SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, X/Shehbaz Sharif
చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్తాన్ మధ్య నాలుగు రోజులపాటు సాగిన ఘర్షణ కాల్పుల విరమణతో ముగిసింది. విజయం సాధించినట్లు ఇరుదేశాలూ చెబుతున్నాయి. కానీ, ఇప్పడు చైనా రక్షణ పరిశ్రమ కూడా అనూహ్య విజేతగా కనిపిస్తోంది.
పహల్గాంలో ఏప్రిల్ 22న తీవ్రవాదులు 26 మంది పౌరులను హతమార్చినందుకు ప్రతిస్పందనగా, భారత్ మే 7న పాకిస్తాన్‌లోని ”ఉగ్రవాదుల స్థావరాలు”గా చెబుతున్న వాటిపై దాడులు చేయడంతో ఈ ఉద్రిక్తతలు మొదలయ్యాయి.
పహల్గాంలో హత్యకు గురైవారిలో చాలా మందిని వారి భార్యలు, కుటుంబ సభ్యుల కళ్ల ముందే కాల్చి చంపారు. అలాంటి ”ఉగ్రవాద గ్రూపులకు ఇస్లామాబాద్ మద్దతు ఇస్తోంది” అని దిల్లీ ఆరోపిస్తోంది. కానీ, ఈ ఆరోపణలను పాకిస్తాన్ తోసిపుచ్చుతోంది.
ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ ప్రతిస్పందన తర్వాత ఇరుదేశాల మధ్య డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాలతో సైనిక చర్యలు సాగాయి.


ఫొటో సోర్స్, Getty Images
విమానాల కూల్చివేతపై ఎవరేమన్నారు?
భారత్ ఫ్రాన్స్, రష్యా తయారీ జెట్లను ఉపయోగించగా, పాకిస్తాన్ జె-10తోపాటు చైనా, పాకిస్తాన్ సంయుక్తంగా తయారు చేసిన జె-17 యుద్ధ విమానాలను మోహరించింది. అయితే, ఇరుదేశాలూ తమ విమానాలు సరిహద్దులు దాటలేదని, దూరం నుంచి క్షిపణులు ప్రయోగించినట్లు చెబుతున్నాయి.
భారత్ ఇటీవల కొత్తగా కొనుగోలు చేసిన ఫ్రాన్స్ తయారీ రఫేల్ యుద్ధ విమానం సహా ఆరు విమానాలను కూల్చివేశామని ఇస్లామాబాద్ ప్రకటించింది. అయితే, దిల్లీ ఈ ప్రకటనపై స్పందించలేదు.
ఇదే విషయమై ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, ”యుద్ధంలో నష్టాలు కూడా భాగమే” అని ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఎయిర్ మార్షల్ ఏకే భారతి చెప్పారు. భారత విమానాలను పాకిస్తాన్ కూల్చివేసిందనే నిర్దిష్ట వాదనపై స్పందించడానికి ఎయిర్ మార్షల్ భారతి నిరాకరించారు.
”మేము ఎంచుకున్న లక్ష్యాలను సాధించాం. మా పైలట్లు అందరూ క్షేమంగా తిరిగి వచ్చారు” అని ఆయన చెప్పారు.
పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న నిషేధిత లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థల ప్రధాన కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడుల్లో కనీసం ”100 మంది ఉగ్రవాదులను” హతమార్చినట్లు భారత్ తెలిపింది.
వైమానిక యుద్ధంలో నిజంగా ఏం జరిగిందనే విషయంపై కచ్చితమైన వివరాలు ఇంకా బయటకు రాలేదు. పంజాబ్‌లోనూ, కశ్మీర్‌లో ఒకే సమయంలో విమానాలు కూలినట్టు కొన్ని మీడియా సంస్థలు పేర్కొన్నాయి, అయితే, ఈ వార్తలపై భారత ప్రభుత్వం స్పందించలేదు.

ఫొటో సోర్స్, AFP
చైనా కంపెనీలకు ”డీప్‌సీక్ మూమెంట్”
భారత యుద్ధ విమానాలపై గగనతల క్షిపణులను ప్రయోగించడానికి పాకిస్తాన్ చైనా తయారీ జె-10 యుద్ధ విమానాన్ని ఉపయోగించి ఉండవచ్చని అమెరికా అధికారులను పేర్కొంటూ రాయిటర్స్ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది.
