SOURCE :- BBC NEWS

శ్రీనగర్‌

ఫొటో సోర్స్, AFP via Getty Images

పాకిస్తాన్‌లోని ‘ఉగ్రవాద’ స్థావరాలపై మిసైల్, వైమానిక దాడులు జరిపినట్టు భారత్ ప్రకటించింది. మొత్తం 9 స్థావరాలపై దాడులు చేసినట్టు తెలిపింది.

అయితే కేవలం ఆరు ప్రాంతాలే దాడులకు గురయ్యాయని పాకిస్తాన్ తెలిపింది. తాము ఐదు భారత యుద్ధ విమానాలను కూల్చివేసినట్టు కూడా ప్రకటించింది. కానీ, భారత్ ఈ ప్రకటనను ధ్రువీకరించలేదు. బీబీసీ స్వతంత్రంగా నిర్ధరించలేదు.

నియంత్రణ రేఖ వెంబడి భారత్ జరిపిన వైమానిక దాడులలో 31 మంది మరణించారని, 57 మంది గాయపడ్డారని ఇస్లామాబాద్ పేర్కొంది.

సరిహద్దు లోపల పాకిస్తాన్ జరిపిన పేలుళ్ల కారణంగా 15 మంది పౌరులు చనిపోయారని భారత ఆర్మీ ప్రకటించింది.

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్‌లో పర్యటకులపై దాడి జరిగిన తరువాత అణ్వాయుధాలు కలిగిన భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి.

ఈ దాడితో ‘పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులకు’ సంబంధం ఉన్నట్టు తమ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని భారత్ చెబుతోంది. కానీ, ఈ వాదనను పాకిస్తాన్ పూర్తిగా తోసిపుచ్చుతోంది. తన వాదనకు మద్దతుగా భారత్ ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని ఇస్లామాబాద్ పేర్కొంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
భారత్, పాకిస్తాన్ యుద్ధం

ఫొటో సోర్స్, Anadolu via Getty Images

ఈ దాడులతో మరింత ఉద్రిక్తత?

ఇటీవలి పహల్గామ్ దాడికి భారత ప్రతిస్పందన విస్తృతంగా ఉందని.. ఒకేసారి పాకిస్తాన్‌లోని మూడు ప్రధాన మిలిటెంట్ గ్రూపుల స్థావరాలపై దాడిచేసిందని నిపుణులు అభిప్రాయపడ్డారు.

సరిహద్దుకు కేవలం 6 నుంచి18 కిలోమీటర్ల దూరంలో ఉన్న సియాల్‌కోట్‌లోని రెండు శిబిరాలు అత్యంత సమీప లక్ష్యాలు కాగా, అత్యంత సుదూర లక్ష్యం పాకిస్తాన్‌లో 100 కిలోమీటర్ల దూరంలో బహవల్‌పూర్‌లోని జైషే మొహమ్మద్ ప్రధాన కార్యాలయం.

అలాగే జమ్మూకశ్మీర్‌లో ఇటీవల జరిగిన దాడులతో సంబంధం ఉన్న లష్కరే తోయిబా కార్యాలయం నియంత్రణ రేఖకు 30 కిలోమీటర్ల దూరంలో పాక్ ఆక్రమిత కశ్మీర్ రాజధాని ముజఫరాబాద్‌లో ఉందని భారత అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు.

ఆరుచోట్ల దాడులు జరిగాయని పాకిస్తాన్ చెప్పింది, అయితే అక్కడ ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయనే విషయాన్ని ఖండించింది.

”గత దాడులకు భిన్నంగా ఈసారి భారత్ తన లక్ష్యాలను విస్తరించడం విశేషం. కిందటిసారి సైనిక పహారాలోని నియంత్రణ రేఖ వెంబడి పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై దృష్టి సారించింది” అని దిల్లీకి చెందిన చరిత్రకారుడు శ్రీనాథ్ రాఘవన్ బీబీసీకి చెప్పారు.

”ఈసారి మాత్రం పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారత్ దాడి చేసింది. లష్కరే తోయిబాతో సంబంధం ఉన్న బహవల్పూర్, మురీద్కేలోని ఉగ్రవాద మౌలిక వసతులు, ప్రధాన కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుంది. జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ ఆస్తులపైనా దాడులు చేసింది. ఇది కేవలం భారత్ ఏ ఒక్క గ్రూపునో కాకుండా, అనేక గ్రూపులను లక్ష్యంగా చేసుకుందనే సందేశం పంపుతోంది” అని ఆయన చెప్పారు.

భారత్-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు గుజరాత్ నుంచి జమ్మూ వరకు విస్తరించి, రెండు దేశాలను విడదీసే సరిహద్దుగా అధికారిక గుర్తింపు పొందింది.

పాకిస్తాన్‌లో భారత మాజీ హైకమిషనర్ అజయ్ బిసారియా బీబీసీతో మాట్లాడుతూ భారత్ చేసిన పని ”బాలాకోట్ కంటే బలమైన ప్రతిస్పందన అని, ఉగ్రవాద కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడం, ఉగ్రవాదాన్ని ఉపేక్షించమనే బలమైన సందేశంతోపాటు ఉద్రిక్తతలు తలెత్తని రీతిలో సంయమనంతో వ్యవహరించడమనే సందేశం ఉందని” వివరించారు.

