SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, INCINDIA/X
12 మే 2025, 08:35 IST
భారత్, పాకిస్తాన్ మధ్య మే 10న సాయంత్రం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.
పహల్గాం దాడి తర్వాత, పాకిస్తాన్‌లో భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ నిర్వహించడం, ఆపై పాకిస్తాన్ షెల్లింగ్ కారణంగా రెండు దేశాల మధ్య వివాదం పెరుగుతూ వచ్చింది.
“అమెరికా మధ్యవర్తిత్వం వహించిన సుదీర్ఘ చర్చల తర్వాత, భారత్, పాకిస్తాన్ పూర్తిస్థాయిలో తక్షణమే కాల్పుల విరమణకు అంగీకరించాయని ప్రకటించడానికి నేను సంతోషంగా ఉన్నాను” అని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మే 10న సాయంత్రం 5 గంటల సమయంలో సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ట్రంప్ ఈ పోస్టు చేసిన తర్వాత, భారత్, పాకిస్తాన్ ప్రభుత్వాలు కూడా కాల్పుల విరమణను ప్రకటించాయి.
నాలుగు రోజుల్లోనే కాల్పుల విరమణ జరగడంతో దీనిపై సోషల్ మీడియాలో కూడా చర్చ జరుగుతోంది.
కాంగ్రెస్, కాంగ్రెస్ మద్దతుదారులు, సోషల్ మీడియా యూజర్లు కొందరు ఈ సందర్భంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గురించి ప్రస్తావిస్తున్నారు.


ఫొటో సోర్స్, NIXON LIBRARY
ఇందిరాగాంధీ గురించి కాంగ్రెస్ ఏం చెబుతోంది?
ఇందిరా గాంధీ, అమెరికా మాజీ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్‌ల ఫోటోను అధికారిక ఎక్స్ హ్యాండిల్‌లో కాంగ్రెస్ షేర్ చేసింది. ”మేం బలంగా, ధైర్యంగా ఉన్నాం. ప్రతి అణిచివేతను ఎదుర్కోవాలన్న సంకల్పం మాకుంది. అలాగే అందుకు సంబంధించిన వనరులున్నాయి. మూడు నాలుగు వేలమైళ్ల దూరంలో కూర్చుని, ఆదేశాలిచ్చి, భారత్ దాన్ని పాటించాలని చెప్పే రోజులు పోయాయి దీన్ని ధైర్యం అంటారు. దేశ గౌరవంపై రాజీపడకుండా దేశం తరఫున నిలబడడం ఇది” అని ఆ ట్వీట్‌లో కాంగ్రెస్ తెలిపింది.
కాంగ్రెస్ సహా కొంతమంది సోషల్ మీడియా యూజర్లు యూపీఎస్‌సీ కోచింగ్ టీచర్ దివ్యకీర్తి పాత వీడియో షేర్ చేస్తున్నారు.
”ఒక మహిళ ప్రధానమంత్రి అయ్యారు. పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేశారు. ఇతరులు కొందరు తాము సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని చెబుతూనే ఉంటారు. ఆమె ఏమీ చెప్పలేదు. కానీ రెండు పనులు చేశారు” అని దివ్యకీర్తి వ్యాఖ్యానించారు.
అయితే, 1971ని, 2025ని పోల్చడం సరికాదని కొందరు భావిస్తుంటారు.
1971లో పాకిస్తాన్‌తో యుద్ధం తర్వాత బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు సోవియట్ యూనియన్ ఉంది. 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైంది.
సోవియట్ యూనియన్‌కు ఉన్నంత శక్తి రష్యాకు ఎప్పుడూ లేదు. ఇది భారత్‌కెప్పుడూ లోపమేనంటారు అంతర్జాతీయ నిపుణులు.
సోవియట్ యూనియన్ మద్దతు భారత్‌కు ఉంది, అదేవిధంగా పాకిస్తాన్‌కు అప్పుడు అణ్వాయుధ సామర్థ్యం లేదు.
“అప్పుడు అమెరికా నుంచి బెదిరింపులున్నాయి. క్షేత్రస్థాయి పరిస్థితులు కష్టంగా ఉన్నాయి. కానీ ఇందిరా గాంధీ భయపడలేదు. 1971లో, ఆమె భారతదేశ గౌరవాన్ని కాపాడటమే కాకుండా, పాకిస్తాన్‌ను రెండు భాగాలుగా విభజించి కొత్త దేశాన్ని సృష్టించడం ద్వారా చరిత్ర సృష్టించారు. ఆమె ఒక ప్రధానమంత్రి మాత్రమే కాదు, దృఢ సంకల్పం ఉన్న ఒక గొప్ప వ్యక్తి” అని హన్స్‌రాజ్ మీనా సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
పాకిస్తాన్‌ను విడగొట్టే వరకు పట్టువిడవకుండా ఇందిరా గాంధీ పనిచేశారని చెబుతూ…. ”జబ్ తక్ తోడా నహీ…తబ్ తక్ ఛోడా నహీ” (విడగొట్టే వరకు వదిలిపెట్టేది లేదు) అని ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘెల్ అన్నారు.
“ఎన్నికల్లో పోరాడటానికి, యుద్ధం చేయడానికి మధ్య తేడా ఉంది. ఎవరూ ఇందిరా గాంధీ కాలేరు” అని జర్నలిస్ట్ రోహిణి సింగ్ చెప్పారు.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ సోషల్ మీడియాలో ఒక లేఖను షేర్ చేశారు. “డిసెంబర్ 12, 1971న, అమెరికా అధ్యక్షుడు నిక్సన్‌కు ఇందిరా గాంధీ ఈ లేఖ రాశారు. నాలుగు రోజుల తర్వాత, పాకిస్తాన్ లొంగిపోయింది” అని పేర్కొన్నారు.
దీనిపై బీజేపీ స్పందించింది.
“1971 యుద్ధం పాకిస్తాన్ సైన్యం లొంగిపోవడంతో ముగిసింది. అయితే, ఆ తర్వాత వచ్చిన సిమ్లా ఒప్పందం రష్యా, అమెరికా రెండింటి ఒత్తిడితో సిద్ధమైంది. భారతదేశం ఎలాంటి వ్యూహాత్మక ప్రయోజనం లేకుండా 99 వేల మంది యుద్ధ ఖైదీలను విడుదల చేసింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌ను ఖాళీ చేయడానికి ఎలాంటి షరతు విధించలేదు. సరిహద్దును అధికారికంగా నిర్ణయించలేదు. యుద్ధానికి లేదా శరణార్థుల సమస్య కోసం భారతదేశానికి ఎలాంటి పరిహారం సంపాదించలేదు. ఆ సమయంలో ఇందిరా గాంధీ ప్రధానమంత్రి. మీకు అనుకూలమైన విషయాలు చెప్పడం మానేయండి” అని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియ పోస్ట్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇందిరకు, నిక్సన్ కు మధ్య విభేదాలు
అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్, ఇందిరాగాంధీ మధ్య దూరం అందరికీ తెలుసు.
1967లో నిక్సన్‌ను దిల్లీలో కలిసినప్పుడు, ఆయనతో మాట్లాడిన ఇరవై నిమిషాల్లోనే ఇందిర చాలా విసుగు చెందినట్లు ఇందిరాగాంధీపై వచ్చిన పుస్తకాలలో కొందరు ప్రస్తావించారు. నిక్సన్‌తో పాటు ఉన్న భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారితో హిందీలో మాట్లాడిన ఇందిర “ఇంకెంతసేపు ఆయనతో మాట్లాడాలి?” అని అడిగినట్లు ఆ పుస్తకాలలో ఉంది.
1971 నాటికి కూడా ఇద్దరి మధ్య సంబంధాలలో పెద్దగా మార్పు రాలేదు.
