SOURCE :- BBC NEWS

భారత్, పాకిస్తాన్, పహల్గాం, విమాన ప్రయాణం

ఫొటో సోర్స్, Getty Images

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో తీవ్రవాదుల దాడి తర్వాత పాకిస్తాన్‌పై భారత్ కొన్ని కఠిన చర్యలు తీసుకుంది. దీనికి బదులుగా పాకిస్తాన్ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. భారత విమానయాన సంస్థలకు పాకిస్తాన్ తన గగనతలాన్ని మూసివేయడం వాటిల్లో ఒకటి.

దీని వల్ల భారత్ నుంచి ఇతర దేశాలకు వెళ్లే భారత విమానాలు ఇకపై పాకిస్తాన్ గగనతలం మీదగా ప్రయాణించలేవు.

ఈ నిర్ణయం వల్ల గురువారం (ఏప్రిల్ 24) సాయంత్రం ఆరుగంటల తరువాత భారత్‌కు చెందిన ఏ విమానాన్నీ పాకిస్తాన్ గగనతలంపైన ప్రయాణించడానికి అనుమతించలేదు.

పాకిస్తాన్ ఈ ప్రకటన చేసే సమయానికి, సహజంగా భారత ఎయిర్‌లైన్స్‌కు చెందిన అనేక విమానాలు గాల్లో ఉండి, వాటిలో చాలా పాకిస్తాన్ మీదగా ప్రయాణిస్తుంటాయి. అప్పుడేం చేస్తారు?

“పాకిస్తాన్ ఈ ప్రకటన చేసిన తర్వాత, మా మొదటి బాధ్యత ఆ సమయానికి గాల్లో ఉన్న విమానాలను భారత్‌కు మళ్లించడం. తర్వాత, తదుపరి వ్యూహం ప్రకారం పనిచేస్తాం” అని భారత విమానయాన సంస్థకు చెందిన ఒక సీనియర్ అధికారి బీబీసీతో చెప్పారు.

గతంలోనూ పాకిస్తాన్, భారత విమానయాన సంస్థలకు తన గగనతలాన్ని మూసివేసింది. బాలాకోట్‌లో వైమానిక దాడులు చేసినట్టు భారత్ ప్రకటించిన తర్వాత పాకిస్తాన్ కొన్ని నెలల పాటు భారత విమానయాన సంస్థలకు తన గగనతలాన్ని మూసివేసివేసింది.

2019లో ఫిబ్రవరి 27 నుంచి జులై 16 మధ్య, భారత విమానాలు పాకిస్తాన్ గగనతలానికి బదులు ఇతర మార్గాలను ఉపయోగించాల్సి వచ్చింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
భారత్, పాకిస్తాన్, పహల్గాం, విమాన ప్రయాణం

ఫొటో సోర్స్, Getty Images

ఖర్చులు పెరుగుతాయా?

గగనతలాన్ని మూసివేయాలనే పాకిస్తాన్ నిర్ణయ ప్రభావం దిల్లీనుంచి ప్రయాణించే విమానాలపై చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే అమృత్‌సర్, లక్నో సహా ఉత్తర భారతదేశంలోని కొన్ని ఇతర విమానాశ్రయాలపైనా ఉంటుంది.

దిల్లీ నుంచి మధ్య ఆసియా, పశ్చిమాసియా, యూరప్, బ్రిటన్, ఉత్తర అమెరికాకు విమానాలు నడిపే భారతీయ కంపెనీలు ఇప్పుడు తమ మార్గాలను మార్చుకోవలసి ఉంటుంది.

“ముంబై నుంచి యూరప్, అమెరికా వెళ్లే విమానాలపై ప్రభావం పెద్దగా ఉండదు. కానీ దిల్లీ నుంచి బయలుదేరే విమానాలు పాకిస్తాన్ గగనతలం వెలుపల ప్రయాణించడానికి వీలుగా అహ్మదాబాద్ నుంచి ప్రత్యామ్నాయ మార్గాన్ని తీసుకోవలసి ఉంటుంది.” అని ఏవియేషన్ కన్సల్టెంట్, ఎయిర్ ఇండియా మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జితేంద్ర భార్గవ బీబీసీతో చెప్పారు.

