SOURCE :- BBC NEWS
ఓ రోజు మధ్యాహ్నం కెన్యాలోని ఓ గ్రామంలో స్థానికులంతా పని నుంచి కాసేపు రెస్టు తీసుకుంటున్న సమయంలో పెద్ద శబ్దం చేస్తూ ఆకాశం నుంచి ఒక వస్తువు నేల మీద పడింది. డిసెంబర్ 31న ఈ ఘటన జరిగింది.
“అదొక బాంబు పేలిన శబ్దంలా అనిపించింది. షాకయ్యాను. చుట్టు పక్కల చూశా. తుపాకి కాల్పులు జరిగాయా ఏంటని నేను భయపడ్డా” అని మకుని కౌంటీలోని ముకుకు గ్రామానికి చెందిన 75 ఏళ్ల రైతు స్టీఫెన్ మంగోకా బీబీసీతో అన్నారు.
“పొగ ఏమైనా ఉందేమోనని ఆకాశంలోకి చూశాను. ఏమీ లేదు. ఏదైనా ప్రమాదం జరిగిందేమోనని రోడ్డు మీదకు పరుగెత్తుకు వచ్చా. ఆకాశం నుంచి ఏదో వస్తువు పడిందని నాతో ఎవరో చెప్పారు” అని ఆయన అన్నారు.
భారీ ఆకారంలో గుండ్రంగా ఉన్న ఒక లోహపు వస్తువు, ఎండిపోయిన నది ఒడ్డున ఉన్న పొలంలో పడింది. పడిన సమయంలో అది మండుతూ ఉంది.
“మాకు ఒక పెద్ద లోహపు వస్తువు కనపడింది. అది కాలుతూ ఉంది. చల్లబడే దాకా ఆగి దాని దగ్గరకు వెళ్లాలని అనుకున్నాం” అని ఆన్ కనునా అనే మహిళ బీబీసీతో చెప్పారు. ఆ వస్తువు ఆమె పొలంలోనే పడింది.
ఆ భారీ రింగ్ చల్లబడటానికి రెండు గంటలు పట్టింది. తర్వాత అది బూడిద రంగులోకి మారింది. అప్పటికే అదొక సంచలనంగా మారడంతో దాన్ని చూసేందుకు స్థానికులంతా అక్కడ పోగయ్యారు.
ఆకాశం నుంచి ఊడిపడిన ఆ వస్తువు ఏమై ఉండొచ్చనే దానిపై స్థానికుల్లో రకరకాల చర్చలు జరిగాయి. కొంతమంది దాని పక్కన నిల్చుని సెల్ఫీలు తీసుకోవడం మొదలు పెట్టడంతో అదొక సెల్ఫీ పాయింట్‌గా మారింది.
కెన్యా రాజధాని నైరోబీకి 115 కిలోమీటర్ల దూరంలో ఉన్న మకునే కౌంటీకి చెందిన స్థానికులు ఈ రింగ్ గురించి అధికారులకు సమాచారం అందించారు.
కెన్యా అంతరిక్ష పరిశోధన కేంద్రానికి ఈ విషయం తెలియడంతో అదేంలో పరిశీలించేందుకు తర్వాత రోజు ఆ ప్రాంతానికి వెళ్లారు శాస్త్రవేత్తలు.
ఆ లోహపు చక్రం గురించి ఆనోటా ఈనోటా పడి అందరికీ తెలియడంతో రాత్రి పూట ఎవరైనా దాన్ని దొంగతనం చేస్తారేమోనని ముకుకు గ్రామస్థులు భయపడ్డారు.
స్థానిక అధికారులతో కలిసి కొంతమంది గ్రామస్థులు జట్లుగా మారి దానికి కాపలా కాశారు. పక్కనే మంట వేసి రాత్రంతా మేల్కొని జాగ్రత్తగా చూసుకున్నారు.
ఆ వస్తువు బరువు 500 కేజీలకు పైనే ఉంటుందని, చుట్టు కొలత 2.5 మీటర్లు ఉండవచ్చని గ్రామస్థులు చెప్పారు.
తెల్లవారాక కెన్యా స్పేస్ ఏజెన్సీ ఉద్యోగులతో పాటు మీడియా, మరి కొంతమంది స్థానికులు అక్కడకు చేరుకున్నారు.
ముకుకులో ఇలా ఎప్పుడూ జరగలేదు. తర్వాతి రోజు కెన్యా స్పేస్ ఏజెన్సీ ఆ వస్తువును తీసుకెళ్లినప్పుడు, ఆకాశం నుంచి ఇలా తమ గ్రామాలు, పొలాల మధ్య పడుతున్న వస్తువులపై గ్రామస్థుల్లో ఆందోళన మొదలైంది.