తూర్పు పాకిస్తాన్‌లో జరుగుతున్న వ్యవహారాలను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లడానికి ఇందిరా గాంధీ 1971 నవంబరులో అమెరికా వెళ్లారు. సమావేశానికి ముందు ఇందిరా గాంధీని 45 నిమిషాలు వెయిట్ చేయించారు నిక్సన్.
వైట్ హౌస్ దగ్గర స్వాగత ప్రసంగంలో, బిహార్ వరద బాధితుల పట్ల నిక్సన్ తన సానుభూతిని వ్యక్తం చేశారుగానీ, తూర్పు పాకిస్తాన్ గురించి ప్రస్తావించలేదు.
భారత విదేశాంగ శాఖలో సీనియర్ అధికారి మహారాజ్ కృష్ణ రసగోత్రతో కొన్ని సంవత్సరాల కిందట బీబీసీ ప్రతినిధి రెహాన్ ఫజల్ మాట్లాడారు.
“ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను. ఇందిరా గాంధీకి ఆమె స్థానమేంటో తెలియజేయడమే నిక్సన్ లక్ష్యం. ఆయన ఇందిరా గాంధీని అవమానించాలనుకున్నారు. వారిద్దరి మధ్య సంభాషణ మొదటి నుంచి సరిగ్గా జరగలేదు” అని రసగోత్ర బీబీసీతో అన్నారు.
“ఆ సమయంలో భారత్‌కు వచ్చి శిబిరాల్లో ఆకలితో చనిపోతున్న దాదాపు కోటి మంది బెంగాలీ శరణార్థుల గురించి నిక్సన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మేం యుద్ధం ప్రకటించడానికి వచ్చామని ఆయనకు బహుశా కొంత సందేహం ఉండవచ్చు. ఆయన ఉద్దేశపూర్వకంగా ఇందిరా గాంధీని చులకన చేసినట్లు వ్యవహరించారు” అని ఆయన తెలిపారు.
“ఇందిరాగాంధీ ఆ విషయం పట్టించుకోలేదు. నిక్సన్‌కు చెప్పాల్సింది చెప్పారు. ‘తూర్పు పాకిస్తాన్‌లో జరుగుతున్న మారణహోమాన్ని మీరు ఆపాలి, మా దేశానికి వచ్చిన శరణార్థులు పాకిస్తాన్‌కు తిరిగి వెళ్లాలి వారికి మా దేశంలో చోటు లేదు అని చెప్పడం ఆమె ఉద్దేశం” అని రసగోత్ర అప్పట్లో ఇందిరాగాంధీ ప్రవర్తన గురించి చెప్పారు.
అమెరికా నౌక, 1971 యుద్ధం
1971 యుద్ధ సమయంలో, అమెరికా తన నౌకను బంగాళాఖాతం వైపు పంపింది.
“అమెరికన్లు ఒక్క బుల్లెట్ పేల్చినా, మరేదైనా చేసినా మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యేది. నిజం చెప్పాలంటే, ఈ భయం నా మనసులోకి ఒక్కసారి కూడా రాలేదు” అని ఇటాలియన్ జర్నలిస్ట్ ఒరియానా ఫలాసికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇందిరా గాంధీ చెప్పారు.
“డిసెంబర్ మొదటి వారంలోనే, సోవియట్ యూనియన్‌కు చెందిన డిస్ట్రాయర్ నౌక, మైన్ స్వీపర్ నౌక మలక్కా జలసంధి నుంచి ఈ ప్రాంతానికి చేరుకున్నాయి. సోవియట్ నౌకాదళం 1972 జనవరి మొదటి వారంలో అమెరికన్ నేవీ ఇక్కడి నుంచి వెళ్లిపోయేవరకు దానిని వెంటాడింది” అని అడ్మిరల్ ఎస్.ఎం. నందా ఆత్మకథ ‘ది మ్యాన్ హూ బాంబ్డ్ కరాచీ’లో తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS