SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు, ఆ తర్వాత కాల్పుల విరమణ జరిగి పది రోజులైంది.
ఏప్రిల్ 22న పహల్గాంలో పర్యటకులపై జరిగిన దాడిలో 26 మంది చనిపోయారు. ఈ దాడి జరిగి 15 రోజులైన తర్వాత, సరిహద్దు, నియంత్రణ రేఖ వెంబడి ఉన్న తొమ్మిది ప్రాంతాలపై భారత్ సైనిక దాడులు చేపట్టింది.
ఈ ప్రాంతాలను ‘ఉగ్రవాద స్థావరాలు’గా భారత్ చెబుతోంది. ఈ పరిణామం తర్వాత సరిహద్దుల్లో పాకిస్తాన్ షెల్లింగ్, డ్రోన్ దాడులు చేపట్టింది.
ఈ ఉద్రిక్తతల సమయంలో, ఆ తర్వాతా ఇరు దేశాలు మధ్య అనేక వాదనలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు జరిగాయి. ఈ వాదనల్లో కొన్ని మాత్రమే ధ్రువీకరణ కాగా, మిగిలిన చాలా వాటికి ఇప్పటివరకు ఎలాంటి ఆధారం లేదు.
ఈ మొత్తం ఘటన తర్వాత అనేక సైనిక, దౌత్య, రాజకీయ ప్రశ్నలకు ఇంకా నేరుగా సమాధానం దొరకలేదు.
రక్షణ, దౌత్య, భద్రతా విషయాల్లో నిపుణుల నుంచి ఈ ముఖ్యమైన ప్రశ్నల్లో కొన్నింటికి సమాధానాలు కనుగొనేందుకు బీబీసీ ప్రయత్నించింది.


పహల్గాంలో దాడి చేసిందెవరు?
పహల్గాం దాడితో ప్రమేయమున్న ముగ్గుర్ని జమ్మూకశ్మీర్ పోలీసులు గుర్తించారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, వారిలో ఒకరు కశ్మీరీ అయితే, మరో ఇద్దరు పాకిస్తానీలు.
పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం..వారి పేర్లు ఆదిల్ హుస్సేన్ టోకర్. ఈయన కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ నివాసి. ఇక హాసిమ్ ముసా అలియాస్ సులెమాన్, అలీ భాయి అలియాస్ తల్హా భాయి మిగిలిన ఇద్దరు.
వారి గురించి సమాచారం తెలిపిన వారికి రూ.20 లక్షల రివార్డు ఇస్తామని కూడా ప్రకటించారు.
దాడి తర్వాత జాతినుద్దేశించిన ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ” మన సోదరీమణుల సిందూరాన్ని ఉగ్రవాదులు తుడిచివేశారు. అందుకే భారత్ ఈ ఉగ్రవాదుల ప్రధాన కార్యాలయాలను ధ్వంసం చేసింది. భారత్ జరిపిన దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారు” అని తెలిపారు.
కానీ, పహల్గాంలో దాడి జరిపిన వారికి ఏమైందనేది ఇప్పటికీ ప్రశ్నార్థకమే.
పదవీ విరమణ పొందిన ఆర్మీ బ్రిగేడియర్ జీవన్ రాజ్ పురోహిత్‌ను బీబీసీ ఇదే ప్రశ్న అడిగింది.
రాజ్ పురోహిత్ ఏం చెప్పారంటే, ”ఈ ఉగ్రవాదులను అంతం చేయడం కాస్త కష్టంతో కూడుకున్న వ్యవహారమే. ఎందుకంటే, వారి చుట్టూ స్థానిక మద్దతుతో నెట్‌వర్క్ ఉంది. ఇక రెండోది, పాకిస్తాన్ నుంచి వారికి సాయం అందుతుంది. ఈ రెండు అంశాలను పరిగణనలోకి తీసుకుని ఉగ్రవాదాన్ని రూపుమాపాల్సిన అవసరం భారత్‌కు ఉంది. ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు, కేవలం ఉగ్రవాదులను చంపితే సరిపోదు. దాన్ని నడిపే వ్యవస్థను విచ్ఛిన్నం చేయాలి” అని అన్నారు.