యుద్ధ సమయంలో, చైనా ఆయుధాలపై ఆధారపడడం ద్వారా విజయం సాధించినట్టు పాకిస్తాన్ చేస్తున్న వాదనను బీజింగ్ రక్షణ రంగ పరిశ్రమలకు ప్రోత్సాహకరంగా కొందరు నిపుణులు చూస్తుండగా, మరికొంతమంది ఈ వాదనతో విభేదిస్తున్నారు.
ఈ ఏడాది జనవరిలో అమెరికా దిగ్గజ కంపెనీలను కుదిపేసిన చైనా స్టార్టప్ కంపెనీ డీప్‌సీక్‌తో పోల్చుతూ, చైనా రక్షణ రంగ పరిశ్రమలకు దీనిని ”డీప్‌సీక్ మూమెంట్”గా నిపుణులు అభివర్ణిస్తున్నారు.
”వైమానిక పోరాటం చైనా ఆయుధ పరిశ్రమలకు ఓ పెద్ద వాణిజ్యప్రకటన. ఇప్పటిదాకా యుద్ధం లాంటి పరిస్థితుల్లో పరీక్షలు జరపడానికి చైనాకు అవకాశం రాలేదు” అని చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన రిటైర్డ్ సీనియర్ కల్నల్ జౌ బో బీబీసీకి చెప్పారు.
భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన గగనతల పోరాట సారాంశం ”చైనాకు చెందిన కొన్ని వ్యవస్థలు ఎవరికీ తీసిపోనివి” అని చూపిందని బీజీంగ్‌లోని విశ్లేషకుడు చెప్పారు.
జె-10 లాంటి యుద్ద విమానాలను తయారుచేసే చైనాకు చెందిన ఎవిక్ చెంగ్డూ కంపెనీ షేర్లు గతవారం 40 శాతం పెరిగాయి. భారత్, పాకిస్తాన్ ఘర్షణలో యుద్ద విమానాల పనితీరుపై వార్తల అనంతరం ఈ షేర్లు పెరిగాయి.
అది తొందరపాటు కావొచ్చు..
అయితే, చైనా ఆయుధాల ఆధిపత్యాన్ని నిర్ణయించడం తొందరపాటు అవుతుందని మరికొందరు నిపుణులు అంటున్నారు.
చైనా జెట్లు భారత వాయు సేన విమానాలు (ఐఏఎఫ్) ప్రత్యేకించి రఫేల్‌పై పైచేయి సాధించాయా? అనే విషయం నిర్థరణ కావాల్సి ఉందని లండన్‌లోని కింగ్స్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న వాల్టెర్ లాడ్విగ్ అన్నారు.
”ప్రామాణిక సైనిక సిద్ధాంతం ప్రకారం, భూమి మీద లక్ష్యాలను ధ్వంసం చేసేముందు శత్రువు గగనతల రక్షణ వ్యవస్థపై ఆధిపత్యం సాధిస్తారు. కానీ, పాకిస్తాన్ సైన్యాన్ని ప్రతీకారానికి రెచ్చగొట్టడం భారత వాయుసేన లక్ష్యం కానట్టు స్పష్టంగా కనిపిస్తోంది” అని ఆయన చెప్పారు.
పాకిస్తాన్ వైమానిక దళం అప్రమత్తంగా ఉన్నప్పటికీ, అప్పటికే ఆకాశంలో ఉన్న తమ విమానాలను ముందుకు నడపాలని భారత పైలట్లకు ఆదేశాలు ఇచ్చారని లాడ్విగ్ భావిస్తున్నారు. అయితే ,ఈ మిషన్ గురించి గానీ, వైమానిక కార్యకలాపాల వ్యూహం గురించి గానీ ఐఏఎఫ్ వివరాలు వెల్లడించలేదు.
రఫేల్ సహా, భారత యుద్ధ విమానాలను జె-10 కూల్చివేసిందనే వార్తలపై బీజింగ్ కూడా ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. కానీ, పాశ్చాత్య ఆయుధ వ్యవస్థను జె-10 కూల్చివేసిందనే ధ్రువీకరణ లేని వార్తలు చైనా సోషల్ మీడియాను విజయోత్సాహాలు, హర్షాతిరేకాలతో హోరెత్తించాయి.
అందుబాటులో ఉన్న సమాచారంతో ఓ నిర్థరణకు రాలేని పరిస్థితుల్లో కూడా, చైనా సోషల్ మీడియాలో జాతీయ భావన సందేశాలు వెల్లువెత్తాయని వెరోనాలోని ఇంటర్నేషనల్ టీమ్ ఫర్ ది స్టడీ ఆఫ్ సెక్యూరిటీలోని చైనా పరిశోధకురాలు కార్లొట్టా రైనౌడో చెప్పారు.
