టు లేదా బరువు ఆధారంగా కొందరిని భిన్నంగా చూస్తారు. దీని వెనుక స్త్రీలను వస్తువులుగా చూడాలనే ఆలోచన ఉంది. ఇది బాగా ప్రభావం చూపిస్తుంది. దీంతో మహిళలు కూడా తమను తాము ఒక వస్తువుగా చూడటం ప్రారంభిస్తారు.” అని అన్నారు.
ఇది ఆమె రంగుకు సంబంధించిన సమస్యా? లేదా ఆమె ఒక మహిళ అన్నది సమస్యా?ఎందుకంటే చాలా మందికి మహిళా బాస్‌లు నచ్చరు కదా…
తిరువనంతపురంలోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ స్టడీస్‌లో స్త్రీవాద పరిశోధకురాలు, ప్రొఫెసర్ జె.దేవికను ఈ ప్రశ్న అడిగింది బీబీసీ.
“రెండూ కారణమయ్యే అవకాశం ఉంది. రెండింటికీ కొన్ని ఊహలు ఉన్నాయి. నల్లజాతి స్త్రీలను తక్కువ సామర్థ్యంకలవారిగా పరిగణిస్తారు. తెల్లజాతి పురుషులు ఎక్కువ సామర్థ్యం ఉన్నవారు అనుకుంటారు.” అని ఆమె బదులిచ్చారు.
మురళీధరన్‌తో పరిచయం ఉన్న మోహినియాట్టం నృత్యకారిణి నీనా ప్రసాద్ బీబీసీ హిందీతో మాట్లాడుతూ ” ఆమె నాకు తెలుసు. తాను రేసిజం గురించి మాట్లాడటం లేదని నేను గట్టిగా చెప్పగలను. భారతీయ సమాజంలోని లోతైన సమస్యపై విలువైన అంశాన్ని ఆమె టచ్ చేశారు. ఆమె వెనుకబడిన వర్గాల మధ్య పనిచేశారని మనం మర్చిపోకూడదు. ఒక మహిళగా ఆమె సింపుల్‌గా, మర్యాదగా ఉండడాన్ని మేం ఎప్పుడూ గౌరవిస్తాం” అని అన్నారు.
తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ సోషల్ మీడియాలో ఇలా రాశారు, “శారదా, మీరు దీనిపై గొంతు విప్పినందుకు అభినందనలు. అద్భుతంగా రాశారు!”

ఫొటో సోర్స్, Muzafar AV
దీనిపై ఏదైనా చర్య తీసుకోవచ్చా?
పేరు చెప్పడానికి ఇష్టపడని కేరళకు చెందిన ఒక ఐఏఎస్ అధికారి బీబీసీతో మాట్లాడుతూ, “ఈ పోస్ట్ వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకోవాలి. పౌరురాలిగా లేదా అధికారిగా ఆమె హక్కులను ఎవరైనా ఉల్లంఘించారా అన్నది తెలియాలి.’’ అని అన్నారు.
“ఈ పోస్ట్ ఒక అభిప్రాయంలా మాత్రమే ఉంది. మాలో కొంతమందికి పోస్ట్ ద్వారా ఆమె ఏం కోరుకుంటున్నారో అర్థం కావడంలేదు” అని మరో అధికారి వ్యాఖ్యానించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS