SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
ఒక గంట క్రితం
బంగ్లాదేశ్ నుంచి దిగుమతయ్యే అనేక, ముఖ్యమైన ఉత్పత్తులపై భారత ప్రభుత్వం మే 17 నుంచి కొత్త ఆంక్షలు విధించింది.
డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ఇకపై బంగ్లాదేశ్ నుంచి రెడీమేడ్ వస్త్రాలు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు, ప్లాస్టిక్ వస్తువులు, చెక్క వస్తువుల వంటివి ల్యాండ్ పోర్టుల(అంతర్జాతీయ సరిహద్దులు) ద్వారా భారత్‌లోకి రావడం సాధ్యపడదు.
ఇకపై రెడీమేడ్ వస్త్రాల దిగుమతులను కోల్‌కతా, మహారాష్ట్రలోని న్హావా షెవా ఓడరేవుల ద్వారా మాత్రమే అనుమతించనున్నట్లు పేర్కొంది.
దీనికిముందు, బంగ్లాదేశ్‌కు కల్పించిన ‘ట్రాన్స్షిప్మెంట్’ సౌకర్యాన్ని కూడా గత నెల ప్రారంభంలో భారత్ ఉపసంహరించుకుంది. ఈ ట్రాన్స్షిప్మెంట్ ఏర్పాటు ద్వారా, భారత్‌లోని ఎయిర్‌పోర్టులు, షిప్పింగ్ పోర్టుల ద్వారా బంగ్లాదేశ్ తన ఎగుమతులను ఇతర దేశాలకు పంపించేందుకు అనుమతులు ఉండేవి.
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో, భారత్ విధించిన ఈ కొత్త ఆంక్షలు భారత్ – బంగ్లాదేశ్ వాణిజ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? వాణిజ్య నిపుణులు దీనిని ఎలా చూస్తున్నారు? ఈ ఆంక్షలను కేవలం వాణిజ్య కోణంలోనే చూడాలా?


ఫొటో సోర్స్, Getty Images
కొత్తగా తీసుకున్న నిర్ణయం ఏంటి?
- ల్యాండ్ పోర్టుల ద్వారా భారత్‌లోకి రెడీమేడ్ వస్త్రాల దిగుమతులను నిషేధించారు. ఇకపై కోల్‌కతా, న్హావా షెవా ఓడరేవుల ద్వారా మాత్రమే దేశంలోకి అనుమతిస్తారు.
- అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం, పశ్చిమ బెంగాల్‌లోని సరిహద్దు చెక్‌పోస్టుల ద్వారా బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి వచ్చే పండ్లు, పండ్లరసాలు, కార్బొనేటెడ్ డ్రింక్స్ వంటి ఉత్పత్తుల దిగుమతులపై కూడా ఆంక్షలు విధించారు.
- బేకరీ ఉత్పత్తులు, స్నాక్స్, మిఠాయి వంటి ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు ఇక నుంచి ల్యాండ్ పోర్టుల ద్వారా భారత్‌లోకి తెచ్చేందుకు వీలుపడదు.
- పత్తి, నూలు వ్యర్థాలు, పీవీసీ, ప్లాస్టిక్ వస్తువులు, చెక్క సామగ్రికి కూడా ఇదే రకమైన ఆంక్షలు వర్తిస్తాయి.
- అయితే, చేపలు, ఎల్పీజీ, వంటనూనెలు, కంకర రాళ్ల వంటి వాటికి ఈ నిషేధం వర్తించదు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్ – బంగ్లాదేశ్ వాణిజ్యంపై దీని ప్రభావమెంత?
భారత్ – బంగ్లాదేశ్ మధ్య 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా 14 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1,19,568 కోట్లు) వాణిజ్యం జరిగినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
ఇదే సమయంలో, బంగ్లాదేశ్ 1.97 బిలియన్ డాలర్ల (సుమారు రూ.16,825 కోట్లు) విలువైన వస్తువులను భారత్‌కు ఎగుమతి చేసింది. బంగ్లాదేశ్ నుంచి అత్యధికంగా రెడీమేడ్ వస్త్రాలు ఎగుమతయ్యాయి.
బంగ్లాదేశ్ తన మొత్తం ఎగుమతి ఆదాయంలో 83 శాతం రెడీమేడ్ వస్త్రాల ద్వారానే ఆర్జిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
దిల్లీకి చెందిన రీసర్చ్ గ్రూప్ ”గ్లోబల్ ట్రేడ్ రీసర్చ్ ఇనిషియేటివ్” (జీటీఆర్ఐ) నివేదిక ప్రకారం, బంగ్లాదేశ్ నుంచి వచ్చే 770 మిలియన్ డాలర్ల (రూ.6,575 కోట్లు) విలువైన వస్తువుల దిగుమతులపై భారత ప్రభుత్వ తాజా ఆంక్షల ప్రభావం ఉంటుంది.
ఇరుదేశాల ద్వైపాక్షిక దిగుమతుల్లో ఇవి సుమారు 42 శాతంగా ఆ సంస్థ పేర్కొంది.
బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు వచ్చే మొత్తం రెడీమేడ్ వస్త్రాల అంచనా విలువ 618 మిలియన్ డాలర్లు (సుమారు రూ.5,278 కోట్లు) ఉంటుందని ఈ నివేదిక పేర్కొంది.
ఇకపై కోల్‌కతా, న్హావా షెవా నౌకాశ్రయాల ద్వారా మాత్రమే రెడీమేడ్ వస్త్రాలను భారత్‌లోకి అనుమతించనున్నారు.
సుంకాలు లేని చైనా వస్త్రాలు (డ్యూటీ ఫ్రీ చైనీస్ గార్మెంట్స్), దిగుమతి రాయితీల వల్ల బంగ్లాదేశ్ ఎగుమతిదారులు లబ్దిపొందుతున్నారని, దీనివల్ల వారికి భారత మార్కెట్లో 10 శాతం నుంచి 15 శాతం తక్కువ ధరకు వస్త్రాలు విక్రయించే వీలు కలుగుతుందని భారతీయ టెక్స్టైల్ కంపెనీలు ఎంతోకాలంగా ఫిర్యాదు చేస్తున్నాయని ఈ నివేదిక పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ నిర్ణయంపై క్లాతింగ్ మాన్యుఫ్యాక్ఛరింగ్ ఆసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ సంతోష్ కటారియా వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడుతూ, ”ఎలాంటి ఇబ్బందులు లేకుండా విదేశీ వస్త్రాలను తక్కువ ధరకు విక్రయిస్తుండడం వల్ల భారతీయ ఉత్పత్తిదారులు, మరీముఖ్యంగా ఎంఎస్ఎంఈలు దెబ్బతింటున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతోకాలంగా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారమవుతుంది” అని అన్నారు.
”విదేశీ వస్త్రాల డంపింగ్‌ను నిరోధించేందుకు, వస్త్ర తయారీ రంగంలో భారత్ స్వావలంబన సాధించేందుకు సకాలంలో తీసుకున్న నిర్ణయం ఇది. వ్యాపారాన్ని సులభతరం చేయడంతో పాటు భారతీయ తయారీదారుల సామర్థ్యాల అభివృద్ధికి నిరంతర మద్దతు కల్పించడం ద్వారా ఈ విధానాన్ని మరింత బలోపేతం చేయాలి” అని ఆయన కోరారు.
అలాగే, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ చైర్మన్ రాకేశ్ మెహ్రా పీటీఐతో మాట్లాడుతూ, ”2025 ఏప్రిల్‌లో, భారత్ నుంచి వచ్చే నూలుపై బంగ్లాదేశ్ నిషేధం విధించింది. ఇది భారత మొత్తం నూలు ఎగుమతుల్లో 45 శాతం. ఈ ఏకపక్ష వాణిజ్య ఆంక్షలకు ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య బలమైన, వ్యూహాత్మక నిర్ణయంగా కనిపిస్తోంది” అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
బంగ్లాదేశ్ వ్యాపారులు, నిపుణులు ఏమంటున్నారు?
బీబీసీ బంగ్లా రిపోర్ట్ ప్రకారం, కొన్నేళ్లుగా భారత్‌కు రెడీమేడ్ వస్త్రాల ఎగుమతులు బాగా పెరిగినట్లు బంగ్లాదేశ్ వ్యాపారవేత్తలు, ముఖ్యంగా రెడీమేడ్ వస్త్ర వ్యాపారంతో సంబంధమున్న వారు చెబుతున్నారు.
అంతేకాకుండా, బంగ్లాదేశ్ ఉత్పత్తులకు భారత ఈశాన్య రాష్ట్రాల్లో కూడా మార్కెట్ విస్తరించింది. దీంతో, చాలా కంపెనీలు ఈ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేందుకు యోచిస్తున్నాయి.
భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో అవన్నీ ప్రభావితమవుతాయని చాలామంది వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం ల్యాండ్ పోర్టుల నుంచి కాకుండా నౌకాశ్రయాల ద్వారానే ఈ రెడీమేడ్ వస్త్రాలను పంపించాల్సి ఉంది. దీంతో ఖర్చు, సమయం రెండూ పెరుగుతాయి.