”ఇలాంటి సందర్భాలలో నిజాల కంటే ప్రజలు పరిస్థితులను ఎలా గ్రహిస్తారనేది ముఖ్యం. మనం దానిని అదే విధంగా చూస్తే, చైనానే నిజమైన విజేత” అని ఆమె చెప్పారు.
చైనాకు పాకిస్తాన్ వ్యూహాత్మకంగా, ఆర్థికపరంగా మిత్రదేశం. చైనా, పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్‌లో భాగంగా, పాకిస్తాన్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు 50 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెడుతోంది.
కాబట్టి, బలహీనమైన పాకిస్తాన్ చైనా ప్రయోజనాలకు అంత ఉపయోగకరం కాదు.

ఫొటో సోర్స్, Planet Labs
చైనా ఆయుధాల ప్రామాణికతపై విమర్శలేంటి?
భారత్, పాక్ ఘర్షణలో చైనా కీలక పాత్ర పోషించిందని పాకిస్తాన్ భద్రతా విశ్లేషకులు ఇంతియాజ్ గుల్ అన్నారు. ”ఇది భారత వ్యూహకర్తలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆధునిక యుద్ధంలో పాకిస్తాన్, చైనా మధ్య ఎంతలోతైన సహకారం ఉందనేది వారు ఊహించి ఉండరు” అని చెప్పారు.
నిజమైన యుద్ధ పరిస్థితుల్లో చైనా జెట్ల పనితీరును పాశ్చాత్య దేశాలలో నిశితంగా విశ్లేషించారని, ఇది అంతర్జాతీయ ఆయుధ వ్యాపారంపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలో అమెరికా అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారు కాగా, చైనా 4వ స్థానంలో ఉంది.
మియన్మార్, పాకిస్తాన్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు చైనా ఎక్కువగా ఆయుధాలను విక్రయిస్తుంది. గతంలో చైనా ఆయుధ వ్యవస్థలు నాణ్యత, సాంకేతిక సమస్యలతో సతమతమవుతున్నాయని విమర్శలు వెల్లువెత్తాయి.
బర్మీస్ సైన్యం 2022లో చైనా, పాకిస్తాన్ సంయుక్తంగా తయారు చేసిన జేఎఫ్-17 యుద్ధ విమానాల్లో చాలా వాటిని సాంకేతిక లోపాల కారణంగా నిలిపివేసింది
చైనా తయారు చేసిన ఎఫ్-7 యుద్ధ విమానాల్లో పలు సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు నైజీరియా సైన్యం నివేదించింది.
ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే, పాకిస్తాన్ చేతిలో భారత్ ఒక విమానాన్ని కోల్పోవడం ఇదే మొదటిసారి కాదు.
పాకిస్తాన్‌లోని అనుమానిత ఉగ్రవాద స్థావరాలపై 2019లో భారత వైమానిక దాడుల తరువాత ఇరుపక్షాల మధ్య కొద్దిసేపు వైమానిక పోరాటం జరిగినప్పుడు, రష్యా తయారు చేసిన మిగ్ -21 జెట్‌ను పాకిస్తాన్ భూభాగంలో కూల్చివేసి పైలట్‌ను బంధించారు. కొన్ని రోజుల తర్వాత ఆయన విడుదలయ్యారు.
అయితే, అమెరికా తయారు చేసిన ఎఫ్-16 సహా పాక్ యుద్ధ విమానాలను విజయవంతంగా కూల్చివేసిన తర్వాత పైలట్ తప్పించుకున్నాడని భారత్ తెలిపింది. అయితే, ఈ వాదనను పాకిస్తాన్ తోసిపుచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
‘‘భారత్ లక్ష్యాలను సాధించింది’’
గత వారం భారత విమానాలను కూల్చివేసినట్లు వార్తలు వచ్చినప్పటికీ, మే 10 తెల్లవారుజామున పాకిస్తాన్‌లో భారత్ ” తన లక్ష్యాలను ఛేదించగలిగిందని”, ఈ వాస్తవాన్ని అంతర్జాతీయ మీడియా పెద్దగా గుర్తించలేదని లాడ్విగ్ వంటి నిపుణులు వాదిస్తున్నారు.