మొత్తంగా దీనర్ధం ఏమిటంటే ప్రయాణ సమయం పెరుగుతుంది. విమానయాన సంస్థలకు ఇంధన ఖర్చులు పెరుగుతాయి. ఈ ఖర్చుల భారాన్ని కంపెనీలు భవిష్యత్తులో వినియోగదారులపై మోపే అవకాశం ఉంది. టిక్కెట్ల ధరలు పెరుగుతాయి.

భారత్, పాకిస్తాన్, పహల్గాం, విమాన ప్రయాణం

ఫొటో సోర్స్, Getty Images

పాకిస్తాన్ నష్టపోతుందా?

విమానాల్లో ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ఏటీఎఫ్‌) ఉపయోగిస్తారు. ఇండియన్ ఆయిల్ వివరాల ప్రకారం ఏప్రిల్ 1, 2025 నుంచి అంతర్జాతీయ మార్గాల్లో దిల్లీ నుంచి ప్రయాణించే భారత విమానాలకు ఏటీఎఫ్ ధర కిలోలీటర్‌కు (అంటే వెయ్యి లీటర్లు) 794.41డాలర్లు. ముంబై నుంచి ప్రయాణించే విమానాలకు కిలోలీటర్‌కు 794.40డాలర్లుగా ఉంది

విమానం ప్రయాణించాల్సిన దూరం ఎక్కువుంటే కంపెనీలు ఎక్కువ ఇంధనాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

2019లో పాకిస్తాన్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు, భారత విమానయాన సంస్థలు రూ.500 కోట్లకు పైగా నష్టపోయాయని భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే అటుపక్క పాకిస్తాన్‌ కూడా నష్టపోయింది.

భారత విమానాలకు పాకిస్తాన్ గగనతలాన్ని మూసివేయడం వల్ల పాకిస్తాన్ కూడా దాదాపు 50 మిలియన్ డాలర్లు నష్టపోయిందని అప్పటి పౌర విమానయాన మంత్రి గులాం సర్వార్ ఖాన్ జూలై 18, 2019న చెప్పారని బీబీసీ ఉర్దూలో ఉంది.

ఎందుకంటే ప్రపంచంలోని అనేక దేశాలు తమ గగనతలాన్ని ఉపయోగించినందుకు విమానయాన సంస్థల నుంచి డబ్బు వసూలు చేస్తాయి. దీనిని ఓవర్‌ఫ్లైట్ ఫీ అంటారు.

ఇతర దేశాల మాదిరిగానే, పాకిస్తాన్ కూడా విదేశీ విమానయాన సంస్థల నుంచి చార్జీలు వసూలుచేస్తుంది. వాటిలో భారతీయ కంపెనీలు కూడా ఉన్నాయి.

విమానం టేకాఫ్ బరువు, కిలోమీటర్ల దూరం మీద ఈ చార్జీలు ఆధారపడి ఉంటాయి.

పాకిస్తాన్ తన గగనతలాన్ని మూసివేసినప్పుడు, భారత కంపెనీల నుంచి ఈ రుసుము పొందలేదు. దీని వల్ల దాని ఆదాయం తగ్గుతుంది.

భారత్, పాకిస్తాన్, పహల్గాం, విమాన ప్రయాణం

ఫొటో సోర్స్, Getty Images

సుదూర ప్రయాణాలపై ప్రభావమెంత?

భారత్ నుంచి మధ్య ఆసియా, యూరప్, బ్రిటన్, అమెరికా వెళ్లే విమానాలు అరేబియా సముద్రం లేదా మధ్య ఆసియా గుండా ఎక్కువ దూరం ప్రయాణించడానికి బదులుగా పాకిస్తాన్ గగనతలాన్ని ఉపయోగిస్తున్నాయి.

ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గంలో ఎక్కువదూరం ప్రయాణించాల్సిరావడం వల్ల విమానయాన సంస్థల నిర్వహణా వ్యయం పెరుగుతుంది. విమానాలు ఎక్కువసేపు ప్రయాణించాల్సిఉంటుంది. దీనికి ఎక్కువ ఇంధనం అవసరం అవుతుంది.

దీంతో పాటు దిల్లీ లేదా ఉత్తర భారతదేశంలోని ఇతర ప్రధాన విమానాశ్రయాల నుంచి పాశ్చాత్య దేశాలకు నేరుగా ప్రయాణించే విమానాలపై కూడా ప్రభావం పడుతుంది. ప్రస్తుతం విమానాలు తమ గమ్యస్థానాన్ని చేరుకోవడానికి 10-15 గంటలు ప్రయాణిస్తాయి. ప్రయాణ మార్గంలో మార్పు కారణంగా అవి మధ్యలో ఎక్కడోచోట దిగాల్సిఉంటుంది.దీని కారణంగా ఖర్చులు పెరుగుతాయి.

మొదటి విషయం ఒక విమానాన్ని ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేసినప్పుడల్లా, విమానయాన సంస్థ ల్యాండింగ్ చార్జీలను చెల్లించాలి.

రెండో విషయం విదేశాల్లోని విమానాశ్రయంలో దిగాల్సిన సందర్భంలో, ఇంధనం అక్కడి నుంచి కూడా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. భారత్‌లో ధరల కంటే ఇది చాలా ఎక్కువగా ఉండొచ్చు.

మూడవది, ప్రతి పైలట్ నిర్ణీత సమయం వరకు మాత్రమే విమానాలను నడపగలరు. విమానం నేరుగా ప్రయాణించడానికి బదులుగా మధ్యలో ల్యాండ్ చేయాల్సి వచ్చినప్పుడు, కంపెనీలు అదనపు పైలట్ సేవలను తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇది కూడా ఖర్చును పెంచుతుంది.

ముందుగా భారత్‌లో రిజిస్టర్ అయిన విమానాలకు ఈ పరిమితి వర్తిస్తుందని జితేంద్ర భార్గవ చెప్పారు. ఏదైనా భారత విమానయాన సంస్థ విదేశాలలో విమానాన్ని లీజుకు తీసుకుంటే, దానికి కూడా ఇది వర్తిస్తుంది.

ముంబై నుంచి ప్రయాణించే విమానాలపై పెద్ద ప్రభావం ఉండదు.

“ముంబై నుంచి ప్రయాణ సమయం అరగంట పెరగవచ్చన్నది నిజమే. అయితే దిల్లీ నుంచి ప్రయాణించే విమానాలకు పట్టే సమయం మాత్రం భారీగా పెరుగుతుంది” అని భార్గవ చెప్పారు.

భారత్, పాకిస్తాన్, పహల్గాం, విమాన ప్రయాణం

ఫొటో సోర్స్, Getty Images

విదేశీ కంపెనీలు లాభపడతాయా?

దిల్లీ, లక్నో, అమృత్‌సర్ వంటి విమానాశ్రయాల నుంచి బయలుదేరే భారతీయ కంపెనీల విమానాలు ముందు గుజరాత్, మహారాష్ట్ర వైపు వెళ్లాలి. ఆ తర్వాత అవి పశ్చిమాసియా, యూరప్, ఉత్తర అమెరికా వైపు ప్రయాణిస్తాయి.

భారత కంపెనీలకు మాత్రమే పాకిస్తాన్ నిబంధన వర్తిస్తుంది, దిల్లీ నుండి నడిచే విదేశీ విమానయాన సంస్థలు పాకిస్తాన్ గగనతలాన్ని ఉపయోగించుకోవచ్చు.ఇది వారి ఖర్చులపై ఎలాంటి ప్రభావం చూపదు. భారత కంపెనీలతో పోలిస్తే లాభపడొచ్చు.

వారి ఖర్చులు పెరగవు కాబట్టి, సహజంగా టిక్కెట్ ధరలు కూడా పెరగవు. కానీ భారత కంపెనీలు మాత్రం టిక్కెట్ ధరలను పెంచాల్సి రావచ్చు.

మొత్తంగా పాకిస్తాన్ కొత్త ఆంక్షలు మొదట భారత విమానయాన సంస్థల జేబులను, తర్వాత ఆ సంస్థల టిక్కెట్లు కొనుగోలు చేసే కస్టమర్ల జేబులను ఖాళీ చేస్తాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)