SOURCE :- BBC NEWS

పాకిస్తాన్

ఫొటో సోర్స్, Reuters

7 మే 2025, 07:32 IST

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్ 22న తీవ్రవాదులు దాడులు జరిపి, 26మంది పర్యటకులు మరణించినప్పటి నుంచి భారత్, పాకిస్తాన్ మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి.

మే 7వ తేదీ తెల్లవారుజామున పాకిస్తాన్‌పై దాడులు జరిపినట్టు భారత ప్రభుత్వం ప్రకటించింది.

ఈ దాడులలో తమ పౌరులు 8మంది చనిపోయారని, 35 మంది గాయపడ్డారని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మొహమ్మద్ ఇషాక్ దార్ చెప్పారు. తూర్పు అహ్మద్‌పూర్ ప్రాంతంలో ఎక్కువ మరణాలు సంభవించినట్టు ఆయన చెప్పారు.

భారత్ జరిపిన దాడులపై పాకిస్తాన్ ప్రభుత్వం, ప్రజలు ఏమంటున్నారు?

బీబీసీ వాట్సాప్ చానల్
పాకిస్తాన్ ప్రధాని

ఫొటో సోర్స్, Getty Images

పాక్ ప్రధాని ఏమన్నారు?

భారత్ మిసైల్ దాడులపై పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ స్పందిస్తూ దీనికి బదులు చెప్పే సంపూర్ణ హక్కు పాకిస్తాన్‌కు ఉందన్నారు.

ఈమేరకు ఆయన ఎక్స్‌లో ఒక పోస్టు చేశారు.

”శత్రువులు పాకిస్తాన్‌లోని ఐదుచోట్ల పిరికిపంద చర్యలకు దిగారు” అని షాబాజ్ అన్నారు. ఈ చర్యలను ‘యుద్ధ చర్యలు’గా ఆయన అభివర్ణించారు.

ఈ చర్యలకు దీటైన సమాధానం చెప్పే హక్కు పాకిస్తాన్‌కు ఉందని, ఇందుకు దీటైన సమాధానం ఇస్తామని, పాకిస్తాన్ ప్రజలంతా, పాకిస్తాన్ సైన్యానికి అండగా నిలవాలని షాబాజ్ షరీఫ్ తన పోస్టులో పేర్కొన్నారు.

”శత్రువుతో ఎలా వ్యవహరించాలో పాకిస్తాన్‌కు, పాకిస్తాన్ సైన్యానికి తెలుసు. శత్రువు దురుద్దేశాలను ఎట్టి పరిస్థితులలోనూ విజయం సాధించనీయం” అని పాకిస్తాన్ ప్రధాని పేర్కొన్నారు.

ఖావాజా అసిఫ్

పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖావాజా ఆసీఫ్ బీబీసీ ఉర్దూతో మాట్లాడుతూ

”వారు (భారత్) తీవ్రవాదుల స్థావరాలపై దాడులు చేసినట్టు ప్రకటించుకున్నారు. అయితే అంతర్జాతీయ మీడియా సంస్థలు వచ్చి దాడులు జరిగిన ప్రాంతాలు తీవ్రవాదుల స్థావరాలో, సామాన్య ప్రజలు నివసించే ప్రాంతాలో పరిశీలించాలి. రెండు మసీదులపైనా దాడులు జరిగాయి. ఓ చిన్నారి, ఓ మహిళ మృతి చెందారు. ఎంతమంది చనిపోయారనే విషయమై నా వద్ద లెక్కలు లేవు. కానీ దాడులు జరిగిన ప్రాంతాలలో ఏడింటిని గుర్తించాం, రెండు కశ్మీర్‌లోనూ, ఐదు పాకిస్తాన్‌లోనూ ఉన్నాయి. అన్నీ కూడా పౌరులను లక్ష్యంగా చేసుకున్నవే” అని చెప్పారు.

సంయమనం పాటించాలి: ఐక్యరాజ్యసమితి

ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ మాట్లాడుతూ, “నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారత సైనిక కార్యకలాపాల గురించి చాలా ఆందోళన చెందుతున్నాను” అన్నారు.

“రెండు దేశాలు సైనిక సంయమనం పాటించాలి. భారతదేశం, పాకిస్తాన్ మధ్య సైనిక ఘర్షణను ప్రపంచం భరించలేదు” అని పేర్కొన్నారు.

వైమానిక దాడులు

‘‘పేలుళ్ల శబ్దాలతో మేల్కొన్నాం’’

పెద్ద పేలుళ్ల శబ్దాలు వినిపించినట్టు ముజఫరాబాద్‌ వాసులు బీబీసీతో చెప్పారు.

“మొదటి పేలుడు జరిగినప్పుడు నేను గాఢ నిద్రలో ఉన్నా” అని బిలాల్ మసీదు పక్కనే నివసిస్తున్న మొహమ్మద్ వహీద్ అన్నారు. ఈ మసీదు కూడా దాడికి గురైన ప్రదేశాలలో ఒకటి అని చెబుతున్నారు.

“నేను వీధిలోకి పరుగెత్తాను, అందరూ వీధుల్లోకి పరుగులు తీశారు. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే..మరిన్ని క్షిపణులు దూసుకొచ్చాయి. గందరగోళ పరిస్థితి ఏర్పడింది” అని ఆయన చెప్పారు.

డజన్ల కొద్దీ ప్రజలు గాయపడ్డారని, వారిని 25 కి.మీ దూరంలో ఉన్న ఆసుపత్రికి తరలించామని వహీద్ చెప్పారు.

“పిల్లలు ఏడుస్తున్నారు, మహిళలు సెక్యురిటీ కోసం పరిగెడుతున్నారు. మాకు భయమేసింది, ఏం చేయాలో తెలియదు. ప్రజలు ఇళ్లను వదిలి పారిపోతున్నారు. అంతా గందరగోళం నెలకొంది” అన్నారు వహీద్.

భద్రతా దళాలు సంఘటనా స్థలంలో ఉన్నాయని, కానీ మసీదును ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారో తనకు అర్థం కాలేదని ఆయన అన్నారు.

“ఇది ఒక సాధారణ వీధిలో ఉండే మసీదు. మేం రోజుకు ఐదుసార్లు ప్రార్థనలు చేసేవాళ్ళం. దాని చుట్టూ ఎటువంటి అనుమానాస్పద కార్యకలాపాలను మేం ఎప్పుడూ చూడలేదు” అని వహీద్ అన్నారు.

నియంత్రణ రేఖ దగ్గర పేలుళ్ల శబ్దాలు విన్న నివాసితులు

అయితే భారత్ దాడులు ప్రారంభించడానికి ముందు భింబర్గాలి ప్రాంతంలో జమ్మూ కశ్మీర్‌లోకి పాకిస్తాన్ ఫిరంగి కాల్పులు జరిపిందని భారత సైన్యం తెలిపింది.

జమ్మూ కశ్మీర్‌లోని అనేక ప్రాంతాలతోపాటు, భింబర్గాలి సమీపంలోని మెంధార్‌ సహా, కొన్ని ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు విన్నట్లు స్థానికులు చెప్పారు.

“నేను ఉంటున్న చోట, శ్రీనగర్‌లో.. భారీ ఫైటర్ జెట్ కార్యకలాపాలు జరుగుతున్నాయి”అని మా ప్రతినిధి షఫత్ ఫరూక్ తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS