SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
ఒక గంట క్రితం
పాకిస్తాన్‌కు వచ్చే నీటిని ఆపడానికి లేదా మళ్లించేందుకు ఏ నిర్మాణం చేపట్టినా ధ్వంసం చేస్తామని పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత్‌ను హెచ్చరించారు.
పాకిస్తాన్ చానల్ జియో న్యూస్‌లో ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ “భారత్ సింధు జల ఒప్పందాన్ని ఉల్లంఘించి, నీటిని ఆపడానికి లేదా మళ్లించడానికి ఏదైనా కట్టడం నిర్మిస్తే, అది పాకిస్తాన్‌పై దాడిగా పరిగణిస్తాం, మేం ఆ నిర్మాణాన్ని కూల్చేస్తాం” అన్నారు.
“సింధు జల ఒప్పందాన్ని ఉల్లంఘించడం అంత సులభం కాదు, అది పాకిస్తాన్‌పై యుద్ధ ప్రకటనే అవుతుంది. దాడి అంటే కేవలం ఫిరంగులు, తుపాకులు కాల్చడమే కాదు, దీనికి అనేక రూపాలు ఉంటాయి, వాటిలో ఇదొకటి. దీని కారణంగా, దేశ ప్రజలు ఆకలి లేదా దాహంతో చనిపోవచ్చు” అని ఆసిఫ్ అన్నారు.

బిలావల్ భుట్టో ఏమన్నారు?
ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన దాడిలో 26 మంది మరణించారు. దీంతో భారత్ 1960 నాటి సింధు నదీ జల ఒప్పందాన్ని నిలిపివేయడంతో పాటు, కీలక నిర్ణయాలు తీసుకుంది.
భారత నిర్ణయంపై పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో కొన్నిరోజుల కిందట మాట్లాడుతూ ‘సింధు నదిలో మన నీరు ప్రవహించాలి, లేకపోతే వారి రక్తం ప్రవహిస్తుంది’ అని వ్యాఖ్యానించారు.
కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్, కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ సహా భారత్‌లోని పలువురు నాయకులు బిలావల్ ప్రకటనపై తీవ్రంగా స్పందించారు. అయితే, ర్యాలీలో పాక్ ప్రజల మనోభావాలను మాత్రమే పునరుద్ఘాటించానని బిలావల్ భుట్టో తర్వాత బదులిచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
‘జేడీ వాన్స్ వ్యాఖ్యలు వ్యక్తిగతం’
“ప్రస్తుతం, సింధు జల ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా ఉల్లంఘించిన అంశాన్ని పాకిస్తాన్ చాలా వేదికలకు తీసుకెళ్తోంది” అని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ జియో న్యూస్‌తో అన్నారు.
పహల్గాం ఘటనపై భారత్ ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదని ఆయన అన్నారు.
రెండు దేశాల మధ్య ఉద్రిక్తత, యుద్ధ ముప్పు గురించి అడిగిన ప్రశ్నకు ఆసిఫ్ సమాధానమిస్తూ “యుద్ధ ముప్పు లేదని చెప్పలేం. 2019లో భారత్ 12 రోజుల తర్వాత స్పందించింది” అని అన్నారు.
2019 ఫిబ్రవరి 14న, సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మందికి పైగా భారత జవాన్లు మరణించారు.
గత కొన్నిరోజులుగా భారతదేశంపై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరిగిందని ఖవాజా ఆసిఫ్ అభిప్రాయపడ్డారు.
ఈ విషయాన్ని ఖవాజా ఆసిఫ్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందిస్తూ ‘ఇది అమెరికా ఉపాధ్యక్షుడి వ్యక్తిగత ప్రకటన కావొచ్చు, ఎందుకంటే విధాన ప్రకటన వైట్‌హౌస్ నుంచి వస్తుంది’ అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
షాబాజ్ భేటీలు
భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సౌదీ అరేబియాతో సహా పలు దేశాల నాయకులను పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ కలిశారు. ఆయా దేశాలు భారత్‌పై ఒత్తిడి తీసుకొచ్చేలా చేయడానికి ఆయన ప్రయత్నించారు.
శుక్రవారం ఇస్లామాబాద్‌లో సౌదీ అరేబియా రాయబారి నవాఫ్ బిన్ సయీద్ అల్ మాలికితో షాబాజ్ షరీఫ్ భేటీ అయ్యారు.
“ఉగ్రవాదం ఎక్కడ జరిగినా పాకిస్తాన్ ఖండిస్తుంది” అని షరీఫ్ ఈ సందర్భంగా అన్నారు.
అదేరోజు యూఏఈ రాయబారి హమద్ అబేద్ ఇబ్రహీం సలీం అల్-జాబిని కలిశారు. ఈ సమావేశంలో షరీఫ్ మాట్లాడుతూ “పాకిస్తానే ఉగ్రవాదానికి అతిపెద్ద బాధిత దేశం” అని అన్నారు.
అంతేకాదు, కువైట్ రాయబారి నాసర్ అబ్దుల్ రెహమాన్ జస్సార్‌ను కూడా ఇస్లామాబాద్‌లో కలిశారు షరీఫ్. గత కొన్నేళ్లుగా ‘ఉగ్రవాదం’పై పాకిస్తాన్ చేసిన పోరులో 90 వేలకు పైగా ప్రజలు మరణించారని, దేశం 152 బిలియన్ డాలర్లకు పైగా ఆర్థికంగా నష్టపోయిందని షరీఫ్ ఈ సమావేశంలో అన్నారు.
పహల్గాం దాడి తర్వాత భారత్, పాకిస్తాన్‌లు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. అందులో భాగంగా పాకిస్తాన్‌కు చెందిన కొన్ని సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయిస్తోంది భారత్.
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఎఫ్ఎం రేడియోలో భారత పాటల ప్రసారాన్ని పాకిస్తాన్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్ (పీబీఏ) నిలిపివేసింది. పీబీఏ నిర్ణయాన్ని అభినందిస్తున్నట్లు పాకిస్తాన్ సమాచార, ప్రసార మంత్రి అతుల్లా తరార్ ప్రకటించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)