SOURCE :- BBC NEWS

పాము

ఫొటో సోర్స్, Getty Images

  • రచయిత, జార్జ్ రైట్
  • హోదా, బీబీసీ ప్రతినిధి
  • 2 మే 2025

పాఠశాలలోని మధ్యాహ్న భోజనంలో ‘చనిపోయిన పాము’ కనిపించిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ చర్యలు చేపట్టింది.

బిహార్ రాష్ట్రంలోని మోకామా నగరంలో జరిగిన ఈ ఘటనలో 100 మందికి పైగా పిల్లలు అస్వస్థతకు గురయ్యారనే రిపోర్టులు వచ్చాయి.

చనిపోయిన పామును ఆహారంలో గుర్తించిన తర్వాత వంటచేసినవారు దానిని తీసివేసి, విద్యార్థులకు భోజనం వడ్డించారనే సమాచారం తమకు అందిందని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) ఒక ప్రకటనలో తెలిపింది.

ఆ రోజు పాఠశాలలో సుమారు 500 మంది పిల్లలకు ఆహారం వడ్డించారని భావిస్తున్నట్లు కమిషన్ తెలిపింది.

పిల్లలు అనారోగ్యానికి గురికావడంతో స్థానికులు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారని ఎన్‌హెచ్‌ఆర్సీ తెలిపింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మధ్యాహ్న భోజనం

ఫొటో సోర్స్, Getty Images

‘విద్యార్థుల హక్కులను ఉల్లంఘించడమే’

భోజనంలో చనిపోయిన పాము ఉండడం నిజమే అయితే అది విద్యార్థుల మానవ హక్కులను తీవ్రంగా ఉల్లంఘించడమే అవుతుందని కమిషన్ పేర్కొంది.

పిల్లల ఆరోగ్య స్థితి సహా రెండు వారాల్లోగా ఈ ఘటనపై ‘సమగ్ర నివేదిక’ను పంపాలని రాష్ట్ర ఉన్నతాధికారులను కమిషన్ ఆదేశించింది.

మధ్యాహ్న భోజన పథకం 1925లో చెన్నై(అప్పటి మద్రాస్)లో మొదట ప్రారంభమైంది.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే సుమారు కోట్లాది భారతీయ విద్యార్ధులకు ఆహారం అందించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తోంది.

మధ్యాహ్న భోజన పథకానికి 2021లో కేంద్ర ప్రభుత్వం’ పీఎం పోషణ్‌’గా పేరు మార్చింది.

పోషకాహార లోపం సమస్యను తీర్చడంతోపాటు, పిల్లలు, ముఖ్యంగా వెనకబడిన నేపథ్యం నుంచి వచ్చిన బాల బాలికలను స్కూల్‌కు రప్పించడానికి ఇది ఉత్తమ మార్గమని ఈ పథకాన్ని విద్యావేత్తలు, ఆర్ధికవేత్తలు కొనియాడారు.

అయితే, ప్రపంచంలోనే అతిపెద్ద ‘పాఠశాల భోజన పథకాల’లో ఒకటిగా పేరొందిన ఈ పథకంలో ఆహార పరిశుభ్రతపై చాలా ఫిర్యాదులున్నాయి.

2013లో బిహార్‌లో విషపూరిత ఆహారం తిని 23 మంది విద్యార్థులు మరణించారని పోలీసులు తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS