SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థ కోసం ఒక డిజైన్‌ను ఎంచుకున్నారు. ఇది భవిష్యత్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అని అభివర్ణించారు. తన ప్రస్తుత పదవీకాలం ముగిసే సమయానికి ఇది పని చేయడం ప్రారంభిస్తుందని ట్రంప్ చెప్పారు.
బాలిస్టిక్, క్రూయిజ్ మిసైళ్లతో పాటు తర్వాత తరం వైమానిక ప్రమాదాలను ఎదుర్కోవడమే గోల్డెన్ డోమ్ లక్ష్యమని ఆయన చెప్పారు.
ప్రపంచంలో వివిధ దేశాలకు తమ సొంత గగనతల రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. యుద్ధ సమయంలో ఏ దేశానికైనా ఇవి చాలా కీలకం.
ప్రపంచంలో ఏయే దేశాల వద్ద ఎలాంటి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఉన్నాయి. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ ఎక్కడ ఉంది?


ఫొటో సోర్స్, Getty Images
ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ?
ఫైటర్ జెట్లు, క్షిపణులు, డ్రోన్లు, ఇతర వైమానిక దాడుల నుంచి ఒక దేశ గగనతలాన్ని రక్షించే సైనిక వ్యవస్థను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని చెప్పవచ్చు.
ఇది రాడార్లు, సెన్సార్లు, క్షిపణి, గన్ సిస్టమ్స్‌ను ఉపయోగించి ఆకాశ మార్గంలో వచ్చే ముప్పును గుర్తించి ఎదుర్కొంటుంది.
ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ను ఒకే చోట శాశ్వతంగా ఉంచవచ్చు లేదా వేర్వేరు ప్రాంతాల్లో మోహరించవచ్చు. వీటికి చిన్న డ్రోన్ల నుంచి బాలిస్టిక్ క్షిపణుల లాంటి భారీ ఆయుధాలను అడ్డుకునే సామర్థ్యం ఉంటుంది.
వైమానిక దాడుల నుంచి జనావాసాలు, సైనిక స్థావరాలు, కీలక నిర్మాణాలను రక్షించడమే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ప్రధాన లక్ష్యం.
ఈ వ్యవస్థ నాలుగు ప్రధాన భాగాలుగా పని చేస్తుంది. రాడార్లు, సెన్సార్లు శత్రువుల విమానాలు, డ్రోన్లు, మిసైళ్లను గుర్తిస్తాయి. అవి సేకరించిన డేటాను కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ విశ్లేషించి ప్రాధాన్యతలను నిర్దేశిస్తుంది.
ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లో ఉండే ఆయుధ వ్యవస్థలు ముప్పును ఎదుర్కొని నిరోధిస్తాయి. అదే సమయంలో మొబైల్ యూనిట్లు వేగంగా సిద్ధమవుతాయి. ఇది యుద్ధ భూమిలో చాలా ప్రభావం చూపిస్తుంది.

ఫొటో సోర్స్, AFP
అమెరికన్ ఎయిర్ డిఫెన్స్
గోల్డెన్ డోమ్ సిస్టమ్ కోసం అమెరికా 175 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తోంది. దీని కోసం ముందుగా బడ్జెట్లో 25 బిలియన్ డాలర్లు కేటాయించారు.
అమెరికా శత్రు దేశాల్లో వేగంగా పుట్టుకొస్తున్న ఆధునిక ఆయుధాలను ఎదుర్కొనేందుకు, ప్రస్తుతం అమెరికా వద్ద ఉన్న రక్షణ వ్యవస్థ అంత సమర్థవంతంగా లేదని అధికారులు చెబుతున్నారు.
కొత్తగా తీసుకొచ్చే క్షిపణి రక్షణ వ్యవస్థ భూమి, సముద్రం, అంతరిక్షంలో కొత్త తరం సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉంటుందని ట్రంప్ చెబుతున్నారు.
ఇందులో భాగంగా వైమానిక దాడుల వల్ల ఎదురయ్యే ప్రమాదాలను ఆపేందుకు అవసరమైన సెన్సర్లు, ఇంటర్సెప్టర్లు అంతరిక్షంలో ఉంటాయి.
అమెరికన్ గోల్డెన్ డోమ్‌కు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ స్ఫూర్తి. క్షిపణులు, రాకెట్ దాడులను అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వ్యవస్థను 2011 నుంచి ఉపయోగిస్తోంది.
అయితే గోల్డెన్ డోమ్ చాలా పెద్దగా ఉండనుంది. ఇది హైపర్ సోనిక్ ఆయుధాల సహా మిగతా ఆయుధాల నుంచి ఎదురయ్యే ప్రమాదాలను విస్తృత స్థాయిలో నిలువరిస్తుంది.
