SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా నుంచి జరిపే అన్ని దిగుమతులపై సుంకాలను ఎత్తివేస్తున్నట్లు ఇండియా చెప్పిందని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తెలిపారు.
ఖతార్ రాజధాని దోహాలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘‘భారత ప్రభుత్వం మాపై ఏ విధమైన సుంకాలు లేకుండా చేస్తామని మౌలికంగా ఆఫర్ ఇచ్చింది’’ అని ట్రంప్ చెప్పారు.
అయితే, దీనిపై భారత్ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. స్పందించాల్సిందిగా బీబీసీ భారత వాణిజ్య శాఖను సంప్రదించింది. ఇంకా స్పందన రాలేదు.
మరోపక్క విదేశీ వ్యవహారాల శాఖామంత్రి ఎస్. జైశంకర్ మీడియాతో మాట్లాడుతూ ‘‘అమెరికా, ఇండియా మధ్య వాణిజ్యంపై చర్చలు జరుగుతున్నాయి. ఇవి కొలిక్కి రాకముందే ఏదీ నిర్ణయించలేం. ఈలోపే దీనిపై అభిప్రాయం వెల్లడించడం తొందరపాటు అవుతుంది’’ అని అన్నారు.

‘ఇండియాలో యాపిల్ ఉత్పత్తుల తయారీ వద్దు’
ప్రస్తుతానికి అమెరికా, భారత్ మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించి బహిరంగంగా ఎటువంటి సమాచారం బయటకు రాలేదు.
దోహాలో పలువురు వాణిజ్యవేత్తలతో ఓ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అమెరికా, ఖతార్ మధ్య భారీ ఒప్పందాలను ఆయన ప్రకటించారు. వీటిలో బోయింగ్ జెట్స్ ఒప్పందం కూడా ఉంది.
దీని తరువాత భారత్‌లో యాపిల్ ఐఫోన్ల తయారీపైనా వ్యాఖ్యానించారు.
‘‘ప్రపంచంలో అత్యధికంగా టారిఫ్‌లు విధించే దేశాలలో భారత్ కూడా ఒకటి. అక్కడ యాపిల్ తన తయారీ కేంద్రాన్ని పెట్టడం నాకిష్టంలేదని యాపిల్ సీఈఓ టిమ్ కుక్కు చెప్పా’’ ట్రంప్ తెలిపారు.
‘‘ టిమ్…మేం మీతో బావున్నాం. చైనాలో మీ ప్లాంట్లన్నింటినీ కొన్నేళ్లుగా పెంచుకుంటూ వస్తున్నారు. మీరు ఇండియాలో తయారీ మొదలుపెట్టడం మాకు పెద్దగా ఇష్టం లేదు’’ అన్నారు.
యాపిల్ ఐఫోన్ ప్రొడక్షన్లో ఎక్కువ భాగాన్ని చైనా నుంచి ఇండియాకు మారుస్తున్నట్లు ఆ కంపెనీ ఈ నెల ప్రారంభంలో తెలిపింది. అయితే ఐప్యాడ్, యాపిల్ వాచ్ వంటి వాటికి వియత్నాం ప్రధాన ఉత్పత్తి కేంద్రంగా కొనసాగుతుందని తెలిపింది.

ఫొటో సోర్స్, Reuters
ఇండియాపై ట్రంప్ టారిఫ్‌లు
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇండియాపై 27 శాతం సుంకాలు విధించారు. తరువాత దానిని 90 రోజులపాటు తాత్కాలికంగా నిలిపివేశారు.
ఈలోగా అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే పనిలో ఉంది భారత్. 90రోజుల వ్యవధి జులై 9తో ముగియనుంది.
మరోపక్క అమెరికా, చైనా పరస్పరం తమ దిగుమతులపై సుంకాలు తగ్గించుకోవాలని అంగీకారానికి వచ్చాయి. చైనా ఉత్పత్తులపై అమెరికా సుంకాలు 145 శాతం నుంచి 30 శాతానికి తగ్గనున్నాయి.
అమెరికా నుంచి దిగుమతయ్యే సరుకులపై సుంకాలను 125 శాతం నుంచి 10 శాతానికి తగ్గించనుంది చైనా.
ఇటీవల దాకా భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అమెరికా. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందం 190 బిలియన్ డాలర్ల ( సుమారు రూ. 16, 27, 812 కోట్లు)కు చేరింది.

ఫొటో సోర్స్, Reuters
నెక్స్ట్ ఏంటి?
వాణిజ్య నిపుణుడు అజయ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, “వాణిజ్య లోటుకు భారతదేశం విధించే సుంకాలను ట్రంప్ ఎప్పుడూ నిందిస్తారు కాబట్టి, భారతదేశం కూడా ‘జీరో ఫర్ జీరో’ విధానాన్ని అవలంబించవచ్చు మొదటి రోజు నుండి ఆటో, వ్యవసాయ ఉత్పత్తులు మినహా 90శాతం అమెరికన్ ఎగుమతులకు సుంకం లేకుండా చేయడానికి ముందుకు రావచ్చు. కానీ ఈ ఒప్పందం పరస్పర బంధాన్ని నిర్థరించేలా చూడాలి. దీనిలో ఇరు పక్షాలు సమానంగా సుంకాలను తీసేయాలి’’ అన్నారు.
రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 42,78,000 కోట్లు ) కు చేర్చాలని ట్రంప్, మోదీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. కానీ లోతైన రాజకీయ సున్నితత్వం ఉన్న వ్యవసాయం వంటి రంగాల్లో భారత్ రాయితీలు ఇచ్చే అవకాశం లేదు.
ఏళ్ల తరబడి సంకోచాల తరువాత భారత్ ఇటీవల వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు మరింత సుముఖత వ్యక్తం చేస్తోంది.
విస్కీ, ఆటోమొబైల్స్ వంటి పలు రంగాల్లో సుంకాలను భారీగా తగ్గించే వాణిజ్య ఒప్పందంపై గత వారమే బ్రిటన్‌తో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది.
యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (ఈఎఫ్‌టిఏ)తో భారత్ గత ఏడాది 100 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 8.56 లక్షల కోట్లు) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
యురోపియన్ యూనియన్ లో సభ్యత్వం లేని నాలుగు దేశాల సమూహమే ఈఎఫ్‌టిఏ. దాదాపు 16 ఏళ్ల చర్చల అనంతరం ఈ ఒప్పందం కుదిరింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)