”ఉగ్రవాదులను చంపడం కంటే పాకిస్తాన్‌లో ఉన్న దాని భావజాలాన్ని నిర్మూలించడం చాలా ముఖ్యం. కొంతమంది ఉగ్రవాదులను చంపడం వల్ల ఉగ్రవాద మూలంపై దాడి చేసినట్లు కాదు” అని ఆయన అభిప్రాయపడ్డారు.
సీమాంతర దాడిలో పౌరులు, భద్రతా సిబ్బంది తమ ప్రాణాలను కోల్పోయారు. బీబీసీతో సహా చాలా మీడియా సంస్థలు బాధితుల కుటుంబాలతో మాట్లాడాయి. ఇప్పటి వరకు మరణాల సంఖ్యపై ప్రభుత్వం ఎటువంటి అధికారిక డేటాను విడుదల చేయలేదు.
సరిహద్దుల్లో కాల్పులు జరిగే అవకాశం ఉన్నప్పుడు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక ప్రజలను సరిహద్దు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలింపుపై ఆదేశాలు ఇవ్వకూడదా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
ఈ ప్రశ్నపై స్పందించిన ఆర్మీ ఎయిర్ మార్షల్ (రిటైర్డ్) దీప్తేందు చౌధురి, ‘‘ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు స్థిరమైన ప్రమాణాలు ఉంటాయి. ప్రతి రాష్ట్రానికి సొంతంగా ఒక ప్రోటోకాల్ ఉంటుంది. కశ్మీర్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో తక్కువ జనాభా ఉంటుంది. జమ్మూ, పంజాబ్‌లలో ఎక్కువ మంది ప్రజలు నివసిస్తూ ఉంటారు” అని తెలిపారు.
‘‘సరిహద్దుకు సమీపంలో నివసించే ప్రజలు అంతకుముందు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా వారు షెల్లింగ్‌ను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ప్రజలు సిద్ధమై ఉన్నారు. బంకర్లను నిర్మించుకున్నారు. అవసరమైన అన్ని ఏర్పాట్లను చేసుకున్నారు. సైరన్ శబ్దాలు విన్నప్పుడు లేదా బ్లాక్ అవుట్ అయినప్పుడు, ఏం చేయాలో వారికి తెలుసు” అని ఎయిర్ మార్షల్ చౌధురి చెప్పారు.
‘‘యుద్ధ అవకాశాలు పెరుగుతున్నప్పుడు లేదా సైన్యం మోహరింపు పెరగడం మొదలైనప్పుడే అక్కడి నుంచి ప్రజలను వేరే ప్రాంతాలకు తరలించడం చేపడతారు. అప్పుడే సరిహద్దు ప్రాంతాలను ఖాళీ చేయిస్తారు. దీనికోసం తగినంత సమయాన్ని ఇస్తారు. షెల్లింగ్ అనేది అకస్మాత్తుగా ప్రారంభమైనప్పుడు, ముందస్తు హెచ్చరికలు ఇవ్వడం సాధ్యపడదు” అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఫైటర్ జెట్ కూల్చేసినట్లు ప్రకటన
జమ్మూకశ్మీర్‌లోని పాంపోర్ ప్రాంతంలో భారీ లోహపు ముక్క పడింది. ఇది ఏదైనా భారత ఎయిర్‌క్రాఫ్ట్‌కు చెందిందా? లేదా? అన్నది ప్రభుత్వం ధ్రువీకరించలేదు, ఖండించలేదు.
మరోవైపు, భారత రఫేల్ విమానాలను కూల్చేశామని పాకిస్తాన్ చెప్పింది.