కెన్యా స్పేస్ ఏజన్సీ ఆ రింగును పరిశీలించిన తర్వాత అది అంతరిక్ష ప్రయోగాలకు ఉపయోగించే రాకెట్‌లో ఒక విభాగానికి సంబంధించిన చక్రం అని చెప్పింది.
“సహజంగా ఇలాంటి వస్తువులు అంతరిక్షంలో నుంచి భూ కక్ష్యలోకి వచ్చిన తర్వాత మండిపోయేలా లేదా ఎడారి ప్రాంతాలు, సముద్రాల్లో పడేలా డిజైన్ చేస్తారు” అని కెన్యా అంతరిక్ష సంస్థ వెల్లడించింది.
ఆ రింగు ఆకాశంలో నుంచి పడినప్పుడు ఎవరికీ గాయాలు కాలేదు. అయితే అది పడిన శబ్దానికి, వేగానికి తమ ఇళ్లకు నష్టం జరిగిందని కొంతమంది ఆరోపించారు.
రింగు పడిన ప్రాంతం నుంచి కిలోమీటరు దూరంలో నివసించే క్రిస్టీన్ కియోంగా తన ఇంటి ప్రాంగణంలో కాంక్రీట్ నిర్మాణాలకు ఏర్పడిన పగుళ్లను బీబీసీకి చూపించారు. రింగు పడిన తర్వాతే ఆ పగుళ్లు ఏర్పడ్డాయని చెప్పారు.
మిగతా వాళ్లు కూడా తమ ఇళ్లకు నష్టం జరిగిందని ఆరోపించారు. అయితే వీటిని ఎవరూ నిర్థరించలేదు.
“ఈ వస్తువు ఎవరికి చెందినదో ప్రభుత్వం గుర్తించాలి. వారి నుంచి నష్టపోయిన వారికి పరిహారం ఇప్పించాలి” అని ముకుకు గ్రామస్థుడు బెన్సన్ ముటుకు బీబీసీతో చెప్పారు.
లోహపు చక్రం పడిన తర్వాత గ్రామంలో కొంతమంది అనారోగ్యం బారిన పడ్డారని స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే అనారోగ్యం ఎవరికి వచ్చింది, వారిని ఎవరు పరిశీలించారనే సమాచారం ఏదీ స్థానిక అధికారుల నుంచి కానీ, స్పేస్ ఏజన్సీ నుంచి కానీ రాలేదు.
అయితే ఆ వస్తువు వల్ల స్పేస్ రేడియేషన్ వ్యాపిస్తుందనే భయం ఉందని ముటుకు చెప్పారు.
“ఇది అంతరిక్షం నుంచి వచ్చింది. అంతరిక్షం నుంచి వచ్చిన వస్తువుల్లో రేడియేషన్ ప్రభావం ఉంటుందని, అది భవిష్యత్ తరాలపై ప్రభావం చూపిస్తుందనే స్థానికుల్లో భయాలు ఉన్నాయి” అని ఆయన చెప్పారు
ఈ మెటల్ రింగ్‌కు పరీక్షలు నిర్వహించిన కెన్యా అణు నియంత్రణ సంస్థ, ఇది పడిన ప్రాంతంలో రేడియేషన్ పాళ్లు కొంత ఎక్కువగా ఉన్నట్లు తాము గుర్తించామని, అయితే అవి మనుషులకు హాని కలిగించే స్థాయిలో లేవని వెల్లడించింది.
కెన్యాలో అంతరిక్ష సంబంధిత కార్యకలాపాల ప్రోత్సాహం, నియంత్రణ, సమన్వయం కోసం 2017లో కెన్యా స్పేస్ ఏజన్సీని ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ఇంజనీర్లు లోహపు రింగు గురించి మరింత సమాచారం తెలుసుకునేందుకు పరీక్షలు చేశారు.
రింగు అంతరిక్షం నుంచి భూమి మీదకు పడిన సమయంలో అదృష్టత్తువశాత్తూ ఎవరికీ ఎలాంటి నష్టజరగలేదని కేఎస్ఏ డైరెక్టర్ జనరల్ తెలిపారు
“అంతరిక్షం నుంచి పడే వస్తువుల వల్ల జరిగే ప్రమాదాలు, గాయాలు, నష్టానికి బాధ్యత, ఆ వస్తువుల్ని ప్రయోగించిన సంస్థ ఉన్న రాష్ట్రాలు లేదా దేశాల పరిధిలో ఉంటుంది” అని బ్రిగేడియర్ హిల్లరీ కిప్కోస్గే బీబీసీకి చెప్పారు.
