SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
అంతరిక్షంలో అర్ద శతాబ్దం పాటు తన కక్ష్యలో చిక్కుకుపోయిన అంతరిక్ష నౌక కాస్మోస్ 482కు సంబంధించిన భాగం ఒకటి ఈ వారంలోనే భూమివైపు రావడం మొదలుపెట్టింది.
1972 సంవత్సరంలో నాటి సోవియట్ యూనియన్ శుక్ర గ్రహం(వీనస్)పై పరిశోధన కోసం కాస్మోస్ 482ను ప్రయోగించింది. కానీ అది భూమి దిగువ కక్ష్య దాటి వెళ్లలేకపోయింది.
తర్వాత అది నాలుగు భాగాలుగా విడిపోయిందని నాసా చెబుతోంది. వాటిలో ఒకటైన ల్యాండర్ ప్రోబ్ భూవాతావరణంలోకి మండిపోకుండానే ఈనెల 10వ తేదీకల్లా ప్రవేశిస్తుందని అంచనావేస్తోంది నాసా.
అయితే, భూమిపై ఎక్కడ పడుతుందనేదీ కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. భూమిపై 70 శాతం ఆక్రమించి ఉన్న సముద్రంలో పడితే దానివల్ల నష్టం స్వల్పంగానే ఉంటుంది.
”ఈ అంతరిక్ష శకలం మీపై చూపించే ప్రభావం ఏంటో చెప్పడం కష్టం” అని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలోని సీనియర్ స్పేస్ డెబ్రిస్ మిటిగేషన్ అనలిస్ట్ స్టిన్ లెమెన్స్ అన్నారు.
ఒక మీటరు వెడల్పుతో, గోళాకారంలో ఉన్న ఈ విడిభాగం బరువు దాదాపుగా అరటన్ను. వీనస్‌పై విపరీతమైన వేడి, ఒత్తిడిని తట్టుకొనేలా అత్యంత మన్నికైన హీట్ షీల్డ్‌తో కాస్మోస్ తయారైంది. భూవాతావారణంలోని అనియంత్రిత పరిస్థితులనూ తట్టుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
శుక్రగ్రహంపై దిగేటప్పుడు వేగాన్ని నియంత్రించడానికి ఉద్దేశించిన పారాచూట్ వ్యవస్థ కూడా, 50 ఏళ్లకు పైగా అంతరిక్షంలో చిక్కుకుపోవడం వల్ల పనికిరాకుండా పోయింది.
51.7 డిగ్రీల ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య ప్రాంతంలో ఎక్కడైనా పడవచ్చని అంచనావేస్తున్నందున ఆ శకలం ప్రయాణ మార్గాన్ని పరిశీలిస్తున్నారు.
దీన్నిబట్టి లండన్, దక్షిణ అమెరికా ప్రాంతాలలో ఎక్కడైనా పడొచ్చని తెలుస్తోంది.

”మానవ తయారీ వస్తువులు భూవాతావరణంలోకి తిరిగి ప్రవేశించడమనేది సర్వసాధారణం. అవి భూమికి చేరడానికి ముందే మండిపోతుంటాయి” అని లెమ్మెన్స్ వివరించారు.
చైనా ప్రయోగించిన లాంగ్ మార్చ్ 5బి రాకెట్ బూస్టర్ 2022లో హిందూ మహాసముద్రంలో పడిపోయింది. 2011లో చైనా అంతరిక్షంలోకి పంపిన తియాంగాంగ్-1 స్పేస్ ల్యాబ్ 2016 మార్చిలో పనిచేయడం ఆగిపోయింది. అది 2018లో భూవాతావరణంలోకి ప్రవేశించి అక్కడ నుంచి మండుతూనే పసిఫిక్ మహాసముద్రంలో మునిగిపోయింది.
ఇప్పుడు కాస్మోస్ 482ను అంతర్జాతీయ అంతరిక్ష సంస్థలు నిశితంగా గమనిస్తున్నాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)