SOURCE :- BBC NEWS
9 నిమిషాలు క్రితం
భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ (92) డిసెంబర్ 26న కన్నుమూశారు.
భారతదేశానికి ఎక్కువ కాలం పనిచేసిన ప్రధానమంత్రులలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఒకరు. ఇక్కడ కొన్ని ఫోటోల ద్వారా ఆయన జీవిత ప్రయాణాన్ని క్లుప్తంగా తెలుసుకుందాం.
పంజాబ్ విశ్వవిద్యాలయంలో చదువు పూర్తయ్యాక మన్మోహన్ సింగ్ కేంబ్రిడ్జ్ వర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ చేశారు.
మన్మోహన్ సింగ్ 1982 నుంచి 1985 వరకు ఆర్‌బీఐ గవర్నర్‌గా పనిచేశారు. 1991లో దేశం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మన్మోహన్ సింగ్ భారత రాజకీయాల్లోకి మొదటి అడుగు వేశారు.
జూన్ 1991లో కేంద్రమంత్రి అయిన మన్మోహన్ సింగ్, అదే సంవత్సరం అక్టోబర్‌లో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు.
అస్సాం నుంచి మన్మోహన్ వరుసగా ఐదుసార్లు రాజ్యసభలో ప్రాతినిధ్యం వహించారు. 2019లో రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.
1984లో జరిగిన సిక్కు ఊచకోతపై పార్లమెంటులో ప్రభుత్వం తరపున మన్మోహన్ సింగ్ క్షమాపణలు చెప్పారు. అయితే, మన్మోహన్ సింగ్‌తో క్షమాపణలు చెప్పించడంపై కాంగ్రెస్‌ను చాలామంది విమర్శించారు.
మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో గాంధీ కుటుంబానికి అండగా ఉన్నారని, మౌన ప్రధానిగా వ్యవహరించారని విమర్శలు ఎదుర్కొన్నారు.
డాక్టర్ మన్మోహన్ సింగ్ బలహీనమైన ప్రధానమంత్రి అని బీజేపీ సీనియర్ నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ అన్నారు.
దేశ, ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో అంకితభావంతో పని చేసిందని మన్మోహన్ సింగ్ సమర్థించుకున్నారు.
2014లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ ” చరిత్ర నాపై దయ చూపుతుందని నేను నిజాయితీగా నమ్ముతున్నాను” అని అన్నారు.
వాజ్‌పేయి, మన్మోహన్ మధ్య జరిగిన ఒక ఆసక్తికర సంఘటన గురించి సుప్రీంకోర్టు న్యాయవాది ఎన్‌ఎం ఘటాటే వివరించారు.
“1991లో వాజ్‌పేయికి అప్పటి ప్రధాని నరసింహారావు ఫోన్ చేసి, మీరు బడ్జెట్‌ను చాలా ఘాటుగా విమర్శించారని మా ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ రాజీనామా చేయాలనుకుంటున్నారని చెప్పారు. ఇది విన్న వాజ్‌పేయి.. డాక్టర్ మన్మోహన్ సింగ్‌కి ఫోన్ చేసి, రాజకీయ ప్రసంగం కాబట్టి విమర్శలను వ్యక్తిగతంగా తీసుకోవద్దని సూచించారు” అని చెప్పారు.
ఆ రోజు నుంచి వారిద్దరి మధ్య ప్రత్యేక బంధం ఏర్పడింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)