SOURCE :- BBC NEWS

డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, EPA-EFE/Shutterstock

ఒక గంట క్రితం

భారతదేశం, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఘనతను అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తీసుకుంటున్నారు.

అమెరికాతో వాణిజ్యం కారణంగానే ఇరుదేశాలు కాల్పుల విరమణ చేశాయని ఆయన ఇప్పుడు కొత్త వాదన చేస్తున్నారు.

అయితే ,పాకిస్తాన్‌తో సంఘర్షణ సమయంలో అమెరికాతో జరిపిన చర్చలలో వాణిజ్యం గురించిన ప్రస్తావన రాలేదని బీబీసీతో మాట్లాడిన వర్గాలు చెప్పాయి.

కాల్పుల విరమణకు సంబంధించి ఇండియా ఇప్పటివరకు ఇచ్చిన సమాచారంలో ఎక్కడా అమెరికా పేరు చెప్పలేదు.

ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన దాడిలో 26 మంది పౌరులు మరణించిన తరువాత భారతదేశం, పాకిస్తాన్ మధ్య సంబంధాలు క్షీణించాయి.

ఈ దాడుల తర్వాత, భారతదేశం పాకిస్తాన్‌తో అన్నిరకాల వాణిజ్యాన్ని నిషేధించింది.

అయితే భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణను ఆదివారం సాయంత్రం సోషల్ మీడియాలో తొలుత ప్రకటించింది అమెరికా అధ్యక్షుడే. దీనితో పాటు, మరుసటి రోజు సోమవారం, రెండు దేశాల సరిహద్దుల్లో శాంతిని నెలకొనడాన్ని ఆయన ప్రశంసించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
కాల్పుల విరమణ

ఫొటో సోర్స్, EPA-EFE/Shutterstock

ట్రంప్ ఏమన్నారు?

డోనల్డ్ ట్రంప్ ప్రతిరోజూ కొత్త వాదనలు చేస్తున్నారు. సోమవారం వైట్ హౌస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో.. కాల్పుల విరమణ కోసం భారత్, పాకిస్తాన్‌లపై ఒత్తిడి తెచ్చానని, ఇది జరగకపోతే, రెండు దేశాలతో వాణిజ్యాన్ని ముగిస్తానని పేర్కొన్నట్లుగా ట్రంప్ తెలిపారు.

వాణిజ్యం కారణంగా ఈ ఘర్షణను ముగించడానికి భారతదేశం, పాకిస్తాన్ అంగీకరించాయని ఆయన పేర్కొన్నారు.

“చాలా ప్రమాదకరమైన అణ్వాయుధాలు కలిగిన రెండు దేశాల మధ్యన పూర్తి కాల్పుల విరమణ తీసుకురావడానికి నా పరిపాలన సహాయపడింది” అని డోనల్డ్ ట్రంప్ అన్నారు. “మేం వారికి ఎంతో సాయం చేశాం. వాణిజ్యంలోనూ సాయపడ్డాం.”

“మిత్రులారా మీతో చాలా వ్యాపారం చేయబోతున్నామని చెప్పాను. దీన్ని వెంటనే ఆపండి, మీరు దీన్ని ఆపేస్తే వ్యాపారం జరుగుతుంది. మీరు దీన్ని ఆపకపోతే మేం మీతో ఎలాంటి వ్యాపారం చేయబోం” అని చెప్పానని ట్రంప్ తెలిపారు.

‘‘వారు ఇది అనేక కారణాల వల్ల చేసి ఉండొచ్చు, కానీ వాణిజ్యమే అతి పెద్ద కారణం’’ అని ఆయన చెప్పారు.

“పాకిస్తాన్‌,భారత్‌‌లతో మేం చాలా వ్యాపారం చేయబోతున్నాం. ప్రస్తుతం భారతదేశంతో చర్చలు జరుపుతున్నాం. త్వరలో పాకిస్తాన్‌తోనూ చర్చలు జరుపుతాం. మేం అణు యుద్ధాన్ని నివారించామనుకుంటున్నాను.” అని డోనల్డ్ ట్రంప్ తెలిపారు.

రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, డోనల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత చైనా, భారతదేశం సహా అనేక దేశాలపై సుంకాలను విధించారు. ఆ తరువాత ఈ సుంకాలను అమలు చేయడానికి గడువు పొడిగించారు.

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, YEARS

భారత్ ఏం చెప్పింది?