ఇది ధ్వని వేగం, ఫ్రాక్షనల్ ఆర్బిటల్ బంబార్డ్మెంట్ సిస్టమ్స్ (ఎఫ్ఓబీఎస్) కంటే వేగంగా తన స్థానాన్ని మార్చుకోగలదు. ఎఫ్ఓబీఎస్ అంతరిక్షం నుంచి కూడా ఆయుధాలను ప్రయోగించగలదు. అలాంటి ప్రమాదాలన్నింటినీ ఆకాశంలోనే నిర్మూలించవచ్చని, దీని సక్సెస్ రేటు వందశాతంగా ఉందని ట్రంప్ చెప్పారు.
ప్రస్తుతం అమెరికా తన భాగస్వామ్య దేశాల భద్రత కోసం టెర్మినల్ హై అల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ ( థాడ్) మిసైల్ సిస్టమ్‌ను మోహరించింది. ఇందులో సౌత్ కొరియా, గయామ్, హైతీతో పాటు మరి కొన్ని దేశాలున్నాయి.
థాడ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్‌కు మధ్యశ్రేణి ఖండాంతర క్షిపణుల్ని ప్రయోగ దశలోనే అడ్డుకుని కూల్చవేయగల సామర్థ్యం ఉంది. ఇది ఆయుధాలను కేవలం అడ్డుకోవడం కాకుండా దాన్ని ప్రయోగించగానే ధ్వంసం చేస్తుంది. అదే ఈ సాంకేతికత ప్రత్యేకత.
థాడ్ క్షిపణి వ్యవస్థ 150 కిలోమీటర్ల ఎత్తులో 200కిలో మీటర్ల దూరం వరకూ దాడి చేయగలదు.
ప్రపంచవ్యాప్తంగా అగ్ర దేశాల వద్ద ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ గురించి బీబీసీ ప్రతినిధి చందన్ కుమార్ జజ్వారే రక్షణ రంగ నిపుణుడు సంజీవ్ శ్రీవాస్తవతో మాట్లాడారు.
“థాడ్‌ను పక్కన పెడితే అమెరికా దగ్గర 170 కిలోమీటర్ల పరిధి వరకు పని చేసే సామర్థ్యం ఉన్న ఎంఐఎం104, పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉన్నాయి” అని శ్రీవాస్తవ చెప్పారు.
“వైమానిక దాడుల నుంచి రక్షించుకునేందుకు అన్ని దేశాలు బహుళ స్థాయి భద్రతను ఏర్పాటు చేసుకుంటున్నాయి. అమెరికా, జర్మనీ, ఇటలీ వద్ద ఎంఈఏ డిఫెన్స్ సిస్టమ్ ఉంది” అని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, @IDF
ఇజ్రాయెల్ ఐరన్ డోమ్
గతేడాది ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్ భూభాగంపై దాడులు చేసినప్పుడు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వ్యవస్థ పతాక శీర్షికల్లో నిలిచింది.
హమాస్‌తో యుద్ధం జరుగుతూ ఉండటంతో తనను తాను రక్షించుకునేందుకు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ సిస్టమ్‌ను విస్తృతంగా ఉపయోగిస్తోంది. ఇరాన్ దాడుల సమయంలోనూ ఇదే వ్యవస్థ ఇజ్రాయెల్‌కు అండగా నిలిచింది.
ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ వల్ల ఇరాన్ ప్రయోగించిన రాకెట్లలో ఎక్కువ భాగం భూమికి చేరకుండానే ధ్వంసమయ్యాయి. ఈ రక్షణ వ్యవస్థ పేరు ఐరన్ డోమ్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్.
ఇజ్రాయెల్ సాంకేతికత 90శాతం కేసుల్లో నిరూపణ అయిందని ఆ దేశ అధికారులు చెబుతున్నారు. ఐరన్ డోమ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్, ప్రత్యర్థులు ప్రయోగించిన రాకెట్లను మధ్యలోనే పేల్చి వేసింది.
ఇజ్రాయెల్ మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి నిర్మించిన క్షిపణి రక్షణ వ్యవస్థలో ఐరన్ డోమ్ ఒక భాగం.
శత్రువులు ప్రయోగించిన క్షిపణులు జనావాసాలపై పడతాయా లేదా ఏదైనా క్షిపణి గురి తప్పిందా అనే దాన్ని ఈ వ్యవస్థ ఆటోమేటిగ్గా గుర్తిస్తుంది.
జనావాసాలపై పడే క్షిపణులను ఈ వ్యవస్థ గాలిలోనే కూల్చి వేస్తుంది. ఈ ఒక్క అంశం ఈ సాంకేతికతను గొప్పగా మార్చింది.
ఇజ్రాయెల్ వద్ద 70 కిలోమీటర్ల నుంచి 300 కిలోమీటర్ల పరిధి ఉన్న డేవిడ్ స్లింగ్ అనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉందని రక్షణ రంగ నిపుణుడు సంజీవ్ శ్రీవాస్తవ చెప్పారు.
2006లో ఇస్లామిక్ గ్రూప్ హిజ్బొల్లాతో యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ ఈ సాంకేతికతపై పని చేయడం ప్రారంభించింది.