పాకిస్తాన్ సైనిక ప్రధాన కార్యాలయానికి కొద్దిదూరంలో ఉన్న రావల్పిండికి సమీపంలోని వ్యూహాత్మక నూర్ ఖాన్ వైమానిక స్థావరంతో సహా, దేశవ్యాప్తంగా ఉన్న 11 పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై క్షిపణులను ప్రయోగించినట్లు భారత సైన్యం తెలిపింది. ఇది ఇస్లామాబాద్‌ను ఆశ్చర్యానికి గురిచేసే లక్ష్యం.
భోలారీలో జరిగిన దాడి అత్యంత సుదూర లక్ష్యాల్లో ఒకటి, కరాచీ నగరానికి 140 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
ఈసారి ఐఏఎఫ్ ప్రామాణిక విధానాలతో పనిచేసిందని లాడ్విగ్ చెప్పారు. మొదట పాకిస్తాన్ వైమానిక రక్షణ రాడార్ వ్యవస్థలపై దాడి చేసి, తరువాత భూమిపైన ఉన్న లక్ష్యాలపై దృష్టి సారించింది.
చైనా అందించిన హెచ్‌క్యూ 9 గగనతల రక్షణ వ్యవస్థ పాకిస్థాన్ వద్ద ఉన్నప్పటికీ, భారత విమానాలు మిసైల్స్, డ్రోన్లను ప్రయోగించాయి.
”ఈ దాడులు చాలా కచ్చితమైనవి, లక్ష్యాన్ని గురిచూసి కొట్టినట్లు తెలుస్తోంది. రన్‌వేల మధ్యలో గుంతలు ఉన్నాయి. ఇది సుదీర్ఘ సంఘర్షణ అయితే, పాకిస్తాన్ వైమానిక దళం వీటిని సాధారణ స్థితికి తీసుకువచ్చి, తమ కార్యకలాపాలు చేపట్టడానికి ఎంత సమయం పడుతుందో నేను చెప్పలేను” అని లాడ్విగ్ అభిప్రాయపడ్డారు.
ఏదేమైనా, భారత సైన్యం తమ కార్యకలాపాల వివరాలు చెప్పడానికి నిరాకరించడం ద్వారా, ఇతరులు ”నచ్చినట్టుగా కథలు చెప్పుకోవడానికి” అవకాశం ఇచ్చిందని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
చైనాకు ఒనగూరిన లబ్ధి ఏంటి?
భారత గగనతల దాడులకు ప్రతిగా తాము కూడా సరిహద్దుకు దగ్గరలోని అనేక భారత ఎయిర్ బేస్‌లపై మిస్సైల్స్, వైమానిక దాడులు చేశామని పాకిస్తాన్ చెప్పింది. అయితే ఈ దాడులు తమ సిబ్బందికి గానీ, పరికరాలకు గానీ ఎటువంటి నష్టం కలిగించలేదని దిల్లీ చెప్పింది.
పరిస్థితి చేయి దాటుతోందని గ్రహించిన అమెరికా, ఇతర మిత్రదేశాలు జోక్యం చేసుకుని, ఘర్షణ ఆపాల్సిందిగా ఇరుదేశాలపై ఒత్తిడి చేశాయి.
అయితే, ఈ మొత్తం వ్యవహారం ఇండియాకు ఒక మేలుకొలుపు అని నిపుణులు చెబుతున్నారు.
భారత్, పాకిస్తాన్ ఘర్షణపై బీజింగ్ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ తమ ఆయుధ వ్యవస్థ పాశ్చాత్య దేశాలతో గట్టిగా పోటీపడగలదని చెప్పేందుకు ఎదురుచూస్తోంది.
పాకిస్తాన్‌కు చైనా సరఫరా చేసిన పాత జెట్ విమానాల్లో కొన్నింటి గురించి దిల్లీకి తెలుసు. కానీ, రాడార్లను తప్పించుకునే సామర్థ్యం కలిగిన మరింత అధునాతన J-20 స్టెల్త్ ఫైటర్ జెట్లను బీజింగ్ ఇప్పటికే సమకూర్చుకుంది.
హిమాలయాల వెంబడి భారత్, చైనా మధ్య సుదీర్ఘకాలంగా సరిహద్దు వివాదం ఉంది.1962లో స్వల్ప సరిహద్దు యుద్ధం జరిగింది. భారత్ ఓటమి పాలైంది. 2020 జూన్‌లో లద్దాఖ్‌లో స్వల్ప సరిహద్దు ఘర్షణ జరిగింది
దేశీయ రక్షణ రంగ పరిశ్రమలో పెట్టుబడులను వేగంగా పెంచాలని, అంతర్జాతీయ కొనుగోళ్లను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్న విషయంపై భారత్‌కు అవగాహన ఉందని నిపుణులు అంటున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)