కాల్పుల విరమణను అంగీకరించడంలో వాణిజ్యం ప్రముఖపాత్ర పోషించిందన్న ట్రంప్ వాదనపై భారత్ ఇంకా అధికారికంగా స్పందించలేదు.

అయితే, పాకిస్తాన్‌తో ఘర్షణ సమయంలో అమెరికా ప్రతినిధులతో భారతదేశం జరిపిన చర్చలన్నింటిలో ఎక్కడా వాణిజ్యం లేదా వ్యాపారం గురించి ప్రస్తావించలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

‘‘మే 6-7 తేదీల మధ్యరాత్రి పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌పై భారతదేశం దాడి చేసిన తర్వాత అమెరికాతో వివిధ స్థాయులలో చర్చలు జరిగాయని’’ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

మే 8న, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి ఎస్.జైశంకర్‌తో మాట్లాడారు.

మే 9న, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడారు.

మే 10 ఆదివారం , అమెరికా విదేశాంగ మంత్రి రూబియో మొదట పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌తో, తరువాత భారత జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ)తో మాట్లాడారు.

ఈ చర్చలన్నింటిలోనూ వాణిజ్యానికి సంబంధించి ఎటువంటి చర్చ జరగలేదని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

ఈ సంభాషణ తర్వాతే అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ గురించి తెలియజేశారు.

సోమవారం రాత్రి 8 గంటలకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగంలో, పాకిస్తాన్ సైనిక, ‘ఉగ్రవాద స్థావరాలపై’ చర్య తీసుకోవడాన్ని వాయిదా వేశామని ప్రధాని మోదీ అన్నారు. ఉగ్రవాదం కొనసాగుతున్నంత కాలం పాకిస్తాన్‌తో చర్చలు జరపలేమని, పాకిస్తాన్‌తో వాణిజ్యం చేయలేమని ప్రధాని మోదీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

 జైశంకర్

ఫొటో సోర్స్, Getty Images

భారత్, అమెరికా వాణిజ్యం ఎంత?

అమెరికా అధ్యక్షుడైన తర్వాత, డోనల్డ్ ట్రంప్ ఇతర దేశాలపై పరస్పర సుంకాలను నిరంతరం ప్రకటించారు. ట్రంప్ సుంకాల యుద్ధంలో ఓ కీలక క్షణం సోమవారం ఆయన చైనాతో వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించడం ద్వారా వచ్చింది.

అమెరికా కూడా భారతదేశంతో చర్చలు జరుపుతోంది, దీనిని డోనల్డ్ ట్రంప్ కూడా ప్రస్తావించారు. భారతదేశంపై 26 శాతంసుంకం విధిస్తామని ట్రంప్ ప్రకటించారు.

అయితే భారతదేశందీనికి ప్రతిగా ఎటువంటి సుంకం విధించలేదు. బదులుగా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన అంశంపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో చర్చించామని చెప్పారు.

భారతదేశం అమెరికాకు మందులు, ఆటో కాంపోనెంట్స్, దుస్తులు వంటివి ఎగుమతి చేస్తుంది.

ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, సైనిక పరికరాలు, వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంది.

భారతదేశానికి అమెరికా ఐదవ అతిపెద్ద ముడి చమురు, ఎల్ఎన్‌జీ (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్) సరఫరాదారు. 2030 నాటికి దేశంలో సహజ వాయువు వినియోగ వాటాను 6.3 శాతం నుంచి 15 శాతానికి పెంచాలని భారత ప్రభుత్వం కోరుకుంటోంది.

అమెరికా భారతదేశానికి చేసే ఎగుమతులకంటే.. భారతదేశం నుంచి చేసుకునే దిగుమతులు ఎక్కువ.

2023 సంవత్సరంలో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 190.08 బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంది. ఇందులో సేవారంగం వాటా 66.19 బిలియన్ డాలర్లు.

ఇందులో భారత్ 83.77 బిలియన్ డాలర్ల వస్తువులను ఎగుమతి చేయగా, 40.12 బిలియన్ డాలర్ల వస్తువులను దిగుమతి చేసుకుంది. అంటే అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య దిగుమతి లోటు 43.65 బిలియన్ డాలర్లు.

అమెరికా భారతదేశం మధ్య 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచాలని భారత్, అమెరికా కోరుకుంటున్నాయి.

బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)