ఐక్యరాజ్య సమితిలోని ఔటర్ స్పేస్ వ్యవహారాల కార్యాలయం నాయకత్వంలో కుదిరిన ఔటర్ స్పేస్ ఒప్పందం ప్రకారం “అంతరిక్షంలోకి ప్రయోగించిన వస్తువుల వల్ల జరిగే నష్టానికి అవి ప్రయోగించిన దేశాలే బాధ్యత వహించాల్సి ఉంటుంది”
“ముకుకు గ్రామంలోని పొలాల్లో పడిన లోహపు రింగ్ ఏ రాకెట్‌కు చెందినది, ఏ దేశానికి చెందినదో చెప్పడం కష్టం. అయినప్పటికీ దర్యాప్తు కొనసాగుతుంది” అని కిప్కోస్గే అన్నారు.
ఆ రింగ్ తాలుకూ చిత్రాలను బీబీసీ బ్రిటిష్ స్పేస్ ఏజన్సీలో నిపుణులకు చూపించింది.
“2008లో ప్రయోగించిన ఏరియన్ రాకెట్‌లో పైబాగంలో అమర్చిన రింగ్ కావచ్చు” అని ఏరియన్ రాకెట్ ప్రయోగంలో పాల్గొన్న డైరెక్టర్ మట్ అర్చర్ చెప్పారు.
“శాటిలైట్లు బాగానే ఉన్నాయి. అయితే రాకెట్ నుంచి విడిపోయిన భాగాలు కక్ష్యలో నుంచి బయటకు వచ్చి కింద పడ్డాయి” అని ఆయన అన్నారు.
ఏరియన్ యూరప్ దేశాల్లో ప్రధాన వ్యోమనౌక. ఇది 230కి పైగా శాటిలైట్లను కక్ష్యలోకి తీసుకెళ్లింది. 2023లో దీన్ని పక్కన పెట్టారు.
ఈ రింగు ముకుకు గ్రామంలో పడటానికి ముందు 16 ఏళ్ల పాటు భూమి చుట్టూ తిరుగుతూ ఉండి ఉండవచ్చు.
అయితే, అంతరిక్షం నుంచి రాలి పడుతున్న వస్తువులు తూర్పు ఆఫ్రికాలో కనిపించడం ఇదే తొలిసారి కాదు.
ఏడాదిన్నర కిందట కొన్ని అంతరిక్ష శకలాలుగా భావిస్తున్న వస్తువులు భూమిపై పడినట్లు పశ్చిమ యుగాండాలో కొన్ని గ్రామాల ప్రజలు చెప్పారు.
2025 జనవరి 8న ఉత్తర కెన్యా, దక్షిణ ఇథియోపియాలో ఆకాశంలో కొన్ని అంతరిక్షం నుంచి రాలిపడిన శకలాలు కాలిపోతున్నట్లు నిర్థరించని కొన్ని కథనాలు వచ్చాయి.
అంతరిక్ష పరిశ్రమ ఎదుగుతున్న కొద్దీ, ఇలాంటి సంఘటనలు తరచుగా జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అవి ఎక్కడ పడతాయో గుర్తించేందుకు ఆఫ్రికన్ దేశాల ప్రభుత్వాలు కొంత ఖర్చు చేయాల్సి రావచ్చు.
ప్రస్తుతం అంతరిక్షంలో 6వేల టన్నుల స్క్రాప్ ఉన్నట్లు నాసా అంచనా వేసింది.
అంతరిక్షం నుంచి పడే వ్యర్థ పదార్ధాలు ఎవరి మీదనైనా పడవచ్చనే అంచనాలు ఉన్నాయి. అయితే అందులో 10 వేలలో ఒకటి మాత్రమే మనుషుల మధ్య పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇలాంటి గణాంకాలు ముకుకు ప్రజలకు కొంత ఉపశమనం కలిగించేవే. ఆ రింగు గ్రామంలోని పొలాల్లో కాకుండా ఊరి మధ్యలో పడి ఉంటే ఏమయ్యేదో అని ఇప్పటికీ గ్రామస్థులు భయపడుతున్నారు.
“ఇలాంటివి మరోసారి జరగవని ప్రభుత్వం మాకు హామీ ఇవ్వాలి” అని ముటుకు అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)