అనేక ఏళ్ల పరిశోధన తర్వాత, ఈ వ్యవస్థను 2011లో పరీక్షించారు. పరీక్షల దశలో దక్షిణ నగగరం బీర్సెబా నుంచి ప్రయోగించిన క్షిపణులను ఈ వ్యవస్థ విజయవంతంగా కూల్చివేసింది.
స్వల్పశ్రేణి దాడుల నుంచి రక్షించుకునేందుకు ఐరన్ డోమ్ వ్యవస్థను రూపొందించారు. ఇది ఎలాంటి వాతారణంలోనైనా పని చేస్తుంది.
ఇందులో అమర్చిన రాడార్ తన వైపు వస్తున్న రాకెట్ లేదా క్షిపణిని గుర్తిస్తుంది.
ఐరన్ డోమ్ డిఫెన్స్ సిస్టమ్ యూనిట్లను ఇజ్రాయెల్ వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. ప్రతి యూనిట్లో మూడు నుంచి నాలుగు లాంచ్ వెహికల్స్ ఉంటాయి. అవి 20 ఇంటర్‌సెప్టర్ మిసైల్స్‌ను ప్రయోగించగలవు.
ఐరన్ డోమ్ డిఫెన్స్ వ్యవస్థను ఒక ప్రాంతంలో శాశ్వతంగా ఏర్పాటు చేయవచ్చు లేదా అవసరమైన చోటకు తీసుకెళ్లవచ్చు.
అయితే ఈ వ్యవస్థ పూర్తిగా అన్ని రకాల మిసైల్స్‌ను అడ్డుకోలేదని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. ఈ టెక్నాలజీ ప్రస్తుతం గాజా నుంచి హమాస్ ప్రయోగిస్తున్న రాకెట్లను పూర్తిగా ధ్వంసం చేస్తోంది. అయితే భవిష్యత్‌లో ఇతర శత్రువుల దాడులను అడ్డుకోవడంలో ఐరన్ డోమ్ అంత ప్రభావవంతంగా పని చేయకపోవచ్చనేది రక్షణ రంగ నిపుణుల అభిప్రాయం.

ఫొటో సోర్స్, Getty Images
ఇండియా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్- ఎస్ 400
భారత్‌కు చెందిన ఎస్ 400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను సుదర్శన చక్రం అని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది.
వివిధ స్థాయిల్లో వైవిధ్య భరితమైన వ్యవస్థల వల్ల ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇది రష్యన్, ఇజ్రాయెల్, స్వదేశీ పరిజ్ఞానం కలబోత కావడంతో చుట్టు పక్కల దేశాల కంటే ఇది అత్యంత ప్రభావవంతమైనదిగా గుర్తింపు పొందింది.
రష్యా నుంచి ఎస్ 400 కొనుగోలు చేసేందుకు2018లో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది.
దీన్ని అమెరికాకు చెందిన పేట్రియాట్ మిసైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌తో పోల్చవచ్చు. భారత్- రష్యా మధ్య ఒప్పందం విలువ 5.43 బిలియన్ డాలర్లు.
ఎస్- 400ను ఎటైనా తీసుకెళ్లవచ్చు. ఆదేశాలు అందుకున్న ఐదు నుంచి పది నిముషాలలోపు దీన్ని సిద్ధం చేయవచ్చని చెబుతున్నారు.
ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌లో ఎస్ 400 ఒకటని సంజీవ్ శ్రీ వాస్తవ చెప్పారు.
“దీని పరిధి 400 కిలోమీటర్లు. రష్యా దీన్ని యుక్రెయిన్‌కు వ్యతిరేకంగా ఉపయోగించింది. అక్కడ ఇది విజయవంతంగా పని చేసింది. భారత్ ఇటీవల పాకిస్తాన్‌తో ఏర్పడిన సంఘర్షణలో ఎస్ 400ను ఉపయోగించింది. ఇక్కడ కూడా అది విజయవంతంగా పని చేసింది” అని శ్రీ వాస్తవ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
చైనా, పాకిస్తాన్
పాకిస్తాన్ వద్ద చైనాలో తయారైన హెచ్‌క్యూ-9, హెచ్‌క్యూ-16, ఎఫ్ఎన్-16 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలున్నాయి. ఇందులో హెచ్‌క్యూ-9ని పాకిస్తాన్ 2021లో తన ఆయుధాల జాబితాలో చేర్చింది. ఇది రష్యాకు చెందిన ఎస్-300కి సమానమని భావిస్తారు.
చైనా వద్ద కూడా ఇలాంటి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలే ఉన్నాయి. ఇటీవలి భారత్- పాకిస్తాన్ సంఘర్షణలో చైనాకు చెందిన హెచ్‌క్యూ-9 గగనతల రక్షణ వ్యవస్థ సరిగ్గా పని చేయలేదని తేలినట్లు రక్షణ రంగ నిపుణుడు సంజీవ్ శ్రీవాస్తవ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)