SOURCE :- BBC NEWS

ట్రంప్‌కు చోటిస్తే..

ఫొటో సోర్స్, Copyright Getty Images

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో దాడి తర్వాత, భారత్, పాకిస్తాన్ మధ్య పెరిగిన ఉద్రిక్తత సైనిక చర్యలకు దారితీసింది.

మే 10న సాయంత్రం ‘కాల్పుల విరమణ’ ప్రకటనతో రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం చల్లారింది.

అయితే, కాల్పుల విరమణ తర్వాత చాలా విషయాలు చర్చకు వచ్చాయి.

ఇందులో ఎక్కువగా మాట్లాడుకున్నది అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ గురించే. ఎందుకంటే భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించిన మొదటి వ్యక్తి ఆయనే.

అంతేకాదు, భారత్, పాకిస్తాన్ వద్దనున్న అణ్వాయుధాల గురించి కూడా చర్చ జరిగింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

ఫొటో సోర్స్, AP

జమ్మూ కశ్మీర్

ఫొటో సోర్స్, Getty Images

కశ్మీర్ పరిస్థితులు ఎలా ఉన్నాయి?

“జమ్మూకశ్మీర్‌లో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది”అని కేంద్ర ప్రభుత్వం చాలా రోజులుగా చెబుతూ వచ్చింది. అయితే, పహల్గాం దాడితో జమ్మూకశ్మీర్ భద్రతపై చాలామందిలో ప్రశ్నలు తలెత్తాయి.

లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ “జమ్మూకశ్మీర్‌లో పరిస్థితి సాధారణంగా ఉందని డొల్ల మాటలు చెప్పడానికి బదులుగా, ప్రభుత్వం జవాబుదారీతనం తీసుకుని కచ్చితమైన చర్యలు తీసుకోవాలి” అన్నారు.

అయితే, ఒక్క పహల్గాం ఘటనతో కశ్మీర్ భద్రతను అంచనా వేయలేయమని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాన్‌ఫ్లిక్ట్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ అజయ్ సాహ్ని అంటున్నారు.

“కశ్మీర్‌లో పరిస్థితి చాలా మెరుగుపడింది. కానీ, ఈ ఒక్క సంఘటనతో కశ్మీర్ అంతర్గత భద్రతను అంచనా వేయలేం. కశ్మీర్‌లో పదహారేళ్లుగా తీవ్రమైన సంఘర్షణ జరుగుతోందని ప్రస్తుతం ప్రజలు మర్చిపోయారు. అక్కడ 2001లో 4,011 మంది ప్రాణాలు కోల్పోయారు. గత సంవత్సరం 127 మంది చనిపోయారు. మేలో 50 మంది మరణించారు. వీరిలో భద్రతా సిబ్బంది, ఉగ్రవాదులు, పౌరులు ఉన్నారు” అని అజయ్ తెలిపారు.

“కాబట్టి, కశ్మీర్‌లో పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంది. అయితే, అక్కడ సాధారణ స్థితి ఉందని, ఉగ్రవాదం లేదని ప్రభుత్వం భావిస్తూ ప్రకటించడమే తప్పు. ఇదేం భద్రతాపరమైన అంచనా కాదు. కశ్మీర్‌లో ముప్పు నేటికీ ఉంది, చాలాకాలం పాటు కొనసాగుతుంది. కశ్మీర్‌తో తనకు ఎటువంటి సంబంధం లేదని పాకిస్తాన్ ఆ అంశాన్ని వదిలేవరకూ అలాగే ఉంటుంది”అని ఆయన అన్నారు.

అజయ్ సాహ్ని

‘దీర్ఘకాలిక వ్యూహం ఉండాలి’

పాకిస్తాన్‌ విషయంలో భారత్‌కు దీర్ఘకాలిక వ్యూహం ఉండాలని అజయ్ సాహ్ని అభిప్రాయపడ్డారు.

“సిమ్లా ఒప్పందం తర్వాత, ఏ వివాదమైనా ద్వైపాక్షికంగానే పరిష్కరించుకుంటామని భారత్ చెప్పింది. వాస్తవానికి, అమెరికా ఈ వివాదంలో జోక్యం చేసుకుంది, చాలాకాలంగా అలా చేయడానికి ప్రయత్నిస్తోంది. బహిరంగంగా చెప్పలేని విషయాలు కూడా కొన్ని ఉన్నాయి” అని అజయ్ అన్నారు.

“బహిరంగ ప్రతిస్పందన అవసరం లేదు, పాకిస్తాన్‌కు హాని కలిగించడానికి వంద మార్గాలు ఉన్నాయి. రహస్య ప్రతిస్పందన విషయానికి వస్తే, ఆర్థిక, సైబర్, ఇన్ఫర్మేషన్ వార్ వంటివి ఉంటాయి. పాకిస్తాన్‌ కోసం దీర్ఘకాలిక వ్యూహం ఉండాలి” అని ఆయన అభిప్రాయపడ్డారు.

పహల్గాం దాడి తర్వాత, భారత్ అనేక చర్యలు తీసుకుంది. సింధు జల ఒప్పందాన్ని నిలిపివేసింది, పాకిస్తానీల వీసాలు రద్దు చేసింది. దీనికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ ‘సిమ్లా’ సహా కీలక ద్వైపాక్షిక ఒప్పందాలను రద్దు చేసుకుంది. వాణిజ్యాన్నీ నిలిపివేసింది.

1971 భారత్, పాక్ యుద్ధం తర్వాత, తూర్పు పాకిస్తాన్ ప్రాంతం బంగ్లాదేశ్‌గా అవతరించింది. అనంతరం, భారత్, పాక్ మధ్య ఈ సిమ్లా ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం, ఇరు దేశాల సమస్యలను ద్వైపాక్షికంగానే పరిష్కరించుకోవాలి.

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్

ట్రంప్ ప్రకటనతో కశ్మీర్‌ రాజకీయాలు ఎలా ఉండనున్నాయి?

“భారత్‌కు చాలాకాలంగా ఎవరూ సాయపడలేదు. మరి భారత్ ఎందుకు ఒకరి తలుపు తట్టాలి. భారత్ బాధిత దేశం మాత్రమే కాదు, విజేత కూడా. భారత్ ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది. కశ్మీర్‌లో ఏడాదికి 4000 మంది మరణించేవారు, అది 127 మందికి తగ్గింది. ఉగ్రవాదం ఉంది కానీ, అంతమవుతోంది. అది కూడా భారత సామర్థ్యం, పని కారణంగానే సాధ్యమైంది” అని అజయ్ సాహ్నీ బీబీసీతో చెప్పారు.

పాకిస్తాన్‌తో కాల్పుల విరమణ తర్వాత, భారత్ ఎక్కడా ట్రంప్ పేరును ప్రస్తావించలేదు. ఈ ప్రశ్నపై అజయ్ సాహ్ని స్పందిస్తూ “ట్రంప్‌ను తప్పకుండా వ్యతిరేకించాలి. మీరు ట్రంప్‌కు ఎదురు నిలవకపోతే, ఆయన తనకు కావాల్సిన స్థానానికి చేరుతారు. మీరు ఆయనకు అవకాశం ఇస్తే, చాలా దూరం వెళతారు” అన్నారు.

నిజానికి, భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ విషయాన్ని ట్రంప్ తన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం ట్రూత్‌సోషల్‌లో ప్రకటించారు. ఇందుకు అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని కూడా చెప్పారు.

కానీ ఇండియా అమెరికా విషయాన్ని ప్రస్తావించలేదు. పాకిస్తాన్, భారత్ మధ్య సైనిక ఘర్షణను నివారించడానికి ఒక ఒప్పందానికి వచ్చాయని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రెస్ బ్రీఫింగ్‌లో చెప్పారు. పాకిస్తాన్ డీజీఎంఓ, ఇండియా డీజీఎంఓ‌కు ఫోన్ కాల్ చేసిన తరువాత ఇరుదేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయని చెప్పారు.

జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలోనూ ప్రధాని మోదీ ఇదే విషయాన్ని చెప్పారు.

కానీ ఆ తరువాతరోజే డోనల్డ్ ట్రంప్ కశ్మీర్ విషయంపై ‘ట్రూత్ సోషల్‌’లో ఒక పోస్టు పెట్టారు.

‘‘ వేలాది సంవత్సరాల నుంచి వివాదాస్పదంగా ఉన్న కశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి ఈ రెండు గొప్పదేశాలతో కలిసి పనిచేయడం కోసం ఎదురుచూస్తున్నాను. దీనివల్ల ఆ ప్రాంతంలో శాంతి, ప్రగతి వర్థిల్లుతాయి. అమెరికాతోనూ ఇతరదేశాలతోనూ వాణిజ్యం పెరుగుతుంది’’ అని ఆ పోస్టులో రాశారు.

కానీ, కశ్మీర్ విషయంలో మూడో దేశం జోక్యాన్ని అంగీకరించమని భారత్ ఎప్పటినుంచో చెబుతూ వస్తోంది.

ప్రధాని మోదీ

ఫొటో సోర్స్, ANI

ఇపుడు పరిస్థితులు మారుతాయా?

భారత్, పాకిస్తాన్ మధ్య ఇప్పుడు ఏదైనా మారుతుందా? అనే ప్రశ్నకు అజయ్ సాహ్ని బదులిస్తూ “నా అభిప్రాయం ప్రకారం ఏమీ మారదు. సమాచార యుద్ధమనేది యుద్ధంలో చాలా ముఖ్యమైన భాగం కానీ, పాకిస్తాన్‌పై భారత్ సమాచార యుద్ధం చేయలేదు. పాకిస్తాన్ కూడా అలా చేయడం లేదు. రెండు దేశాలు తమ ప్రజలపై దృష్టి సారించాయి” అన్నారు.

అణు యుద్ధం చర్చ గురించి అజయ్ మాట్లాడుతూ “అణు యుద్ధం ఊరికే అలా ప్రారంభం అయిపోదు. చిన్నపాటి అణు యుద్ధం ముప్పు ఉన్నా దిల్లీలోని ప్రతి రాయబార కార్యాలయం ఖాళీ అయ్యేది. ఆపరేషన్ పరాక్రమ్ సమయంలో ఒక్క బుల్లెట్ కూడా పేల్చలేదు కానీ, రాయబార కార్యాలయాలను ఖాళీ చేయించారు” అని అన్నారు.

‘అణు’ అనే పదాన్ని పాకిస్తాన్ ఉపయోగిస్తోంది, ట్రంప్ కూడా ఆ పదం వాడారు. న్యూక్లియర్ డెటరెన్స్ అంటే పరస్పర హామీతో జరిగే విధ్వంసం. ఇది ఉపయోగించకూడని సాధనం లేదా ఆయుధం. ఎందుకంటే అది ఈ దేశాలనే కాదు, బహుశా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిదాన్ని నాశనం చేయగలదు” అని అజయ్ సాహ్నీ అన్నారు.

భారత ప్రధానమంత్రి జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో “భారతదేశం ఎటువంటి అణు బెదిరింపులను సహించదు” అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)