విలేఖరుల సమావేశంలో దీని గురించి ఎయిర్ మార్షల్ ఏకే భారతిని ప్రశ్నించినప్పుడు, ”మనం పోరాటంలో ఉన్నాం, అందులో నష్టాలు కూడా ఉంటాయి. మీరు మమ్మల్ని అడగాల్సింది, మన లక్ష్యాలను సాధించామా? ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయాలనే మన లక్ష్యాలను అందుకున్నామా? అని. దానికి సమాధానం అవును” అని అన్నారు.
‘‘ప్రస్తుతానికి మరింత సమాచారం ఇవ్వలేం. ఇది ప్రత్యర్థులకు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. మేం ఎంచుకున్న లక్ష్యాలను సాధించామని, పైలట్లందరూ ఇంటికి తిరిగి వచ్చారని మాత్రం చెప్పగలను” అని ఎయిర్ మార్షల్ భారతి చెప్పారు.
పాకిస్తాన్ యుద్ధ విమానాలను భారత్ కూల్చేసిందా? అని అడిగినప్పుడు, ఎయిర్ మార్షల్ ఏకే భారతి ఏం చెప్పారంటే, ‘‘మన సరిహద్దుల్లోకి ప్రవేశించకుండా వారి విమానాలను అడ్డుకున్నాం. వాటి శకలాలు మన దగ్గర లేవు’’ అని తెలిపారు.
ఎయిర్ మార్షల్ చౌధురి ప్రకారం, ”ఆపరేషన్ కొనసాగుతున్నప్పుడు నష్టాలను బహిరంగంగా వెల్లడించాలా లేదా అన్న దానిపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతాయి” అని చెప్పారు.
‘‘బాలాకోట్‌ను ఉదాహరణగా తీసుకుంటే, ఆ సమయంలో మా మిషన్ సాధించిన విజయాలను బయటికి చెప్పేందుకు మేం సిద్ధంగా లేము. ఆ సమయంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమాచారం ఇచ్చేది. ఆ తర్వాత రక్షణ మంత్రిత్వ శాఖ బయటికి వచ్చేది. రక్షణ శాఖ ముందుకు వచ్చే సరికి కథంతా మారిపోయేది. రెండు రోజుల తర్వాత అభినందన్ పట్టుబడ్డారు. ఆ తర్వాత, ప్రపంచ దృష్టంతా దానిపైకి మరలింది. ఉగ్రవాదాన్ని లక్ష్యంగా చేసుకోవాలనే భారత వ్యూహాత్మక లక్ష్యం మర్చిపోయారు” అని చౌధురి అన్నారు.
‘‘సైన్యానికి నష్టం వాటిల్లుతుంది. ఇది వారి ఉద్యోగంలో భాగం. సంఖ్య అంత ముఖ్యం కాదు. ఎవరెన్ని జెట్లను కూల్చేశారన్నది పెద్ద విషయం కాదు. మన వ్యూహాత్మక లక్ష్యంలో గెలిచామా లేదా అన్నదే ప్రధాన విషయం’’ అని ఎయిర్ మార్షల్ చౌధురి చెప్పారు.

ఫొటో సోర్స్, EPA-EFE/Shutterstock
భారత్-అమెరికా మధ్య ఏం చర్చ జరిగింది?
భారత్-పాకిస్తాన్‌లు అధికారికంగా కాల్పుల విరమణ ప్రకటించడానికి ముందు, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఓ ప్రకటన జారీ చేశారు.
ఆయన ప్రభుత్వ మధ్యవర్తిత్వంతో, ఇరు దేశాలు తక్షణమే, పూర్తిగా ఈ ఉద్రిక్తతలను నిలిపివేసేందుకు అంగీకరించాయని ట్రంప్ చెప్పారు.