రెండు దేశాలకూ ఈ నిర్ణయం చేటు కలిగించనుందని బంగ్లాదేశ్ గార్మెంట్స్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (బీజీఎంఈఏ) మాజీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఫైసల్ సమద్ అన్నారు.
”ల్యాండ్ పోర్టుల ద్వారా వస్తువులను పంపినప్పుడు మాకు సమయం, ఖర్చు తగ్గుతుంది. ఓడరేవుల ద్వారా అయితే ఖర్చు, సమయం పెరుగుతాయి. ఇది కేవలం మాకే కాదు. భారత దిగుమతిదారులకు కూడా నష్టమే” అని ఫైసల్ సమద్ బీబీసీతో చెప్పారు.
” భారత్‌కు ఎగుమతులు భారీస్థాయిలో లేకపోవచ్చు, కానీ మొత్తం బంగ్లాదేశ్ ఎగుమతుల నిష్పత్తిలో ఈ వాటా తక్కువైతే కాదు” అని ఢాకా యూనివర్సిటీ ఇంటర్నేషనల్ బిజినెస్ డిపార్ట్మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మొహమ్మద్ మోనిరుల్ ఇస్లాం అన్నారు.
” భారత్ తీసుకున్న ఈ నిర్ణయం కచ్చితంగా బంగ్లాదేశ్ వాణిజ్యంపై ప్రభావం చూపుతుంది. ఎందుకంటే, మన మార్కెట్లు చాలా పరిమితం. ఉత్పత్తుల వైవిధ్యం కూడా తక్కువే. భారత్‌కు ఎగుమతయ్యే వస్తువుల్లో చాలా వాటిని అభివృద్ధి చెందిన దేశాలకు పంపలేం. అంతేకాక, ఓడరేవుల ద్వారా ఎగుమతి చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం” అని ఆయన అన్నారు.
ఎగుమతుల మార్కెట్లో తలెత్తనున్న ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు బంగ్లాదేశ్ పాలకుల వద్ద ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేదని ఆయన అన్నారు. భారత్‌తో ఎగుమతుల విషయంలో ఏదైనా సమస్య తలెత్తితే, దానికి ప్రత్యామ్నాయం లేదా పరిష్కారంపై స్పష్టత లేకపోవడానికి ఇదే కారణమన్నారు.

ఫొటో సోర్స్, ANI
కేవలం వాణిజ్య కోణంలోనే చూడాలా?
ఈ విషయం కేవలం ఆర్థికపరమైన నిర్ణయం కాదని, ఇది రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను ప్రతిబింబిస్తుందని బంగ్లాదేశ్‌కు చెందిన పరిశోధనా సంస్థ సెంటర్ ఫర్ పాలసీ డైలాగ్ (సీపీడీ) సీనియర్ ఫెలో దేబప్రియా భట్టాచార్య బీబీసీ బంగ్లాతో చెప్పారు.
బ్యాంకాక్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు ముహమ్మద్ యూనస్ సమావేశం తర్వాత కూడా ఇలాంటి నిర్ణయం రావడం ‘షాకింగ్’ అన్నారు.
”ఇలాంటి చర్యలను అప్పటికప్పుడు తీసుకోరు. రెండు దేశాల మధ్య సంబంధాలు క్లిష్టంగా, అస్థిరంగా మారుతుండటం ఆందోళన కలిగించే అంశం. దీన్ని అధిగమించేందుకు రాజకీయపరంగా ప్రయత్నాలు జరగాలి. పరస్పర గౌరవం, ప్రయోజనాలకు అనుగుణంగా భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది” అని ఆమె అన్నారు.
భారత్ – బంగ్లాదేశ్ మధ్య ప్రస్తుత వాణిజ్య వివాదం కేవలం దిగుమతులు – ఎగుమతులకే పరిమితం కాదని గ్లోబల్ ట్రేడ్ రీసర్చ్ ఇనిషియేటివ్ (జీటీఆర్ఐ) గ్రూప్ నివేదిక పేర్కొంది.
ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం చైనాకు దగ్గరవుతూ, కొత్తగా 2.1 బిలియన్ డాలర్ల (సుమారు రూ.17,939 కోట్లు) ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో ఇది కేవలం వాణిజ్యానికే పరిమితం కాదని ఈ నివేదిక తెలిపింది.
భారత్ చర్యను ప్రాంతీయంగా పెరుగుతున్న బీజింగ్ ప్రాభవానికి వ్యూహాత్మక వ్యతిరేక విధానంలో భాగంగా చూడొచ్చు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)