”ఈసారి దాడులు గతంలో కంటే మరింత ఖచ్చితంగా, స్పష్టంగా కనిపించాయి. దీంతో పాకిస్తాన్ కూడా పెద్దగా ఖండించలేని పరిస్థితి” అని బిసారియా చెప్పారు.

”పాత పరిస్థితి పునరుద్ధరణే లక్ష్యంగా” దాడులు జరిగాయని భారత వర్గాలు చెప్పాయి.

“భారత ప్రభుత్వం 2019లో చేసిన దాడులు ఉగ్రవాద గ్రూపులను సమర్థవంతంగా నిరోధించలేకపోయాయని, అందుకే మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది” అని ప్రొఫెసర్ రాఘవన్ అభిప్రాయపడ్డారు.

”ఉగ్రవాదాన్ని అణచివేయడానికి సమయాన్ని బట్టి పదేపదే దాడులు అవసరమనే ఇజ్రాయెల్ సిద్ధాంతానికి ఇది అద్దం పడుతోంది. కానీ, ఎదురుదాడి ఒక్కటే ఉగ్రవాదాన్ని అణిచివేస్తుందనుకుంటే, ప్రతీకారం తీర్చుకోవడానికి మనం పాకిస్తాన్‌కు అన్నిరకాల ప్రోత్సాహాలు ఇస్తున్నట్టే.. పైగా అది త్వరగా అదుపు తప్పుతుంది కూడా” అని అన్నారు.

భారత్, పాకిస్తాన్ యుద్ధం

ఫొటో సోర్స్, AFP via Getty Images

సంఘర్షణ ముదురుతుందా?

పాకిస్తాన్ వైపు నుంచి కూడా ప్రతీకార చర్యలు అనివార్యమని ఎక్కువమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

”పాకిస్తాన్ ప్రతిస్పందించడం ఖాయం. తరువాత తలెత్తే ఉద్రిక్త పరిస్థితులను ఎదుర్కోవడమే సవాలు. ఇక్కడే దౌత్యం కీలకపాత్ర పోషిస్తుంది” అని బిసారియా చెప్పారు.

”సంయమనంతో ఉండాల్సిందిగా పాకిస్తాన్‌కు సలహాలు అందుతున్నాయి. కానీ, పాకిస్తాన్ ప్రతిస్పందన తరువాత ఇరుదేశాలు తక్షణం ఉద్రిక్తతలను పెంచకుండా చూడటమే కీలక విషయం” అని ఆయన అన్నారు.

ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా మురీద్కే, బహవల్పూర్ వంటి ప్రాంతాలను భారత్ లక్ష్యంగా చేసుకుని సర్జికల్ స్ట్రైక్స్ చేస్తుందనే విషయం ఊహించిందేనని లాహోర్‌కు చెందిన రాజకీయ, సైనిక విశ్లేషకుడు ఇజాజ్ హుస్సేన్ వంటి పాకిస్తాన్‌కు చెందిన నిపుణులు అంటున్నారు.

ప్రతీకార దాడులు జరిగే అవకాశం ఉందని డాక్టర్ హుస్సేన్ అభిప్రాయపడ్డారు.

“పాకిస్తాన్ మిలటరీ గురించి మీడియాలో వస్తున్న కథనాలు, తగిన సమాధానం చెబుతామనే ప్రకటనల ద్వారా రాబోయే రోజుల్లో సరిహద్దు వెంబడి సర్జికల్ స్ట్రైక్స్ రూపంలో ప్రతీకార చర్య జరిగే అవకాశం ఉంది ” అని ఆయన బీబీసీతో అన్నారు.

అయితే రెండు వైపులా సర్జికల్ స్ట్రైక్స్ చిన్నపాటి యుద్ధానికి దారితీస్తాయని డాక్టర్ హుస్సేన్ ఆందోళన వ్యక్తం చేశారు.

భారత్ దాడుల తీవ్రత, కీలక ప్రదేశాల్లో కనిపించిన నష్టం, ప్రాణనష్టం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందని అమెరికాలోని అల్బనీ యూనివర్సిటీకి చెందిన క్రిస్టోఫర్ క్లారీ అభిప్రాయపడ్డారు.

ఉద్రిక్తతలు పెరుగుతున్నప్పటికీ, తగ్గే అవకాశం ఉందని కొంతమంది నిపుణులు ఆశాభావంతో ఉన్నారు.

”ఈ సంక్షోభం నుంచి బయటపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నియంత్రరేఖ వెంబడి కొంత ప్రతీకార దాడులు, భారీ కాల్పులు మాత్రమే జరుగుతాయి” అని క్లారీ అభిప్రాయపడ్డారు.

ఏది ఏమైనా ఘర్షణ మరింత పెరిగే ప్రమాదం ఉంది.

ఇది 2002 భారత్-పాకిస్తాన్ సంక్షోభం తర్వాత ‘అత్యంత ప్రమాదకరమైన’ పరిస్థితిగా మారింది. అంతేకాదు, 2016, 2019 నాటి ప్రతిష్టంభనల కంటే ఇది మరింత ప్రమాదకరం.

పాకిస్తాన్‌కు ప్రతీకారం అనివార్యమా?

భారత దాడికి ముందు యుద్ధ వాతావరణం లేకపోయినా త్వరలోనే పరిస్థితి మారవచ్చని పాక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

”సమాజం రాజకీయంగా చీలిపోయింది. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన నేతలు జైళ్లలో ఉన్నారు. ఇమ్రాన్ ఖాన్‌ను జైలుకు పంపడంపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి” అని ఇస్లామాబాద్‌కు చెందిన విశ్లేషకుడు, జేన్స్ డిఫెన్స్ వీక్లీ మాజీ కరస్పాండెంట్ ఉమర్ ఫరూక్ అన్నారు.

” కానీ, ప్రస్తుతం పాకిస్తాన్ ప్రజలు 2016, 2019లో మాదిరి సైన్యానికి మద్దతు ఇవ్వడానికి పెద్దగా మొగ్గు చూపడం లేదు. యుద్ధం చేయాలనే భావోద్వేగం ప్రజలందరిలోనూ స్పష్టంగా కనిపించడం లేదు. కానీ, భారత వ్యతిరేక సెంటిమెంట్ ఎక్కువగా ఉన్న సెంట్రల్ పంజాబ్‌లో ప్రజాభిప్రాయం మారితే, సైన్యం చర్యలకు దిగాలనే ఒత్తిడి మరింత పెరగొచ్చు. ఈ ఘర్షణ కారణంగా సైన్యానికి ప్రజాదరణ మళ్లీ పెరగవచ్చు” అని ఆయన అన్నారు.

డాక్టర్ హుస్సేన్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు.

“భారతదేశంతో ప్రస్తుత ప్రతిష్టంభన పాకిస్తాన్ సైన్యానికి జనాదరణ తిరిగి పొందేందుకు ఒక అవకాశాన్ని కలిగిస్తుంది. ప్రత్యేకించి సైన్యం రాజకీయాలలో జోక్యం చేసుకుంటోందని విమర్శించిన పట్టణ మధ్యతరగతిలో ఇది జరగొచ్చు” అని హుస్సేన్ అన్నారు.

భారత్,పాకిస్తాన్య యుద్ధం

ఫొటో సోర్స్, NurPhoto via Getty Images

భారత్, పాక్ వెనక్కు తగ్గుతాయా?

సంఘర్షణకు, సంయమనానికి మధ్య భారత్ మరోసారి చక్కటి మార్గంలో నడుస్తోంది.

పహల్గాం దాడి జరిగిన కొద్దిసేపటికే భారత్ తన ప్రధాన సరిహద్దు మార్గాలను మూసివేయడం, సిందు నదీ జలాల పంపిణీ ఒప్పందాన్ని నిలిపివేయడం, దౌత్యవేత్తలను బహిష్కరించడం, పాక్ పౌరుల వీసాలను రద్దు చే.

ఇరు దేశాల సైనికులు ఆయుధాలతో చిన్నపాటి కాల్పులు జరపగా, భారత్, పాకిస్తాన్ తమ గగనతలాన్ని పరస్పరం మూసివేశాయి.

దీనికి ప్రతిస్పందనగా, పాకిస్తాన్ 1972 సిమ్లా శాంతి ఒప్పందాన్ని నిలిపివేసింది, ఇతర ప్రతీకార చర్యలూ తీసుకుంది.

2019 పుల్వామా దాడి తర్వాత పాకిస్తాన్ మోస్ట్ ఫేవర్డ్ నేషన్ (ఎంఎఫ్ఎన్) హోదాను రద్దు చేయడం, భారీ సుంకాలు విధించడం, కీలక వాణిజ్య, రవాణా సంబంధాలను నిలిపివేయడం వంటి చర్యలు తీసుకుంది భారత్.

బాలాకోట్‌పై భారత్ వైమానిక దాడులు చేయడం, ఆ తర్వాత పాక్ ప్రతీకార వైమానిక దాడులు, భారత పైలట్ అభినందన్ వర్ధమాన్ పట్టుబడటంతో ఈ సంక్షోభం మరింత ముదిరింది. దీంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. అయితే దౌత్య మార్గాల ద్వారా ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుముఖం పట్టడంతో పైలట్‌ను పాకిస్తాన్ విడుదల చేసి, సుహృద్భావ చర్యగా చెప్పుకుంది.

“పాతకాలపు దౌత్యానికి మరో అవకాశం ఇవ్వడానికి భారతదేశం సిద్ధంగా ఉంది. ఎందుకంటే భారతదేశం ఒక వ్యూహాత్మక సైనిక లక్ష్యాన్ని సాధించింది. పాకిస్తాన్ తన ప్రజల ముందు విజయం సాధించినట్టు ప్రకటించుకుంది” అని బిసారియా గత వారం నాతో అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)