పాకిస్తానీ డైరక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) తమల్ని సంప్రదించడంతో ఈ కాల్పుల విరమణ జరిగిందని భారత్ చెబుతోంది. ట్రంప్ ప్రకటనను భారత్ ఖండించడం లేదు, అలాగని ఒప్పుకోవడం లేదు.
దీనిపై భారత మాజీ దౌత్యవేత్త దిలీప్ సింగ్ బీబీసీతో మాట్లాడుతూ,‘‘పాకిస్తాన్ కచ్చితంగా అమెరికాను సంప్రదించినట్లు అనిపిస్తోంది. ఆ తర్వాత, భారత్‌తో అమెరికా మాట్లాడి ఉండొచ్చు. ‘మేం సిద్ధమే, కానీ పాకిస్తాన్ నుంచి ఈ చొరవ రావాలి’ అని భారత్ చెప్పి ఉండాలి. ఆ తర్వాత పాకిస్తాన్ తన డీజీఎంఓను భారత డీజీఎంఓను సంప్రదించాలని కోరి ఉంటుంది. మన డీజీఎంఓ కాల్పుల విరమణకు ఒప్పుకుని ఉంటారు. ఆ తర్వాత కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది” అని అన్నారు.
అమెరికాతో మెరుగైన సంబంధాలు ఉండటం భారత్‌కు చాలా అవసరమని దిలీప్ సింగ్ చెప్పారు. ఈ సంబంధం కేవలం అధ్యక్షుడు ట్రంప్ పాలనాకాలానికి మాత్రమే పరిమితం కాలేదన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘కాల్పుల విరమణ ఎలా జరిగిందో చెప్పండి’
ట్రంప్ ప్రకటన, కాల్పుల విరమణ నిర్ణయం తర్వాత.. అసలు ఈ నిర్ణయం ఎలా తీసుకున్నారో పూర్తి వివరాలను తెలియజేయాలని ప్రతిపక్షం ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి చేస్తోంది. కాల్పుల విరమణలో అమెరికా పాత్రను స్పష్టంగా తెలియజేయాలని ప్రతిపక్షం కోరుతోంది.
ఇలాంటి సైనిక కార్యకలాపాల సమయంలో ప్రతిపక్షాన్ని ప్రభుత్వం సంప్రదించాలా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
‘‘ఇది ఎలాంటి ప్రోటోకాల్‌లో భాగం కాదు. ఇలాంటి వ్యూహాత్మక, సైనిక కార్యకలాపాల్లో, ఎన్నో విషయాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆపరేషన్‌లో నేరుగా ప్రమేయం లేని వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకోవడం కుదరదు. ఆపరేషన్ వివరాలను కూడా ఎవరితో పంచుకోరు. అది భద్రతకు పెను ప్రమాదం” అని దిలీప్ సింగ్ తెలిపారు.
సైనిక విధానానికి చెందిన విషయాల్లో ప్రతిపక్షాన్ని సంప్రదించిన దాఖలాలు లేవని దిల్లీ యూనివర్సిటీలోని హిందూ కాలేజీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్, రాజకీయ నిపుణులు చంద్రచూడ్ సింగ్ తెలిపారు.
‘‘1971 భారత్-పాకిస్తాన్ వార్‌ను తీసుకుంటే, యుద్ధ వ్యూహంపై ప్రతిపక్షంతో చర్చించలేదు. పార్లమెంటరీ వ్యవస్థలో మిలటరీకి చెందిన నిర్ణయాలను పార్లమెంట్ ముందుకు తీసుకురారు. ఆపరేషన్, మిలటరీ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన వివరాలు ఉన్న వారు మాత్రమే ఆర్మీకి చెందిన నిర్ణయాలు తీసుకుంటారు. కాల్పుల విరమణ చేయాలా వద్దా అన్నది ప్రతిపక్షాలను అడగాల్సిన అవసరం లేదన్నది నా అభిప్రాయం” అని ప్రొఫెసర్ సింగ్ తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)