SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్‌లోని తీవ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా మే 7 వ తేదీ తెల్లవారుజామున మిసైల్ దాడులు చేసినట్లు భారత సైన్యం ప్రకటించింది.
ఈ సైనిక చర్యకు ‘ఆపరేషన సిందూర్’ అని పేరు పెట్టింది.
భారత్ పాకిస్తాన్ మధ్య ఇటీవల ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో రెండు దేశాల సైనిక శక్తి సామర్థ్యాల మీద చర్చ మొదలైంది.
రెండు దేశాల వద్ద ఏయే క్షిపణులు ఉన్నాయి, గగనతల రక్షణ వ్యవస్థలు ఎలా ఉన్నాయో చూద్దాం.

భారతదేశపు అగ్ని-5 క్షిపణి ఉపరితలం మీద 5 నుంచి 8వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలపై దాడి చేయగలదు. పాకిస్తాన్ వద్ద ఉన్న షహీన్-3 క్షిపణి రేంజ్ 2,750 కిలోమీటర్లు.
ఆయుధాల కోసం భారతదేశం ఎక్కువగా రష్యా మీద, పాకిస్తాన్ చైనా మీద ఆధారపడుతున్నాయి.
పశ్చిమ దేశాలు చాలా కాలంగా భారత్‌కు క్షిపణి సాంకేతిక పరిజ్ఞానం ఇవ్వడాన్ని ఆపేశాయి.
అయితే మిసైల్ టెక్నాలజీ విషయంలో భారత్, ఫ్రాన్స్ కలిసి పని చేస్తున్నాయి.
ఇందులో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి. ప్రపంచంలో ఏడు దేశాల దగ్గర మాత్రమే ఇవి ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
యాంటీ బాలిస్టిక్ మిసైల్ సిస్టమ్
“యాంటీ బాలిస్టిక్ మిసైల్ సిస్టమ్ ఉన్న కొన్ని దేశాల్లో భారత్ కూడా ఒకటి. భారతదేశపు క్షిపణి రక్షణ వ్యవస్థలో రెండు రకాల క్షిపణులు ఉన్నాయి. ఇందులో మొదటిది పృథ్వి ఎయిర్ డిఫెన్స్ మిసైల్. ఇది చాలా ఎత్తులో కూడా క్షిపణి దాడుల్ని అడ్డుకోగలదు. రెండోది అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్. ఇది తక్కువ ఎత్తులో కూడా క్షిపణి దాడుల్ని అడ్డుకుంటుంది.
భారత దేశపు యాంటీ బాలిస్టిక్ మిసైల్ సిస్టమ్‌కు 5వేల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయోగించిన క్షిపణుల్ని కూడా అడ్డుకునే సామర్థ్యం ఉందని భావిస్తున్నారు” అని ‘ది నేషనల్ ఇంట్రస్ట్’కు రాసిన కథనంలో రక్షణ రంగ విశ్లేషకుడు హారిసన్ కాస్ తెలిపారు.
భారత్, రష్యాతో కలిసి బ్రహ్మోస్, బ్రహ్మోస్-2 అనే హైపర్‌సోనిక్ క్రూయిజ్ మిసైల్స్‌ను అభివృద్ధి చేసింది. వీటిని నేల, నింగి, సముద్రంతో పాటు సముద్రపు లోతుల నుంచి కూడా ప్రయోగించవచ్చు.
“సంప్రదాయ, అణ్వాయుధ క్షిపణుల విషయంలో భారత్ వద్ద అనేక ఆప్షన్లు ఉన్నాయి. క్షిపణి దాడులను నిరోధించే సామర్థ్యం కూడా భారత్‌కు ఉంది” అని హారిసన్ కాస్ చెప్పారు.
సంప్రదాయ, అణు క్షిపణుల విషయంలో పాకిస్తాన్ వద్ద కూడా అనేక ఆప్షన్స్ ఉన్నాయి. తరచుగా చెలరేగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా రెండు దేశాలు తమ క్షిపణి సామర్థ్యాలను అభివృద్ధి చేసుకున్నాయి.
అయితే భారత్ మాదిరిగా పాకిస్తాన్ వద్ద ఖండాంతర బాలిస్టిక్ మిసైల్ లేదు.
పాకిస్తాన్‌కు అది అంత అవసరం లేదనేది రక్షణ రంగ విశ్లేషకుల అభిప్రాయం.
భారత్ చైనా మధ్య గతంలో యుద్ధం జరిగింది. మరోసారి చైనాను ఎదుర్కోవాల్సి వస్తే అనే కోణంలో భారత్ తన రక్షణ సామర్థ్యాలను అభివృద్ధి చేసుకుంటోంది.
అయితే పాకిస్తాన్ మాత్రం ప్రస్తుతం భారత్ మాత్రమే తన శత్రువు అని భావిస్తోంది.
“భారత్ కోణంలో చూస్తే, పాకిస్తాన్‌కు ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అవసరం లేదు. పాకిస్తాన్ క్షిపణుల సామర్థ్యం ప్రాంతీయ లక్ష్యాలను చేరుకోగల స్థాయిలో ఉంది” అని హారిసన్ కాస్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్ వద్ద ఐసీబీఎం లేదు
వ్యవహారం ఐసీబీఎం వరకు వస్తే ఇక ఏమీ మిగలదని భారత్‌లో ప్రముఖ రక్షణ రంగ విశ్లేషకుడు రాహుల్ బేదీ చెప్పారు.
“ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి గాల్లోకి ఎగరడానికి 15 నుంచి 20 సెకన్లు మాత్రమే. ఇది వ్యూహాత్మక ఆయుధం. చైనాను దృష్టిలో పెట్టుకుని భారత్ దీన్ని అభివృద్ధి చేసింది. పాకిస్తాన్ దగ్గర ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి లేదు. పాకిస్తాన్‌కు దీనితో అవసరం కూడా లేదు. పాకిస్తాన్ ఆయుధాలన్నీ భారత్ లక్ష్యంగా ఉంటే, భారత్ తన రక్షణ సామర్థ్యాన్ని చైనా లక్ష్యంగా పెంచుకుంటోంది. 1998లో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించినప్పుడు ఇదే విషయాన్ని నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు రాసిన లేఖలో వివరించారు” అని రాహుల్ బేదీ చెప్పారు.
చైనాతో కలిసి షహీన్ క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేసింది పాకిస్తాన్. షహీన్ క్షిపణులు స్వల్ప, మధ్యంతర, దీర్ఘశ్రేణి లక్ష్యాలపై దాడులు చేయగలవు.
భారత్ దాడులను ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ కూడా యాంటీ బాలిస్టిక్ మిసైల్ వ్యవస్థలను సమకూర్చుకునే పనిలో ఉంది.
పాకిస్తాన్ దగ్గర హెచ్‌క్యూ-9బీఈ ఉంది. అయితే భారత్ బ్రహ్మోస్ ప్రయోగిస్తే దాన్ని అడ్డుకోవడం పాకిస్తాన్‌కు సాధ్యం కాకపోవచ్చని హారిసన్ చెప్పారు.
బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణుల గురించి ప్రతిపక్ష పార్టీల ఎంపీలు పాకిస్తాన్ పార్లమెంట్‌లో ఆందోళన వ్యక్తం చేశారు. తమ వద్ద ఉన్న బ్రహ్మోస్ మిసైల్స్‌లో ఒకదానిని పొరపాటున పాకిస్తాన్ వైపు ప్రయోగించినట్లు భారత్ ఒకసారి ప్రకటించింది. ఈ ఘటన 2022 మార్చిలో జరిగింది.
“సూపర్ సోనిక్ ఆయుధం ఒకటి 40వేల అడుగుల ఎత్తు నుంచి పాకిస్తాన్ సరిహద్దుల్లో పడింది. అది దేశీయ, అంతర్జాతీయ వాణిజ్య విమానాలు ప్రయాణించే మార్గానికి సమీపంగా వెళ్లింది. భారతదేశం దీని గురించి పాకిస్తాన్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇది ఆ దేశపు బాధ్యతారాహిత్యానికి నిదర్శనం” అని అప్పటి పాకిస్తాన్ జాతీయ భద్రత సలహాదారు మొయిద్ యూసుఫ్ అన్నారు.
ఆ క్షిపణి భారత్ సరిహద్దు నుంచి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ దేశంలోని చిన్న పట్టణం మియాన్ చానులో పడిందని పాక్ అధికారులు తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈసారి ఏం జరిగింది?
“ఈసారి పాకిస్తాన్‌లోకి ప్రవేశించడానికి బదులు తన భూభాగం నుంచే దాడి చేసింది భారత్. ఇందులో పెద్ద విషయం ఏంటంటే, పాకిస్తాన్ ప్రధాన భూభాగమైన పంజాబ్ మీద ఈ దాడి జరిగింది” అని రాహుల్ బేదీ చెప్పారు.
భారత్, పాకిస్తాన్ క్షిపణి సామర్థ్యం గురించి చెప్పాల్సి వస్తే “భారత్ వద్ద బీఎండీ సీల్స్, అంటే బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ ఉంది. పాకిస్తాన్ దగ్గర ఇది లేదు. అయితే బీఎండీ ప్రతీసారి వందశాతం లక్ష్యాలను ఛేదిస్తుందని చెప్పలేం. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ విఫలం కావడాన్ని మనం చూశాం. అయినప్పటికీ, భారీ దాడులను ఎదుర్కోవడంలో బీఎండీ సీల్స్ ఉపయోగపడతాయి” అని రాహుల్ బేదీ చెప్పారు.
“భారత్ వద్ద వ్యూహాత్మక, సంప్రదాయ ఆయుధాలు ఉన్నాయి. ఉదాహరణకు, అగ్ని వ్యూహత్మక క్షిపణి, బ్రహ్మోస్ సంప్రదాయ రకానికి చెందినది. వాటిని పాకిస్తాన్ వద్ద ఉన్న ఘౌరి, బాబర్ క్షిపణులతో పోల్చినప్పుడు భారత క్షిపణులు దాడి చేసే సామర్థ్యంలో ఎంతో ముందున్నాయి. భారత ఆత్మ రక్షణ వ్యవస్థ కూడా ఇప్పుడు బాగా మెరుగుపడింది” అని బేదీ చెప్పారు.
‘‘భారత గగనతల రక్షణ వ్యవస్థ ఆకాశ్, ఎస్-400 చాలా ఉపయోగకరం. పాకిస్తాన్ దగ్గర ఇలాంటి వ్యవస్థలు లేవు. పాకిస్తాన్ భారత సైనిక కేంద్రాల మీద దాడి చేస్తుందని నేను అనుకోవడం లేదు. అయితే అది కచ్చితంగా స్పందిస్తుంది” అని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో స్పెషల్ సెంటర్ ఫర్ నేషనల్ సెక్యురిటీ స్టడీస్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న లక్ష్మణ్ కుమార్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS